ఏ కవీ చెయ్యలేని సాహసోపేత అనంత సృష్టిస్థితిలయ కవితా ప్రళయ నర్తన విన్యాస ఖండము ఇది.. సృష్టి ఆవిర్భావం మొదలు.. నేటి వరకు ఏక కవితలో పొందుపరిచే మహత్తర దృశ్య కావ్యం.. ఇప్పటివరకు ఏ కవి చెయ్యని సాహసమే.. ఎక్కడా చదవని విన్యాసమే..
ఎందుకో తెలియకుండా ఓ ఆలోచన వచ్చింది 10 రోజుల క్రితం.. ఒకే కవితలో సృష్టి ఆవిర్భావం మొదలు ముఖ్యమైన భావాలన్నీ పొందుపరిస్తే ఎలా ఉంటుంది ?? అని..
మళ్ళి ఆలోచించా.. చాలా పెద్దది అయిపోతుందేమో కదా... చదువుతారా ?? అని
ఒక్కరైనా చదువుతారు కదా అనే నమ్మకమే నన్ను ఈ స్థాయికి నడిపించింది.. అదే షుమారు 9 రోజులనుంచి నాచేతి కలాన్ని అవిశ్రాంతంగా కదిలించింది.. కొన్ని వర్ణనలను, కొన్ని పద ప్రయోగాలను నేను మునుపు వ్రాసిన వ్యాసాలలో నుంచి, కవితలలో నుంచి తీసుకోవడం జరిగింది.. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి.. మీ ఇంటి సభ్యునిగా భావించి చదివి మీ అభిప్రాయం చెప్తారని ఎదురు చూస్తూ..
//// నాని అక్షర స్వరూపము కాదిది .. విలక్షణ విశ్వరూపం \\\\
********************************************
మహా విస్పోటనం..
ప్రళయ భీకర విధ్వంశం..
విశ్వవ్యాప్తికి ఆదిమ బీజం..
ఉద్భవించెను సమస్త జీవరాశి..!!
అదిగో .. అదిగదిగో..
రాక్షస బల్లుల రాకాసి జాడ..
వికృత చేష్టల హింసా.... మారణ కాండ..
రాకాసుల స్వైర విహార రణరంగ క్రీడ .. !!
గగనతలంలో విహంగ వీక్షణ.. !!
సముద్రనవనీత సుధా సాగరంలో
జలపుష్పాల జలక్రియా విన్యాసంబులు..!!
భువన సీమలో చెంగు చెంగుమను
కృష్ణతారముల చెంగలించులు..!!
మ్రాను మ్రానుకు దుమికెడి
మర్కటముల గారడి ప్రదర్శనములు..!!
పటమట దిక్కున ధగ ధగల మెరుపులు..
వాయువ్య మూలన ఆకాశ రాజు
ఢమ ఢమల ఘర్జనలు.. ఇంతలోనే
నింగి వలచింది నేలను..
తొంగి చూచింది ప్రకృతి కాంత సొగసును ..
వంగి నిలిచింది,
సందిట కౌగిలించింది..
కనుసైగ చేసింది..
అనువైన కోనలో
కోరిక తీర ముద్దులిచ్చింది..
నింగి నేలను వలచి
మంచుపొగలతో పంపింది ప్రేమలేఖ..
నేలకు దిగివచ్చి
వలచి తలచి
పిలిచి కౌగిట జేర్చి
కొండ శిఖర అధరాల
కొరికి నొక్కి
పచ్చికబయళ్ళ
పమిట కొంగుపై
రంగు రంగు పువ్వుల
పుప్పొడి గందాల సువాసనలు చిలికి
వనమూలికల పరిమళాల పన్నీరుచల్లి
పిల్ల గాలులు చల్లంగ వీచి
ప్రకృతి కాంత సఖియలైన గిరులు తరులు
తన్మయమునొంద
అబల ప్రకృతి కాంత కన్నియును
ఆకాశ రాజు ఆలింగనముచేసి
పరిణయమాడె ఈ ప్రకృతి కాంతను
ప్రకృతి పులకరించి హర్షించే..
వానరము.. వానరుడయ్యే..
రక్త హింస జేసి...
జంతు భక్ష గావించే..
సిగ్గు, బిడియము నేర్చే..!
కప్పుకొనుటకు పత్రములు జుట్టే..
ఆరగించుటకు నిప్పును రాజేసే..
వానరుఁడు .. మానవుడయ్యే ..
ప్రకృతి మాతకు నిత్య కళంకమయ్యే..
వాని జీవితం
జనన మరణాల మధ్య
కాలం వ్రేలాడగట్టిన
ఓ కాంతి రేఖయ్యే..
జననం ఒక మరణం లేని ప్రశ్న..
మరణం ఒక జననం లేని ప్రశ్న..
సమాధానం లేని రెండు
సంపూర్ణ ప్రశ్నలకు
సమాధానం చెప్పడానికి
సందేహాల బోనులో నిలబడ్డ
సాక్షిలాంటిదీ జీవితం..!!
అది అబద్దం చెప్పదు ..
సత్యం తెలియదు..
ఎన్ని జీవితాలు..
ఎన్నెన్ని జీవితాలు !!
ఎన్నెన్ని సాక్ష్యాలు.. !!
కళ్ళులేని కాలం
చెవులు లేని కలంతో..
నోరులేని కాగితాల మీద
కన్నీటి అక్షరాలతో
అన్నీ వ్రాసుకుంటున్నది..
ఎక్కడి నుంచి వచ్చి
ఎక్కడికి పోతున్నాడో
ఎవరికీ తెలియని
మనిషి జీవితం ఒక మహాకావ్యం..
జీవితం ఒక నిత్య సత్యం
అయినా అది మహా స్వప్నం..
బాల్య యౌవన వృద్దాప్యాలు
రుజా జరా మరణాలు
రాగ ద్వేషాలు – త్యాగ భోగాలు
అల్లుకున్న
సుందరతర గందరగోళం ఈ జీవితం
అనుభవించడం తప్ప
అర్ధం చెప్పరానిదీ జీవితం
రండి చూద్దాం జీవితాన్ని
రంగు రంగుల సింగిణిని
ఎన్నో వికీర్ణ వర్ణాల ఏకరూపం ఈ జీవితం
కామ, క్రోధ, లోభ,
మోహ, మద, మత్సర్యాది
అరిషడ్వర్గాల పందిరి మీద
క్షణానికో పూవు పూచే
చిత్ర గంధి జీవితం
ఎక్కడ పుడుతుందో.. తెలియని
ప్రాయేటి కెరటం ఈ జీవితం..
అద్బుత ద్వీపం మీద
మబ్బులా వచ్చి కురిసి
వాగులా పొంగి పొరలి
వారాశిలో కలిసిపోయే
వర్ష బిందువు ఈ జీవితం
అనుభూతి శిఖరాలనుంచి
అవలోకిద్దాం జీవితాన్ని
ఆలోచనా అంతరాళాలనుంచి
పరిశీలిద్దాం జీవితాన్ని
అనంతత్వ కిరణాలలో
దైవత్వ దర్పణాలలో
దర్శిద్దాం ఈ జీవితాన్ని
జననానికి మరణం శిక్ష..
మరణానికి జననం శిక్ష..
ఉభయ శిక్షలను తానే అనుభవించే
ధర్మం లేని జీవితం మానవునిది..
అందుకే..
దయ, దాక్షిణ్యం మరచి
తల్లితండ్రులు భ్రూణహత్యకు
పూనుకొనుటకు సిద్దహస్తులైనారు..
జాలి లేక ఆడ పిల్లను
సాకనోపక చంపబూనుచు,
గోడకు కొట్టినట్టి తండ్రియే
కరుడుకట్టిన కసాయి యవ్వగా..
పాపను కనుపాపవలెన్
కాయవలసిన తల్లిదండ్రులే ఆ
పాపను రూపుమాపఁగ..
ఏది ధర్మం.. ??
ఎక్కడిది న్యాయం ??
అన్నీ తప్పించుకొని
ఆడపిల్లగా భూమిమీదకు రాగా..
ఆడపిల్లను “ఆడ” పిల్లవే,
ఈడ పిల్లవు కావనుచు
అత్త ఇంటికి సాగనంపుటే
తమ లక్ష్యముగా పంపితిరే ..
వెళ్ళినాక ఈసడింపులకు
తాళలేక, కన్నవారికి చెప్పలేక..
మరణమే శరణమని వేడగా ..
గర్భమున తన శిశువు
కదలికలకు ఊపిరి పీల్చుకొని
క్రొత్త భంధం కోసం 9 నెలలు
వేచి చూడగా..
ముద్దులొలుకుతూ పుట్టినది
చూడు ఆడపిల్ల.... !!
అత్త మూతివిరుపుల తోడూ ..
మామగారి వెక్కిరింతలూ
ఇక మగపిల్లాడు లేడు
మనకని ఈసడించేడు భర్త..
వైఖరి దిక్కు తోచక గుండె
బరువై కుమిలి కుమిలి ఏడ్చే ఆ యబల ..
జన్మనిచ్చిన తల్లి నిస్పృహ
తెలిసినట్లుగా ఆ బిడ్డ ఏడ్వగా ..
ఆడపుట్టుక అంత అలుసా..
అన్నట్లు తోచేనపుడు..
పెద్దలందరు చీదరించిన
తండ్రికూడ నిరాదరించిన
తల్లి ఒడిలో పెరిగి పాపయు
వ్యక్తిత్వము కూర్చుకున్నది..
విద్య, వివేకములు అబ్బి
అంద, చందములు అమరి..
వినయ భూషణయై నిలిచినది
ఈ కోమలాంగి.. !!
ఆమెను చూడాలంటే కళ్ళతో కాదు...
హృదయంతో చూడాల్సిందే..
అబ్బ ఏమి అందమో,
యెంత లావణ్యమో,
నిజం చెప్తే నమ్మరు కాని ..
పుడమి హర్షిస్తుంది
తన పాదపద్మములు తగిలి..
మేఘాలు వర్షిస్తాయి
తన సుగంధాల శ్వాస తాకి..
మయూరము పురివిప్పియాడును
తన దేహ సౌందర్య కాంతులకు..
తుమ్మెదలు పరితపించును
తన పెదవుల తియ్యదనానికి..
కొందరిని చూస్తే, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ..
ఇంకొందరిని చూస్తే, ఆరాధించాలనిపిస్తుంది ..
ఆమెను చూస్తే మాత్రం ఏంటో నా భావాల్ని చూస్తున్నట్లు వుంది..
తన నేత్రాలకు అంటిన ఆ కాటుక ఘాడంగా ఆమెను కౌగిలించుకొని చెరగనంటోంది..
తన మోముకు అంటిన పున్నమి వెన్నెల ఆమెను వదలనంటోంది..
తన అధరములనంటిన గులాబి వర్ణం ఆమెను చూసి సిగ్గులొలుకుతోంది..
పారిజాతపు కుసుమం వంటి ఆమె దేహ పరిమళములు
మదనుడిని మత్తెక్కించి ఆహ్వానము పలుకుతున్నాయి..
ఆమె చూసే క్రీగంట చూపులు సమ్మోహితుడను చేస్తున్నాయి..
మొదట ఆమెను నా నేత్రాలతో చూశాను ..
ఎలాంటి సౌందర్యం కనిపించలేదు..
ఆశ్చర్యమేసింది..
హృదయపు తలుపులు తెరిచి మరలా తేరిపారా ఆమెను చూడసాగాను..
బోలెడన్ని సౌందర్య అందాలు ఆమె అణువణువునా అమరి వున్నాయి..
ఆమె నలుగుపిండితో అభ్యంగనస్నాన మాచరించి
లేలేత పసుపు తన వంటి మొత్తానికీ రాసుకొని..
ముదురు కుంకుమ వర్ణం గల రవిక, చీర కట్టుకొని,
నుదిటిన పాపిడిబిళ్ళ పెట్టుకొని,
నడుము కిందకు జాలువారే వయ్యారాల వాలుజడతో,
విరబూసిన పుష్పాల అలంకరణతో,
చెక్కిలినంటిన సౌందర్య చుక్కతో,
గంధపు లలాట తిలకముతో,
అరచెయ్యిని అంటిన యెర్రని గోరింటాకుతో,
పునుగు, జవ్వాది మొదలగు దేహ పరిమళములతో,
పారాణి కలిగిన పాద పద్మములతో,
ముద్దులొలికే ముక్కుపుడకతో,
కంఠమున ధరించిన ఎద సౌందర్యాభరణంతో,
చెవికి అలంకరించిన కర్ణికతో..
అరిటాకు వంటి శృంగార నడుముకు,
ముద్దుల వడ్డానంతో..
హంస నడకలు చిందుతూ.. నా
హృదయ వేదిక మీద నవరస రూపిణియై,
నవజీవన నాయికవై
అనంగ శరాలు వర్షించే ఆంగికాభినయంతో ..
నర్తిస్తోందీ... రంగుల ప్రపంచంలో.. !!
అదే రంగుల ప్రపంచంలో ఓ రైతూ ఉన్నాడని
తన భుజాన నాగలిని నిలిపి..
ఒళ్లంతా కమిలిన గాయాలతో,
కాడెద్దులా మారి దున్నుతున్నాడని ..
రక్తంతో తన పొలాన్ని తడుపుతూ..
కన్నీళ్ళతో చేనును దున్నుతూ ..
అన్నపూర్ణను అందరికీ అందించాలనే,
తపనతో భగీరధునిలా మారాడు ఆ రైతు ..
అన్నం “మేకు” అయిందనో,
“ముద్ద” అయిందనో,
ప్రక్కకు నెట్టే నేటి మనుషుల
మనస్తత్వ పోకడలు ఒక్కసారిగా
జ్ఞప్తికి వచ్చాయి.. !!
నీటికోసం నింగివంకా,
పంటకోసం నేలవంకా,
ఆశపడుతూ..పరుగుపెడుతూ..
నేలతల్లిని నమ్ముకొని,
ఉన్నదంతా అమ్ముకొని,
బిడ్డల కన్నా “చేనే” ప్రాణమనుకొని,
పొలాల మధ్య తిరుగుతూ
బక్కచిక్కిన ఈ కర్మలోకపు
ఈ కర్షకుడి కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించట్లేదు
నీరుతో తడవాల్సిన భూములు
ఈ నాడు,
రైతుల కన్నీళ్ళతో తడుస్తున్నాయి..
పచ్చగా పలకరించాల్సిన పంటలు
బీడులై దీన స్థితితో చూస్తున్నాయి..
నిజంగానే ఇదో “రంగుల ప్రపంచం”..
“విద్య” వ్యపారమౌతోంది..
“వైద్యం” అంగట్లో వస్తువౌతోంది..
“బంధాలు” సెంటిమెంట్లు అవుతున్నాయి..
“అమ్మ” అద్దెకు దొరుకుతోంది..
“నాన్న”కు చిరునామానే అవసరం లేదు..
“క్రమశిక్షణ మా ప్రత్యేకత” అన్న నినాదం..
“కంప్యూటర్ మా లక్ష్యం” గా మారుతోంది..
“జాతీయగీతం” పరదేశం ఆలాపన చేస్తుంది..
దేశాన్ని అమ్మేవారు “దేశభక్తులు” అయ్యారు..
పొలాలు “స్మశానాలు” అవుతున్నాయి..
ఇక్కడ
అన్నం, నీళ్ళు దొరకవు..
సెల్ పోన్లు, కలర్ టీవీలు,
టాబ్ లు, కార్లు చౌకగా దొరుకుతాయి..
ప్రేమ అమ్మబడుతుంది “తూకాని”కి..
రక్తం చిమ్మబడుతుంది “ఉత్త పుణ్యానికి”
అదో మాయా ప్రపంచం..
అదే “రంగుల ప్రపంచం”
అదే ప్రపంచంలో ఓ “తండ్రీ” వున్నాడు..
సమాజం దృష్టిలో అతడో కాంత దాసుడు..
పేరుకే కాంత దాసుడు..
నిరంతర సంసార సాగర శ్రమజీవుడు...
నితాన్వేషణ విధి నిర్వహనుడు...
వేకువనే లేచి .. వున్నా, లేకున్నా
యేవో బట్టలు వేసుకొని ..
తిన్నా, తినకున్నా,
ఎండనకా, వాననకా,
పగలు, రేయి తారతమ్య భేదాలు మరిచి
సంసారమనే బీడు కయ్యను ..
గాడేద్దు వలె దుక్కి దున్నుతున్నాడు..
కంటిలోని జలాన్ని ఆవిరి చేస్తూ ..
కంటిముందర సంసారమనే భూమిని
చిరునవ్వుతో .. లాగుతున్నాడు పచ్చని
పంట చెయ్యాలనే తపనలతో..
కమిలిన చేతులతో,
తన పాదాన్ని అంటిన కనికరం లేని గాయాలతో.. !!
ఎందుకోసమో ఈ త్రాస.. ఎవరోకోసమో ఈ ప్రయాస..
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు తెలిసింది..
మసిపట్టి మసకబారిన తన మోము ఒకటి వుందని..
గతించిన ఏళ్ళను వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ..
అంతా చీకటిపట్టిన మసే కనిపించింది..
దుమ్ము, ధూళితో నిండిన తన జీవితాన్ని దులిపేదెవరు ??
మొరటివాడు, మొండి వాడు, క్రోధుడు ఇవే తన బిరుదులు ..
అతడో అద్బుతం, అతడో అజరామరం,
అతడే ఓ అనంత శక్తిస్వరూపుడు..!!
అంతటి శక్తి రూపుని అర్ధాంగి “అమ్మ”
అమ్మంటే ఓ అద్బుతం..
అమ్మంటే ఓ అపురూపం..
అమ్మంటే ఓ అద్బుత కావ్యం..
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు,
అక్షరాలు, ఆలింగనాలు,
నడక, నడత,
అనురాగాలు, ఆత్మీయతలు,
ఆనంద సమయాలు,
కన్నీళ్లను వర్షించే క్షణాలు
ఇంకా..ఎన్నో ఎన్నెన్నో..
అందమైన అనుబంధం,
అంతేలేని అనురాగం
వెరసి ఓ మరుపురాని జ్ఞాపకం..
పిల్లాడిని గెలిపించడానికి తను ఓడిపోతుంది..
అలా ఓడిపోవడమే గెలుపనుకుంటుంది..
ఒకసారి తన బిడ్డను కొట్టింది..
అయినా ఏం లాభం ?
వాడికంటే ముందే ఏడ్చింది..!!
వాడు గుక్క పెట్టేలోపే
గుండెల్లోకి లాక్కుంది..
తెరలు తెరలుగా
తన కౌగిళ్ళలో కప్పుకుంది..
కళ్ళే కాదు.. తనువులోని
ప్రతీ అణువు చెమరించేలా ఏడ్చింది..
ఇంకెప్పుడూ అమ్మకు కోపం తెప్పించకూ !! అంటూ
వాడిని బహిరంగంగా బతిమాలింది..
వెయ్యి అల్లర్లు భరించాక ఒక్కటి చెబుతుంది..
అదే అమ్మంటే.. !!
అంతటి ఉత్తమరాలు నుంచి
వేరుపడిన వారిలో
గాత్రంతో గారడీ చేసే గాయకులూ,
స్వేదాన్ని చిందించే కర్షకులూ..
అద్వైతాన్ని భోధించే జ్ఞానులూ,
విధ్యను పంచె గురువులూ,
కనికరము లేని కామాందులూ,
హింసకు ఆద్యంపోసే రాక్షసులూ,
సమాజాన్ని మేల్కొలిపే కవులూ,
అందరూ ఆ తల్లి బిడ్డలే..
ఒకే చెట్టు వేళ్లే ..
ఇంతకీ ఎవరీ కవి..
సాధారణ మానవుడు
స్ఫటికంలాంటివాడు
ప్రక్క రంగులకు లోబడి
వ్యక్తిత్వం కోల్పోతాడు
కవిని మాత్రం సూర్యునితో
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడు వన్నెలు జీర్ణించుకొని
ఏకవర్ణం చిమ్ముతాడు
తన అక్షర శరములతో.. !!
మంచుగుడ్డలు కప్పుకున్న
మానవుల మెదళ్ళలో
వెచ్చని కిరాణాలందించే
వాడే కవి,
వాడే రవి...!!
అవనిలోని ప్రత్యనువూ
కవికొక బ్రహ్మాండం
అతనిగుండె కదుపలేని అణుశకలం
లేనే లేదు..!!
అణువులోన నిద్రించే
అతర్జాతీయత్వాన్ని
పనిగట్టి వీపుదట్టే
ప్రబల దార్శినికుడు కవి.. !!
పరమాణువు ముఖములోన
తెరుచుకునే మరణదంష్ట్రల
మాటలతో కరిగించే
మహా మాంత్రికుడు కవి..!!
సాటివాళ్ళు మూఢత్వపు
సారా మైకంలో పడి
ప్రేలుతుంటే జాగృతి.. దీ
పాలెత్తిన వాడు కవి..!!
బురదలోన బ్రతికే ...కు
మ్మరి పురుగుల లేవనెత్తి
బంభారాలుగా మార్చే
బ్రహ్మత్వం కవిలో ఉంది ..!!
చెదలు దిన్న హృదయంతో
మసిబట్టిన మనస్సుతో
మాటలు గిల్కేవా...
డేనాటికి కవికాడు ..!!
పరుల బాధ తన బాధగ
పంచుకున్నవాడే కవి..
పరుల సుఖంలో శిరస్సు
పైకెత్తినవాడే కవి.. !!
పుచ్చపూలు గచ్చపొదలు
జిల్లెడులు, పల్లేరులు
కవి కలం సోకితేనే
కల్పవృక్షాలవుతాయి..!!
తుహినాచల శిరం నుండి
తురగలించే జలపాతాలు
కవి గుండెలో విధ్యుత్తును
కల్పించక మానవు..!!
జగత్తులో ఏ మూలో
పొగచూరిన నరజాతుల
వీపులపై విరుగుతున్న
వెండి కొరడా దెబ్బలతో
కవి కళ్ళలో ఎర్రదాళ్ళు
పొంగి ప్రవహించును ..!!
పడమటి బెహార్లు హుషారుగా
పరచిన బంగారు వలల్లో
పావురాళ్ళ కాళ్ళిరుక్కుంటే
కవి గొంతుక లోయలోనుంచి
గర్జించిన చప్పుడు ..!!
పచ్చిగడ్డిలా పెరిగిన పల్లె వాళ్ళపై
ఆకాశంనుంచి రాకాసులు
అగ్నివర్షం కురుస్తుంటే
కవి శిరస్సును చీలుస్తూ
ఎగుస్తుంది విస్పోటక ప్రతినాదం..!!
ప్రయోజనం లేకుండా పొడిచే
పగటి చుక్కలకు
దూరంనుంచి తో .... కాడించే
ధూమాకేతువులకు,
ఎవడి కాంతినో అరువు దెచ్చుకొని
నిగనిగలాడే చంద్రబింబానికి,
పనిలేకుండా పరిభ్రమించే
అనంత గ్రహ గోళాలకు,
క్షణం సేపు మిడిసిపడే
మిణుగురు పుర్వులకు,
అకారణంగా ముఖం చిట్లించుకునే
ఆస్తమ సంధ్యకు,
అణువణువూ ఈ బ్రహ్మాండంలో
వున్న జీవికీ, మృత్పిండానికి
కర్మసాక్షి ఈ కవియే
ఈ కవియే భారవియే...!!
ప్రణయం ఒక తుమ్మెదలా
మనస్సులో మర్మరిస్తుంటే,
ప్రేయసి ఒక తుమ్మెదలా
ఎదలో కదలాడుతుంటే,
భవిష్యత్తు ముళ్ళులేని
ప్రసవ పథంలా కనిపిస్తే,
బ్రతుకొక చక్రాలు లేని
ప్రసవ రధంలా ఎదురొస్తే,
కవిగొంతుక తేనే తేనేగా
పల్కక తప్పదు..!!
కవిలో సౌరభాలు
రెక్కలు విప్పక తప్పదు..!!
శరన్నిశీధాలు పగళ్ళపై
దురాక్రమణ సాగించి
మృత్యుభాను ముడికొప్పును
జీవన పురుషుడు సడలించి
సెలవేసిన విద్వేషాన్ని
సౌహార్దం కత్తిరించి
జగత్సర్ప మొక్కమాటు
సడలిన కుబుసాన్ని విడిస్తే
కవి హృదయం నాగస్వరమై రవలిస్తుంది.. !!
కవి గీతం రాగాంకురమై రావణిస్తుంది.. !!
పిరికితనం వారసత్వంగా
సక్రమించిన శరణాగతుల
పిల్లి గొంతులలో సాహస
భీషణమర్ధల ఘోషలు
పెకలించే శంఖస్వరం..!
ఇదే కవితా స్వరూపం..!!
ఇదే కవి విశ్వరూపం.. !!
ఇంతకీ
ఇదంతా వ్రాస్తున్న నేనెవరిని??
నా, నీ, అనే భేదాభిప్రాయం లేకుండా నా
ఆత్మీయులు సంలపించు “నానీ” నా ..
అయితే నా గురించి చెప్పాల్సిందే..
ప్రకృతే నా పుస్తకం..
పాఠకులే నా గ్రంధాలు..
అక్షరాల్లేని కాగితాలను
చదవడమే నా అలవాటు...!!
ఈ విశ్వాంతరాళంలో
విరుచుకుపడుతూ
కాలపురుషుని చోదకత్వంలో
పయనిస్తున్న
రధికుణ్ణి నేను..
ప్రశాంత సాగర ఘోష
ప్రళయ ఝుంఝూర్భటుల విలయ హేష
నా శృతికి అవలీలగా వినిపించే భాష..!!
వసంతాల సంతసాలు
పౌష్యలక్ష్మి సంబరాలు
విప్లవ ప్రతాపాలు
నే నడిచిన మార్గంలో మైలురాళ్ళు ..!!
కర్కశ కరాళ కరాలు
లే చిగుళ్ళను చిదిమేస్తుంటే
మూగగా ఆక్రోశిస్తూ
గులాములకు సలాములిచ్చే
లే గులాబీ స్వాముల బాష్పాంజలులు
కలవారి వికటాట్టహాస ఘట్టనలకి
వెన్ను విరిగి
వన్నె తరిగి
వంగి యీల్గే సగటు మనిషి
సుప్త సంతప్త జ్వాలలు
నే పయనించే
మహాప్రయాణంలో
ఎన్నో అపశృతుల గాథలు..
ఇదే నా అక్షర స్వరూపం..
మూడు పదుల అనుభవ విలక్షణ విశ్వరూపం..