Saturday, November 30, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 19th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఆ డ్రాగన్ వృక్షం కిందనే మోహన్ కాస్త గుంట త్రవ్వి మంట రాజేసాడు.. మీరు ఉండండి నేను ఒకటి చేస్తాను అంటూ ఆ అమ్మాయి ఓ పాత్ర పెట్టి నౌక నుంచి తీసుకొచ్చిన కొన్ని ఆహార పదార్ధాలతో ఆహారం తయారుచెయ్యడం ప్రారంభించింది…

ఓ ముప్పై నిమిషాల అనంతరం ఆ ఆహారాన్ని అందరూ కమ్మగా కడుపునిండా ఆరగించి అన్నీ సర్దుకొని బయలుదేరారు…

కొన్ని గంటల ప్రయాణం అనంతరం వారికి ఓ సమస్య వచ్చి పడింది…

తరువాత ఏంటో చూద్దాం పదండి..
19th Part
వారిని కొందరు ఆటవికులు చుట్టుముట్టారు.. ఏవో నోటితో విచిత్రమైన సైగలు చేస్తూ, కోపంగా చూస్తూ, వారందరినీ బలవంతంగా తీసుకు వెళ్తుండగా.. 


నౌకలోనుంచి వీరితో కలిసి వచ్చిన ఆ పిల్లాడు భయం భయంగా చూస్తూ.. అయ్య బాబోయ్ వీరికి దొరికామ మనం.. అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి... ఇక అందరం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుందాం.. అని అంటాడు… 

ఏమైంది? ఎందుకు అలా అంటున్నావ్? అని 

మిగిలిన వారందరూ ప్రశ్నిస్తారు

ఎవరనుకుంటున్నారు వీళ్ళను ?? 

ఈ ప్రపంచంలో మనుషుల్లా ఉన్న వీరు మేము ఎప్పటికీ మనుషులం కాము అని భావిస్తూ.. వీరికి కనిపించిన మనుషుల్ని అత్యంత దారుణంగా వేటాడి వారిని చిత్రవధ చేసి చంపేయడం వారి అలవాటు.. అసలు మనిషంటేనే వీరికి గిట్టదు.,.. 

వీరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రారు.. ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా అజ్ఞాతంగానే ఉంటారు.. 

వీరు ఎక్కడ ఉంటారు ?? 

ఎలా ఉంటారు? 

అనేది అందరికీ ఓ ప్రశ్నార్థకమే..!!

కొన్ని సంవత్సరాల క్రితం ఓ తుఫాను భీభత్సం చేస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు నౌకలో ఇటువైపుగా వెళ్తున్న మేము ఈ దీవికి తీరంవెంట పడివున్న ఓ వ్యక్తిని కనుగొన్నాము.. 

అతను తన రెండు చేతులు పైకి ఎత్తి మమ్మల్ని వేడుకుంటూ పడిపోయి ఉండడం గమనించాము.. మా కెప్టెన్ గారికి ఎందుకో తన పై జాలి కలిగి అతన్ని తీసుకొని రమ్మని మనుషులను పంపాడు.. వారు వెళ్ళి తీసుకు వస్తుండగానే అతడు మార్గమధ్యంలో మరణించాడు.. ఆ వ్యక్తి మరణించేటప్పుడు కొన్ని భయంకరమైన వాస్తవాలను వారికి చెప్పాడట.. అతని దేహాన్ని మా నౌకలోకి తీసుకు వచ్చిన తర్వాత అతని శరీరం చూసిన మా నౌక లోని వారంతా స్పృహ కోల్పోయి, తిన్నది బయటకు వచ్చేలా వాంతులు చేసుకున్నారని చెప్పారు… 



అతని శరీరం అంతా వందల, వేల సంఖ్యలో రంధ్రాలతో తూట్లు పడి ఉన్నాయని మధ్య మధ్యలో సూర్యచంద్రుల ఆకారంలో గాయాలు ఉన్నాయని వారు అన్నారు…

వారి తెగ పేరు "యక్షామ" అని వారి ఒంటిపై సూర్యచంద్రుల ఆకారపు గుర్తులు అంతటా ఉంటాయని వారు అన్నారు.. అలాగే వారు రాక్షస గబ్బిలాలను పూజిస్తారు అని చెప్పారు… యక్షామీలు చాలా పురాతనమైన వారు అని క్రీస్తుశకం 52 నుంచి వీరి మనుగడను కొనసాగిస్తున్నారని నౌకలో మాట్లాడుకుంటుంటే విన్నాను… అంతేకాదు వీరు ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణులైన మంత్రముగ్ధులట.. అందుకే వారి మనుగడ తెలుసుకోవడం అసాధ్యమని చెప్పారు.. 

ఇక్కడ ఎన్నో తెగలవారు ఉన్నారు కానీ .. యక్షామ పేరు చెప్తే మిగిలిన వారందరూ వణికిపోతారు.. వీరి గురించి మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేరు.. వికృతంగా అఘోరాల వలె కనిపించే యక్షామీ లు చాలా పురాతనమైన వారు ప్రత్యేకమైన వారు అని చెప్తాడు… వారి ఒంటి మీద ఉన్న ఆ సూర్యచంద్రులు ఆకారాలను బట్టి నేను వీరిని కనుగొన్నాను అంటాడు ఆ పిల్లాడు.. 

అంటే మనల్ని కూడా అలా తూట్లు పెట్టి చంపేస్తారా !! 

వణుకుతూ అడుగుతుంది ఆ అమ్మాయి…!!

ఏదోఒక మార్గం వుండే ఉంటుంది.. ఎవ్వరూ భయపడకండి.. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు అని అంటాడు మోహన్… 

అయినా వీరిని చూస్తుంటే మనల్ని కావాలనే తీసుకువెల్తున్నట్లు, మనకోసమే ఇక్కడకు వచ్చినట్లు కనిపిస్తున్నారు.. 

ఒకవేళ వీరు మనపై దాడి చెయ్యాలకునుంటే ఇంత ప్రశాంతంగా తీసుకువెల్తారా ?? 

అందుచేత మీరెవ్వరూ భయపడాల్సిన పనిలేదు.. అని ఆకాష్ అంటాడు.. 

వీరితో మనం మాట్లాడగలిగితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు అంటాడు ఆకాష్.. 

నాన్నగారు మీరు పెద్దవారు మీరైతే బాగుంటుంది.. మీరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి అని చెప్తాడు.. 

నాన్న అంటే ఎంత ప్రేమరా నీకు ఇలాంటి విషయాల్లో మాత్రం ముందుకు తోస్తావ్.. ఇక తప్పదుగా అంటూ భయంగానే ముందుకు కదులుతాడు.. 

మాట్లాడాలని ఏదో చెప్పబోతూ వుండగా .. వారిలో ఒకరు తమ నడుము మొలకు చుట్టివున్న ఓ చిత్రపటాన్ని తీసి ఇస్తాడు.. ఆ చిత్రం ఇదివరకు విచిత్ర ఆకారములో గల ఆ అమ్మాయిది.. వెంటనే ఆమెను గుర్తుపట్టిన ప్రసన్నకుమార్ భాటియా అందరికీ చూపిస్తాడు.. ఇంతలో వారి తాత్కాలిక స్థావరం వచ్చింది.. అక్కడ ఓ అందమైన యౌవన మహిళ విచిత్ర వేషభూషణములో కనిపిస్తూ తనకన్నా ఎత్తునవున్న కర్రలాంటి ఆయుధాన్ని పట్టుకొని వుంది.. వారు వారి బాషలో ఆమెతో ఏవో మాట్లాడి వెళ్ళిపోయారు.. 

ఆమె రెప్పవేయకుండా వీరందిరినే తీక్షణంగా చూస్తూ వుంది.. 


వీరికి ఏం మాట్లాడాలో అర్ధం కాక అలానే మౌనంగా వుండిపోయారు.. మొదట మాట్లాడే సాహసం చెయ్యలేకపోయారు.. 

అలానే చూస్తున్న ఆమె దృష్టి ఆకాష్ మీద ఆగి .. 

కాసేపు ఆకాష్ ని చూస్తూ ఇలా రా అంటూ చేతితో సైగ చేసింది.. 

రెండడుగులు ముందుకు వచ్చి నిల్చున్నాడు ఆకాష్.. 

మీరు చూసిన చిత్రంలోని అమ్మాయి నా సోదరి..తనే మీకు ఆ నేలమాళిగలో కనిపించింది.. తనను కొందరు చిత్రవధ చేసారు.. తరువాత బంధించారు.. చివరికి తను చనిపోవడానికి కారణం కూడా అయ్యారు.. తను బాధపడటానికి ఓ కన్నీరు బొట్టును కూడా మిగల్చకుండా దారుణంగా చంపేసారు.. 

మీరు భయపడాల్సిన పనిలేదు.. 

యక్షామీలు భయంకరులే కాదు రాక్షసులు కూడానూ .. కానీ ఊరికే వారు ఎవ్వరికీ హాని తలపెట్టరు ..

వారిని ఇబ్బందిపెట్టినవారిని మాత్రం వారు అస్సలు వదలరు.. శతాబ్దాలనాటి మనుగడలో లేని శిక్షలను విచక్షణారహితంగా అమలుచేస్తారు.. ఇక్కడ నాయకుడు ఎవరూ వుండరు .. ఎవరికి వారే నాయకులు.. యక్షామీలలో ఆఖరి ఆడమంత్రముగ్ధిని నేనే.. నా పేరు “ఉవిధ” నా వయస్సు మీ ముత్తాత చిన్మయానంద్ భాటియా గారికన్నా ఎక్కువే.. అనగానే 

ప్రసన్నకుమార్ భాటియా ముందుకు వచ్చి మా తాతగారు మీకు తెలుసా ?? 

ఎవరమ్మా మీరు అని ప్రశ్నిస్తాడు.. 

భూత, భవిష్యత్, వర్తమానాన్ని నేను దర్శించగలను.. 

ఇకపోతే మీ తాత గారు మాకెంతో సాయం చేసి మాలో ఒకరైనారు.. 

మా యక్షామీలలో మగవారికి మంత్రవిద్య తెలియదు.. ఆడవారే వారి మార్గనిర్దేశకాలు.

ఈ దీవిలో ఎన్నో ఏళ్ళనుంచి స్త్రీ ఆక్రందన ఆ సముద్ర కెరటాల శబ్దం కన్నా భీకరంగా వినిపిస్తోంది..

వారు దాన్ని ఆపాలని ఎంతో శ్రమించారు.. నిజంగా చిన్మయానంద్ భాటియా గారు ఓ గొప్ప వ్యక్తి .. 

నేడు వారు లేకపోయినా వారి సంకల్పమే ఇంకా పోరాడుతుంది మీ రూపంలో.. !!

మీరేమంటున్నారో నాకు అర్ధం కావట్లేదు అండి అంటూ ప్రసన్నకుమార్ భాటియా అనగానే …

నాతోపాటు రండి ఇక్కడ ఎక్కువసేపు వుండకూడదు .. మీకు అన్నీ విషయాలు తెలుస్తాయి.. అంటూ ముందుకు కదుల్తుంది.. 

ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా ఆమె వెనుకనే వెళ్తారు.. 

ఇప్పుడు వారు ఉన్నచోటు నుంచి వారు వెళ్ళాలనుకున్న చోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన ఎవరో కోసినట్లు వుండే సన్నని ద్వారము అది చూసి అందరూ సంతోషపడుతుండగా .. ఇది సంతోష పడాల్సిన విషయం కాదు.. చాలా క్రూరమైన మానవ మృగాలు సంచరించే చోటు ఇదే.. నా సోదరిని పోగొట్టుకున్న ప్రదేశం ఇదే..ఈ అమ్మాయిని కనుక వారు చూస్తే ఇక అంతే చూసిన రోజే తనకు చివరిది అవుతుంది అని అంటుంది ఆమె.. త్వరగా ఇటు రండి అని ఓ కొండచరియ ప్రక్కన గల రహస్య నేలమాలిగ లోనికి తీసుకెళ్తుంది.. 


ఇప్పడు అడగండి మీరేమడగాలి అనుకుంటున్నారో.. 

అసలిక్కడ ఏం జరుగుతుంది ?

మా ముత్తాత గారు వీలునామాలో ఇంత రహస్యంగా రాసి మమ్మల్ని ఇక్కడదాకా ఎందుకు రప్పించారు ??

వారి ఉద్దేశం ఏంటి ?

అసలు మీరెవరు ? మా బాష మీరెలా మాట్లాడగలుగుతున్నారు ?

మీకు మేమంతా ఎలా తెలుసు ?

ఆడవారిని ఇక్కడ ఏం చేస్తున్నారు ?


అసలు ఆ కన్నీటి ఆకారం గల గుర్తు ఏంటి ? ఎక్కడ చూసినా అదే ఉంటోంది ..

చకచకా ప్రశ్నలు సంధిస్తాడు లోకేష్.. 

మీ ప్రతీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను అని .. ఇలా మొదలుపెడుతుంది.. 

కొన్నిసంవత్సరాలకు ముందు ఈ చోటంతా మా యక్షామీల నివాస స్థావరం.. మాలో అందరూ మూడు వందలనుంచి అయిదు వందల ఏళ్ళ దాకా జీవిస్తారు.. ఈ రహస్యం మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు.. దీనికి కారణం మా ఆడవారిలో వున్న “మంత్రదములు”. ఇవి ఒక తరమునుంచి మరు తరమునకు మర్మముగా అందించబడుతూ వస్తున్నవి.. వాటివల్లనే మా సంతతి ఇంత రహస్యముగా జీవించుచున్నది.. అంతే కాదు మేము సూర్య, చంద్రుల తేజస్సునుంచి శక్తిని పొందుతాము.. నక్షత్రాలే మా దిక్కులు, మాలో చనిపోయినవారిని ఒక్కో నక్షత్ర్రంగా భావిస్తాము.. ఇలా మనుగడ సాగిస్తూ వున్న మా స్థావరంలోకి అనుకోకుండా ఒకరోజు ..

To be continued …

Written by : BOBBY

Friday, November 29, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 18th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

మెల మెల్లగా తెల్లవారుతోంది… అందరిలో అసహనం తాండవిస్తోంది…. అనవసరంగా మనమంతా ఇక్కడకు వచ్చామేమో అనే ఒత్తిడి వారిలో తారాస్థాయికి చేరుకుంది.. ఆ సమయంలో వారి ఆలోచనా ధోరణి మొద్దుబారిపోయింది.. గత కొన్ని రోజులుగా నిద్ర, ఆహారం లేని కారణంగా, అలసిన దేహంతో చెయ్యి కూడా కదుపలేని స్థితిలో వారు ఉన్నారు.. 

తరువాత ఏంటో చూద్దాం పదండి..
18th Part
మొత్తానికి తెల్లవారిపోయింది.. లేలేత సూర్య కిరణాలు వారి పాదాలను ముద్దాడుతూ వారిని నిద్ర లేపుతున్నాయి.. చుట్టూ వున్న పక్షులు సుప్రభాతములు ఆలపిస్తూ వారిని పలకరిస్తున్నాయి .. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు ఆకాష్.. కళ్ళు నులుముకుంటూ చంద్రవదన వంటి ఆమె మోమును మొదటగా చూస్తాడు.. తరువాత ఒక్కొక్కరుగా అందరూ లేచారు.. ఇక లేచిందే తడువుగా ఆ బింబం కోసం మళ్ళి అందరూ గాలిస్తూ వుండగా దూరాన ఆటవికుల గుంపు ఒకటి వీరికంట పడింది.. టక్కుమని అందరూ ఆ రాతి వెనుకన నక్కి చూస్తారు.. వారి గుంపు నేరుగా వీరివైపే వస్తుంది.. దగ్గరకు వచ్చాక కాని తెలియలేదు.. వారు అఘోరాలు అని… అందరిలో భయం.. అఘోరాలకు ఇక్కడ పనేంటి అని.. మోహన్ కు అసలు విషయం అప్పుడు అర్ధం అవుతుంది.. వీరెందుకు ఇక్కడకు వస్తున్నారో నాకు అర్ధం అయింది అని అంటాడు మోహన్.. 



అది తరువాత సంగతి ముందు వారి నుంచి మనకు ఏదైనా హాని వుందా అది చెప్పండి అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. లేదు లేదు ఇది సంతోషించాల్సిన విషయమే.. వారంతా మా గురువుగారి సేవకులు అయివుంటారు. అని మోహన్ అంటాడు .. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అని అడుగుతాడు ఆకాష్.. వారు ధరించిన కంఠ భూషణములు, వారి చేతిలో వున్న విచిత్ర వస్తుసామాగ్రి, వారిదేహంపై రాసుకున్న భస్మపు ఆకృతులు. ఇవి చాలు వారు నిస్సందేహంగా మా గురువుగారికోసమే ఇక్కడకు వచ్చారని…. చెప్తాడు మోహన్.. ఇంతలో ఆ అఘోరాలు వారున్న చోటుకు వచ్చి వారి మొలకు కట్టివున్న భస్మాన్ని ఆ ప్రదేశమంతా చల్లుతూ మోహన్ కు ఒక సందేశాన్ని చెప్తారు.. 

“నేటికి రెండో రోజు మూడవ జామున మొదటి వాడే తీయగలడు .. దారి తెల్పగలడు ..

ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు. గాలి, వెలుతురు, వుండదు” ..ఆ ప్రదేశమే మీ మార్గం.. వెళ్ళండి అంతా శుభం అంటూ వెళ్ళిపోయారు.. 

వారు చెప్పిన ఏ ఒక్క అక్షరమూ ఎవరికీ అర్ధం కాక తర్జనభర్జన పడుతుండగా.. వారితోపాటు వున్న ఆ అమ్మాయి నాకు కొంచం అర్ధం అయ్యి కానట్లు అనిపిస్తుంది నే చెప్పనా అని అడుగుతుంది.. మీకు తెలిసింది చెప్పండి అంటూ మోహన్ మిగతావారు కోరుతారు.. 

నేటికి రెండో రోజు అంటే మనం వచ్చి ఇది రెండో రోజు 

మూడవ జాము అంటే ఇవాళ రాత్రి 

మొదటి వాడు అంటే మొదటగా పుట్టినవాడు అంటే ఆకాష్ 

అతడే మనల్ని నడిపించగలడు అని నాకు అర్ధం అయింది.. 

మరి ఐదవ దిక్కున అంటే అసలు దిక్కులు నాలుగే కదా అని మోహన్ ప్రశ్నిస్తాడు.. 


కొన్ని శతాబ్దాలనాటి ప్రస్తావన పూర్వులు ఆరు దిక్కులుగా చూసేవారు.. మనచుట్టూ వున్నవి నాలుగు దిక్కులు అయితే మన క్రింద పైన వున్నవి మరో రెండు దిక్కులు. ఇకపోతే ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు అంటే పాతాళములో సూర్యచంద్రులు వుండరు కదా.. గాలి వెలుతురు కూడా.. ఇలా నాకు తోచింది, అనిపించింది చెప్పాను అని చెప్తుంది.. 

ఇదంతా వింటున్న ప్రసన్నకుమార్ భాటియా అమ్మా నువ్వు మామూలు స్త్రీ వి కాదు.. నీలో ఏదో అద్బుతమైన జ్ఞానం ఇమిడివుంది అని ప్రశంసించారు..

అంటే మనం వెళ్ళాలనుకున్న నేలమాళిగ నిజం అన్నమాట అని అంటాడు మోహన్.. 

ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ రాత్రిలోపు మనం ఆ మార్గం కనిపెట్టాలి తలొక దిక్కుకు వెళ్ళి బయటనుంచి కూడా వెతుకుదాం పదండి అని ఆకాష్ అంటాడు.. లేదు సూర్యకిరణాలకు ఈ రాతికి ఏదో సంబంధం వుంది అని ఆ అమ్మాయి చెప్తుంది.. నాకు ఎందుకో ఏటవాలుగా కాకుండా పైనుంచి సూర్యకిరణాలు రాతిమీద పడతాయనిపిస్తుంది .. మన నెత్తి పైనే ఏదో మతలబు వుంది అని ఆమె విశ్వసిస్తుంది.. ఆకాష్ వెంటనే ఆ రాతి గుట్ట పై కప్పు మీదకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు.. చాలా సేపటి తరువాత మోహన్ సాయంతో ఎలాగోలా పైకప్పు మీదకు చేరుకుంటాడు.. అప్పటికి సరిగ్గా సమయం మిట్టమధ్యాహ్నము కావస్తున్నది ... అక్కడ నేత్రం ఆకారం గల ప్రతిమలు అక్కడక్కడా వున్నాయి.. వాటిని ఎంత కదిల్చినా ప్రయోజనం కనపడలేదు.. 


ఐదవ దిక్కున సూర్య చంద్రులు వుండరు. గాలి, వెలుతురు, వుండదు..ఆ ప్రదేశమే మీ మార్గం.. అని ఆ అఘోరాలు చెప్పింది జ్ఞప్తికి వచ్చి అన్నిటినీ క్రింది వైపుకు తిప్పుతాడు.. రాతికి సరిగ్గా పైనగల ఒక ద్వారం తెరుచుకుంటుంది.. ఆ ద్వారం గుండా సూర్యుని కిరణాలు అక్కడ వున్న రాతిపై సన్నని గీతలాపడివున్నాయి.. అందరూ ఆ గీతనే చూస్తూ ఏమీ కనపడుటలేదే అని అనుకుంటుండగా రెండవ వాడు అయిన లోకేష్ మాత్రం వెనుకన పడుతున్న ఆ రాతి బింబాన్ని చూస్తున్నాడు..అది ఎలా వుందంటే రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన సన్నని ద్వారము ఆ రెండు కొండలను చీలుస్తూ భూమి లోపలకు వెళ్ళినట్లుగా కనపడుతుంది.. అది గమనించిన మిగతా వారు అందరూ ఆశ్చర్యంగా అలానే చూస్తూ వుండిపోయారు.. 


ఇక ఆలస్యం ఎందుకు మన చుట్టూరు చాలా కొండలు వున్నాయి.. వాటిల్లో ఈ నమూనా గల కొండలు ఎక్కడ ఉన్నాయో మనం కనిపెట్టాలి అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. 

కనిపెట్టబల్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తుంది .. అలాగే ఈ బింబంలో ఆ నది సూర్యుడు అస్తమించే దిక్కుకు ప్రవహిస్తున్నట్లుగా ఆకారం వుంది.. అంటే పశ్చిమం వైపున మనం కనిపెట్టగలిగితే చాలు ఆ ప్రవహించే నది.. ఆ నది దగ్గర వున్న కొండలు ఆ కొండలు మధ్యన మార్గం అన్నీ మనకు కనిపిస్తాయి.. అని మోహన్ అంటాడు.. 

అయితే … దారి ఇక్కడ నుంచి లేదన్నమాట ఆ నేలమాళిగ వున్న ప్రదేశం ఆ కొండచర్య మధ్యన ఉందన్న మాట అని ఆ అమ్మాయి అంటుంది.. 

ఎడారిలాంటి ఈ ప్రదేశంలో నది ఉండటం చాలా ఆశ్చర్యంగా వుంది అని ఆకాష్ అంటాడు.. ఇక్కడ ఆటవికులను మనం కనుక అడిగితే వారు మనకు ఏదైనా సాయం చెయ్యొచ్చు.. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అంటూ ఆకాష్ అంటాడు.. 

ఇక అందరూ వారి వారి వస్తువులు తీసుకొని పశ్చిమానికి కదలడం మొదలుపెట్టారు .. 

అయిదు గంటలుగా వారు ప్రయాణిస్తూనే వున్నారు. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. రాత్రికి పడుకోవడానికి ఏదైనా అనువైన ప్రదేశం ఉందేమో అని గాలించసాగారు … అక్కడ ఒక పెద్ద డ్రాగన్ వృక్షం కనిపించింది.. దానికింద ఒక పరదాలాంటిది కట్టుకొని అందరూ ఆ పరదా కింద చేరారు..

జంతువులనుంచి, కఠినమైన చలి ప్రభావం నుంచి రక్షణ కోసం మోహన్ ఓ వెచ్చని మంటను మండించాడు .. 

అక్కడి ఉష్ణోగ్రతలు పగటిపూట విపరీతమైన వేడిగాను, రాత్రివేళ తట్టుకోలేనంత చలిగాను మార్పు చెందుతూ వుంటాయి.. 


శిరస్సు పై నల్లని ఆకాశ వస్త్రము .. 

ఆ వస్త్రముపై మెరుస్తున్న కళ్ళు పట్టనన్ని నక్షత్రాలు .. 

మేఘాలతో దోబూచులాడే అంబుజుడు .. 

మంచుతెమ్మెర ఎదురుగా కూర్చుని తన నోటితో ఊదుతున్నట్లు వణికే దేహం.. 

భగభగ మను మండే మంట నుంచి వచ్చి మేనును తాకే వెచ్చని స్పర్శ.. 

ఎదురుగా మనసైనోడి వాడి చూపు .. అబ్బా ఎంత బాగుందో అనుకుంటూ ఆ అమ్మాయి ఆకాష్ ను క్రీగంట గా చూస్తూ వలపుల బాణాలను సంధిస్తోంది… 

ఆకాష్ తన కళ్ళతోనే ఆమెతో మాట్లాడుతున్నాడు.. అలా వారి ప్రణయ ప్రత్యుత్తరాలు మధ్యరాత్రి వరకు సాగాయి..ఎప్పుడు పడుకున్నారో తెలియదు .. పొద్దు పొద్దున్నే సూర్యభగవానుడు అందరి చెక్కిల్లను ముద్దాడుతూ లేపాడు… 

గడచిన రెండు రోజులుగా సరైన ఆహారం లేనందున అందరూ చాలా నీరసంగా అలసటగా కనిపిస్తున్నారు.. ఇక ఈరోజు మాత్రం ఎలా అయినా వంట చేసుకొని తినాలని అందరూ నిశ్చయించుకున్నారు.. 

ఆ డ్రాగన్ వృక్షం కిందనే మోహన్ కాస్త గుంట త్రవ్వి మంట రాజేసాడు.. మీరు ఉండండి నేను ఒకటి చేస్తాను అంటూ ఆ అమ్మాయి ఓ పాత్ర పెట్టి నౌక నుంచి తీసుకొచ్చిన కొన్ని ఆహార పదార్ధాలతో ఆహారం తయారుచెయ్యడం ప్రారంభించింది…

ఓ ముప్పై నిమిషాల అనంతరం ఆ ఆహారాన్ని అందరూ కమ్మగా కడుపునిండా ఆరగించి అన్నీ సర్దుకొని బయలుదేరారు…

కొన్ని గంటల ప్రయాణం అనంతరం వారికి ఓ సమస్య వచ్చి పడింది…

To be continued …

Written by : BOBBY