అది
నా పన్నెండవ ఏట అనుకుంట
మొదటిసారి నా భావాన్ని అక్షరీకరించే సందర్భమది
నాకింకా గుర్తుంది
దుఃఖిస్తున్న నా గుండె
అపరిచిత చిత్యము పై కూర్చుని
పొట్లాం మడతల్లోంచి భావం చే జారిపోకుండా
అక్షరాల్ని పొందిగ్గా కూర్చే అపూర్వ దృశ్యమది..!!
సాతానయ్యవారి చతురాక్షరీ చాత్తాద
రా మా ను జ మంత్రోపాసనములు శ్రవణములకు తాకే వేళ
మైలు రాళ్ళ కొలతల్లో నన్ను.. నేనే మైమరిచిన వేళ
శిరస్సు తెగిపడిన వైనమూ తెలియనరాని వేళ
నేత్రాలలోరుధిరము కారుతున్నా చలించని వేళ
చేతివేళ్ళ కదలికల మధ్య మొదటిసారి స్ఖలిస్తున్న
నా కలం అక్షరాలను... నే చూస్తున్న..!!
స్మశానాంతమున అస్తమిస్తున్న జీవ రసమే
విశ్వమంతా కనిపించే అలౌకిక సౌందర్యమని
ఆ క్షణం నాకనిపించింది..!
నాటితో నా ప్రస్తానం ఆరంభమైంది
ప్రభాత, అస్తమయ సూర్య కాంతులలో నే రాసే
పుస్తకపు పేజీలు నిండిపోతున్నా.. నా,
కనుబొమ్మల మధ్య ఒక చీకటి తెర
మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటుంది..!!
నా ఈ ప్రస్థానంలో
కవిత్వమనే అగ్ని దగ్గరకు వచ్చి మాడిపోయి రాలిపోయే
దీపపు పురుగుల్ని ఎందర్నో చూసాను
గాల్లోంచి ఎగిరొచ్చే పొగడ్త కోసం
చాతక పక్షుల్లా నిరీక్షించి నిష్క్రమించే వారినీ చూసాను
లేత రాతలను చూసి పల్లికిలించిన
వరాహ సౌందర్యుల విలాస విషాద ఘట్టాలనూ చూసాను
ముఖపుస్తకంలో మదమెక్కిన మద బలంతో
చచ్చు రాతలు రాసి డప్పులేసుకునే నపుంసకుఁల తవికలూ చూసాను
తలపండిన పండిత పుంభావ సరస్వతుల కర్ణ ఖజిత
రత్న మహారూప లక్షణ విలక్షణ విస్వరూప రహస్యాక్షరాలనూ చూసాను
కానీ
కలియుగ దౌర్భాగ్యం
ఇక్కడ ప్రాణం పోసుకున్న వాక్యం మరెక్కడో కవితై తేలుతుంది
దానికన్నా అచేతనంగా ప్రాణం వదిలెయ్యడమే శ్రేయస్కరమనిపిస్తుంది..!!
Written by: Bobby Nani