Monday, January 28, 2019

అతను – ఆమె




అతను – ఆమె 
********** 

తెల్లవారున 
ఎప్పుడు మొదలైందో తెలియదు 
జోరున వర్షం 
చినుకూ చినుకూ 
సప్తస్వరాలతో మంచు ముత్యాలై 
జలజలమని నింగినుంచి నేల రాలుతున్నాయి 
పొద్దుగాల పోయిన చెలిమికాడు కోసం 
తమలపాకంత నయనాలతో 
ఇంతింత పెద్దవి చేసి రెప్పవాల్చక, 
కుదురు కూర్చోక 
పారాణి పాదాలతో, 
సిరి మువ్వల అందియలతో, 
తడబడు అడుగులతో, 
సగం చింతకాయి నోటిన కరుచుకొని 
పులుపుతో కందిన చెక్కిళ్లతో, 
అటూ, ఇటూ తిరుగుతూ, 
ఓరచూపుల పూ బాణాలతో 
వేచిచూస్తూ వుంది..!! 

ఇంతలో 
మనసైన మగఁడు 
శిరసు నుంచి ధారలా కారుతున్న 
వర్షపు ప్రవాహంతో 
ఆమె వెనుకగా వచ్చి 
తడిచిన తన చల్లని చేతులతో 
ఆమె కౌను ను స్పృశిస్తూ 
నాభి చుట్టూ తన చేతులను బిగిస్తూ.. 
చెవి దగ్గర తుమ్మెదలా 
చెలి యౌవన మధువును గైకొనుటకు 
తపించుచూ, తహతహలాడుతున్నాడు. 
అతని అధరములనుంచి రాలే వర్షపు చినుకులు 
ఆమె పచ్చని పసిడి మెడపై 
ఒక్కొక్కటిగా రాలుతూ ఆమెలో 
త్తేజాన్ని, తన్మయత్వాన్ని ప్రేరేపిస్తూ 
ఆమెలో 
ఓ కవ్వింతను 
ఓ పులకింతను 
పుట్టిస్తున్నాయి..! 
వణుకుతున్న తన పెదవులతో 
నేల రాలిన ఆ సగం చింతకాయ 
చిన్నబోయింది...!! 


వర్షపు చలితో గజ గజమంటూ 
ఒకే దుప్పటిలో 
వెచ్చని ఆవిర్లు ఒకరికొకరు 
అందిపుచ్చుకుంటూ 
కుంపటిలా మారారు తమకముల 
ద్వి దేహపు పులకింతలతో 
ఆమె కనుసైగల చిలిపి కాంతులతో 
ప్రణయ ఘట్టానికి పరదా తొలగిస్తూ 
అతడు అందుకున్నాడు 
ఆమె అధరములను సుతిమెత్తగా..! 

పూదేనె వంటి తియ్యని 
ఆమె అధరములు 
కాస్త వగరుగా, 
మరికాస్త పులుపుగా 
కొత్త రుచిని సంతరించుకున్నాయి ఆ 
సగం కొరికిన చింతకాయ ప్రభావముతో 
ఆ విషయం జ్ఞప్తికి వచ్చి 
ఇరువురి జత పెదవులలో 
చిరు నవ్వులు చిందాయి .. 
అతని హృదయ వేదిక మీద ఆమె 
ఆమె హృదయాంతరంగాలలో అతను లా 
ఒకరికొకరు వుండిపోయారు 
అతను – ఆమె లా...!!

Written by: Bobby Nani

Wednesday, January 23, 2019

నాలో నేనే.. నాతో నేనే..





నాలో నేనే.. నాతో నేనే.. 
***************** 


ఎక్కడా పరచని ఊహలను 
లెక్కలేనన్ని అనుభూతులను 
ఏరుకొచ్చి 
జీవనిర్భర భావ చిత్రాలలో 
కలిపి, నిలిపే నా కలం 
నీ అపురూప కళా సౌందర్యాన్ని చూచి 
తన గొంతును కదుపలేక.. కంపిస్తుంది..!! 

కోమలీ..! 
నిను ఆహ్వానించేదెలా 
నా గుండె బరువు తీరేదెలా..!! 

మిన్నేరు నీ కాళ్ళ మీదే ప్రవహిస్తుందా ? 
మెరుపు కన్నెలు నిన్నే స్పృశించి నర్తిస్తున్నాయా ? 
నీ అంగాంగంలో 
సుధా స్రవంతులు పొంగి పారుతుంటే 
నీ అధరపుష్పంలో సంధ్యారుణిమ 
మధుర గీతాలు పాడుతుంటే 
నా చాకితాంతరంగంలో 
నవభావనలేవో వికసిస్తూ, 
ఈ సృష్టికి అర్ధ పరమార్ధాలు 
నాకీ నాటికి బోధపడుతున్నాయి..!! 


వాక్కులకూ ఊహలకు చిక్కవని 
విధిలేక ఒప్పుకుంటాయి 
విశ్వసాహిత్యాలు..!! 

రంగులకూ, రాగాలకూ అందవని 
లోకంలోని కళలన్నీ పూ దండలై 
నీ కంఠమును అలంకరిస్తాయి..!! 

శస్త్రాలు, సకల అణ్వస్త్రాలూ 
నీ చూపు చలువలో 
మంచు గడ్డలుగా నిలిచి పోవా..! 
పాపాలూ, పంకిలాలూ 
నీ కంటి దీపాల వెలుతురులో 
తానమాడితే పుణ్య తీర్థాలైపోవా..! 
నీ మదిలోని భావ పుష్పాలనుంచి 
ఒలికిపడే ఉచ్చ్వాస సౌరభాలను 
మోసుకుపోయే పిల్లగాడుపులకంటే 
ధన్యాత్ములెవరే ? 

ఎన్నాళ్ళు, 
ఎన్నేళ్ళు నిరీక్షణతో 
తపస్సు చేసిందో ఈ మట్టి గోళం 
ఈ నాటికి తన కోర్కె ఫలించింది.. 
నీ మందస్మిత కాంతి భూషలు ధరించేందుకు..!! 

ఓ 
నవ యౌవన మోహినీ 
కనిపిస్తూ వుంది 
సర్వశాస్త్రార్ద సారం నీ 
దరహాస మకరంద ధారలో 
శబ్దాలు, అలంకార శాస్త్రాలు 
నీలో చూచుకొని తమను తాము సరిచూచుకొని 
శోభిస్తున్నాయి..!! 

రమణీ ..!! 
ఎంత రమణీయము 
నీ ఈ జీవితోత్సవము 
కళలన్నీ రంగురంగుల బావుటాలై 
సాహిత్యాలన్నీ సరస కావ్య సౌరభాలై 
సౌందర్యాలన్నీ మహోజ్జ్వల దీప మాలికలై 
ఆనందాలు స్వాగత తోరణాలై 
జరుపుచున్న ఈ మహోత్సవాన్ని మైమరిచి 
నాలోని కన్నులు తెరిచి దర్శిస్తున్నాను. 
హర్షం వర్షిస్తున్నాను.. 
నాలో నేనే.. నాతో నేనే..!!

Written by : Bobby Nani

Friday, January 11, 2019

ఉదయిస్తూనే ఉంటా..


భానుని వీర్యంతో పులకించే పుడమి 
నిత్యం పచ్చి బాలింతరాలు
ఎన్నో పురుళ్ళు పోసుకున్నా కూడా
యౌవనం సడలక 
నిత్య పారవశ్యముతో 
పరవళ్ళు చిందించే ఆమె తియ్యని 
పేగు వాగులో ఊపిరి పోసుకొచ్చిన 
ఆవేదనా తరంగాన్ని నేను..!!

మిట్ట పల్లాల కరుకుదనము మీదకు ఉరికి సాగించే 
నా ప్రస్థాన యాత్రలో తోడుగా 
అమాస నిశీధిలో మొలచిన 
మొదటి నక్షత్రాన్ని తుంచుకొని 
హృదయ గోడల కూడలిలో 
దూర్చుకున్నాను..!!

అరమూసిన దాని కన్నుల్లోంచి 
ప్రవహించే పగటి ఆయకట్టలో 
నాడు నేను నాటిన నెత్తుటి బిందువులు 
ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి..
నవీన వసంతానికి స్వాగతం పలికే నా 
కవిత మ్రాను అయ్యేందుకు
కొమ్మల్ని చాస్తూ, 
గుప్పిళ్ళ నిండా 
నిప్పు రవ్వలు పూస్తూ, 
చిగురించే కక్షావైక్షకుడనై నే 
ఉదయిస్తూనే ఉంటా,
రేపటి నూతనాధ్యాయానికి..!! 

Written by: Bobby Nani

Friday, January 4, 2019

“సంక్రాంతి”



“సంక్రాంతి” అంటే పండగ కాదు మన జీవనవిధానం .. అలాంటి పండుగ నేడు కనుమరుగైపోతుంది.. పల్లెటూళ్ళలో కూడా ఈ పండుగ ఛాయలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకప్పుడు ఈ పండగకి సిటీలు బోసిపోతాయి, పల్లెటూళ్ళు ఫక్కున నవ్వుతాయి.. ఇప్పుడు రెండిటికీ పెద్ద తేడా లేదు.. పక్కున నవ్విన పల్లెటూళ్ళు వెల వెల బోతూ బిక్కమొహం వేసి మనవైపు జాలిగా చూస్తున్నాయి..అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలిపే ఓ చిరు ప్రయత్నమే ఇది..


“సంక్రాంతి”
********

గంగిరెద్దుల వాని సన్నాయి మేళం 
జంగందేవర శంఖారావం 
సాతాని జియ్యరు శ్రీహరి గీతాలు 
నీకు తొలిజాము మేల్కొలుపు సంగీతాలు 
ఏవి ? ఇప్పుడేవి ??

ముద్దబంతుల ముద్దిడిన 
పైరగాలి సౌరభాలు 
చెంగు చెంగున దూకు 
లే దూడల పాల నురుగులు 
పొలిమేరల్లో నిన్ను స్వాగతించడానికి 
ఏవి ? ఇప్పుడేవి ??

సిగ్గు మొగ్గలు తొడుగ
సిగ చేమంతులే తురిమి 
రంగు రంగుల రంగ వల్లికలు తీర్చి 
మొగలి పూ..వంటి మగని కోరి 
మురిపెముగా గొబ్బెమ్మలే పేర్చి 
జడ కుచ్చుల చిఱు గంటల
చిరు గాజుల సరిగమల 
ముద్దు గుమ్మలు 
ఎదురు గుమ్మముందు 
నీకు స్వాగతము పలుకంగ 
ఏరి ? ఇప్పుడేరి ??

భోగి మంటల అరుణిమ 
నుదిటి సింధూరమై మెరయ 
అభ్యంగ నావిష్కృత కురులు పైకెగయ 
ముదమార ముడివేసి 
ముంజేతి గాజులు సయ్యాటలాడ 
ముత్యాల ముంగిట 
ముత్తయిదువుల ఆహ్వానములు 
అలలారు సమయములు 
ఏవి ? ఇప్పుడేవి ??

నవ దంపతుల సరసాలు 
విరి బోణుల విలాసాలు 
బా... మరదళ్ళ పరిహాసాల 
వదినా ..మరుదుల అనురాగాల 
చెంగలించు 
అలనాటి మా సీమలు 
ఏవి ? ఇప్పుడేవి ??

సింధూరపు బొట్టు 
పాపిట పెట్టి 
దొండ పండండి 
కొడుకు నిమ్మని 
కోరుకును సీమంత వధువులు ..
ప్రియుని పిలుపు 
శతకోటి వీణలు మీట, 
ఎదలో ప్రణయ రాగాలు 
సవరించు నవోఢలు 
ఏరి ? ఇప్పుడేరి ??

వోర వాకిలి వెనుక 
వాలు చూపులు సంధించు 
వన్నెలాడుల క్రీగంట పరికించి 
మధుర భావాల గుండె చప్పుళ్ళ 
పరవశించు కొత్త అల్లుళ్ళు ...
మూసిన ప్రణయ
సౌధపు వాకిళ్ళు తెరచి 
అలనాటి తొలిరేయి 
వలపు కౌగిళ్ళు తలచి 
పరవశించిపోయే 
ముదుసలి యెవ్వన మామలు..! 
అనురాగపు జల్లుల తడిసి 
మగని పులకరింతకు జడిసి 
లోలోన మురిసిపోయి 
ముసిముసిన నవ్వుకునే ముదుసలి అత్తలు..!
ఏరి ? ఇప్పుడేరి ??

కోడి పందాలు, 
కోడెల బలాబలాలు 
గంగిరెద్దుల నాట్యాలు 
కోలాటముల సయ్యాటలు 
భగ భగల భోగి పాయసము
పొంగారు పొంగలి 
ౘవులూరు గుత్తి వంకాయ 
కమ్మని గుమ్మడి పులుసు 
రోటిలోని వేడి వేడి గోంగూర పచ్చడి 
జిడ్డు తేలిన 
గడ్డ మీగడ పెరుగు 
ఏవి ? ఇప్పుడెక్కడివి ??
కనుమరుగై, కాలగర్భమున 
కలసిన అలనాటి మన పద్దతుల 
సజీవ దాఖలాలు
ఏవి ? ఇప్పుడేవి ??
కాలం మిగిల్చిన మన కన్నీటి ఆనవాళ్ళు 
గతకాలపు స్మృతి చిహ్నాలివి 
కాంతి లేని పల్లెటూళ్ళు ..! 
ప్రాణం లేని లోగిళ్ళు.. !
వెల వెల పోతున్న పండుగలు.. 
సంకెళ్ళ మాటున “సంక్రాంతి” చీకట్లు.. 
దుర్భర దారిద్ర్యపు కౌగిల్లు ...దుస్సల దైన్యానికి సజీవ నకల్లు..!!

పొట్టతిప్పల వేటలో యువకులు.. 
పూటగడవని వృద్దులు ..
వయసుడిగిన కాలంలో ..
పాతబడిన ఇళ్ళకు కాపలా..
ఇదీ ముసలితనపు చిత్రం ..
రాలుతున్న బ్రతుకు పత్రం.. 
కళ తప్పిన “సంక్రాంతి” నూతన భాగోతం ..
ఇది ఏ అభివృద్దికి చిహ్నం ?? 
ఏ సంక్షేమానికి సూత్రం .. 
ఏ విపరీత పోకడకు విచిత్రం .. 

Written by : Bobby Nani