Saturday, December 30, 2017

ఇక నేటితో మా “డాక్యుమెంట్ రైటర్” అవసరం లేదు అనుకుంటున్నాను...



ఇక నేటితో మా “డాక్యుమెంట్ రైటర్” అవసరం లేదు అనుకుంటున్నాను...ఈ వ్యవస్థను నమ్ముకొని వేల మంది రోడ్డున పడుతున్నారు.. కాని దాని గురించి దిగులు లేదు.. ప్రజలకు మంచి విధి విధానాలతో సులభతరంగా, సౌకర్యవంతముగా, స్వల్పతరమైన ఖర్చులతో వారికి మంచి జరుగుతుందంటే మేము దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము..

నిజాలు ఒప్పుకోవాలి మరి..

మాలో కొందరు చాలా దారుణంగా వున్నారు... లంచాలను ప్రోత్సహించడం, వారి పరపతిని వుపయోగించి నయానో, భయానో వారి పని చేయించుకోవడం, ప్రజలను నడ్డి విరిచేలా దోచుకోవడం ఇదే వారి పనిగా కొందరు “డాక్యుమెంట్ రైటర్” లు నిత్య జీవన విధానం అయిన నేటి తరుణంలో ప్రజలకు ఓ కనువిప్పు కలిగించేలా, అక్షరానికి విలువకట్టే మా లో కొందరు రైటర్ల వికటాట్టహాసాలకు, వికృతి చేష్టలకు ఓ చెంపపెట్టులా నేడు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆశాజనకంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాను.. అలానే చదువు వుండి ఈ వృత్తినే నమ్ముకున్న మాలాంటి యువకులు వేలల్లో వున్నారు.. వారి గురించి కూడా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను..

అలానే మీరు G.O. లో చెప్పినట్లు ప్రజలే ఇంటిదగ్గరనుంచి తమ ఆస్తిని క్రయం లేదా విక్రయం చెయ్యాలంటే online లో నగదుని కట్టేసి ఎవరికి వారే Fill in the Blanks లో దస్తావేజుని తయారు చేసుకోవచ్చని తీర్మానించారు .. ఇది ప్రతీ ఒక్కరు ఇలా చెయ్యగలరని మీరు భావిస్తున్నారా ?? నగదు రహిత లావాదేవీలకే జనం ఇంకా అలవాటు పడలేదు.. ఇలాంటి సమయంలో ఈ విధి విధానాలు విజయం సాధిస్తాయని మీరు నమ్ముతున్నారా ?? 

మరైతే illiterates సంగతి ఎలా ??

వారు వారి ఆస్తిని విక్రయించాలంటే ఎవరిదగ్గరకు వెళ్ళాలి?? 

మీరే అలాంటివారికోసం ఆఫీస్ లలో ఏవైనా సదుపాయాలు కల్పించి వారి దస్తావేజులను మీరు తయారు చెయ్యగలరా ?? 

ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కడా ప్రస్తావించలేదు..

ఇక పోతే స్వాతంత్ర్యం రాకముందు రాసిన గ్రాంధిక సరళి గొలుసు కట్టు రాతలకు ఇక ముగింపు అని రాసారు... Mother Document అనేది పాత రోజుల్లో గొలుసు కట్టు రాతలతోనే రాస్తారు.. అది అర్ధం చేసుకుంటేనే దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా లింకు డాక్యుమెంట్లు అర్ధం అవుతాయి.. మరి మా అవసరం లేదన్నారు.. ఇది చదివేవారు మాలోనే అతి స్వల్పంగా వున్నారు.. దానికి మీ సమాధానం ??

Fill in the Blanks లో దస్తావేజుని తయారు చేసుకోవచ్చని అన్నారు.. ఓ ఐదేళ్ళ క్రితం జరిగిన చిన్న విషయం చెప్పాలనిపించి చెప్తున్నాను..

ఒకవ్యక్తి కొనుగోలు కొరకు వచ్చాడు.. ఆ దస్తావేజులో ఓ లేఖరి పొరపాటున “రూము పోను” అని రాయుటకు బదులుగా “రూము తోను” అని రాయడం జరిగింది .. విషయం ఏంటంటే అమ్మే వ్యక్తికి ఒక పెద్ద ఇల్లు వుంది.. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మూలన చిన్న రూము వుంది.. ఆస్తి మొత్తం అమ్ముతాను కాని ఈ రూము మాత్రం నేను అమ్మను నేనే ఉంచుకుంటాను అని ఆయన చెప్పారు.. నిజానికి ఆ దస్తావేజులో ఇలా రాయాలి “రూము పోను సదరు ఆస్తి మీకు చెంది... అది మొదలు మీరు, మీ వారసులు దాన, విక్రయ, వినిమయాధి సర్వ, సంపూర్ణ హక్కులు కలిగి ఆచంద్రార్కస్థాయిగా అనుభవించుకోవలసినది” అని రాయాలి...

కాని నిజానికి ఇలా రాసారు.. “రూము తోను సదరు ఆస్తి మీకు చెంది... అది మొదలు మీరు, మీ వారసులు దాన, విక్రయ, వినిమయాధి సర్వ, సంపూర్ణ హక్కులు కలిగి ఆచంద్రార్కస్థాయిగా అనుభవించుకోవలసినది” అని ... అంటే ఆ రూమును కూడా కలిపి ఆ కొన్న అతనికి హక్కులు కల్పించేసారు.. “పోను” “తోను” చూసారా యెంత చిన్న సవరణ పడిందో.. ఈ చిన్న సవరణకు ఆయన మళ్ళి ఖర్చు పెట్టాల్సి వచ్చింది..

ఇంత స్వల్పమైన పాయింట్స్ ని వొళ్ళు దగ్గరపెట్టుకొని రాయాల్సి వుంటుంది మేము.. ఒకటికి పదిసార్లు నానార్ధాలను, ద్వందార్ధాలను సరి చూసుకొని ప్రతీ అక్షరం రాస్తాము.. లక్షల్లో ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటాయి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన భాద్యత మాది.. ఇంత ఆలోచించి రాయాల్సిన డాక్యుమెంట్లును మీరు Fill in the Blanks అంటున్నారు.. అదే ఆందోళనగా వుంది..

తరువాత “వీలునామా” Will గురించి ప్రస్తావిస్తే .. ఈ వీలునామా లో Fill in the Blanks పెట్టడానికి ఎలా సాధ్యం అనేది నాకు అర్ధం కావట్లేదు.. నేను చనిపోయాక నా ఆస్తి పలానా వారికి చెందాలి అని వారి యొక్క వారసులకు యావదాస్తులను, చీర, చీపురు, చెప్పు, చాటా, తట్టా, బుట్టా ఇలా ఒక్కటేమిటి అన్నీ పంచేస్తారు.. ఒక్కోసారి మరొకరికి చెందజేసి వారు జీవించి ఉన్నంతవరకు వాళ్ళకు రైట్స్ ఉండాలి వాళ్ళ తదనంతరం మరొకరికి చెందాలి అనే “లా” conditions తో రాసే వీలునామాల పరిస్థితి ఏంటి.. ??

ఇద్దరి మధ్య ఒప్పుదల లావాదేవీలతో మాటలతో కూడిన దస్తావేజులను ఎలా రాయగలరు ??

దత్త స్వీకార పత్రం “Adoption Deed” ఇందులో ఎలాంటి ఆస్తి వుండదు.. ఒకరిని శాస్త్రీయంగా దత్తత తీసుకునే విధి, విధానాలు మేము ఇప్పుడు దస్తావేజులో రాస్తున్నాం Fill in the Blanks లో రేపు మీరెలా రాస్తారు ??

ఇక “Unregistered Documents” రిజిస్ట్రేషన్ కాకుండా నోటి మాటలతో జరిగే లావాదేవీల ప్రక్రియల గురించి మీరు ఎక్కడా ప్రస్తావించలేదు..

Sale Agreeent – విక్రయానికి ముందు జరిగే అడ్వాన్సు అగ్రిమెంట్ ...

Agreement with possession – విక్రయం జరగని పక్షంలో స్వాదీనం చేసినట్లు రాసుకొనే పత్రం..

Un Registred Settlement – కుటుంబ సభ్యులకు ఉచితంగా చెందజేసే పత్రం

Ratification – ఒప్పుదల (ఇద్దరు మనుషుల మధ్యన కట్టుబడి ఉండాలి అని రాసుకునే పత్రం) 

Relinquieshment – హక్కు విడుదల (ఇద్దరికి హక్కుగల ఆస్తిని ఒకరు హక్కును వదులుకునే పత్రం) 

Lease Deed – బాడుగ ఖరారునామా (నీ స్వంత ఆస్తిని నువ్వు అడ్వాన్సు తీసుకొని టైం పెట్టుకొని ఇతరులకు బాడుగకు ఇచ్చే పత్రం)

Partnership Deed – నూతనంగా ఇద్దరు లేదా కొందరు కలిసి వారి మధ్య ఒప్పందాలను, వారుపెట్టిన ఖర్చులను, రాబోవు లాభాలను వివరంగా రాసుకొనే పత్రం..

ఇలా ఒక్కటేమిటి వందల్లో వున్నాయి.. 

డాక్యుమెంట్ రైటర్ లేకుంటే ఇవన్నీ ఎలా జరగాలి ??

సరైన ప్రాస నియమాలతో, అర్ధవంతమైన పద ప్రయోగాలతో, అక్షర దోషాలు లేకుండా ఎన్నో సంవత్సరాలనుంచి ఈ వృత్తిని నమ్ముకొని ఒకరు మరొకరికి వారి జ్ఞాన సంపదను అందిస్తూ ఓ కుటుంబం గా జీవిస్తున్న వారికి నేడు ఈ దుస్థితి రావడం నిజంగానే శోచనీయం ...

కేవలం.....కేవలం కొందరు దారితప్పిన “అక్షర అసురుల” తప్పిదానికి యావత్ “అక్షర జ్ఞానులు” నేడు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది..

మార్పు రావాలని కోరుకుంటున్నాం.. 

అందుకు మావంతు మేము ఎప్పుడూ సిద్దమే..

కాని ఆ మార్పు నేడు వున్న స్థితి గతులకన్నా దయనీయమైన స్థితిలో ఉండకూడదని ఆశిస్తూ సెలవు...

Written By : Bobby Nani

Friday, December 29, 2017

చెట్లు మన మాటలను వింటున్నాయ్ ..!!


చెట్లు మన మాటలను వింటున్నాయ్ ..!!
*****************************

“మీరు చెట్లతో మాట్లాడండి – మీ మాటలు చెట్లు వినగలవు, అర్ధం చేసుకోగలవు” 
అంటున్నారు కొందరు వృక్ష శాస్త్రజ్ఞులు .. ఇంతకుముందు జరిగిన వృక్ష శాస్త్రజ్ఞుల సమావేశ సభలో చెట్లు కూడా అనేక అనుభూతులకు లోనౌతాయని, మన మాటలను అర్ధం చేసుకొని స్పందిస్తాయని ఆ సభలో శాస్త్రజ్ఞులు సూచించారు.. 

మన భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం కూడా ఓ ప్రముఖమైన ఆచారముగా ఉంది.. 
ఉదాహరణకు ప్రతినిత్యము “తులసి” చెట్టును పూజించడం మనకు తెలిసినదే.. 

రాజస్థాన్ లోని స్త్రీ లు జూన్ నెలలో ఒక నిర్ణీత దినాన “మఱ్ఱి” చెట్టును పూజిస్తారు.. పూజ అనంతరం “ఓ మహా వృక్షమా ! నా భర్తను అన్నీ ఆపదలనుంచి రక్షింపుము, అతణ్ణి అదృష్టశాలిని చేయుము” అని ప్రతీ ఏటా బిగ్గరగా వేడుకుంటూ వుంటారు.. ఆ మఱ్ఱి చెట్టు వారి మాటలను వింటుందని, వారికి శుభములను కలుగజేస్తుందని అక్కడి ప్రజల నమ్మకం..

ఇదే విధంగా కాలిఫోర్నియాలోని లూథర్ అనే శాస్త్రవేత్త వృక్ష శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసాడు.. ఈయన ప్రత్యేక శ్రద్ధతో “నాగ జెముడు” చెట్లను పెంచుతున్నాడు...నాగజెముడు చెట్టు నిండా ముళ్ళు ఉండుట దాని సహజ లక్షణం.. కానీ లూథర్ పెంచే నాగ జెముడు చెట్లకు ముళ్ళు వుండవు...అదే ప్రత్యేకత !!

లూథర్ వాడే విత్తనాలు మమూలువే .. 
అందరిలానే తనూ పెంచుతున్నాడు.. 
కానీ నాగ జెముడు మొక్కలకు ప్రతీరోజూ నీళ్ళు పోస్తూ “ఇతరులను బాధించే ముళ్ళు మీకు అవసరం లేదు.. నేను మీకు ఏ ఆపదా రాకుండా కాపాడుతాను” అనే వాడట.. ఆ మాటలను అర్ధం చేసుకున్న నాగ జెముడు చెట్లు ముళ్ళు లేకుండానే పెరుగుతున్నాయట .. ప్రపంచం మొత్తం మీద నాగ జెముడు చెట్లుకు ముళ్ళు లేకుండా వున్నది ఒక్క లూథర్ గారి తోటలోనేనట.. ఈ వింతను చూసేందుకు చాలామంది ప్రత్యేకంగా వెలుతున్నారట.. 

అలానే 1900 వ సంవత్సరములో ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త జగదీశ చంద్ర ప్రసాద్ వృక్షాలకు ఇరవై విధాలైన గ్రహ్యశక్తి ఉంటుందని .. నరాల సముదాయం లేకపోయినా అవి శ్వాసిస్తాయని, ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయని, కండరాలు లేకపోయినా కదలగలుగుతాయని ప్రకటించారు.. 

ప్రాణమున్న జీవులు ఎండ తీవ్రతకు వాడిపోతాయి. అలాగే చెట్లు కూడా అధిక వేడిమికి వాడిపోతాయి.. క్లోరోఫాం వాసనకు ప్రాణులు మూర్చపోతాయి.. అలానే చెట్లు కూడా మూర్చపోతాయని ఆయన చెప్పారు.. 

“డొరోతీ” అనే మహిళా వృక్ష శాస్త్రవేత్త 1968 వ సంవత్సరములొ మొక్కల మీద కొన్ని ప్రత్యేక ప్రయోగాలు చేసి సంగీతానికి, వాయిద్యాల శబ్దాలకు చెట్లు స్పందిస్తాయని సూచించారు.. పల్లెల్లో పంట పొలాల్లో కార్మికులు, పొలం పనులు చేస్తూ పాడుకునే పాటలకు మొక్కలు స్పందిస్తాయని... అవి ఉత్సాహంగా పెరిగి మంచి పంటను అందిస్తాయని ఆమె చెప్పారు.. ఇంటి ఆవరణంలో చక్కని వాతావరణం ఉంటే ఆ మొక్కలు బాగా పెరుగుతాయని.. అలా కాకుండా రోత పుట్టించే అధిక శబ్దాలు, వాయిద్యాలకు చెట్లు వాడిపోతాయని .. ఆ శబ్దాన్ని అవి భరించలేకపోవడమే అందుకు గల కారణం అని చెప్పారు “డొరోతీ” గారు.. 

మనం తోటలో పెంచుకునే మొక్కలు మనం చూపించే స్నేహం, ప్రేమ వల్ల చాలా ఆనందంగా పెరుగుతున్నాయని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త “ఫ్రాంకాస్” మరియు రష్యాకు చెందిన “పోటో వీటోనే” గార్లు కొన్ని వ్యాసాల్లో వ్రాసున్నారు.. 

తెలిసో తెలియకో మనం చెట్లను అనేక రకాల బాధలకు గురి చేస్తూ ఉంటాము కదా.. అంతెందుకు నేనే ఎన్నోసార్లు నా చిన్నతనంలో క్రికెట్ ఆడేందుకు వికెట్స్ కోసం మంచి వాటంగా వుండే కొమ్మలనే విరిచే వాడిని.. అలా ఎన్నో చెట్లను బాధించాను.. మొక్కల గురించి ఇవన్నీ తెలుసుకున్నాక నిజంగా చాలా బాదేసింది.. ఇక నా వల్ల ఏ మొక్కకు బాధ కలగకూడదనే ఆలోచన నాలో కలిగింది.. ఇలాంటి ఆలోచన కనీసం చదివే ఒక్కరిలో అయినా మెదుల్తుందనే సదుద్దేశంతో ఇదంతా నేను మీకోసం రాయాల్సి వచ్చింది.. నా ఉద్దేశంలో వెయ్యిమంది చదవడం గొప్ప కాదు.. ఒక్కరు మారి ఆ మారిన విషయాన్ని మనతో పంచుకుంటారే అదండీ నిజమైన సంతృప్తి.. 

ఆ ఒక్కరికోసమే నా ఈ ప్రయాస..!!

స్వస్తి __/\__

Written by : Bobby Nani

Thursday, December 28, 2017

1977 వ సంవత్సరములొ జరిగిన ఓ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటన ఇది..


నిన్న రాత్రి పడుకునే ముందు ఓ డాక్యుమెంటరీ చదివాను..చదివిన దగ్గరనుంచి అవే ఆలోచనలు ఇప్పటికీ నను వెంటాడుతూనే ఉన్నాయి .. ఇలా రాయడానికి కూడా కారణభూతాలైనాయి.. 

1977 వ సంవత్సరములొ జరిగిన ఓ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటన ఇది.. 

రోమ్ నగరంలో స్థిర పడిన మన భారతీయుల జంటకు రెండు సంవత్సరముల పాప వుండేది.. తన పేరు “నడోజామిట్టీ” ఈ పాప కొన్ని అనివార్య కారణముల వల్ల అకస్మాత్తుగా 1965 వ సంవత్సరములో మరణించింది.. వారికి లేక లేక పుట్టిన సంతానం .. తనని ఎంతో గారాబంగా చూసుకుంటూ వుండేవారు.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండలేదు.. ఆ పాప మరణం ఆ తల్లితండ్రులను దుఃఖసాగరంలో ముంచేసింది.. 

వారి ఆచారము ప్రకారం ఆ పాప దేహాన్ని శ్మశానంలో పాతిపెట్టారు.. 
ఆనాటి నుండి ప్రతీ రోజూ “అమ్మా నన్ను బయటికి తియ్యి.. నేను నీతోనే ఉంటాను ... నన్ను తవ్వి తియ్యి ..” అంటూ ఆపాప రాత్రుల్లో తల్లికి కనిపించి మొరపెట్టుకునేదంట..!!

ముందు ఆ తల్లి కొంత కాలము ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదట .. కానీ రోజూ వదిలిపెట్టకుండా ఆ పాప అలా కల్లో కనబడి మొర పెట్టుకుంటుంటే ఇక సహించలేక పోయింది.. నిజంగా పాప బ్రతికే ఉందా ?? అనే భ్రమలో పడింది.. ఆ తల్లి మానసికంగా ఏదో తెలియని ప్రభావానికి లోనైపోతూ ... అక్కడి ప్రభుత్వానికి తన మొర విన్నవించుకుంది.. 

ప్రభుత్వమూ, అధికారులూ వేళాకోళము చేసారు.. ఆమెను మతిస్థిమితం లేనిదానిగా భావించారు.. అయినా ఆ తల్లి పట్టు వదల్లేదు.. ప్రభుత్వంతోనూ, అధికారులతోనూ పోరాడుతూనే వచ్చింది... అలా అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పన్నెండు ఏళ్ళు గడిచిన తరువాత ఎట్టకేలకు ప్రభుత్వం ఆ పాపను బయటికి తీసేందుకు ఒప్పుకుంది.. 

1965లో చనిపోయిన పాపను 1977 లో అక్కడి ప్రభుత్వ పనివారు ఆ పాపను పాతిపెట్టిన చోట తవ్వి చిన్నారిని బయటకు తీసారు... ఆ పాప దేహాన్ని చుసిన అక్కడివారు నిశ్చేష్టులైపోయారు.. అందుకు గల కారణం ఆ పాప ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుండటమే .. 

ఇన్ని సంవత్సరములు ఆ పాప దేహం భూమిలో ఉన్నా కుళ్ళలేదు, రంగు మారలేదు.. చక్కని రబ్బరు బొమ్మలా ఉంది.. 

ఆ పాపను చూసిన ఆ తల్లి ఆనందంతో తన గుండెలకు హత్తుకుంది.. ఈ విషయం యావత్తు ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.. ఎవ్వరికీ అంతుపట్టని అద్బుత విషయమైపోయింది.. 

Written by : Bobby Nani

Tuesday, December 26, 2017

అలిగిన ప్రియురాలిపై ఆ భావకుడు తన ప్రేమ మకరందాన్ని ఎలా చల్లుతున్నాడో చూడండి..


అలిగిన ప్రియురాలిపై ఆ భావకుడు తన ప్రేమ మకరందాన్ని ఎలా చల్లుతున్నాడో చూడండి.. 
ఇంతకీ ఇది చదివాకైనా ఆమె అలక మానుతుందంటారా ?? 
ఆ భావకునికి బాహువులలోకి ఆ చిన్నది ఒదుగుతుందంటారా.. ??


రాతి గుండె నీదే లేక్షణ ..!!
నల్లరాతి గుండె నీదే లేక్షణ.. !!

నన్నొంటరిగ జేసి నను విడిచిపోయావు.. 
కన కలలన్నిటినీ కల్లగా జేశావు 
బాస లేమాయనే .. ??
అలనాటి మన ప్రతిమ లేమాయనే..!!

నాటి మన ప్రణయమ్ము చూడ 
కొలనిలో తామరలు కలకలా నవ్వేవి.. 
తుమ్మెదలు రాగాలు తూలుతూ పాడేవి.. 
పొప్పొడుల రంగులతో పుడమి విప్పార్పేది.. 
చల్ల గాలులు రేగి సవ్వడులు చేసేవి 
కూయంటు దూరముగ కోకిలలు పాడేవి 
గగనమంతా నీలి కాంతులతో నిండేది.. 

మరి నేడు ..
నీవులేని బ్రతుకు నీడగా మారింది.. 
దారి తెలియని బాటసారినయ్యాను.. 
పాట లేమాయనే 
నాటి మన ప్రణయాటలేమాయనే.. !!

రెక్క విరిగిన పక్షి రిక్కవలె కూలాను.. 
కటిక చీకటిలోన కఱిగిపోతున్నాను..
అలక మానవే లేక్షణ..
అలలా చెంతచేరవే లేక్షణ.. !!


Written by : Bobby Nani

Saturday, December 23, 2017

నువ్వొచ్చాకే ఈ నేల మీద నా అస్తిత్వం స్థిరపడింది ...



నీ గురించే ఆలోచిస్తున్నాను... 
కళ్ళజోడు పెట్టుకున్నా కానీ 
ఏ స్వాప్నిక ప్రపంచమూ కనిపించని నా 
జీవితంలోకి వెన్నెల తోరణం లా 
ప్రవేశించిన నీ గురించే .. 
పగలూ, రేయీ ఆలోచిస్తున్నాను.. !
నీపై ఎన్నో ఊహలు చేసాను.. !!

నువ్వు మొదటిసారి నాకు తారసపడ్డప్పుడు 
నీనుంచి రెండే రెండు పొడి పొడి మాటలు రాలినా 
మాట్లాడినంత సేపూ నీ రెండు కళ్ళూ నా 
హృదయంలో అమర్చిపోయావు.. !!

మంత్రించి విడిచిన మహావాక్యంలా 
నువ్వొచ్చి చేరావు నా ప్రతీ కావ్యం లోకి.. 

నేనొక కలనో, కవితనో అల్లుకుంటున్నప్పుడు 
విడిపోతున్న దృశ్యాక్షరాల మధ్య 
ప్రప్రధమ ఆకాశపుష్పంలా, 
ఘుమఘుమలాడిపోయావు.. 
ఎవరూ చూడకుండా నీకోసం 
ఎన్ని సముద్రాలు దాటి వచ్చేవాణ్నో ..
ఎవరికి చెప్పి నమ్మించను..??

వికృతాకారాల విషదంష్ట్ర లు నా
రక్తమాంసాల్ని చీల్చలేదని కాదు.. 
విశాల వక్షోజాల మధ్య కొరికితే 
స్వర్గంగా విహరించలేదనీ కాదు 
విశ్వ సంకుచితత్వాన్ని అధిగమించాలనే 
ప్రయత్నం మాత్రమే నీలోని ఆకాశాల్ని నాకు 
సన్నిహితం చేసింది.. 
మరేమీ లేదు, 
నువ్వొచ్చాకే ఈ నేల మీద 
నా అస్తిత్వం స్థిరపడింది 
ఆకాశంలో నక్షత్ర కూటమి 
నిశిరాత్రి చెవిలో రహస్యంగా 
గుసగుసలాడింది.. !!

Written by : Bobby Nani

Friday, December 22, 2017

ఓ షార్ట్ ఫిల్మ్...


నేను ఓ షార్ట్ ఫిల్మ్ కు రాసిన స్టొరీ ఇది.. 

సమాజానికి వినోదంతో పాటు ఓ ఆలోచనను కూడా కలిగించాలి... అది మన వ్యక్తిగత భాద్యత.. అలాంటి ఆలోచనలతో కూడిన రచనలు, బుద్దిని, తర్కాన్ని కలిగించే వ్రాతలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 

ఓ నలభై అయిదేళ్ళ వ్యక్తి తనగదిలో నిద్రపోతూ... పోతూ ... ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.. అప్పుడు సమయం పావు తక్కువ 6 కావస్తోంది.. !!!

భారంగా తను అడుగులేస్తూ ప్రక్కన వున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి నీళ్ళ బాటిల్ లొ వున్న నీరుని గుట గుటా గుక్కతిప్పుకోకుండా తాగేసాడు.. తను చాలా తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నట్లుగా కనిపిస్తున్నాడు .. టేబుల్ ప్రక్కన వున్న కుర్చీలో కూర్చుని టేబుల్ కి దగ్గరగా జరిగి అక్కడ ఉన్నటువంటి పేపర్లో ఏదో రాయడం మొదలు పెట్టాడు.. 

కొన్ని క్షణాల అనంతరం తన కళ్ళజోడును చాలా భారంగా తీస్తూ .. కళ్ళు తుడుచుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చి లేచి నిల్చున్నాడు.. నాలుగు అడుగులు ముందుకు వేసి తన తలను నెమ్మదిగా పైకి ఎత్తాడు.. పైన సీలింగ్ కి అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉక్కుకి ఓ ఉరితాడు వ్రేల్లాడుతూ ఉంది.. !!!

అక్కడవున్నటువంటి కుర్చీ లాక్కొని తన తలకు ఆ ఉరితాడు బిగించి వణుకుతున్న తన శరీరంతో, నీరు చిమ్ముతున్న కళ్ళు రెండూ గట్టిగా మూస్తూ, తన రెండూ చేతులతో తొడల దగ్గర ఉన్నటువంటి తన ఫాంట్ ని గట్టిగా తన పిడికిళ్ళతో నొక్కుతూ.. ఇక నిలబడి వున్న కుర్చీ ప్రక్కకు తన్నబోతున్న సమయంలో .... 

దూరాన నుంచి మైకులో ఓ స్వరం వినిపించ సాగింది.. !!

మీరు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో కనుక ఉంటే దయచేసి ఒక్క క్షణం ఇక్కడకు వచ్చి వెళ్ళండి ... ఏమో ఈ ఒక్క క్షణం మీ భవిష్యత్తును, ఈ దేశ భవిష్యత్తును మార్చగలదేమో చూద్దాం .. అని ఆవేశ పూరితమైన ప్రసంగాన్ని చేస్తున్నాడు ఆ వ్యక్తి.. 

ఆ మాటలకు, అతని కంఠ స్వరానికి ముగ్ధుడైన ఈ వ్యక్తి .. ఆలోచిస్తూ .. 
సరే ... ఒక్క క్షణంలో ఎంపోతుంది అని అనుకొని .... ఇతడేం చెప్తాడో విందాం అంటూ ... హటాహుటిన మాట్లాడే వ్యక్తి దగ్గరకు చేరుకుంటాడు.. 

అక్కడకు వెళ్ళి చూసిన ఇతడికి నోటిమాట రాలేదు.. 
అందుకు కారణం అది ఒక అనాధలైన చూపు లేని వాళ్ళ సంరక్షణా కేంద్రం.. అక్కడ వున్నవారంతా కంటి చూపు లేని వారే.. పిల్లల దగ్గరనుంచి వృద్దులవరకు అందరూ ఉన్నారు.. అలా వారిని చూస్తుండగానే ఆ వ్యక్తి ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు... 

ఈరోజు మన 71వ స్వాతంత్ర్య దినోత్సవం... 70 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాం... దీన్ని పురస్కరించుకొని సమాజం విసిరేయబడ్డ ఈ పుడమితల్లి బిడ్డలమైన మేము కొన్ని మాటలను మాట్లాడదలచి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము.. దయచేసి మా అభ్యర్ధనను మన్నించి మాకోసం మీ అమూల్యమైన కొన్ని విలువైన క్షణాలను వెచ్చించవలసినదిగా ప్రార్ధించడమైనది.. 

ఇక్కడ ఉన్నటువంటి ప్రతీ ఒక్కరికీ ఒక్కో హృదయ విదారక సమస్య ఉంది.. అయినా మేమంతా సంతోషంగానే బ్రతుకుతున్నాం.. ఈ సమాజం మమ్మల్ని అసహ్యించుకున్నా, ఛీ కొట్టినా, నీచంగా చూసినా అందుకు కారణం మా పుట్టుకే... మేము కాదు.. నిజంగానే ఇలాంటి పుట్టుకను ఎవ్వరూ కోరుకోరు... జీవితాంతం ప్రత్యక్ష నరకాన్ని మేము ఇక్కడే అనుభవిస్తూ ఉంటాము.. వాటికి తోడు కొందరి సూటిపోటి మాటలు మరింత కృంగదీస్తూ ఉంటాయి.. వీటన్నిటినీ భరిస్తూ ఇంకా ఎందుకు బ్రతికున్నామా అని చాలా సమయాల్లో అనిపించింది.. చావు పరిష్కారం కాదని.. దానివల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని గ్రహించాము..

అప్పటినుంచి ఏదైనా సాధించి మరణించాలని బలంగా అనుకొని బ్రతుకుతున్నాం.. మన మరణం పదిమందికి ఉపయోగ పడాలేకాని భారం కాకూడదు అనేలా బ్రతుకుతో పోరాడుతున్నాం అని అంటూ..
“జీవితం అంటే మరణించడం కాదు.. సాధించడం” అని తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడు..

అలా వింటూ వున్న ఇతడికి తెలియకుండానే కళ్ళల్లో నీరు ధారలా కారుతోంది.. కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఇతడి దృష్టి ఓ చిన్నారిపై నిలిచింది... ఎనిమిదేళ్ళు ఉంటాయేమో ఆ చిన్నారికి ... నేలమీద పద్మహాసనం వేసుకొని ఎదురుగా వున్న మన జాతీయ జెండా ని రెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉంది.. మిగతా పిల్లలంతా చిన్న చిన్న జెండాలు చేతుల్లో పట్టుకొని అల్లరిచేస్తూ అటూ, ఇటూ పరిగెడుతూ ఉన్నారు.. ఆ చిన్నారి దగ్గరకు వెళ్లబోతుండగా ఆ సంరక్షణా కేంద్రాన్ని చూసుకునే ఓ వ్యక్తి ఇలా రమ్మని సైగ చేస్తాడు.. 

ఇది గమనించిన ఈ వ్యక్తి ....ఆ అధికారి దగ్గరకు వెళ్ళి ……నమస్కారం అండి ఏంటి విషయం ? అని అడుగుతాడు 

మీరు ఆ పాప దగ్గరకు వెళ్తుండటం గమనించాను అందుకే పిలిచాను అని అంటాడు.. 

అవును అండి .. ఇందాక నుంచి గమనిస్తున్న ఆ పాప చాలా వ్యత్యాసంగా ఉంది. అందరి పిల్లల్లా లేదు.. అదీ కాక చక్కగా పద్మహాసనం వేసుకొని జండా ను అలానే చూస్తుంది ఎందుకలా చూస్తుంది ??.. ఏమైవుంటుంది అని తెలుసుకోవాలని తన దగ్గరకు వెళ్తున్నాను అని సమాధానమిస్తాడు.. 
ఆ పాప తండ్రిగారు సైన్యం లొ పనిచేసేవారు.. ఈ పాప పుట్టినదగ్గరనుంచి తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితి.. ఎప్పుడూ ఫోన్ లొ మాట్లాడటం, ఫోటో చూడటమే కాని నిజంగా ఎదురుగా చూసి మాట్లాడింది ఎరుగదు ఆ పాప .. ఆయన విధి నిర్వహణ అలాంటిది మరి !!!.. వారి అమ్మా, నాన్నది ప్రేమ వివాహం.. అందరిని వదిలి వచ్చేశారు.. ఓరోజు ఎదురు కాల్పులలో దేశంకోసం తన ప్రాణాలను అర్పించాడు.. 
మొదటిసారి తన తండ్రిని చూడటం.. 

శరీరంపై మొత్తం మన దేశ జండాను కప్పి మొహం మాత్రం కనిపించేలా ఉంచారు.. 

ఈ సృష్టిలో తన తండ్రిని మొదటిసారి ఇలా ఏ బిడ్డా అలా చూడలేదేమో .. అప్పటినుంచి ఆ పాప ఇలా అయిపోయింది .. 

మరి తన తల్లి దగ్గర కాకుండా అనాధలా ఇక్కడెందుకు ఉంటుంది ?? అని ప్రశ్నిస్తాడు ఈ వ్యక్తి 

తన భర్త మరణ వార్త విని ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని కన్నీరును తుడుస్తూ చెప్తాడు.. 

అది విన్న ఈ వ్యక్తి కన్నీటి బిందువులు టప టపా నేల రాల్తున్నాయి.. 
ఇంత చిన్న వయస్సులో ఆ పాపకు ఇంత పెద్ద శిక్షా.. అని అనుకుంటూ ఉండగా.. 

ఆ అధికారి తన కళ్ళు తుడుచుకుంటూ బాధాకరమైన విషయం ఏంటంటే తన తల్లి చనిపోయిందని కూడా ఆ పాపకు తెలియకపోవడం.. అని చెప్తాడు..

To be Continued … 


Written by : Bobby Nani

Thursday, December 21, 2017

చిన్న విషయమే.. కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం..



చిన్న విషయమే.. కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం.. 
****************************************

చాలా చిన్న విషయం అనుకునే ఎంతో పెద్ద పెద్ద విషయాలు మన ముందు చాలానే ఉన్నాయి.. కానీ వాటిని మనం లెక్కే చెయ్యం.. అలాంటి వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం చర్చించబోయే విషయం.. 

మనం చేసే అనేక తప్పిదాల వల్ల ఈ భూమికే కాకుండా, మనతో జీవించే సమస్త జీవరాశికి కూడా ఆటంకం కలుగుతూ ఉంది.. మానవుడు చేసే ప్రతీ పనిలో ఏదో ఒక రకంగా నలిగేది, నలుగుతున్నది మనతో జీవిస్తున్న ప్రాణులే .. 

విషయంలోకి వెళ్తే.. 

ప్రతీరోజు ఓ చెత్తకుప్పకు దగ్గరగా కొన్ని కుక్కలు ఉమ్మడిగాజీవిస్తూ, ఆ చెత్తకుప్పలోని ఆహార పదార్ధాలను ఆరగిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవి.. ఆ ప్రదేశానికి అవి రుణపడినట్లు భావిస్తూ ఎంతో విశ్వాసంగా ఉంటూ ఉండేవి.. తెల్లవాదులూ తిరుగుతూ కొత్తవాళ్ళను రానివ్వకుండా ఆ ప్రదేశానికి రక్షలా కాపలా కాస్తూ ఉండేవి.. అలా ఉండగా ఆ ప్రదేశానికి ఓ కుటుంబం తాత్కాలిక నివాసం కొరకు వచ్చారు.. 

వారి ఇంటికి చేరువలోనే ఉన్నటువంటి ఆ చెత్త కుప్పలోకి ఈ ఇంటివాసులు రకరకాల తినుబండారాలను, వారి పిల్లలు సగం సగం తిని పారేసిన ఆహారపదార్ధాలను ప్లాస్టిక్ కవర్ లొ కట్టి అందులోకి విసిరే వారు.. అలా ఉండగా ఓ రోజు .. ఎంతో ఆకలిమీద వున్న ఓ కుక్క ఆతురతతో ఓ కవర్ని పెరికేసి తినడం మొదలెట్టింది.. కొన్ని క్షణాల్లోనే తన గుంతుకేదో అడ్డుపడి నోటినుంచి అధిక రక్తస్రావంతో, గట్టిగా దగ్గలేక దగ్గుతూనే రెండు పగలు, ఒక రాత్రి నరకయాతన అనుభవించి చనిపోయింది.. 

అలా ప్రతీ పది రోజులకు ఓ కుక్క చనిపోతూ వస్తుండేది.. ఆ ప్రాంతం వారంతా చనిపోయిన ఆ క్షణం అయ్యో పాపం అనుకుంటూ మరుసటి క్షణం మర్చిపోయి ఎవరి పనుల్లో వారు ఉండిపోయేవారు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పాతిక కుక్కల దాకా చనిపోయాయి.. మున్సిపాలిటీ వారు ఈ ప్రాంతంలోని కుక్కలు చనిపోతున్నాయని ప్రభుత్వ పశువుల డాక్టర్ గారికి విన్నవించుకున్నారు.. ఆ డాక్టర్ గారు చనిపోయిన కుక్కను శవ పరీక్ష నిర్వహించిన పిదప చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడు .. 

అందుకు గల కారణం .. షేవ్ చేసిన బ్లేడ్ లు కుక్క మెడ భాగంలో ఉండిపోయి పైకి చెప్పుకోలేక.. మింగ లేక, కక్కలేక ఆ కుక్క నరకయాతన అనుభవించి చనిపోయిందని ఆయన నిర్ధారించారు.. 
షేవ్ చేసిన బ్లేడ్ లను జాగ్రత్తగా చెత్తకుప్పలొ వెయ్యడం చాలా చిన్న విషయం.. దాని వెనుక మూగ ప్రాణాలు ఇలా భరించరాని బాధతో చనిపోతున్నాయి.. 

ఆలోచించండి.. 

ఇప్పుడు కూడా ఇది చిన్న విషయమే అంటారా.. ?? 

మనలో చాలామంది షేవ్ చేసుకున్నాక బ్లేడ్స్ ని ప్లాస్టిక్ కవర్ లలో పెట్టి చెత్త కుప్పల్లో వేస్తున్నారు.. ఆ చెత్త కుప్పల్లో ఈ బ్లేడ్ లతో పాటు వ్యర్ధ ఆహార పదార్ధాలు కూడా ఉంటాయి.. ఆ ఆహార పదార్ధాలకు అలవాటు పడిన కొన్ని కుక్కలు అక్కడ తినేందుకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి.. 

దయచేసి మీరు వాడిన బ్లేడ్ లను కాస్త శ్రమ అనుకోకుండా కాస్త గుంత తీసి పూడ్చి పెట్టండి.. కాలానుగుణంగా అవి తుప్పుపట్టి మట్టిలో కలిసిపోతాయి.. ఏ ప్రాణికి హాని జరగదు.. 

దయచేసి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని మనవి చేస్తూ.. !
మీ వంతు బాధ్యతగా మూగ జీవాల ప్రాణానికి సంరక్షణకు బాధ్యతవహించండి.. !!

Written By: Bobby Nani

Monday, December 18, 2017

నిన్ను మొదటసారి చూసింది ద్విగుణీకృతమగు ఆ నల్లని శిరోజాల మధ్యన నుంచే.. !!



నిన్ను మొదటసారి చూసింది 
ద్విగుణీకృతమగు ఆ నల్లని శిరోజాల మధ్యన నుంచే.. !!

కనిపించీ కనిపించని ముఖమును చూస్తూ 
కనురెప్పలు రెండూ రెపరెపలాడే కవాటాల్లా కొట్టుకున్నాయి 
ఎన్నో గడియలు నీ, .. నా మధ్య నుంచి నేల రాలుతున్నాయి.. 
అయినా నీ రూపం కనిపించదే .. !!

తపనల తలంపులతో నిలువెల్లా తపించిపోతున్నాను.. 
రోజూ పుష్పించే పుష్పాలతో 
అగరొత్తుల వొత్తైన ఆ శిరోజాల్ని 
నా చేతులతో అలంకరించే రోజుకోసం వేచివున్నాను.. !!

శీతల సముద్రంలోకి ఎగిరొచ్చిన దగ్గరనుంచి
మరణాన్ని మించిన నీ నిశ్శబ్దం 
నను హత్య చెయ్యాలని వెంటాడుతోంది.. 
నీ విరహం నా దేహాన్ని సూదిమొనల్లా తాకుతోంది.. !!

తుమ్మెద రెక్కల వంటి ఆ కనురెప్పలు.. 
కలువలవంటి ఆ నేత్ర త్రయములు...
లేత మీగడ వంటి చెక్కిలి.. 
మరగ కాగినట్టి పాల సొగసు.. 
వీణానాదము వంటి మృదు మధుర వాక్కు..
చూసి చూడగానే విశాల నితంబాలతో 
పులకరింపజేస్తూ, పలకరించినట్లనిపించింది.. !!

ఆ రూపం ఎప్పుడు నన్ను కౌగిలించుకుందో కానీ 
నాటి నుంచి భావాలన్నీ నాలో వక్రంగా 
ధ్వనిస్తున్నాయి..
సంకేతాల మధ్య ఒంటరితనాన్ని అనౌచిత్యంగా 
అలంకరించుకుంటున్నాయి..!!

నీ భావాల కలల అలలతో నేనల్లిన వలల్ని 
నల్దిశలా వెదజల్లుతున్నాను 
ఈ అక్షర మాలికల రూపంలో .. నీ
పరువపు సొగసు, సొబగులను 
వొడుపుగా పట్టడం నేర్చుకున్నాను
అందుకే అందరూ బంగారాన్నేరుతుంటే 
నేను మాత్రం ఈ “బంగారం” జ్ఞాపకాల్ని అన్వేషిస్తున్నాను.. !!

Written by : Bobby Nani

Saturday, December 16, 2017

స్వప్న పరిష్వంగము...


తీర్చిదిద్దిన ఆమె కాటుక కళ్ళని 
ఊహించుకుంటూ మురిసిపోతానే కానీ,
తన కళ్ళనెప్పుడూ సూటిగా చూడలేదు..!!

రుచి పుట్టించే పెదాలకోసం నిరీక్షిస్తూంటానే కానీ, 
ఒక్కసారి కూడా సంతృప్తిగా ముద్దిచ్చి ఎరుగను..!!

చుక్కల మధ్య నుంచి 
తెల్ల హంసల తెలిమబ్బుల మధ్యనీంచి 
క్రీగంట చూపులతో ఆహ్వానాలు గుమ్మరిస్తూ ఉంటుంది..
అకస్మాత్తుగా నా చెవుల్లో నాల్గు వాక్యాలు 
ముద్దు ముద్దుగా ఊది చకోరిలా ఎగిరిపోతుంటుంది.. 
ఏ అందియల చప్పుడు విన్నా నువ్వేనేమోనని 
చెవులు రిక్కించడం నాకు మామూలైపోయింది..!!

నీ భావాలనలా అల్లుకుంటూ, గిల్లుకుంటూ 
నిద్రలో పడుతూ లేస్తూ, 
ఆకాశాన్ని, అల్లిబిల్లి ఊహల్నీ ఆహ్వానిస్తూ, 
స్వప్నిస్తూ, చెవులు చీరుకుంటూ 
నాలో నేనే ఏదో గొణుక్కుంటూ వుండిపోతుంటాను ..!!

అందమైన పక్షిలా మారి అలా హఠాత్తుగా 
నా బాహువులపై వాలి క్షణాల్లో నవ్వుతూ 
వెళ్ళిపోవడం తనకలవాటే కావచ్చు 
స్వప్న పరిష్వంగముల కోసం నిరీక్షిస్తూ, 
ఎడారి బండరాళ్ళ మధ్య ఇరుక్కుపోయి 
గిలగిల్లాడ్డం నా కొక్కడికే తెలిసిన యదార్ధసత్యం..!!

నువ్వే నన్ను వెలివేసావో..
నీ భావాలే నన్ను వెలివేసాయో నాకైతే తెలియదు.. 
ఏకాంత నిశ్శబ్దమే నా అంతఃపురమైంది.. 
నీ దేహ సౌందర్య దృశ్యమే నా జీవితాదర్పణమైంది.. 
నీ చిరునవ్వే తాంబూల చర్వణమైంది.. 
నా భావాలతో పొదిగిన నీ దేహం 
స్పర్శా వ్యామోహం లేని శిలలానే మిగిలిపోయింది..!!

నీ నుంచి రాలే రెండే రెండు 
ప్రేమ శకలాల కోసం 
ఆకాశం మీది చుక్కల్ని మొత్తం చీకట్లో వడబోస్తూ 
లెక్కెడుతున్నాను .. !!

Written by : Bobby Nani

Monday, December 11, 2017

ముగ్ధత్వంతో కూడిన ఓ ప్రేమ..


ముగ్ధత్వంతో కూడిన ఓ ప్రేమ.. 
**********************


ఎలా చెప్పను ఆమెకు..
ప్రతీ క్షణం తన ధ్యాసేనని.. 
ప్రతీ గడియా ఆమె ఆలోచనేనని .. 
ఎన్నో ఊసులు .. తన గురించి
అవన్నీ తళుక్కున హృదిలో మెరవగానే 
పెదవులపై ఓ చిరునవ్వు మొలుస్తుంది.. !!


ఆమె ఊహల్లో విహరిస్తుంటాను.. 
నెమలి రంగు చీరకట్టి 
కుచ్చిల్లలో దూర్చిన కొంగు జారి 
పైట నిలవనంటుంటే.. 
పరధ్యానంలో వున్న ఆమె
పైట సవరించుటలో 
తెలియకుండా కుచ్చిల్లలో దోపిన చేతి వేళ్ళకు 
అంటుకున్న పిండి, 
నడుము చల్లంగ తాకి 
జివ్వుమన్న నవనాడులతో 
ఈ లోకానికొచ్చిన ఆ పడతి సిగ్గులే నాకు 
కనిపిస్తున్నాయి.. !!


సంధ్యాస్తమ సమయంలో 
మొక్కలకు నీరోసే సమయాన 
పిక్కలపైకెత్తిన చీర కుచ్చిల్లతో 
వాలుజడల వయ్యారి కులుకులతో 
సగం తడిసిన దేహంతోనున్న ఆమెను 
ఓ పిల్ల తెమ్మెర ఆర్తిగా వచ్చి హత్తుకుంది.. 
కనురెప్పలు రెండూ భారంగా మూతపడిన వేళ
చిగురుటాకు నుంచి చెక్కిలిపై రాలిందో నీటి బిందువు..!!
అరవై క్షణాలలో 
ఇంత ఇష్టానికి ముగింపుంటుందంటావా..??
మనిద్దరికీ లింగభేదాలెక్కడివి ?? ఒకే దేహమైతే.. !!


నీ నుంచి నే కోరుకునేదొక్కటే 
చీకటి రాత్రుల్లో,
నచ్చిన ఏకాంతాల వెన్నెలలు తోడై 
పక్క పక్కగా నడుస్తూ 
ఎక్కడో ఎదురెదురుగానో
పక్క పక్కన చేయీ చేయీ 
రాసుకుంటూ,
లోలోన రగులుతున్న జ్వాల 
ఎగిసిపడుతున్న వేడి ఆవిర్లు విరజిమ్ముతుంటే 
వెన్నెల ఆరబోతలలో 
మసక ఆనవాల్లతో నిను పోల్చుకుంటూ 
మత్తు దిగని పదాల సొగసు 
కవిత్వపు దేహంపై యవ్వనపు ఛాయల్లో 
ఉభయులమూ పారాడాలి.. 
కాటన్ చీర దాచలేని నడుము మడతల్లో 
బారాలకి.. చేతి సాయపు భరోసా లేపనాలు పూస్తూ..
నిన్నదుముకుంటూ .. వెచ్చని ఆశలతో 
అంతముండని వాంఛతో 
రేయంతా కాదే .. 
జీవితకాలమంతా నిడివి కలిగిన 
సుదీర్ఘ రేయిలో అలుపెరగని 
జంట ప్రయాణం చెయ్యాలి..
మరి చేస్తావా .. ?? 

Written by : Bobby Nani

Saturday, December 9, 2017

ఎవరీమె ??


నవయవ్వనంలోనే 
చిరిగిన వంటితో 
రక్తాకాశాన్ని నిర్మిస్తున్నది
ఎవరీమె ??

కురులు విరబోస్తే 
వరులు నదులు దాటారని విన్నాను.. 
నఖ నక్షత్రాలతో విశ్వాంతరాళాలను 
భూతలం మీద నిర్మించిందని చెప్పారు.. 
తన పాదాల వెంట 
సామ్రాజ్యాలను నడిపించిన ఆమె 
ఇప్పుడు సంక్షుభిత కాసారంలా శుష్కమవుచున్నది 
నరక కూపాలను గుండెల్లో దాచుకొని గమిస్తూ 
నఖక్షతాలలో ఎర్రబడ్డ కాశ్మీరమయ్యింది.. 
ఎవరీమె ?? 

కనుకొలకుల్లో గొల్ల కొండలు 
పరిభ్రమించాయని పాడారు.. 
తోడేలు చీల్చిన గొఱ్ఱేలా కొండకోనపై 
వేలాడుతున్నదేంటి..??

వెదురు బొంగు యీలలో 
శృతి కలిపిందని విన్నాను.. 
ఖండాంతరాంతరాళ నల్ల సంద్రాల ఝుంఝుంను 
మోసుకొస్తున్నదేంటి ?? 

పాద నర్తనతో పంచభూతాలను 
నడిపించిందని విన్నాను.. 
నేడు త్రిలింగ దేశము జానెడు నేలనివ్వ నిరాకరిస్తోందే 
యీమె ఈ దేశానికి మూలమా.. ? 
ఈ దేశం ఈమెకు మూలమా.. ?

నిరాకరించిన కవులే 
ఆమెను అందుకోలేక 
నీడల జాడలలో నిరక్షరాలు పొదుగుతున్నారు 
ఆమె గుంపుగా నున్నప్పుడు 
కవి వ్యక్తిగా 
ఆమె దేశమైనప్పుడు కవి గుంపుగా 
ఆమె ఖండమైనప్పుడు కవి దేశంగా 
ఆమె ప్రాకృతికమైనప్పుడు కవి వైయక్తికంగా 
అందనంత ఎత్తుగా ఆమె ఎదిగిపోతున్నది.. 

ఆమెలోనే నిండిపోవాలని 
ఆమె (ఒడి)లోనే పోవాలని ఆరాటం 
ఆమె రాజ్యమని అందుకోబోయాను 
కానీ, 
ఆమె ప్రకృతని అప్పుడే తెలిసింది.... !!

Written by : Bobby Nani

Friday, December 8, 2017

చెయ్యని నేరానికి శిక్ష..


చెయ్యని నేరానికి శిక్ష.. 
****************

ప్రమాదాలు ... ప్రమాదాలు .. 

పేపర్ చూస్తే ప్రమాదాల వార్తలు.. టి.వి. చూసినా అవే వార్తలు, బయటకు వెళ్ళినా అవే వార్తలు .. ఏరోజూ ఈ వార్త లేని పేపర్ గాని, టీవీ న్యూస్ గాని లేదు.. ఈ వార్తలు మన భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో విలయతాండవం చేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా విస్త్రుతరూపం దాల్చిన ఈ మృత్యురాక్షసిని నియంత్రించేదెవరు ?? 

చెయ్యని నేరానికి శిక్ష ఉంటుందా ?? 
అంటే తప్పనిసరిగా ఉంటుంది.. అవే ఈ రోడ్డు ప్రమాదాలు.. 

దీనిద్వారా ఎంతమంది చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారో.. !! 

ఎన్ని కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోతున్నాయో లెక్కే లేదు.. 

సహజ మరణాలు తగ్గిపోతున్నాయి.. ప్రమాద మరణాలు పెరిగిపోతున్నాయి.. ముసలీ ముతకా మాత్రమే సహజ మరణం పొందుతున్నారు.. యువశక్తి చాలా వరకు అర్ధాంతరంగా నశించిపోతోంది.. 

ప్రభుత్వం జనాభా పెరిగిపోతోందని గగ్గోలు పెడుతుంటే బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, భర్తలను పోగొట్టుకున్న భార్యలు, తల్లితండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు, భార్యలను పోగొట్టుకున్న భర్తలు మొత్తం కుటుంబాన్నే పోగొట్టుకొని అనాధలుగా మిగులుతున్న అభాగ్యులు ఎందరో.. 

ఈ నిరంతర ప్రమాద ప్రవాహం ఇలాగే కొనసాగితే కుటుంబ నియంత్రణ పథకాల అవసరం లేకుండా పోతుంది.. మనిషి మాన, ప్రాణానికి భద్రత లేని సమాజం మనది.. ప్రమాదాలకు భయపడి ఇంట్లోనే కూర్చోలేము.. ఈ ఉరుకుల పరుగుల సామాజిక జీవనంలో జీవన పోరాటం తప్పదు.. 

ప్రమాదం జరిగితే కర్మ సిద్ధాంతాన్ని వల్లించుకుంటూ విధిరాత అని సరిపెట్టుకుంటున్నారే తప్ప ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేద్దాం అని ఎవరూ ముందుకు రావట్లేదు.. ఏదైనా ప్రమాద వార్త వింటే ఆ కాసేపు అయ్యోపాపం అంటారు.. తరువాత మళ్ళి మరిచిపోయి ఎవరి పనిలోకి వారు వెళ్ళిపోతారు.. 

ప్రమాదాలలో అయినవారిని పోగొట్టుకున్న వారుకూడా రోధించడమే తప్ప, స్పందించడం లేదు.. అన్నీ తెలిసిన విద్యావంతులు, యువకులు, పెద్దవారు కూడా వాహనాలలో ప్రయాణం చేసే సమయంలో తొందరపడి పోతుంటారు.. చిన్న చిన్న తప్పిదాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు .. సొంత వాహనమే కదా.. అని సరిగ్గా సమయానికి ముందు బయలుదేరడం, మార్గమధ్యంలో అనుకోని రీతిలో ట్రాఫిక్ రద్దీ వల్ల లేదా మరే ఇతర కారణం వల్ల ఆలస్యం అయిపోతుందని వేగంగా వెళ్ళడం ప్రమాదాలకు ముఖ్య కారణంగా మారుతోంది.. 

ప్రమాదాలను గురించి విని మాకు కాదులే అనుకోకండి.. మీవంతు రాకుండా చూసుకోండి.. 

దీని నివారణా మార్గం ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు.. ప్రజలు, ప్రభుత్వం కలసికట్టుగా పనిచెయ్యాలి.. ప్రభుత్వం దీనికి ఒక సామాజిక సమస్యగా తీసుకొని క్రింది స్థాయి నుండి ప్రక్షాళన చెయ్యాలి.. ప్రజలు కూడా చైతన్య వంతులు కావాలి.. ప్రజా చైతన్యం లేనిదే ఏ సమస్యకు పరిష్కారం లేదని ప్రపంచ చరిత్రలే చెబుతున్నాయి.. అంతరిక్షానికే బాటలు వేసిన మనవ మేధస్సుకు ఈ సమస్య అసాధ్యం కాదు.. 

ఆలోచంచండి.. ఆచరిస్తే సుసాధ్యమే.. 

నా వల్ల ఏమౌతుందని ఎవరూ అనుకోవద్దు.. నావంతు కృషి చేస్తానని ప్రయత్నించండి.. 

నేను గ్రుడ్డి వాణ్ణి నా వల్ల ఏమౌతుందని ప్రాన్స్ దేశస్తుడైన లూయిస్ బ్రెయిలీ తలంచిఉంటే ఈ రోజు బెయిన్ లిపి ఉండేదా.. ప్రపంచంలో ఇంతమంది అందులకు మేలు జరిగేదా .. !!

వైధ్యం లేని జబ్బుగా గుండె జబ్బు వున్న తరుణంలో తన సోదరుడు హృద్రోగముతో మరణిస్తే నా వల్ల ఏమౌతుందని దక్షిణాఫ్రికా దేశస్తుడైన డా‍. క్రిష్టియన్ బర్నార్డ్ తలంచి ఉంటే నేడు జరుగుతున్న ఇంత సులువైన గుండె శస్త్చికిత్సలు, బైపాస్ సర్జరీలు జరిగేవా...!!

చెయ్యాలనే ఆలోచన ఉంటే ఆచరణ సాధ్యమే.. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు.. మీ ఇంటి దగ్గర ఉన్నవారికే అవగాహన కలిగించండి.. రెప్ప పాటులో జరిగే అనర్ధాలను కళ్ళకు కట్టినట్లు వారికి వివరించండి.. ముఖ్యంగా యువతకు చెప్పండి.. ఒక కుటుంబంలోని వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబాన్ని ఎంతలా కృంగదీస్తుందో వారికి వివరించండి.. 

ఒక మంచి మాటకు ఒక కుటుంబాన్నేప్రాణంతో నిలబెట్టే శక్తి ఉందని మర్చిపోకండి.... 

స్వస్తి __/\__

Written by: Bobby Nani

Wednesday, December 6, 2017

జీవన వాహిని..


చర చర బిర బిర చేర ..రావే 
నీ అడుగుల సడి నే నృత్యము విన!!

ప్రేయసి అనురాగ భావనా 
జీవన వాహిని.. రావే!!

సిగ్గుల మొగ్గలు శిరమున దాల్చి 
బుగ్గల నిగ్గుల కెంపులు పొంగగ 
గగన వీధిలో ఇంద్ర ధనువు వలె 
కదిలి రావే నా ముంగిటకు !!

గిరి శిఖరాల పరువులు తీసే 
మేఘ మాలికల లోన దాగిన 
తటిల్లతను తలపించు రీతిలో 
తరలి రావే నా చెంత చేరగా!!

పొంగి పొరలు జలపాతపు శోభను 
పొంచి చూచు రాయంచ విధాన 
నడిచి రావె అందాల భామినీ 
నడకలోని నీ కులుకులు చూడ !!

అందీ అందని చందమామ వలె 
అడవిలోన చరియించు లేడి వలె 
మెయిలు రాకకు పరవశించిన 
ముద్దుల శిఖి వలె నర్తించ రావే !!

Written by : Bobby Nani

Tuesday, December 5, 2017

“చలి” నను కౌగిలించిన వేళ...


“చలి” నను కౌగిలించిన వేళ... 
**********************

చెక్కిలి మీద 
సనసన్నగా తాకుతూ 
చిరు గాలుల ముద్దులతో 
ఓ పిల్లగాలి నను చుట్టేసింది.. !!

నాకన్నా ముందే 
త్వర త్వరగా ఇంటికి చేరిపోయే
సాయంత్రాల వెలుగు రేఖ 
నను జాలిగా చూస్తోంది.. !!

వణుకుతున్న 
పుడమితల్లి వంటి మీద 
రంగు రంగుల దుప్పట్లు 
నను దయతో కప్పుతున్నాయి.. !!

మరణశయ్యపై నున్న సూర్యుని 
చిట్టచివరి వెచ్చని కిరణం 
నను ముద్దాడి ముద్దాడి 
విషాదంగా వెళ్తోంది.. !!

రెక్కల మీద మంచు 
ముత్యాలు పొదుగుకొని 
పక్షులు ఆలపించే 
సామూహిక వీడ్కోలు గీతాలై 
నను లాలిస్తున్నాయి.. !!

చిటారు కొమ్మమీంచి 
రాలుతున్న చిట్ట చివరి ఆకుల 
వెచ్చని ఊపిరులు 
ఆర్తిగా నను స్పృశిస్తున్నాయి..!!

అయినా చలి తగ్గదే.. 

చలి కప్పిన దేహానికి 
చెలి స్పర్శే మందనిపించింది..
చేతులు చాచి 
బిగుతు బాహువుల్లోకి 
“చెలి”నాహ్వానించాను
వెనువెంటనే 
గుండెలోని పిల్ల 
గుండెలపై వాలింది.. 
చలి కౌగిళ్ళనుంచి విడిపడి 
చెలి పరిష్వంగములో 
ఒదిగిపోయాను..!!

Written by : Bobby Nani