ఏ స్వప్నమో తెలియని స్వాప్నిక ప్రపంచంలో
రాలుతున్న ఆకాశపు నక్షత్రాన్ని చూస్తున్నాను..!!
అమ్మ పొత్తిళ్ళలో అప్పుడే చిగురించిన చిన్నారి
చీర ఊయలలో అరికాలు బయటపెట్టి
అమ్మ స్తన్యం కోసం లేత పెదాలతో తడుముకుంటుంది
అమ్మ స్తన్యాన్ని జుర్రుతూ పాలురాని పాపాయి గుక్కపెట్టుకు
చీకటి రాత్రి ఉలిక్కిపడిలేచింది,
తడికల గుడిసె అదిరిపడి మూల్గింది,
రెప్ప దాటని అమ్మ కన్నీరు ఎగిసిపడి పొంగింది.!!
డబ్బా పాలు పోయలేని పేదరికం
భర్త దూరమైన ఒంటరితనం
మళ్ళి మళ్ళి మనసును తొలిచే జ్ఞాపకం
వణికించే వర్తమానం వెనుక
వెన్నుతట్టే భవిష్యత్తు ఆచూకైనా కనపడట్లేదు..!!
స్నేహంతో, ప్రేమతో దగ్గరైన పరిచయాలే
బాయ్, సీయు లతో ముగింపులు పలికే ప్రపంచంలో
జీవితానికి ఎన్ని మరమ్మత్తులు చేసినా
చివరికి ఒంటరితనమే మిగుల్తుంది..!!
గుక్కతీసిన పాపాయి ఏడుపు
కాసేపటికి అలసిపోయి ఆగింది
పాలు పట్టలేని తల్లిప్రాణం మాత్రం
ద్వారానికి వేలాడే ఎండినాకులా రాలిపోయింది..!!
కళ్ళులేని కాలం
చెవులు లేని లోకంతో
నోరులేని జీవితాన్ని శాసిస్తోంది..!
మారని రాతలు
మార్పు రాని బ్రతుకులు కొందరివి..!!
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985