Friday, February 22, 2019

నిచ్చెలి అలకపాన్పు



ఓసి కోపదారి ప్రేయసీ..!!
కోపం దేనికే ??
ఇకనైనా మానవే 
నా హృదయం పరితపించుచున్నదే ..!!

ఓ ప్రియా,
నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించవే
నీ బాహువులలో బంధించవే, 
దంతక్షతాలతో క్షతగాత్రుడిని చేయవే 
ఘనస్తనాలతో గాఢంగా మర్ధించవే
నీ కడకంటి చూపులతో తనువంతా తూట్లు చెయ్యవే 
కసికసిగా మన్మథ శిక్షలు విధించవే 
కాయమంతా అధర గాయాలు చేయవే..!!

నేను అర్ధం చేసుకోగలను ఇదంతా 
వక్రచారి అయిన మన్మథ విజృంభణ ఫలితమేనని 
ఏం చెయ్యను చెప్పు 
నీ వియోగ సమయం క్షణమొక యుగంగా వుంది నాకు.. 
చంద్రుని చల్లని కిరణాలు ప్రళయ భానుడి చండ కిరణాలై 
తాపాన్ని పుట్టిస్తున్నాయి 
చల్లని మందమారుతాలు సైతం 
వజ్రఘాతాలై వేధిస్తున్నాయి
పరిమళాలు వెదజల్లే పూలమాలలు వాడి 
సూదుల్లా గుండెలోతుల్లో గుచ్చుతున్నాయి 
మంచి గంధపు లేపనాలు కణకణలాడే 
అగ్ని కణాలై ఒళ్లంతా సెగలు పుట్టిస్తున్నాయి 
ఊపిరి పీల్చడం కూడా భారంగా తోస్తోంది.
నీ కోపం, 
నీ విరహం,
నాకో ప్రళయమై తలపిస్తోందే ప్రణయిని..!!

ఓ ప్రియా !
నీ కనుల కాంతితో సమానమైన కలువపూలు 
నీట మునిగిపోయాయి 
నీ ముఖ శోభను అనుకరించే నెలరేడు
కనిపించకుండా కారుమబ్బులు క్రమ్ముకున్నాయి 
నీ అందమైన మదగమనాన్ని అనుసరించే రాజ హంసలు 
నిర్మలమైన మానస సరోవరానికి తరలిపోయాయి 
ఇకనైనా అలకపాన్పు దిగిరావా..
నా దరి చేరవా.. లేక్షణవై, 
విలక్షణ మూర్తివై,
సారంగ సింగారిణివై,
నీ అమృత పయోధరములు 
అధరములకందిస్తూ రావా 
బిరబిర వచ్చి నను చేరవా 
రసికరాజ శిఖామణి లా..!!

Written by : Bobby Nani

Tuesday, February 19, 2019

పరిష్వంగ స్వప్నం..



తనను చూసి ఎన్నాళ్లైందో..
తన నోటినుంచి మాటల ద్రాక్షపండ్లు రాలి,
ఆ రాలిన నవ్వుల ద్రాక్ష రసంలో నే మున్కలేసి ఎన్నాళ్లైందో
తనముందెప్పుడూ నేను నెలల బాలుణ్నే
తన ఒడిలో నే తలవాల్చినప్పుడు నా 
ఛాతిమీద పడు ఆ కురులతోనే నేనాటలాడేది 
అమాసనాటి చిమ్మచీకట్లలో పండువెన్నెలలా 
ఆ నల్లని కురుల మధ్య ఆమె మోము 
ఉదయించే రవి బింబంలా దేదీప్యమానమై కనపడుతుంటుంది..!!


తన తలంపు తగిలితే చాలు 
అలా సంద్రం వెంట ఇద్దరం నడిచివెళ్తున్న అనుభూతి 
నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది .. చంటి పిల్లాడి చేతిలో 
పీచుమిఠాయిలా ఎదురుగానున్న సంద్రం మమ్ము చూచి 
కేరింతలు కొడుతూ కనిపించింది
మా వెనగ్గా సూర్యుడు ముద్దమందారమై ఎర్రగా నవ్వుతున్నాడు..
ఒక్కసారిగా నాలో వేయి వోల్టుల విద్యుల్లత మెరిసింది..!!

సంద్రంలోంచి అకస్మాత్తుగా నడిచి వచ్చిన 
కాంతి ద్వీపంలా ఆమె నాకు కనిపించింది.
నా ఎదురు చూపుల్ని చీల్చుకొచ్చినట్లు అనిపించింది.. 
ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ, 
ఒకరినొకరం ఆవేశంగా హత్తుకున్నాం..
మా ఇద్దరికోసమే అన్నట్లు 
ఈరోజు సంద్రం నిర్మానుష్యంగా వుంది.. 
ఒకరి పరుగులో మరొకరం వొగురుస్తున్నాం 
ఒకరి నవ్వులో మరొకరం శ్వాసిస్తున్నాం 
సంద్రాన్ని జారుడుబండ చేసుకొని 
కెరటాల మీద జర్రున జారుతున్నాం 
బద్దకంగా ఆవలిస్తూ, 
బరువు కళ్ళతో చేర బిలుచుకుంటున్నాం 
ఒకళ్ళనొకళ్ళు చూచుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటున్నాం 
తను సంద్రంలా నురగలు కక్కుతూ వుంది 
నేను సూర్యునిలా ఎరుపెక్కిపోతూ ఉన్నాను 
మబ్బులు కమ్మకపోయినా 
చీకటి మాత్రం ఆకాశం మీదకు ఒరిగిపోయింది..
ఇద్దరం అమాంతం చంద్రుణ్ణి ప్రసవించినట్లున్నాం 
అతగాడు మెల మెల్లగా అడుగులు వేస్తున్నాడు 
దొర్లించిన రూపాయి నాణేల్ని తన చుట్టూ విసిరేసుకొని 
అదే పనిగా ఆడుకుంటూ..!! 

Written by : Bobby Nani

Saturday, February 16, 2019

వెన్నెల ఒడిలో ఓ రాత్రి..!!


వెన్నెల ఒడిలో ఓ రాత్రి..!!
*******************

వినీలాకాశంలోని తారలు పారిజాతాల్లా వికసిస్తున్నాయి 
వెన్నెలలో కొబ్బరిమట్ల మధ్య నా మనసు 
గాలి తెరకి కదుల్తున్న తరణిలా ఊగుతోంది 
ఈ వెన్నెల వెలుగులలో నేన... నా జ్ఞాపకాలను 
నెమరేసుకుంటూ అక్షరాల్ని ముద్రిస్తూ, 
వెన్నెల ఒడిలో నే తలపెట్టి నా ఆశల్నీ, ఆశయాల్నీ బుజ్జగిస్తున్నా
శ్వేతనీల పల్లకిలో నా స్వప్నం దేశమంతటా ఊరేగుతోంది
ఓ అల్లరి నక్షత్రం నా చుట్టూ తిరుగుతూ, 
నా ఎదపై రంగుల్ని గుమ్మరిస్తోంది 
ఆ కాంతి నా దేహంలోకి చొచ్చుకొని నాలో సన్నని కోరిక రగిలిస్తోంది..!!

ఓ వెన్నెలా 
నేనీరోజు నీ ఒడిలో తలపెట్టి ఉన్నాను 
నాలోని ఊసులు నీతో చెప్పాలనిపిస్తోంది 
మానవత్వమే లేని మా ఈ నేల మీది ప్రపంచంలో 
జీవితం... నిప్పుల్ని విరజిమ్ముతూ వుంటుంది 
అంతటా కరంకములు మండుతూనే వున్నా, 
పొగముసిరిన గుడిసెల్ని కూడా 
ఇక్కడి మా రాజకీయం పట్టి పీడిస్తూనే ఉంటుంది 
కులం బూడిదలో బంగారాన్ని ఏరుకోవాలని ప్రయత్నిస్తూనే వుంటుంది 
చీకట్లో రాక్షసత్వం మరణాన్ని కూడా అమ్ముకుంటూ వుంటుంది 
దుఃఖంతో గొంతు పెగలక ఈ మధ్య నా నుంచి 
ఒక్క వాక్యం కూడా రాలి పడట్లేదు..!

కానీ ఓ వెన్నెలా
ఇవాళ నువ్వు నా గాయాలకు వెన్న పూస్తున్నావు 
పువ్వులూ, పున్నమీ లేని జీవితం ఎంత దుర్భరమో 
నాకీనాడు అర్ధమౌతోంది..!!

పత్రికల్లో, వార్తల్లో మాత్రం 
ప్రజా పోరాటాలు, నీతి, నిజాయితీలు 
అంతిమంగా విజయం సాధిస్తాయని అంటున్నారు.. 
నాటి నుంచి నేటివరకు ఈ మాటలు వింటూనే ఉన్నాను..!!

నా కళ్ళముందు కనిపించే ఆకాశంలోని నక్షత్రాలు 
వెలిగి వెలిగి అలసిపోయి 
మబ్బుతెర దించేసుకొని నిద్రలోకి జోగుతున్నాయి 
కళ్ళార్పకుండా వెన్నెల్ని ఆరగిస్తూ తెల్లారకూడదని 
కోరుకుంటున్న నాకు 
నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు 
రేపటి రాక్షస ప్రపంచానికి మళ్ళీ వాకిలి తెరుచుకునేందుకు..!!



Written by: Bobby Nani