Friday, February 26, 2021

అభిసారిక


వచనాన్ని ఉత్ప్రేక్షతో జోడించి స్వల్ప వర్ణన వ్రాయడం అంటే ఇదే.. చాలా మటుకు అర్ధం కాకపోవచ్చు నోరు కూడా తిరుగక పోవచ్చు.. కానీ ప్రయత్నించండి.. ఎందుకంటె.. శరీరానికే కాదు వ్యాయామం నాలుకకు, బుద్దికి కూడా కావాలి.. ఇలాంటి పదాల వల్ల జిహ్వ ఉత్తేజితమౌతుంది.. అంతే కాదు బద్దకాన్ని విడనాడి వేగం పుంజుకుంటుంది.. మాంసాహారాల వల్ల మందపడిన జిహ్వకు ఇలాంటి పదాల అల్లిక వ్యాయామమే అని చెప్పొచ్చు.. గుర్తుంచుకోండి వ్యాయామం శరీరానికే కాదు.. బుద్దికి కూడా వుండాలి.. చదివి అభిప్రాయలు చెప్పండి మరి..!!


అభిసారిక
*********

తమ్మి పూదేనె తెగ ద్రాగి
జుమ్మనుచు పారిపోయెడి
తుమ్మెద సమూహము గాంచు
చెలియ పుష్కలాక్షి కై
సింగారించు ఝణ ఝణల మ్రోయు
పసిడి మొలనూలు శోభన కాంతుల
నళినీ లత తమ్ములతో వెలు గున్
చెలగున్ లత పువ్వుల గుత్తుల తోన్
వెల యున్ కవితల్ విమలాత్ములన్..!!

లలితము,
మధురాక్షర సంకలితము,
లలనా హృదబ్ద గలితము,
రససం కావ్య చలితము,
కర్పూరగంధి నమోస్తుతే..! నమోస్తుతే..!!

నింగికి నీలిమవై,
కడలికి కెరటమువై,
పడతికి పరువానివై,
పారాణికి పసుపువై,
కావ్యానికి కథానికవై,
నాట్యానికి భంగిమవై,
రమణీయ కుసుమానికి
రస రమ్య పరిమళానివై,
హిమగానానికి పడిశమువై,
మధువుకు మధురిమవై,
హృదయానికి స్పందనవై,
కనుదోయికి కాటుకవై,
కనుపాపకు కమనీయ దృష్టివై,
ఎడారి పుడమికి
ఎడలేని ఇసుకవై,
అధరాలకు మృదుహేలవై
జన్మకు మరుజన్మవై,
ప్రేమకు ప్రణయాలింగవై,
మాధవునికి రాధవై,
నీ ఆత్మను నేనై,
నా ఆత్మవు నీవై,
అందాల అలివేలివై
నర్తించు నా హృదయవేధికపై
అంగనాభిసారికవై..!!

నీ
సమ్మోహన తలంపుతో
పులకరించును రేయి చలువ వెన్నెలలు
జలదరించు సరస్సు కలికి తామరలు
అలరించు లే దీవె తలిరాకు ననలలు
తొలకరించు శరత్తు తెలి యంచగములు..!!

Written by: Bobby Aniboyina

Friday, February 12, 2021


 

తన అక్షరాలంత

అందమైనది కాదు

అతని జీవితం..!!
చీకటితో సావాసం
ఓటమితో సంసారం
అశ్రువులతో జీవితం
నిరంతర మానసిక యుద్ధం
ఇదే తను..!
ఇది మాత్రమే తను..!!

గాయాలు కనపడవు
కానీ దెబ్బ గట్టిగానే వుంటుంది
రక్తం చిందదు
కానీ బాధ నరకంలా వుంటుంది
ప్రతీ రోజు అద్దం ముందు నిల్చోని
నవ్వును అతికించుకుని వెళ్ళడం
తనకు అలవాటైపోయింది..!!

ఎవరో వెనుకన నక్కి
వెన్నుపూసలు
ఫెల ఫెల మని
విరుచుతున్నట్లు
బలమైన ఆకారం
గుండెలపై తొక్కుతున్నట్లు
బాహువులు నేలలో కూరుకుపోతున్నట్లు
నెత్తిన గోవర్ధనగిరి మోస్తున్నట్లు
ఆగి ఆగి వొళ్ళంతా
ఎవరో బ్లేడుతో కోస్తున్నట్లు
ఆదమరిచినప్పుడు
సమ్మెట తో తలపై బలంగా కొట్టినట్లు
దేహమంతా సూదులతో
పొడిచి పొడిచి
రక్తాన్ని నాలుకతో రుచి చూస్తున్నట్లు ..!
ఎవరివో అడుగుల చప్పుడు
నిరంతరం అతన్ని వెంటాడుతూనే వుంటుంది
ఇదే తను..!
ఇది మాత్రమే తను..!!

ప్రపంచమంతా ఒక్కటై
తనని ఒంటరిని చేసి తొక్కుతున్నట్లు
మరణం తనకోసం కులాసాగా
వీలుచైర్లో ఎదురు చూస్తున్నట్లు
బొంతకాకి తన దేహం కోసం
పదునైన ముక్కుతో వేచివున్నట్లు
బిగి కౌగిలి
అవును నిజమే
మృత్యువుతో బిగి కౌగిలి కావాలి అతనికి
స్వేచ్చగా,
శాశ్వతంగా
తమకముతో మట్టిని
హత్తుకునేందుకై ..!!

Written by: BOBBY Aniboyina