మన ప్రాచీన సాహిత్య కవులు కొందరు తాము ప్రేమించిన స్త్రీ ని కాని, ఆమె గురించి కాని, వారి ప్రేమవ్యవహారాలు కాని వారు రచించిన కావ్యాలలో ఎక్కడా కనిపించవు ఇంత గొప్ప కవితాసాగరులకు ప్రేయసి లేదా అనే సంశీతి నాకు కలిగి .. అందుకుగల కారణం ఏమైవుంటుంది అని కొన్ని పుస్తకాలు తిరగేశాను....అందులో కొన్ని వాస్తవికతలను చూసాను... కొంతమంది ప్రముఖ కవులు వారి ప్రేయసిని కావ్య నాయికగా స్వీకరించి కావ్య రచన చేసున్నారు.. మరికొందరు ప్రకృతిలోని అందాలనే వారి ప్రణయ ప్రేయసిగా చేసుకొని వర్ణించి వున్నారు.. ఉదాహరణ కు
నాయని సుబ్భారావు గారు “సౌభద్రుని ప్రణయ యాత్ర” లోని “ వత్సల అనే స్త్రీ ఆ కవి ప్రేమించిన ప్రేయసే ..
అడవి బాపిరాజు గారు “శశికళ” లో ఓ ఊహా సుందరినే అయిన ప్రేయసి గా ఊహించారు..
విశ్వనాధ సత్యనారాయణ గారు “కిన్నెరసాని” పాటలో “కిన్నెర” అంటే ఒక వాగు. ఆ వాగునే ఆయన ప్రేయసిగా భావించారు ..
ఇలా ఎందరో ప్రాచీన కవులు వారి ప్రేయసిని వివిధ రూపాలలో చూసుకుంటూ వారి శైలిలో “నభూతో న భవిష్యతి” లా ఎన్నో పద్యాలు, కావ్యాలు, రచనలు రాసారు.. నిజానికి ఆ వర్ణనలు వారికోసమే అన్నట్లు గా వుంటాయి..
“భావ కవిత్వం” అంటే నాకు చాలా ఇష్టం “భావ కవిత్వం” అనగా సౌందర్యం, ప్రేమ .. “భావ కవిత్వం” కేవలం స్త్రీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తుంది... ఇందులో శారీరక అంగాంగ వర్ణనలు కనిపించవు. అందుకే వేల్చేరు నారాయణరావు గారు “అమలిన శృంగారం” అని నామధేయం పెట్టారు.. అంటే నిర్మలమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైన శృంగారం అని అర్ధం... ఇది చదువరులకు అందాన్ని, ఆహ్లాదాన్ని, నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి.. అందుకే ఈ రకపు వర్ణనలను నేను ఇస్టపడుతాను .. మనసు బాలేనప్పుడు ఇలాంటి భావ కవిత్వాలు రాసుకోవడం అలవాటు .. ఒక్కోసారి అలా రాసుకున్నవి చదవడం నేను రాసినవాటిల్లోనే మళ్ళి మళ్ళి సవరణలు చెయ్యడం అలవాటు..
కాని “ప్రబంధ కవిత్వం” అలా కాదు.. స్త్రీ యొక్క దేహ అంగాంగ వర్ణనలకు ఇది నిలయం... ఘాటైన పదాలతో, విశ్లేషణలతో సున్నిత హృదయులకు భయానకాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తాయి.. కాని “భావ కవిత్వం” నుండే ఈ “ప్రబంధ కవిత్వం” పుట్టింది.. అంతే కాదు “భావ కవిత్వం” లో ప్రకృతి, ప్రణయం, ప్రబోధం, ప్రాధాన్యం వహించాయి..
మన ప్రాచీన కవులు ఆదర్శ ప్రణయాన్ని వర్ణించి వున్నారు.. వాటిల్లో చాలావరకు పురుషాధిక్యాన్ని చాటినవే వున్నాయి.. స్త్రీ పై గౌరవాదరాలు కలిగి లేవు.. స్త్రీ ని శృంగార మూర్తిగాను, ప్రబంధాల్లో అయితే కముకిగాను మన ప్రాచీన కవులు వర్ణించి వున్నారు..
మరికొందరు ద్వంద విధముల కవిత్వాలను రాసేవారు.. ఉదాహరణకు “భావ సంధి” సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు వీర రస మూర్తిగాను, అదే సమయంలో కృష్ణుని వైపు చూస్తున్నప్పుడు శృంగార రసమూర్తిగాను కనిపించింది... దేని స్థానం దానిదే. ఇలాంటి ఒక స్థితినే “భావ సంధి” అంటారు..
ఇకపోతే “రాగ భంధం” దీనిలో ప్రణయ స్పర్శ వుంటుంది కాని అది ఎలాంటిది అంటే ప్రకృతినే ప్రేయసిగాను, కవి హృదయం ప్రియుడిగాను సంభావించుకొని ప్రకృతి వర్ణన చాటున చాలావరకు ప్రణయ వర్ణనే వుంటుంది.. ఇలాంటి వర్ణనలో దాశరధి గారు ప్రముఖులు..
“పూల గాలి సోకి పులకింప జగమెల్ల
వచ్చినది ఉగాది వన్నెలాడి “
ఆహా యెంత బాగా రాసారో కదా.. ఉగాది అనగానే మనకు వసంతం జ్ఞప్తికి వస్తుంది... ఆ వసంతంలో ప్రకృతి నయనానందకరంగా వుంటుంది.. ఎటు చూసినా చెట్లన్నీ కొత్త చిగుళ్ళతో, పూల సువాసనలతో కనిపిస్తాయి.. ఇదంతా ఒక కవికి ఒక ప్రేయసిని చూసినట్లే వుంటుంది... చాలామంది కవులు ప్రకృతి ని ప్రకృతి లానే వర్ణించారు... అలాంటి సందర్భంలో సామాన్య మానవులకు కవులకు తేడా వుండదు అనడంలో సంశయమే లేదు.. దృశ్య వస్తువును వీలైనంత వరకు అంతర్నేత్రముతో చూడగానే అది మనకు పలువిధముల కోణాలు కనిపించాలి. ఓ నది ని చూసినప్పుడు ఒక కాంతగా కవితానేత్రానికి కనిపించాలి..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహా కావ్యాలు, ఎందరో మహానుభావులు, చదవగలిగే ఓపిక, తీరిక ఉండాలే కాని యావత్ జీవితం కూడా సరిపోదు ....
స్వస్తి, ___/\__
Written by : Bobby Nani