Tuesday, June 18, 2019

సుప్తమధుకీల



కోపగించుకున్న ప్రియురాలు అలక బూనింది .. ముత్యం లాంటి మోమును కందగడ్డ చేసుకుంది.. ఆమె అలక తీర్చేందుకు వాడుకలో లేని అక్షరాలను ఏరుకొచ్చి ఆ పరిణేత ఎలా అలంకరిస్తున్నాడో చూడండి .. !!

సుప్తమధుకీల
***********

ఎంత కోపమే.. 
ఆ సంపెంగ నాసికపై 
బేసరి లేకున్నా తళుక్కుమనే ఆ 
చిరు కోపానికేం తక్కువ లేదు..!!

ఓ ... లలనా... 
నీ చిరు కోపఁబును 
కుదియించు కూరిమికాడును నేను 
స్వీకరించు నా యీ 
పద పద్మహారాలను..
అధర అలంకరణలను..!! 

తిరుగంద జలకలశ హస్తమగు 
కలధౌత పాదుకల ప్రభాతదేవి వలె..
తిరుగంధ జలములు గల కలధౌతపాత్రపై, 
అందియలతో లలన నృత్యాల ద్రొక్కగ
ముత్యాలురాలినవి వెన్నెల్లో.. 
మ్రోగినవి తప్పటడుగుల విడెపు అందియ మువ్వలు..!!

కూర్చిన ముత్యాల కుప్ప చెదిరినరీతి 
రంగైన రత్నాలరాశి పరిచిన రీతి 
చిలికిన పన్నీరు ఒలికిన గాలిలో చినుకులైన రీతి..!!
జవరాలి మిణుగురు మువ్వల తప్పటడుగులకు 
మేల్కొనిన ముత్యాల నా మనసు ముగ్గులేసింది 
రత్నాల నా మనసు రంగులేసింది.. 
జాగారాల నా మనసు చెంగల్వ రంగవల్లులల్లుకొని 
నిరీక్షించినది ఈ సుప్తమధుకీల మురిపెమ్ములకై...!!

ప్రేయసీ ..!!
నినుచూచి, 
నీ వాలకపు పోలికలు చూచి, 
తిల్లాణ తాళయుత గీత సంగీతముల తేలుతూ 
తురీయావస్థతో, ప్రతిధ్వనుల జేయ 
జగదనుష్టాన గంధర్వదేవతలు 
గుమిగూడి వచ్చి నృత్యాలాడినారే...!!

నీ 
నునుసిగ్గుల 
చిరునవ్వులు రాలగా 
చంద్రికల 
జలతారు వల్లెలతో 
వన మధుకములు 
ఆడుకున్నవి పాడుతూ..!!

పున్నమి వెన్నెలలో 
పూలతావుల పిల్ల వాయువోలే 
నను పరిష్వంగించే నీ తలంపులు 
వేళాకోళం మరదలల్లే చెవిలో 
కొక్కొరోకోయి మని చిలిపిగ పిలిచి పోతుంటాయి..!!

Written by: Bobby Nani

Tuesday, June 11, 2019

నిద్రలో... నిన్న రాత్రి


నిద్రలో... 
నిన్న రాత్రి 
నా చెక్కిలిపై ఓ ఆత్మీయపు 
చిరుజల్లు నను ముద్దాడుతూ గడిపింది 
పదే పదే నా బుగ్గను తడి చేస్తూనే వుంది 
కదుల్తూ, మెదుల్తూనే ఉన్నాను ఒంటరి నా పాన్పుపై...!!

మా బాల్కనీలో..
కిటికీ అవతల జోరున వర్షం 
ఆకాశం తన గుండెల్ని చింపుకొని 
నేలపై నీటి దీపాలుగా రాలుతున్న 
కమనీయ దృశ్యం అది..
నా రెండు కళ్ళను నులుముతూ 
లేచి కూర్చుని అలానే చూస్తున్నాను..!!

ఒక్కో వర్షపు చినుకు 
ఒక్కో భావాన్ని మోసుకొచ్చి
రహస్యంగా నా చెవిలో దూరి 
చల్లని పిల్లతెమ్మెరై అల్లరి గావిస్తోంది..
పసి పాప చేసే చిరుమువ్వల సవ్వడిలా, 
గల గలమంటూ, జల జలా నేల రాలుతూ, 
నా తనువంతా ముద్దాడాలని 
నను ఆహ్వానించుచున్నది..!!

తామర నేత్రాలతో, 
రెప్పవేయక అలానే చూస్తూ 
నా రెండు చేతులను చాచి 
ధారలు ధారలుగా .. వెండిజలతారులా 
పడుతున్న ఆ వర్షాన్ని ఆర్థిగా హత్తుకున్నాను.
హటాత్తుగా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.. 
నా నేత్రాలనుంచి కన్నీటి ధారలు ఆ వర్షంతో కలిసిపోయాయి 
ఇక అంతే నా కన్నులకు రెప్పల ఊయలలు ఊగడం మొదలెట్టాయి 
ఎప్పుడు పడుకున్నానో తెలియదు 
ఓ సుధీర్గ నిద్ర మళ్ళి నాన్నావరించింది...!!

Written by: Bobby Nani

Tuesday, June 4, 2019


ఏముంది? 
ఈ ప్రకృతిలో ఆస్వాదించడానికి 
మరేముంది 
ఈ సృష్టిలో అవలోకించడానికంటూ 
కళ్ళు తప్ప హృదయంలేని, 
ముక్కు తప్ప జీవాత్మ లేని, 
అమాయక ప్రాణులం మనం..!! 

అదృశ్య సౌందర్యాల్ని అస్పృశ్యముగా అన్వేషిస్తూ 
అతిమనోహర భంగిమల్లో సుందరంగా కదుల్తున్న 
ఆ కొమ్మ కొమ్మ లోని అంతరంగాన్ని చూడు 
రంగురంగుల ఆకులలో అంతులేని స్వర్గాలు 
లిప్తపాటు కనురెప్పల కదలికల్లో 
ఆవిష్కరించబడుతున్న అద్బుత సూర్య, చంద్రోదయాలు 
విచ్చుకుంటున్న ప్రతీ పువ్వూ 
అనంత సువాసనల్ని ఘుళిపించే సుమధుర ఘట్టాలు..!! 

ఉషస్సును పారబోసుకుంటూ 
కృత్రిమ కలల్లో .. ఎందుకని వెతుక్కుంటావ్ 
రా..!! 
ఆ శీతల గదుల మధ్య నుంచి 
ఉషస్సులో కరిగిపోతున్న ప్రవాహాన్ని చూడ్డానికి 
హృదయాన్ని దోసిలి చేసుకొని తనివితీరా ఆస్వాదించడానికి.. !!