Wednesday, November 23, 2016

మసిబారిన పసితనం ..



బాలల దినోత్సవం గురించి ఎన్నో గొప్పగా ఉపన్యాసాలు ఇస్తాం.. ముఖపుస్తకంలో ఎక్కడ చూసినా వారిపై రాసేస్తాం పోస్ట్ లు పెట్టేస్తాం.. ఆరోజు అయిపోగానే మళ్ళి ఇక 365 వ రోజున యదాతధం.. దీనివల్ల అర్ధరూపాయి కూడా లాభం లేదని అందరికీ తెలిసిన విషయమే.. అయినా మనం ఇంతే.. మనం మారం ... నేను కూడా.. ఆలోచన గొప్పదే కాని ఆచరణ లేని ఆలోచన నిష్ప్రయోజనం ... మనం ఆలోచనదాకే వచ్చి ఆగిపోతున్నాం.. ఆచరణ చెయ్యట్లేదు.. ఇలాంటి పిల్లల గురించి కొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చాయి .. అందుకు చాలా సంతోషంగా వుంది.. కాని వారికి అందవలసిన అవసరాలు సంపూర్ణంగా అందటం లేదు.. తొంభై శాతం వస్తే పిల్లలకు 40 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు.. ఇది చాలా శోచనీయం .. బడికెల్లాల్సిన పిల్లలు బడిబయట బానిసలుగా వున్నారు... పదిమంది కలిసి ఒక్కరి చొప్పున వారి బాగోగులు చూసినా వారి జీవితం మరోలా వుంటుంది.. అలాంటి ఓ మసిబారిన పసి హృదయాల గురించి ఆవేదనా భరిత అక్షర మాల.. 


మసిబారిన పసితనం .. 
****************


నీ అరచేతులు నా వేళ్ళంత పొడవైనా లేవు..
నీ కాళ్ళు నా పాదలంతైనా లేవు... 
అయినా మేము నీ చేత ఎంగిలి కప్పులు తీయిస్తాం.. 
ఎంగిలాకుల భోజనం నీ కడుపుకు పెడతాం.. 
నువ్వు బాలుడవన్న దృష్టి మాకు మా పిల్లల్ని చూసైనా తట్టదాయే.. 
తట్టినా ఒప్పుకునేందుకు తలవంపులు మాకు.. 
అమ్మదగ్గర పాలు తాగినన్నాళ్లే నువ్వు చిన్నారివేమో..
పసివాడి తనమే నీ పసితనమేమో .. 
నీ జీవితం హోటలు బండపై తుండు గుడ్డగానో .. 
విదిలించిన విస్తరి మెతుకులగానో .. 
డబ్బుకు పుట్టిన పిల్లల సంరక్షణాయంత్రం గానో స్థిరపడుతుంది.. 
ముక్కుపచ్చలారని నీ కాలం.. 
బస్సుల్ని, రైళ్ళను శుభ్రం చేసి చేయి చాస్తూనో .. 
మెకానిక్ షెడ్లల్లో రోజు రోజుకీ మసిబారి పోతూనో..
పాలిష్ బూట్ల క్రింద పడ్తూ, లేస్తూనో.. 
దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది.. 
మా పిల్లల కోసమే మేము చాక్లెట్లు, బిస్కెట్లు, 
ఐస్ క్రీముల అందమైన బాల్యాన్ని తయారు చేస్తాం.. 
మేమంతా చదువుకొని 
మేమే బాల సంక్షేమ సంఘాలుగా మారి.. 
ఏడాదికోసారి ఇవాల్టి నీ భవిష్యత్ కోసమే 
మాట్లాడుకుంటున్నామని ఉపన్యాసాలు ఇస్తుంటాం..
మమ్ములను మేమే సమర్ధించుకుంటూ వుంటాం.. 
మొక్కల్ని పెంచి భూమి పచ్చగా వుండాలని కోరుకుంటాం.. 
ఇప్పుడిప్పుడే నాటుకుంటున్న మీరు 
ఎండారో, వానారో, 
బతికేరో, చచ్చేరో 
అసలు మీరు ఏ ప్రపంచం అడుగున 
కష్టం రెక్కల్లో జీవితాన్ని విర్చుకుంటున్నారో ఆస్సలు ఆలోచించం.. 
మీ పై సినిమాలు కూడా తీసేస్తాం.. 
మా కళ్ళెదురుగానే లోకం చాకిరీ అంతా చేయించి.. 
ఇవేళ్టి బాలలే భావి పౌరులమంటాం... 
ఎవడి భవిష్యత్తు వాడే చూస్కోవాలంటాం .. 
చదువుకంటే, ప్రగతి కంటే, ఆకలి ప్రధానమైన చోట, 
మేమే అమ్మానాన్నల మయ్యీ 
నీ పొట్టను నీ చేతికే ఇచ్చేస్తాం.. 
అందుకే నువ్వు పుత్తిల్లలో నుంచి పాలు తాగడం మానగానే ..
శ్రామికుడవయ్యావు .. 
ఓ బాలుడా.. !! 
నీకు “బాల్యం” అంటూ ఒకటుందని 
తిరిగి చూస్కున్నప్పుడు కష్టాలు, కన్నీళ్ళు తప్ప మరేమీ నీకు కనపడవు.. 
అవే నీ జ్ఞాపకాలు, అవే నీ బాంధవ్యాలు.. 
మెహర్భానులు పలుకు మా రాజులం మేము ... ఎప్పటికీ మారము, మారబోము.. !!!

Bobby Nani

No comments:

Post a Comment