Wednesday, October 19, 2016

ఓ యువతా మేల్కొ..



ఓ యువతా మేల్కొ.. 
****************** 

మరణమే శరణమని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే ఓ యువతా ఒక్కసారి ఆలోచించు.. నీ మరణం కన్న నీకొచ్చిన సమస్య ఏ పాటిది.. మరణానికి మించిన సమస్య లేదని గ్రహించు.. 

అసలు సమస్య ఎక్కడ మొదలౌతుందో తెలుసా.. ప్రతీ మనిషి తనకే అన్నీ కష్టాలు వున్నాయని అనుకోవడమే మీ మొదటి సమస్య.. అదే మిమ్మల్ని మృత్యువు దగ్గరకు తీసుకెళ్తుంది.. 

ఈ సృష్టిలో ప్రతీ ప్రాణికి సమస్యలు వుంటాయి... వున్నాయి కూడా ... “జీవం” అనగా పోరాడటం అని అర్ధం... ఎన్నో జీవరాసులు ఈ భూమి మీద పోరాడుతున్నాయి.. వాటి మనుగడను పెంచుకుంటూ పోతూ వున్నాయి... మరి మనిషి ఎందుకు సమస్యలతో పోరాడకుండా అత్యంత పిరికివాడిలా ఆత్మహత్య లాంటివి చేసుకుంటున్నాడు.. ?? 
మనిషి ముందు అవి వేటిలో గొప్ప ??
ఇంత జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చిన ఓవరం.. మీ ప్రాణాల మీద మిమ్మల్ని పుట్టించిన మీ తల్లిదండ్రులకే అధికారం లేదు.. అలాంటిది మీకెలా వుంటుంది...

ప్రతీ సమస్యకు పరిష్కారం వుంటుంది... విత్తు లేనిదే చెట్టు లేదు.. చెట్టు లేనిదే విత్తు లేదు అని గ్రహించండి... మీ సమస్యకు విత్తు ఎక్కడ వుందో అన్వేషించండి.. ఈ లోకంలో దొరకనిదంటూ ఏది లేదు... ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఒక్కసారి ఆలోచించండి...

మీ మరణం కన్నా మీ సమస్య ఇసుక రేణువులో అతి సూక్ష్మమైనది అని అర్ధంచేసుకోండి... దయచేసి ఆత్మహత్యలు ఆపండి... మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి.. 

మీరు మరణించాలి అనే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా అస్సలు ఎక్కదు .. కాని ఆ సమయంలో ఒక పని చెయ్యండి.. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళండి.. చివరి నిమిషంలో మృత్యువుతో పోరాడుతున్న వారిని చూడండి కుదిరితే వారితో మాట్లాడండి.. జీవితం అంటే ఏంటో యెంత అమూల్యమైనదో వారి మాటల్లోనే మీకు తెలుస్తుంది.. మీరు వద్దు అనుకుంటున్న జీవితం కోసం .... కనీసం ఒక్క రోజు అయినా బ్రతకాలనే తాపత్రయం తో వారు ఎంతలా పరితపిస్తున్నారో గ్రహించండి.. 

ఆ పక్కనే యాక్సిడెంట్ వార్డ్ కి వెళ్ళండి.. ఎందుకంటె మృత్యువుకు చాలా దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు మీకు అక్కడ కనిపిస్తారు.. మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు వారి మనసులో కదిలిన అనేకానేక సంగతులు, వారు చేసిన పాప పుణ్యాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు మెదల్తాయి.. ఒక్క అవకాశం ఇస్తే ఇక ఇలా బ్రతకను నన్ను నేను సరిచేసుకుంటాను అని భగవంతుడని కన్నీటితో వేడుకుంటారు ఆ సమయంలో .. మీకేమో మీ జీవితం అంటే లెక్కే లేదు కదా.. అలా మృత్యువు దాకా వెళ్లి వెనక్కి వచ్చినప్పుడు జీవితం మీద ఒక నిబద్దత ఏర్పడుతుంది.. వారి దృష్టిలో ఈ కష్టాలు, సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి... ఎందుకంటె తనేంటో, తన స్థాయి ఏంటో, తను ఎందుకు ఉన్నాడో అప్పుడు తనకు ఎవ్వరూ చెప్పకపోయినా అనుభవం తనకు నేర్పుతుంది... అలాంటి వారి మాటలు విన్నప్పుడు మీకు మరణించాలనే ఆలోచన కాదు కదా.. ఊహ కూడా రాదు.. 

ఒక మనిషి జననం సులభమే, మరణం కూడా సులభమే ... 
కానీ ఈ రెండిటికి మధ్య వున్న జీవనం మాత్రం అలుపెరగని పోరాటం ... 
గమ్యమెరుగని పరుగుపందెం .. 
దారి పొడవునా “మంచి” అనే ముసుగులో పొంచివున్న దొంగలు ... 
కులంతో, రాజకీయంతో, మతంతో, ధనంతో, స్నేహంతో, ప్రేమతో, నానారకాల ముసుగులో ఏకమైపోయి ముళ్ళ కంపలై గుచ్చుతుంటారు ...
కొందరు స్నేహితులు పువ్వులై పలకరిస్తుంటారు.... 
దుష్టులకు దూరంగా, సన్నిహితులకు దగ్గరగా, శ్వాసిస్తున్నంత కాలం సాగిపోతూనే వుండాలి..
చిన్న చిన్న ఆనందాలను విడువక జుర్రుకుంటూ వెళ్ళడమే ఏకైక మార్గం ...

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఒక్కసారి నేను పైన చెప్పిన విషయాలను ఆలోచించండి... దయచేసి ఆత్మహత్యలు ఆపండి...

స్వస్తి __/\__

Bobby.Nani

No comments:

Post a Comment