Wednesday, February 21, 2018

స్త్రీ...



స్త్రీ ని దర్శించడం అంటే ఎప్పుడూ ఆమె బాహ్య సౌందర్యాన్ని వర్ణించడం, చూడటం మాత్రమే కాదు.. అంతర్ సౌందర్యం కూడా సందర్శించగలగాలి .. ఆచారాల పేరిట ఆమెకు జరిగే కొన్ని కార్యాలను చూస్తే మనసుకు చాలా బాదేస్తుంది.. అలా బాదేసిన కొన్ని సందర్భాలలో ఇది ఓ సందర్భం.. 

ఆమె నిగనిగలాడే నలుపైనా సరే 
ఎర్రకోకలో అప్పుడే పూచిన తంగేడులా ఉంటుంది.. 
ఉభయసంధ్యల్లో ప్రకృతి ఆ చీరనే కట్టుకొని 
లోకాన్నంతటినీ పులకింపజేస్తుంది .. !!

భర్త తిట్టినప్పుడు ఉబికే కన్నీళ్ళను ఎన్నిసార్లు 
తుడిచి ఓదార్చిందో ఆ కొంగు మీది కాటుక మరకలే చెబుతాయి.. 
భర్త కొడితే చిట్లిన రక్తం మరకలతో 
అద్దకం పూలలా ఉంటుంది ఆ కొంగు 
చాకిరేవుకు వేసినా పోని జీవితపు మరకలవి.. 


పాదాలపైకి కట్టిన ఎర్రచీరలో రోడ్డుపైకి వచ్చినప్పుడు 
వెంటపడే కోడిగాళ్ళను చూసి 
ఒంటినిండా కొంగు కప్పుకుని నడిచిపోయే ఆమె 
నీలాకాశంలో సూర్యబింబం పుడమిపై 
నడిచిపోతున్నట్లు ఉంటుంది.. !!

ఎర్రని కొంగుచాటున చంటివానికి పాలిస్తుంటే 
ఆమె ముద్దమందారమై మెరుస్తుంది.. 
కొప్పునిండా తెల్లని మల్లెలు చుట్టి 
రూపాయంత ఎర్ర కుంకుమ నుదుటున పెట్టి 
చేతులనిండా ఎర్ర గాజులతో మగని వెంట 
తిరునాళ్ళలో తిరిగే ఆమె – ఇలలో ఇంద్రధనస్సే
ఆకలిపొట్టను, అరిగిన శరీరాన్ని ఎర్రకొక చాటున దాచుకుంది.. !!

భర్త చనిపోయాడని 
చిన్ననాడు నీళ్ళుపోసి తల్లిపెట్టిన బొట్టును 
బలవంతంగా తుడిచేసి, 
బాల్యం నుంచి చేతినిండా గలగలలాడుతూ 
కష్టసుఖాలకు తోడుగా వున్న గాజులు 
బలవంతంగా పగులకొట్టి 
ఎర్రకోకను విప్పించి, తెల్లచీరను మీద పడేసినప్పుడు 
జీవంపోయిన ఆమె 
పగటి చంద్రబింబంలా వెలవెలబోయింది.. 
మోడైన తంగేడులా చిన్నబోయింది.. !!

ఈ దురాచారాన్ని చూడలేని సూర్యుడు 
పడమటి కొండల్లో తలదాచుకున్నాడు.. 
ఆడవారి జీవితాలలో కొత్త పొద్దు రావాలని 
రేపటికోసం ఎదురుచూద్దాం.. !! 

Written by : Bobby Nani

Tuesday, February 20, 2018

అక్షరాలే నా నేస్తాలు..



అక్షరాలే నా నేస్తాలు.. 
ఈ హృదయంలో పుడుతుంటాయి 
క్షణం, క్షణం, లక్షల ఆశాకుసుమాలు..!!

ఈ పిరికెడు మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. 
మోయలేని బరువును మోయలేక మోస్తూ.. 
అక్షరాల నాశ్రయిస్తాను.. 
ఈ హృదయం పగిలిపోకుండా, 
నా ఆశాలత వాడిపోకుండా, 
పుట్టుకొచ్చే ఆశాకుసుమాల్ని 
అక్షరాల్లోకి అనువదించి 
కాగితాలకతికిస్తుంటాను..
నా బరువంతా వాటికప్పగిస్తుంటాను.. 
ఈ అక్షరాలకతికించిన కాగితాలే సాక్ష్యాలు 
నా ఆశాకుసుమాలకు..!!

అందుకే 
అక్షరాలే నా నేస్తాలు.. 
నా ఆశల బరువు నిరంతరం మోస్తున్నందుకు... !!

Written By: Bobby Nani

Saturday, February 17, 2018

దేవుడికి ప్రతీ ఏటా పెళ్ళేమిటి ?? పుట్టినరోజున నాడే పెళ్ళా.. ??


ఓ గ్రూప్ లో నాస్తికత్వం చిందులేస్తూ ఉంటుంది.. అలాంటి గ్రూప్ లో ఒక ప్రశ్న నా కంట పడింది.. 

దేవుడికి ప్రతీ ఏటా పెళ్ళేమిటి ?? 

పుట్టినరోజున నాడే పెళ్ళా.. ?? 

మనకు పెళ్ళిళ్ళు కాని ...రాతి బొమ్మలకు పెళ్ళిళ్ళా .. ??

అందులోనూ ప్రతీ ఏటానా..?? 

వెఱ్ఱిలోకం, వెఱ్ఱి జనం అంటూ ఓ నాస్తిక మహాశయుడు అక్కడ కామెంట్ చేసాడు.. 

దాన్ని ఖండిస్తూ.. చిన్న వివరణ.. 

ప్రతీ ఏటా ఏ తిథి నాడు వివాహమైనదో ఆనాడు వివాహోత్సవం జరుపుకోవాలని గృహ్య సూత్రాలలో ఉంది.. కాని ఈ నియమం దేవతలకు లేదు.. 

ఉదాహరణకు – రాముడు పుట్టినరోజునే పెళ్ళి చేస్తారు.. ఇదేమిటి విష్ణువు యొక్క అవతారమైన రాముడు అవతరించినప్పుడే అమ్మవారు కూడా అవతరిస్తుంది.. వారిద్దరూ సూర్యుడు, సూర్య కాంతి, పువ్వు, దాని పరిమళం, రత్నం, దానికాంతివంటి విడదీయరాని సంబంధం కలవారు.. రామాయణంలో 
“అనన్యా రాఘవేణాహం భాస్కరేణ యధా ప్రభా” అనే శ్లోకం పై మాటనే స్థిరపరుస్తుంది.. రాముడు పుట్టిన వెంటనే సీత పుట్టినట్లు లేదు.. ఆయనకు, ఆమెకు 7 సంవత్సరముల వ్యవధి ఉంది కదా అని సందేహం.. లోకంలో పురుషుని వయస్సు ఎక్కువ, స్త్రీ వయస్సు తక్కువగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరికీ పెళ్ళి అని ఉండటం చేత సీత రామునితో అవతరించినా చిన్నదిగానే ఉన్నట్లే ఉంటుంది.. ప్రకృతి, పురుషుడు కలిసివుంటారనే సత్యాన్ని తెలియపరచడం కోసం పుట్టిననాడే పెళ్ళి చెయ్యాలనే ఆచారం పుట్టింది.. వారి జయంతులనాడే వివాహ ఉత్సవాలు పరిపించాలని “కామికాగమంలో” ఉందని పెద్దలు చెప్పగా విన్నాను.. ప్రస్తుతం ప్రమాణం చూపించలేక పోతున్నాను... అందుకు క్షంతవ్యుణ్ణి.. 

ఇక రెండవ సందేహం :

రాతి బొమ్మలకు పెళ్ళేమిటి ?? 

ఆయనకు పెళ్ళి చేసినా చెయ్యకపోయినా ఏమనడు.. అది మనకోసం.. 
ప్రతిబింబంలో బొట్టు కనపడాలంటే బింబానికి (లేదా ముఖానికి) బొట్టు పెట్టాలి కదా ..!!

ఆయన బింబం అయితే.. మనం ప్రతిబింబాలం.. నీలో జీవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే నరహరిని పూజింపుమని శంకరాచార్యుల వారన్నారు.. 

“తత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసిచేన్నరహరి పూజాం కురు సతతం 
ప్రతిబింబాలంకృతి ధృతికుశలో బింబాలంకృతిమాతనుతే”

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. నాస్తికులు మారుతారని కాదు.. మనలో కొందరైనా తెలుసుకుంటారని.. ఎప్పుడూ ఆ చరవాణి, అమ్మాయిలు, సొల్లు కబుర్లే కాదు.. అప్పుడప్పుడు కాస్త సాహిత్యం, శాస్త్రాలపై కూడా దృష్టి నిలపండయ్యా .. నిన్న వాడు ఆ కూతలు కూస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పలేకపోయారు .. కారణం అవగాహనారాహిత్యం.. యువత అన్నిట్లో ముందు ఉండాలని కోరుకుంటూ __/\__

Written by : Bobby Nani

ఈ దేశమే నేను..!!

Thursday, February 15, 2018

నీతోనే.. నీలోనే .. వుండిపోతానలా ..!!


ఎత్తైన ప్రదేశపు బాల్కనీలో వున్న నాకు .. 
కనుచూపుమేర ఆకు పచ్చని తివాచీ కప్పినట్లుగా 
ప్రకృతి శోభాయమానంగా కనిపిస్తుంది.. 
భీమ బకాసురవంటి ఎత్తైన పర్వతాలు 
నాలాంటి ఎందరినో చూస్తూ శతాబ్ధాలను గడిపేస్తున్నాయి...
మేఘాల తెరలు పర్వత కొసలను తాకుతూ గిలిగింతలెడుతున్నాయి.. 
వాయువు అన్నిటినీ ఊయలలా ఊపుతూ వయ్యారంగా తిరుగుతోంది.. 
పళ్ళు కొరికే చలి... నా వంటిమీదకు చేరి నను కొయ్యబారేలా చేస్తుంది.. 
అప్పుడే .. సెగలు, పొగలు కక్కే కాఫీ కప్పును 
చేతికందిస్తూ ఎదుట కూర్చుందో ముదిత..!!

కబుర్లు, కాలక్షేపాలలో మునిగిన నాకు 
ఓ సుందర దృశ్యం కనువిందుచేయసాగింది.. 
తన పద్మపు పాదాలను లే లేత రవి కిరణాలు
ముద్దాడుతూ పై పైకి పాకుతున్నాయి.. 
ఆ కాంతులకు ఆమె దేహం పసిడిపూత పొదిగిన
సువర్ణణిలా మూడు పదులు దాటిన ముత్యపు మెరుపులా ఉంది.. !!

ఆదమరిచి మాట్లాడుతున్న ఆమె పెదవులను చూడసాగాను 
ప్రతీ పలుకు ఆ అధరముల మధుర కదలికలు 
నను రెప్పవేయనీయక చేస్తున్నాయి.. 
నారింజ తొనల ఆ పెదవుల ముద్రలు నా హృదయ క్షేత్రముపై 
తన్మయత్వపు నాట్యభంగిమల ప్రదర్శనలు గావిస్తున్నాయి.. 
దానిమ్మల పలు వరుసతో, 
తామరాకు నేత్రాలతో, 
కనుబొమ్మల విన్యాసాలతో, 
ఏదేదో మాట్లాడుతూనే ఉంది... !!

నా దృష్టి మొత్తం ఆమె ముఖ కవళికలుపైనే నిల్చుంది.. 
ఆమె హావభావాలు, 
ఆ మూతి ముచ్చట్లు, 
ఆ స్వర మాధుర్యం, 
నను నిరర్థకుడను చేస్తున్నాయి.. !!

ఏంటో నీ తలఁపులతోనే తపించిపోయే నాకు 
నువ్వెదుట కూర్చుని కబుర్లజల్లులు కురిపిస్తున్నావు 
నా కళ్ళలో కోటి కాంతుల కుసుమాలు ఒక్కసారిగా పూచినట్లుంది.. 
నీ నవ్వులో ఆనందాన్నై 
నీ నుదిటిన అరుణవర్ణాన్నై 
నీ కళ్ళలో రౌద్ర రూపాన్నై 
నీ ముఖములో వర్చస్సునై 
నీతోనే.. 
నీలోనే .. 
వుండిపోతానలా ..!!

Written by : Bobby Nani

Wednesday, February 14, 2018

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ....


ముందుగా అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు .... 
అలాగే ఈ రోజు చాలా విచారకరమైన రోజు అయినందుకు చింతిస్తున్నాను కూడా ....

ఏంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా విచారం అని చెప్తున్నాడు అనుకుంటున్నారా ? 

శుభాకాంక్షలు ఎందుకంటె కొత్తగా ప్రేమలోపడిన యువజంటలకు.... 
విచారకరం ఎందుకంటె వీళ్ళు అందరూ చివరిదాకా అలా ఉండగలరా ? .... అనేదానికి ... 

నా అనుభవం ప్రకారం 100 కి 10 జంటలే వివాహం దాకా వెళ్తున్నారు... మిగిలిన 90 జంటలు రేపటి సంవత్సరం దాకా ఉంటారనేది ఒక ప్రశ్నార్ధకం గా మిగిలింది... ఇది ఒక ఎత్తు అయితే వివాహం దాకా వచ్చిన 10 జంటలు చేసుకున్నాకా వాళ్ళ ప్రేమని నిలబెట్టుకుంటున్నారా ? అందులో కేవలం 2 జంటలు మాత్రమే చివరిదాకా ఉండగలుగుతున్నారు... 

ఇలా ఎందుకు ? 

తప్పు ఎక్కడ వుంది ? 

ఈ ప్రేమ వ్యవహారంలో మాత్రమే యువతలో పరిపక్వతకు భంగం ఎందుకు కలుగుతుంది ? 
మిగిలిన విషయాల్లో ఎంతో అనుభవజ్ఞత చూపించే యువత ఈ ప్రేమ వ్యవహారంలో ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ? 

ఒక్క విషయం చెప్పాలని వుంది.... 

శారీరకమైన బాద కన్నా మానసిక బాద చాలా తీవ్రస్థాయిలో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే... అలాంటప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించి మోసం చేస్తే ఆ వ్యక్తి పడే మానసిక క్షోభ ను భరించడం కూడా కష్టతరమే... ఇది ఎంతపెద్ద తప్పో ఈ రోజుల్లో ఎవరికీ కనిపించట్లేదు... ఇది చాలా సాదారణ విషయం గా పరిగణలోనికి తీసుకుంటున్నారు... ఒక ఆడపిల్లను పైశాచికంగా చిత్ర హింసలు పెట్టి చంపేశారు అని తెలిస్తేనేనా మీరు రంగంలోకి దిగేది... 

అంతా అయిపోయాక న్యాయం అనే పేరుతో కేసును ఇంకో 20 సంవత్సరములు తిప్పుతూ ఉండడమే కదా మన రాజ్యాంగ గొప్పతనం .... అలాంటివి మాత్రమే మీకు ఈ బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్నాయి... ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా మోసం చేసి వదిలి వెళ్ళిపోతే ఆ భాదితుల సంగతి ఏమిటి ? అలా ఎవరికి తెలియకుండా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో మీకు తెలియదు.. 

ఇది ప్రభుత్వ లోపం కానే కాదు... 
ఇది మన లోపం... 
మనమే ఒక సరియైన వ్యక్తిని ఎంచుకోవాలి.... 
ఎంచుకున్న వ్యక్తితో కడదాకా ఉండేలా జీవించాలి... ఉండగలగాలి.. 
ఈరోజుల్లో మనవాళ్ళు మాటలతో బూరెలు వండేస్తున్నారు ... అది చూసి వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తునారు... మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనేవిషయం మీ యొక్క ఊహాశక్తికే తెలియాలి... అది తెలుసుకోనప్పుడు మీరు ప్రేమించకండి .... ప్రేమించానని చెప్పి మోసం చెయ్యకండి.... 

ఇది మన పద్దతి కాదు అని కొందరు అంటున్నారు... వాళ్ళు అలా అంటునప్పుడల్లా నవ్వు వస్తుంది.. ఎందుకంటె మన పద్దతి అనేది మనం మర్చిపోయి చాలా కాలం అయింది... ఇప్పడు వున్నవి అన్నీపాశ్చాత్య పద్దతులే... కాని చిత్రమేమిటంటే ఈ ప్రేమికుల రోజు మాత్రమే ఇది మన పద్దతి కాదు అని మనవాళ్ళకు తెలియడం... 

మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకోబోయే ఆఖరి గడియ వరకు మనం, మన పద్ధతులనే పాటిస్తున్నామా ? అలా చేయలేనప్పుడు ఇలా చెప్పడం ఎంతవరకు సబబు ... అలా అని నేను ఈ ప్రేమికుల రోజును సమర్ధించటం లేదు... అందరికీ చెప్పుకోవడానికి ఒక రోజు వుంది. కాని ప్రేమికులకు కూడా ఒక రోజు వుండాలి.. కాని అది పొందే అర్హత మాత్రం నిజమైన ప్రేమికులకు మాత్రమే వుండాలి.. వాళ్ళు నిజంగా నిజాయితీగా జీవితాంతం ఒకరి ఒకరు తోడుగా వుంటాను అని మనస్పూర్తిగా అనుకొని నిలబడిన వాళ్లకు ఈ ప్రేమికుల రోజు అనేది దక్కాలి... 

చివరగా ఒక్క మాట.. 

ప్రేమించడం, ప్రేమించబడటం అనేది ప్యాషన్ కాదు... 
తల్లి మనకు ఒక్కరే అలాగే తండ్రి కూడా ఒక్కరే ఎలా అయితే ఉంటారో మనల్ని జీవితాంతం ప్రేమించే వారు కూడా ఒక్కరే అయివుండాలి... ప్రేమ, పెళ్లి అనేది జీవితంలో ఒకరితోనే ఒక్కసారే .. ఆ అనుభూతి చాలా గొప్పది... దాన్ని దయచేసి కలుషితం చెయ్యకండి... మీకు కాబోయే జీవిత భాగస్వామి నిజాయితీగా ఎలా వుండాలని మీరు కోరుకుంటారో అలాగే వాళ్ళు కోరుకుంటారని గుర్తుపెట్టుకోండి... వాళ్ళకు మీ మనసును, దేహాన్ని కల్మషం లేకుండా నిజాయితీగా అందివ్వండి.... 

నేను ప్రేమకు, ప్రేమించేవాల్లకు వ్యతిరేఖిని కాదు ప్రేమ పేరుతో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద నేను వ్యతిరేఖిని అని మీకు విన్నవించుకుంటూ __/\__

స్వస్తి..

Written by : Bobby Nani
 

Tuesday, February 13, 2018

పద్మినీ ...


పద్మినీ ...
********


ప్రాతఃకాలసమయంలో 
తొలి రవికిరణం ఉదయించే చోట 
నే... కూర్చుని తెల్లని కాగితాలలో 
నఖశిఖ పర్యంతపు ఊహా నాయికలను
ప్రసవించుచున్నాను .. !!

అప్పుడే ఓ అసందర్భ స్వరమేదో 
నా శ్రవణమునకు తాకింది..!!

తెలియకుండానే నా హృదయం ఆ 
స్వర సాన్నిధ్యమునకు ప్రాకులాడింది.. 
తల పైకెత్తి చూచాను చతుర్ధశినాటి చంద్రోదయాన్ని 
రవి కిరణం మెల్ల మెల్లగా చీల్చుకు వస్తోంది.. !!
నా చుట్టూరా కలియతిరిగాను 
ఆ స్వర జాడ కానరాలేదు.. 
అడుగులేసుకుంటూ ముందుకు కదిలాను ..
అక్కడో క్రీడా సరస్సు కనిపించింది.. 
సమీపమునకు చేరాను .. 
సరస్సుకు ఓ ప్రక్కన బంగారు మెట్లను పోలి వున్నాయి.. 
ఆ మెట్లపై లలిత సంగీతంలోని శివరంజని రాగాన్ని 
ఆలపిస్తోందో ముదిత.. !!

ఏమా కంఠ మాధుర్యము 
ఏమా లలాట లావణ్యము .. 
నిశ్చలంగా నిల్చుని చూస్తూ వుండిపోయానలా .. !!

ఏమైనా పద్మినీ జాతి స్త్రీ దేవతా స్వరూపిణే
మరోసారి రుజువైనది ఈమెను చూచిన నాకు.. 
ఆమె నుదురు మేనకను పోలి కస్తూరి తిలకంచే శోభిల్లుచున్నది..
ముఖ సౌందర్యం తళ తళ మెరయుచున్న పున్నమి కాంత మణిలా 
విచ్చుకున్న పద్మం లా, చిరునవ్వు మోము తో 
వెన్నెల కాంతివలె స్పష్టంగా వుంది.. 
ముంగురులేమో ఊగే మేఘాలవలె, 
నెమలి పింఛమువలె, తుమ్మెద బారుల్లా 
వెంట్రుకలు సోయగాలై వ్యాపించబడి వున్నాయి..
ఆ కనుబొమ్మలు ధనస్సుల్లా వంగి, చూపులు శరములను 
ఎక్కుపెట్టి నేరుగా ఉల్లమునకు సంధిస్తున్నాయి .. 
ఆమె నేత్రాలు తెల్లతామర రేకులను 
నల్ల కలువ రేకులను కలగలుపుకొని 
లేడి కన్నులను ధిక్కరించుచునట్లున్నాయి.. 
ఆమె నాశిక సంపంగి మొగ్గవలె, కాడికి కట్టిన నాగలివలె 
దున్నేందుకు సిద్దములా వుంది.. 
అధరములు దోర దొండ పండ్లలా, 
అమృత రసాన్ని స్రవిస్తూన్నాయి .. 
ఆమె కంఠం శంఖంలా.. సంపంగి చెట్టు కాండంలా వుంది.. 
స్తనములు పూర్ణకుంభములవలే 
నడుం మడతలు తరంగం వలె, 
నూగారు తుమ్మెద చాళ్ళలా సోయగంగా వున్నవి.. 
లోతు తెలియని ఉదర నాభి పొక్కిలి ప్రస్పుటంగా
కనులకు కనువిందు గావిస్తోంది.. 
కటీరముల బరువుకు ఆమె నడుము 
ఇంద్రధనువులా వంపులు తిరిగి వుంది.. 
పిక్కలు బంగారు సన్నాయిలను పోలి ప్రకాశవంతంగా వున్నాయి.. 
పాదాలు పద్మాలవలె, వేళ్ళు చివుర్లవలె 
బంగారు కాంతులను వెదజల్లుతున్నాయి.. 
నిజంగానే ఆమె ఓ అద్బుత క్షేత్రం, అజరామర రూపం 
ఆమె సౌందర్యాతిశయాన్ని చూస్తే 
మానవ మాత్రులే కాదు..
దేవాదిదేవతలు సైతం ముగ్ధులై ముడుచుకుపోతారు.. !!
శుద్ధ సువర్ణచ్చాయ గల ఆ దేహం, 
ఆ రూపురేఖా విలాసాలు,
కిన్నెర కాంతలను తల తన్నే విధంగా వున్నాయి.. !!

Written by : Bobby Nani

Monday, February 12, 2018

లలన..


చాలామంది అంటుంటారు చిత్రాన్ని చూస్తూ రాయడం చాలా కష్టం అని.. నాకు మాత్రం దృశ్య కావ్యం చాలా సులభం.. భావ కావ్యం కాస్త లోతుగా ఆలోచించి రాయాలి.. ఒకరు ఈ ఫోటో పంపించి అక్షరాలతో అలంకరించమన్నారు.. ఇక వారి కోరిక మేరకు.. ఆ రూపాన్ని అలా చూస్తూ..ఇలా మీ ముందుకు వచ్చాయి ఈ అక్షర మాలికలు.. 

ఆహా ఏమా సొగసులే.. 
ఏమా భంగిమలే .. 
ఏమా సౌష్ఠవములే లలన.. 
అసూయ పడుతూ మలిచుంటాడే బ్రహ్మ 
తాత్వికులు సైతం తన్మయత్వపు చెమటలు 
వెడలు గ్రక్కుతారే నిను దర్శించిన శగ, శరముల తాపములతో..!!

సొగసునైనా కాకుంటినే నీ 
అణువణువులో ఆంగికాభినయంతో నర్తించేందుకు..!!
మధువునైనా కాకుంటినే నీ 
అధర చుంబనములంచున స్రవించేందుకు .. !!
కుచమునైనా కాకుంటినే నీ 
హృదయ గోపురముపై కలశంలా తళుక్కుమనేందుకు..!!
గోరింటనైనా కాకుంటినే నీ 
అరచేతిన ముద్దమందారమై విరబూసేందుకు ..!!
రవిక ముడినైనా కాకుంటినే 
నీ వెన్నును నిత్యం ముద్దాడుతుండేందుకు..!!
ఇంద్రచాపమైనా కాకుంటినే నీ 
నవనీత నడుము బిగుతుఁగ చుట్టుకునేందుకు .. !!


జీరాడు చీర కుచ్చిళ్ళతో.. 
జాలువారు కురులు విరులతో ..
చకోరి చక చకలతో ..
పసిడిఛాయ దగ దగలతో ..
మరగ కాగిన పాలమీగడ గులాబి వర్ణముతో ..
యెవ్వన లేడిలా చెంగు చెంగుమనుచూ 
కాలి అందియల ఘల్లు ఘల్లుమని 
శోళపద్మపు నాట్య ముద్రతో 
తద్దిమ్మి తకదిమ్మి, 
దిద్దిమ్మి దిమిదిమ్మియను 
రాగ తాళ నాట్యములతో 
గాండీవపు వంపుతిరిగిన వృత్తాకారముతో 
రావే.. ఇటురావే.. 
బిర బిరగ నను చేరగ రావే.. 
నా ఎదపై తన్మయత్వపు నృత్యము నర్తించగ రావే.. !!

Written By : Bobby Nani

Thursday, February 8, 2018

వాసంతిక ..


“వాసంతిక” అంటే వసంతోత్సవము అని అర్ధం... అంటే ఆమెలో ఎప్పుడూ వసంతమే వెల్లివిరుస్తూ ఉంటుంది.. అలాంటి అమ్మాయి గురించి వ్రాసాను.. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయి అరుదు.. పద్మినీ జాతి స్త్రీ లు ఎందరో వుంటారు.. కానీ “వాసంతిక” లా ఉండటమే కష్టం .. అందుకే అలాంటి చంద్రవదన గురించి కనీసం ఊహల్లో అయినా అక్షర సత్కారాలు చెయ్యాలనిపించింది.. అలా రూపొందుకున్న ప్రతి రూపమే నా ఈ “వాసంతిక”... చదివి అభిప్రాయం చెప్పండి.. __/\__

వాసంతిక 
నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే.. 
ఎందుకో తెలుసా.. ?? 
నిను చూసి నక్షత్రాలే చీకట్లో వొదుగుతుంటాయి.. 
ఆకాశపు గుండెల్లో నెలవంక వెలవెలబోతుంటుంది.. 
నీ పరువపు సొగసులలో నిశీధి నిట్టూర్పుతుంటుంది.. 
చీకటి కాంతిలో నీవు మాత్రం ఎప్పుడూ 
వెండివెలుగుల తారలా మెరిసిపోతూనే ఉంటావు..
ఆ చీకటినంతా మచ్చగా చేసి ముచ్చటగా పెదవుల
కింద ఆభరణమై అమర్చావు .. !!


ఎగిసి ఎగిసి పడుతున్న ఆ ద్రాక్ష గుత్తుల్లాంటి నల్లని 
నీ కళ్ళు నన్ను ఎప్పుడూ కాటేస్తూనే ఉంటాయి
నీ నుదిటిన కనుబొమ్మల మధ్య 
ఉదయించే సూర్యబింబాన్ని అలానే చూడాలనిపిస్తుంది.. 
అల్లి బిల్లిగా నీ ముఖాన్ని అల్లుకున్న నల్ల నల్లటి లతలూ 
పిల్లగాలికి పై పైకి ఊగుతూ 
ఎప్పటికప్పుడు నను మురిపిస్తూ, మైమరిపిస్తూ వుంటాయి.. 
చీకట్లో కూడా తళుక్కున మెరిసే నీ నాశికా నక్షత్రము 
నీ అందానికి మరింత వన్నె తెస్తోంది.. 
నా గుండెల్లో ఎగసి పడే యెర్ర సముద్రం 
ఊహల సామ్రాజ్యంలో నీపై ఎర్ర ముద్దబంతి పూలై వర్షిస్తోంది.. 
వెన్నెల... మల్లె సొగసులై గుప్పు గుప్పుమని 
గుబాళింపులు వెదజల్లుతోంది.. 
నీ సిగ్గు దొంతరల మధ్య విచ్చుకుంటున్న 
ఎర్ర మందారం నను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉంటుంది.. !!


వాసంతిక 
నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే..
ఎందుకో తెలుసా.. ?? 
పాలమీగడ సొగసు గత్తెవు 
పంచదార పలుక గత్తెవు 
మకరంధపు మధుర గత్తెవు 
సిగ్గులొలుకు సరస గత్తెవు 
మధురలొలుకు మధువ గత్తెవు
వాసంతిక ...,
అందాన్ని వెతుక్కుంటూ వచ్చిన నాకు 
బ్రహ్మాండమే ఎదురుపడింది...
నీలో వాసంతము ఇగురు చిగురై నా కనుపాపను 
ముద్దాడే వరకు నా యీ అక్షర ప్రవాహిని నీపై 
కురుస్తూనే ఉంటుంది.. !!

Written by : Bobby Nani

“దాశరథి కృష్ణమాచార్య”



నిన్న నేను వ్రాసిన “నేనే చీకటైతే .. వెలుగు నా ప్రేయసి..” అనే శీర్షికలొ “దాశరథి గారంటే నాకు చాలా ఇష్టం..” అని నేను ఉదహరించిన విషయాన్ని గురించి కొందరు ఆత్మీయ మిత్రులు నాతో సంభాషించారు.. 
అసలు మీకు దాశరథి గారి గురించి ఏం తెలుసు?? వివరించండి ?? అంటూ కొందరు.. 
దాశరథి గారు ఎవరు ?? అంటూ మరికొందరు 
దాశరథి గారు రచించిన ఏ ఏ పుస్తకాలు మీరు చదివారు ??
మిమ్మల్ని ఆయనలా ప్రభావితం చేసిన రచనలు ఏవి ?? అంటూ అనేకానేక ప్రశ్నల వర్షం రాత్రంత్రా కురుస్తూనే ఉంది.. నేను మాత్రం ఆ వర్షంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వపు నృత్యం చేస్తూ గప్చిప్ గా ఊరుకున్నాను.. అక్కడ ఊరుకున్నది ఇక్కడ వివరణ ఇవ్వడానికేనని కొందరి మిత్రుల ప్రఘాడ విశ్వాసం... !!

వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ చిరు వివరణ ఇవ్వదలచాను.. 

“దాశరథి కృష్ణమాచార్య” తెలంగాణా బిడ్డ.. వరంగల్ లో జన్మించారు .. తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు.. దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని గర్వంగా ప్రకటించి ఉద్యమానికి ఊపును, ప్రేరణనందించిన మహాకవి దాశరథి... 

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భావాలను అందుకోవడం, దర్శించడం అసాధ్యం.. ఉదాహరణకు కొన్ని చెప్తాను .. 
తెలంగాణా ఉద్యమ సమయంలో “పోలీసు స్టేషన్” నుంచి తప్పించుకుని పారిపోతున్నప్పుడు కూడా మంచినీళ్ళు అడిగితే ఆప్యాయంగా ముంతతో నీళ్ళు అందించిన రైతు పిల్ల వయ్యారం, ఆమె కళ్ళలోని అమాయకత నన్ను మైమరిపించాయని దాశరథి గారు చెప్పారు.. హృదిలో ఎన్ని ఆలోచనలు సుడులు తిరుగుతున్నా కూడా చూసిన ప్రతీ దానిలో సౌందర్యాన్ని కనుగొనడం ఆయనకే సాధ్యం.. అందరిలా కాకుండా విభిన్నమైన కోణంలో తన రచనలను గావించారు అందుకే ఆయన అందరిలా కాకుండా ప్రత్యేకమైన వారిగా నిలిచిపోయారు..

నిజామాబాదు జైల్లో కిటికీలోంచి చూస్తే బయటి మామిడి కొమ్మ చిగిర్చి, పూలు పూసున్న రీతిని చూస్తే లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది అని ఆయన అన్నారు.. ప్రకృతి సౌందర్యం, ప్రణయ భావన తన విప్లవ భావాలకు ఆటంకం కాలేదంటాడు.. ఆయన రచించిన కావ్యాలన్నింటిలో భావకవిత్వం ఉంది.. 

దాశరథికి ఉషస్సులొ, వసంతంలో, శరత్తులో అన్నిటా ప్రేయసే కనిపిస్తుంది.. వసంత ఋతువుల్లో ముఖ్యంగా మనోహరమైన ప్రణయ భావాలను ఆయన రచించారు.. 

దాశరథి రచించిన కవితా ఖండికలలో “రాగబంధం” విశిష్టమైనది.. మహాంధ్ర మూర్తిని ఒక ప్రేయసిగా చేసుకొని, తనని ప్రియునిగా ఆరోపన చేసుకొని రచించిన కవిత “రాగబంధం”

నిజానికి దాశరథి గారికి తెలుగు రాష్ట్రాలు విడిపోవడం అస్సలు ఇష్టం లేదు.. అందుకే “మహాంధ్రోదయ గీతి” అని “సమైఖ్యాంధ్ర సౌభాగ్యగీతి” అని పదే పదే తన అభిమానాన్ని వ్యక్తీ కరిస్తూ ఉంటాయి.. 

తెలంగాణలో ఎటు చూసినా వేప మాకులు, పూల తోటలు, మామిడి తోటలు సంపంగి, సన్నజాజి తోపులు వంటివన్నీ నిరంతరం తెలంగాణా ప్రాంతమంతా వ్యాపించి హాసిస్తున్నట్లుగా, ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి.. దాశరథికి ఇవంతా ఒక కొత్త సౌందర్యంలాగా కనిపించింది.. ఒక ప్రక్క తోటలకు నీళ్ళు పెట్టే మహిళలు, ఇంటి ముంగిట రంగ వల్లికలు, పూల గొబ్బిల్లు, కల్లాపి దృశ్యాలు ఇలా తెలంగాణా సుందరి ఎంత బాగా ఉందో అంటూ వర్ణించారు.. 

అలానే రాయలసీమలో కూడా ప్రాంతం చిన్నదైనా (కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నాలుగు ప్రాంతాలలో కలిసి ఒక రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి రాయల వైభవాన్నే పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.. అందుచేత లేపాక్షిలో ఆనాటి కట్టడాలు, పెనుగొండలోని గగన మహలు దృశ్యాలు, తిమ్మరుసు నాటిన స్తంభం, జైన దేవాలయాలు, తిమ్మరుసు సమాధి, అప్పటి కవితా పుటలను అన్నిటినీ స్మరిస్తే ఒక రాయలసీమ. అందుచేత ఇక్కడ కూడా నదులు, వంకలు, వాగులు, సెలయేళ్ళు ప్రత్యేకించి పంట పైరులు అడుగడుగునా అందాలను విరజిమ్మే పూలతోటలు, కొబ్బరి తోటలు, గున్నమావి గుబుర్లు, చీనీ తోటలు, వేప చెట్ల విలాసాలు, ఓహో.. ఎన్నెన్ని రాయలసీమ సౌందర్యం, పరమ రమ్యంగా అనిపిస్తుంది.. అందుచేత ఏ కవైనా ఆకర్షింప బడటం ఆశ్చర్యమేమీ కాదు.. దాశరథి గారు ఇలాంటి రాయలసీమ సౌందర్యాన్ని బాహిరంగా సందర్శించారు.. 

ఇక పోతే నా కోస్తా ప్రాంత సౌందర్యం గురించి చెప్పనక్కరలేదు.. ఆధునిక కవులు పేర్కొన్నట్లు ఈ మహాంధ్ర దేశానికి మరకత మణి ఏదంటే ఒక్క కొనసీమే.. ఇంక గోదావరి, కృష్ణ, పెన్నా, తూర్పు వైపైతే మంజీర, వంశధార, ప్రాణహిత నదులు ఎటు చూసినా పొటమరించే వరి మళ్ళు, మైళ్ళ తరబడి విస్తరించిన దోస తోటలు, కొబ్బరి తోపులు, మామిడి చెట్ల సౌందర్యం చెప్పనలవి కాదు.. వేప చెట్ల సౌందర్యాన్ని అయితే దాశరథి గారు విజృంభించి వర్ణిస్తాడు.. 

అంతే కాకుండా కోస్తా ప్రాంతం కళాకారులెందరికో నిలయం.. సంగీత సాహిత్యాలకు ఆలవాలం.. నదీ నదాలకు ఆ ప్రాంతమే ఆటపట్టు.. ఇలా పేర్కొంటూ పోతే కోస్తా ప్రాంత సుందరి నిస్సందేహంగా చిరు యవ్వని.. అందుచేత సాధారణ ప్రజలకు సైతం ఆకర్షణ కలిగిస్తుంది.. ఇక దాశరథి గారికి కోనసీమ ప్రాంతమంటే గుండెల్లో సందడి.. ఆ ప్రాంత సుందరిని వర్ణిస్తే కాని హాయి ఉండదని ఆయన పేర్కొన్నారు.. 

ఇక పోతే ఆయన రచనలు గురించి.. “మహాంధ్రోదయము” లో చాలావరకు దేశీయాభిమానం, ప్రకృతి, తెలంగాణా విముక్తి ఇలాంటివే కనిపిస్తాయి తప్ప ప్రత్యేకంగా వర్ణించబడిన ప్రణయ ఘట్టం కానరాదు.. 

చాలామంది కవులు ప్రకృతిని కేవలం ప్రకృతి గానే వర్ణించారు.. అలాంటి సందర్భంలో సామాన్య మానవులకు అలాంటి కవులకు చెప్పుకోదగ్గ తేడా కనిపించదు.. దృశ్య వస్తువు వీలైనంత వరకు అంతర్నేత్రముతో చూడగానే అది పలు విధాలుగా కనిపించాలి.. ఆ నది ఒక కాంతగా అతని కవితా నేత్రానికి కనిపించింది.. 
“ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల భాష్పధారవే ! మంజీర !
నీవు పారి దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు”

విశ్వనాథకు “కిన్నెర” ఎలా రవళిస్తుందో అలానే దాశరథిగారికి “మంజీర” ప్రవహిస్తున్నంత వరకు మంజీర రవళి మ్రోగుతూనే ఉంటుంది.. మంజీర నదిని, నారీమణిగా, సాధ్వుమూర్తిగా, ప్రేమ భావంగా, పరోపకారిణిగా ఇలా రకరకాలుగా ఉల్లేఖిస్తూ వర్ణించాడు..

అలాగే “పౌష లక్ష్మి” అన్న ఖండికలో సంక్రాంతి సంబరాలు అద్బుతంగా వర్ణించారు.. 
“మధురి” అన్న ఖండికలో ఉగాదిని తన ప్రేయసిగా వర్ణించారు.. 
దాశరథి గారి దృష్టిలో ఆ లేత గాలే నాట్యం చేసే ప్రియురాలు.. జీరాడే చీర అని చెప్పడం వల్ల ఆకులు రాలే దృశ్యం స్పురిస్తుంది.. పక్షుల కిల కిల రావాలను శాంత వసంత బాష గా మునుపే చెప్పారు... ఇలా దాశరథి కి అనిపించే ప్రతీ దృశ్యం కూడా ప్రణయ దృశ్యంగా కనిపిస్తుంది అని అనడంలో సందేహం లేదు.. 
ఇలా ఒకటా రెండా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. !!

మిత్రుల కోరిక మేరకు ముఖ్యమైన విషయాలను రాయడం జరిగింది.. అది కాస్త ఇలా ఇంత పెద్దదిగా అయిపోయింది.. అందుకు క్షంతవ్యుడను.. __/\__

Written by : Bobby Nani

Wednesday, February 7, 2018

నేనే చీకటైతే .. వెలుగు నా ప్రేయసి..



దాశరథి గారంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటె ఆయన ప్రకృతినే ప్రేయసిగా భావించి అనేక కవితలు రూపొందించారు.. “భావకవిత్వానికి” ప్రాధాన్యత వహిస్తారు.. ఆయన దారిలోనే నేనూ ప్రకృతినే ప్రేయసిగా చేసి అనేక కవితలను వ్రాసాను.. అదే తరహాలో చీకటి, వెలుగు అనే రెండు విభిన్న కోణాలను తీసుకొని ప్రేయసి, ప్రేమికల్లా వాటిని మలచి రాయాలనే చిరు ఉత్సాహముతో, కుతూహలముతో ఇది వ్రాస్తున్నాను.. చదివి అభిప్రాయాలను తెల్పడం మాత్రం మరువకండి.. 


నేనే చీకటైతే .. వెలుగు నా ప్రేయసి.. 
***************************

చీకట్లో వెలుగు చిక్కింది గదా అని ముద్దు పెట్టుకోబోతే 
చిలిపి చూపులు చూస్తూ తప్పించుకు పారిపోయింది.. 
ఓర వాకిలిగా తలుపు తెరిచి రాత్రి కన్య వెలుగు కోసం 
నిరీక్షిస్తూ కూర్చున్నాను.. 
కవితా పుష్పాలను కోసుకొచ్చి, 
సముద్ర తీరంలో దొరికిన శంఖు చక్రాల్ని ఏరుకొచ్చి 
సంకేతాల చల్లని ఈ ఇసుక నదీ తీరంలో ఒక్కసారైనా కవ్వించక పోతావా అని 
ఒక చూపైనా నా వైపు విసరక పోతావా అని 
దుఃఖం పొర్లుకొస్తున్న నాకు .. క్షణాలు రాలిపోతున్న కాలంలో .. 
కాలైనా కదపలేని దీనావస్థలో నేనున్నాను.. నీకోసం వున్నాను.. 
నా కళ్ళలో విరహం ఉలిక్కి ఉలిక్కిపడి లేస్తుంది.. 
నిరీక్షణ కలల అలల మధ్య నురగలా కరిగిపోతుంది.. 
విరహంలో నిగ్రహం తప్పిన నన్ను 
వీధి దీపాలు మిణుకుతూ ప్రశ్నిస్తున్నాయి... 
ఇన్నాళ్ళూ ఎక్కడ తప్పిపోయానో చెప్పమంటున్నాయి .. 
అద్దంలో ఉబ్బిపోయిన ముఖం చూచుకుంటూ 
నాలోని నన్ను నేను తవ్వుకుంటూంటే దోసేట్లో కొచ్చి చేరింది మనసు.. 
ఆకాశాన్ని అదేపనిగా అవలోకిస్తూ కూర్చున్నాను.. 
ఎప్పుడు వచ్చిందో వెలుగు ఎదురుగ్గా నిల్చుంది, 
తన రెండు చేతుల్లోనూ సూర్యుణ్ణి నా కందిస్తూ.. !!

ఇద్దరం అలా సాగరతీరాన నడిచి వెళ్తున్న అనుభూతి 
నాకెంతో ఆనందంగా ఉంది.. ఎదురుగ్గా సముద్రం కేరింతలు కొడుతోంది.. 
వెనక్గా అప్పుడే వస్తూ ఎర్రగా నవ్వుతున్నాడు సూర్యుడు.. 
ఒక్కసారిగా నాలో తెలియని తన్మయత్వం.. 
ఒకరినొకరం ఆవేశంగా కౌగిలించుకున్నాం .. 
ఒకరిపరుగులో మరొకరం వొదుగుతున్నాం..
ఒకరి నవ్వులో మరొకరం శ్వాసిస్తున్నాం ...
సంద్రాన్ని జారుడు బండలా మలచి కెరటాల మీదన జర్రున జారుతున్నాం.. 
తీరాన్ని పాన్పుగా చేసి తనివితీరగ దోర్లుతున్నాం.. 
ఆమె సముద్రంలా నురగలు గక్కుతోంది 
నేనూ సూర్యునిలా ఎరుపెక్కి పోతున్నాను.. 
మబ్బులు కమ్మనే లేదు కానీ 
చీకటి మాత్రం వెలుగు మీదకు ఒరిగిపోయింది.. 
ఇద్దరం కలిసి అమాంతంగా ప్రేమకు ప్రతిరూపమైన చంద్రుణ్ణి ప్రసవించాము.. 
అతగాడు ఆకాశంలో మెల మెల్లగా అడుగులు వేస్తున్నాడు.. 
రూపాయి నాణేల్ని తన చుట్టూ విసిరేసుకొని అదే పనిగా ఆడుకుంటున్నాడు.. 
కోనేట్లో కోయిలమ్మ సంగీత స్నానాలు చేస్తూ రాగాలు తీస్తోంది.. 
అప్పుడు కాని అర్ధమవ్వలేదు.. చీకటి కరిగే సమయం ఆసన్నమైందని.. 
కులాసా కబుర్ల కాలక్షేపంలో అర్దరాత్రి గంటలెలా దొర్లిపోయాయో అర్ధం కాలేదు.. 
వెలుగును వీడి చీకటి అస్తమించాల్సిన సమయం వచ్చేసింది.. 
వెలుగును వెళ్ళలేక వదలలేక రేపటి మరో సుదీర్గ రాత్రికోసం నేడు నిష్క్రమించిందీ చీకటి..!! 

Written by : Bobby Nani

Tuesday, February 6, 2018

సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప..



సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప.. 

(దయచేసి కాస్త సమయం తీసుకొని ఈ ఆర్టికల్ చదివేందుకు ప్రయత్నించండి.. )

ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఇలా రాసివుంది.. ఇద్దరు అన్నదమ్ములు అట 1. సీతన్న, 2. వెంకన్న ఆస్తి అంతా ఇద్దరూ చెరిసగం చేసుకున్నారంట .. వారికి ఒక విధవ ఆడపడుచు వుంది అంతే కాదు వారు పంచుకున్న ఆస్తులు సమానంగా పోను ఒక ఎకరా పొలం మిగిలింది.. పొలమును మరియు విధవ ఆడపడుచు ఈ రెండిటిని కూడా ఇద్దరూ తీసుకోవాలి అనే నిర్ణయాన్ని నమోదు చేసి ఉంటాడు వారి తండ్రి వీలునామాలో.. పొలం కావాలని కొట్టు కుంటారేమో అని అందరూ అనుకున్నారు..కాని ఆశ్చర్యంగా వారు ఆమె కావాలని కొట్టుకున్నారు.. 
విషయం ఏంటంటే ?
పొలం మీద పంట మాత్రమే వస్తుంది.. ఆమెను ఇంటికి తీసుకువెళ్తే వారి ఖర్చు తగ్గుతుంది.. ఆడమనిషి కాబట్టి బ్రతికినంతకాలం మా కుటుంబానికి చాకిరీ చేస్తుంది .. పైగా అట్లు పోసి అమ్మి రాబడి కూడా తెచ్చి ఇస్తుంది అని సమాధానం చెప్పారంట.. వారి దూర దృష్టికి నిజంగానే నేను విస్తుపోయాను..


రక్షణ లేని ఆమెపై అందరికీ హక్కువుంటుంది.. అందరూ ఆమెను వాడుకోవాలని చూసేవాల్లే .. కాని ఆమె అభివృద్దిని కోరే వారే అరుదవుతారు.. ఆమె శ్రేయస్సు పై కాని, ఆమె ఇష్టాఇష్టాలపై గాని ఏ ఒక్కరికి శ్రద్ద వుండదు.. ఆఖరికి కన్న తల్లితండ్రులకు, రక్త సంబంధీకులకు కూడా భారం అవుతుంది ఈమె.. అత్త మామలు, అన్నదమ్ములు, వదినెలు ఆమెను వేరు పురుగుగా చూస్తారు.. బావలు, మరుదులు ఆమె వారసత్వాన్ని ఎలా భంగ పరుద్దామా అని ఆలోచిస్తారు.. చదువుకుందామా అంటే చదివించే నాధుడే వుండడు .. పోనీ పెళ్ళాడుదామా అంటే మళ్ళీ పెళ్ళా !!! అంటూ అసహ్యంగా చూస్తారు.. వయస్సు మళ్ళిన మగవారు సైతం కన్నెలనే కోరుతారు ..కాని భర్తృవిహీనలంటే అతి నీచంగా చూస్తారు.. వైధవ్యం ఆమె కోరుకున్న వరం కాదు అని అందరికీ తెలిసిన విషయమే కదా.. కావాలని తెచ్చుకున్న దోషం అంతకన్నా కాదు.. అది ఆమెపై అనుకోని ఆశ నిఘాతంగా వచ్చిపడ్డ మహోపద్రవం ... 


ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. మరెన్నో సమస్యలు తీరుతున్నాయి.. ఇంకెన్నో మరబోతున్నాయి.. కాని మారని సమస్య మన విధవరాండ్రదే ... వారి వేష భాషల్లో కొంచం మార్పు వచ్చినా జీవిత విధానంలో ఏ మార్పు రాకపోవటం శోచనీయం .. వారు ఇటు పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా బరువే.. 
అది చాలక “తల చెడ్డ దానికి భోగభాగ్యాలెందుకు పడివుండక” అంటూ ఈసడిస్తుంది ఈ సమాజం.. 
“పూర్వ జన్మ పాప ఫలం వల్ల ఇలాంటి దశ వచ్చింది “ అంటారు తోటి స్త్రీలు.. 
“చేసుకున్నవారికి చేసుకున్నంత, అనుభవించక తప్పుతుందా ? 
ఏనాడో ఏ పచ్చని కాపురంలో నిప్పులు పోసి వుంటుంది అనుభవిస్తుంది మనమేం చేస్తాం “ అంటూ దెప్పిపొడుస్తారు తోబుట్టువులు.. 
“ నా పాప ఫలం” అంటాడు తండ్రి.. 
“ నా తలరాత వల్లనే దాన్ని కన్నాను కాని దాని అదృష్టాన్ని కనగలనా “ దానితో పాటు నేను అనుభవించక తప్పుతుందా అంటూ వాపోతుంది ఆమె తల్లి.. 


నెత్తిమీద గుడ్డ ఆ దేముడే తొలగించినప్పుడు, నుదుటి వ్రాత అలా రాసినప్పుడు అనుభవించక తప్పుతుందా.. ఇలా అందరికీ లోకువై, అందరిచేతా ఈసడింపబడుతూ ఎడారిలాంటి జీవితాన్ని సాగిస్తుంది ఆ అభాగ్యురాలు.. 


ఏ నేరం లేకుండా, ఏ తప్పూ చెయ్యకుండా శిక్ష అనుభవించేది ఎవరయ్యా అంటే విధవాడబడుచు అని రూఢీగా చెప్పవచ్చు.. 
అంతే కాదు ఒక చెంప జీవితంలో తీరని నష్టాన్ని పొంది బ్రతుకులో భారంతో గడుపుతున్న ఆమెపై జాలిలేక పోగా దయ, కరుణ చూపకపోగా దెప్పిపొడవటంలో న్యాయమేమిటో అర్ధం కావట్లేదు.. అందరికీ చాకిరీ చేస్తూ అందరికీ లోకువగా బ్రతకటమే ఆమె జీవిత ధ్యేయం, పరమావధి అవుతుంది.. 


ఇక పిల్లలున్న తల్లి, ఆస్తిలేని తల్లి, ఉద్యోగార్హత లేని తల్లి అయితే ఆమె కష్టాలు చెప్పలేనివిగా వుంటాయి.. ఇంటిపని, పిల్లల పని, వారి పోషణా భారం అనంతంగా వుంటుంది.. వారి చదువు, ఆరోగ్యం లాంటివి అనుక్షణం ఆమెను వేదిస్తూనే వుంటాయి.. అష్ట కష్టాలు పడి పెంచిన ఆ పిల్లలు పెద్దవారయ్యాక పెళ్లి అయ్యాక ఆమెకు ఇంత తిండీ, గుడ్డా కూడా ఇవ్వరు.. తండ్రి ఆస్తికి మాత్రం వారసులు అవుతారు.. 


“విడో” కాగానే ఆమె పరిస్థితులు తారుమారు అవుతాయి.. కొన్ని విధులు, బాధ్యతలు ఆమెకై కేటాయించబడతాయి .. ఎదురువస్తే “అపశకునం” అంటారు.. శుభకార్యాలలో పాల్గొనరాదు అంటారు.. తన బిడ్డ పెళ్లి కూడా తను దూరంగా వుండి చూడాలి.. ఇలా ఎన్నో ఎన్నెన్నో..


ఇవన్నీ మనసులో పెట్టుకొని వారికోసం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ వున్నాను.. 
స్త్రీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వితంతువులకు యాభై శాతం కేటాయిస్తే బాగుండు.. 
అలాగే వృత్తి, విద్యల్లో వారికి ముందుగా అవకాశం కల్పించాలి.. 
వయోపరిమితిని అధిగమించి వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించాలి.. 
యువకులు, విద్యార్ధులు చైతన్య వంతులై అలాంటి వారికి వివాహం చేసేందుకు ముందుకు రావాలి.. 
తోటి స్త్రీలు వారిని ఉద్దరించడానికి తోడ్పడాలి.. 
అలా సర్వులూ వారికి చేయూత నిచ్చిన నాడే వారు స్వతంత్రులు కాగలరు..


ఎన్ని చేసినా, మరిన్ని చేసినా వితంతువులు సైతం తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుకోవడానికి సర్వవిధాలా ప్రయత్నించాలి.. ఆనాడే వారి సమస్యలు సమసి పోగలవు..


ఒక్కరి హృదిలో అయినా ఈ ఆలోచన వస్తే బాగుండు..


స్వస్తి __/\__

Written by : Bobby Nani

Monday, February 5, 2018

మీ ప్రతీ కదలికను Hackers చూడగలరని మీకు తెలుసా..??


మూడోకన్ను ఒక్క శివునికే పరిమితమా..?? అంటే కాదనే చెప్పుకోవచ్చు.. 

ఎందుకంటే నేటి సమాజంలో సామాన్యుని దగ్గరనుంచి శ్రీమంతుని వరకు ప్రతీ ఒక్కరి చేతిలో ఇమిడిపోయి వుండేది ఒక్క మొబైల్ (చరవాణి) మాత్రమే.. ప్రతీ (చరవాణికి)మొబైల్ ముందు, వెనుక (కెమెరాలు) కళ్ళు అమరి ఉండటం ఇంకా మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం.. 

మీ ప్రతీ కదలికను Hackers చూడగలరని మీకు తెలుసా..??

నిస్సందేహంగా మీ కెమెరా నుంచి వారు మీ ప్రతీ కదలికలను చూడగలరు.. 

అవును మీరు విన్నది నిజమే.. ప్రపంచంలో ప్రతీ కెమెరాను Hackers చూడగలరు.. ఆండ్రాయిడ్ అయితే మరింత సులభంగా చూడొచ్చు.. మన ఇండియా లొ నూటికి 90 శాతం ఉన్నవి అవే.. 

“Andro RAT” అనే ప్రక్రియద్వార ఆ గూఢచారి అతను కోరుకునే పనులను చాలా సులభంగా చెయ్యగలడు.., సందేశాలను పంపడం, కాల్స్ చేయడం, డేటాను మార్చడం, ఫోన్ కెమెరాను ఉపయోగించి మీ యొక్క వ్యక్తిగత సమాచారాల్ని చూడటం వంటివి చేయవచ్చు. ఇది ఒక రిమోట్ యాక్సెస్ / అడ్మినిస్ట్రేషన్ టూల్స్ లా పనిచేస్తుంది.. నిజానికిది చట్ట విరుద్దం.. అయినా Hackers అవన్నీ పట్టించుకోరు... ఎందుకంటె వారికి అదొక ఆనంద వ్యసనం.. 

ఒక మొబైల్ ఫోన్ ను మీరు కేవలం ఓ పరాయి వ్యక్తిలా భావించండి.. అప్పుడే ఇలాంటి పరిణామాలకు మనం బాధ్యులం కాకుండా ఉండగలము.. ఓ పరాయి వ్యక్తి మీ ఇంట్లో కాని, లేదా మీ బెడ్ రూమ్ లొ గాని ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో వారికి ఎంత దూరంగా ఉండాలని అనుకుంటారో అలానే మీ మొబైల్ ని భావించండి.. మీ మొబైల్ ను బెడ్ పై పెట్టేసి మీరు దుస్తులు మార్చుకునే సమయంలో మీకు తెలియకుండానే మీ కెమెరా నుంచి మిమ్మల్ని మరొకరు చూస్తారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి.. 

వ్యక్తిగత సమాచారాలను మీ మొబైల్ లొ నిక్షిప్తం చెయ్యకండి.. మీరు చేసే ప్రతీ క్రియను మీకు తెలియకుండా మరో కన్ను చూస్తుందని గ్రహించండి.. 

ముఖ్యంగా ఆడవారు కాస్త జాగ్రత్త వహించండి.. 

సమస్య రాకముందే జాగ్రత్త పడటం ఉత్తమం.. వచ్చాక మనమెలానో మార్చలేము.. బాధపడటం తప్ప.. 

మీ కుటుంబ సభ్యునిగా భావించి చెప్తున్నాను..!! 
అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను..!! 

Written By : Bobby Nani