ఒక చిత్రం ఇలా వుంది అలా వుంది అని తేల్చి దానిపై రివ్యూ రాసేంతటి గొప్పవాడిని కాను కానీ, చాలా రోజులతరువాత ఈ చిత్రానికి రివ్యూ రాయాలనిపించింది..
నిన్న రాత్రి “జెర్సీ” చూసాను..
ఒక దిగువ మధ్యతరగతి కుటుంబ కథా చిత్రం ఇది..
ఒక సామాన్యుడు తనలో ఎంత సత్తా ఉన్నాకూడా క్రికెటర్ అవ్వాలంటే ఒక యుద్దమే చెయ్యాలని “గౌతం తిన్నానూరి” గారు చూపించిన విధానం అత్యత్భుతం.
ఎంతో వైవిధ్యభరితంగా సాగిన ఈ కథలో ఓ అమ్మాయి ప్రేమను గెలుచుకున్న అతడు జీవితాన్ని గెలవడానికి పడ్డ శ్రమ, కష్టం, బాధ, ఒత్తిడి నుంచి మరణం దాకా సాగిన తన ప్రయాణాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు..
సంపన్నుల ఇంటినుంచి తనకోసం అన్నీ వదిలేసి వచ్చిన ఆ అమ్మాయి కథానాయకుడితో దిగువ మధ్యతరగతి జీవితాన్ని అనుభవిస్తూ, కుటుంబ భారాన్ని కూడా తనపై వేసుకుని కోపం, బాధ, కన్నీళ్ళతోనే కాలం గడుపుతూ మనసులో తన ప్రేమను అణిచిపెట్టుకుని Shraddha Srinath ప్రదర్శించిన నటన ప్రతీ మనిషినీ కదిలించేలా, కంటతడి పెట్టించేలా చేస్తుంది..
మన (కట్టప్ప) సత్యరాజ్ గారు చేసిన నటన ఆయన చెప్పిన ఒక డైలాగ్ “నా కన్న కొడుకును కూడా నిన్ను నమ్మినంతగా నమ్మేవాడిని కాదేమో రా” అంటూ మొదట్నుంచి చివరిదాకా తను కనపరిచిన ఆ వాత్సల్యం, ఆ అభిమానం, ఆ ఆరాటం, ఆ ప్రేమ అద్బుతం అంతే..
నాని గురించి ఏం చెప్తాం.. నిజంగానే తను natural star ఎంత సహజంగా నటించాడో అసలు.. తన నటనా విశ్వరూపం ప్రదర్శించాడు.. చాలా తక్కువ మాట్లాడుతూ, ముఖకవళికలలోనే అన్నీ రసాలను ఏక కాలంలో చూపించాడు .. నిజంగా ఈ చిత్రంలో తన నటన నభూతోనభవిష్యతి.. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన సన్నివేశం గడచిన పదేళ్లుగా విఫలమౌతూ, మాటలు పడుతూ, గొండేల్లోని బాధను తొక్కిపెట్టి తుదకు మళ్ళి రంజీ టీంలో తన పేరు చూసాక తనకు కలిగిన ఒక నమ్మకం, ఓ సంతోషం, ఏదో సాధించడానికి ఓ మెట్టు ఎక్కాము అన్న గర్వం అన్నిటినీ కలబోసి ఓ రైల్వే స్టేషన్ కు వెళ్ళి తన ఆనందపు అరుపు ఎవ్వరికీ వినపడకూడదని ఓ రైలు కూత శబ్దంతో కలిపి తను అరిచిన ఆ ఆనందం చూస్తున్న ప్రతీ ఒక్కరికి ఒళ్ళు గగుర్పుడిచేలా చేస్తుంది..
కథలో ముఖ్యమైన మలుపులు
************************
తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ను తన కుటుంబం కోసం, తన ప్రాణాలకోసం వదిలేయడం
తన కొడుకు అడిగిన జెర్సీ షర్టు కోసం ఓ తండ్రిగా కేవలం 500 రూపాయల కోసం తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడం.
పదేళ్ళ తరువాత తన కొడుకు కోసం మళ్ళి బ్యాట్ పట్టుకోవడం
రంజీలో తానెంటో నిరూపించడం
బ్రతకడం కోసం లూసర్ గా పదేళ్ళుగా చస్తూ బ్రతికినా విన్నర్ కోసం తన మరణాన్ని లెక్కచెయ్యకుండా చివరికి గెలిచి చనిపోవడం..
నేషనల్స్ కి సెలెక్ట్ అవ్వడం.
తన కొడుకు అడిగిన “జెర్సీ” షర్టు తను పెద్దయ్యాక తన తండ్రిదే తనకు గిఫ్ట్ ఇవ్వడం
ఈ కథను ఎంతో చక్కగా తెరకెక్కించారు “గౌతం తిన్నానూరి” గారు వారికి, ఈ చిత్ర యాజమాన్యం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెల్పుకుంటూ.. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆనందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాను..