ఎప్పుడూ కవితలూ, కావ్యాలేనా.. అంగాంగ వర్ణనలేనా.. శృంగార పలుకులేనా.. ఉపనిషత్తులు గురించి కూడా దృష్టి పెడదాం....ఓసారి వాటినీ పరికిద్దాం..
నిజం చెప్పాలంటే గడిచిన 4 దినాలనుండి ఆధ్యాత్మిక వైపు పరుగులు తీస్తోంది నా మనసు.. ఏంటో మరి.. ఇవి రాయడానికి నా వయస్సు, అనుభవం రెండూ చాలవు.. కాని అప్పుడప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను.. వ్రాస్తూనే ఉంటాను.. దోషజ్ఞులు, అనుభవజ్ఞులు తప్పులను సరి చెయ్యగలరు..
సమస్త మానవాళి వారి వారి స్థాయిలలో ఉద్దరింపబడటానికి మార్గాలను చూపేవే ఈ వేదాలు.. పరిపక్వం చెందిన సాధకులు, వైరాగ్య భావన గలవారికి, మోక్షం కోసం తపించే వారికి చక్కగా ఉపకరించేవి ఉపనిషత్తులు...
ఉపనిషత్తు అనే శబ్దం వినిపించగానే ఎవరిలో అయితే ఒక పారవశ్యం, పులకరింత కలుగుతుందో వారే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని గ్రహించగల బుద్దిని కలిగి ఉంటారు .. ఉపనిషత్తు అనగా అజ్ఞానమును పూర్తిగా నశింపజేసేది అని ఒక అర్ధం కూడా ఉంది.. వైరాగ్య వంతుడైన సాధకుని పరమాత్మ సన్నిధికి చేర్చే ఆ పరమాత్మతో ఐక్యత కలిగించేది ఉపనిషత్తు అని మరొక అర్ధం కూడా లేక పోలేదు..
నాలుగు వేదాలలోను జ్ఞాన భండాగారాలవంటి ఉపనిషత్తులు 1180 ఉన్నాయి.. అయినా ఇప్పుడు అన్నీ పేర్లు కూడా లభించటం లేదు.. ముక్తికోపనిషత్తులో శ్రీ రాముడు ఆంజనేయునికి 108 ఉపనిషత్తుల పేర్లను తెలియజేయడం జరిగింది.. అందులో 10 ఉపనిషత్తులను అత్యంత ప్రధానమైనవిగా భావించి ముగ్గురు ఆచార్యులు వాటికి భాష్యాలు వ్రాసారు.. అవే దశోపనిషత్తులు గా ప్రఖ్యాతిగాంచినవి..
అవి :
1. ఈశ,
2. కేన,
3. కఠ,
4. ప్రశ్న,
5. ముండక,
6. మాడూక్య,
7. ఐతరేయ,
8. తైత్తీరీయ,
9. ఛాందోగ్య,
10. బృహదారణ్యక,
ఉపనిషత్తులనే వేదాంతము అని కూడా అంటారు.. ఎందుకంటే వేదాలకు అంతములో ఉన్నవి కనుక. ఇలా వేదాలలో చివరి భాగంలో వున్న ఈ ఉపనిషత్తులు సాధన చతుష్టయ సంపన్నులై, అర్హత కలిగిన పరిపక్వ సాధకులను, పరమాత్మ సన్నిధికి చేర్చి ఆ పరమాత్మతో ఐక్యత కలిగించి, జన్మ రాహిత్యం ద్వారా శాశ్వత బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి..
అయితే ఇక్కడ ఒక్కటి బాగా గుర్తుంచుకోవాలి..
ఏ ఉపనిషత్తు అయినా తనంతట తానుగా, మనకు ఇష్టం ఉన్నా, లేకున్నా బలవంతంగా మనలను ఈడ్చుకువెల్లి పరమాత్మ సన్నిధికి చేర్చదు .. ఎవరైతే ప్రపంచంలో తిరుగుతూ వారి వారి వాసనల కనుగుణంగా వ్యవహరిస్తూ, సుఖ, దుఃఖాలను పొందుతూ . ఏదో ఒక నాటికి నిత్యమైనదేమిటో - అనిత్యమైన దేమిటో తెలుసుకొని, అనిత్యమైన ప్రాపంచిక విషయాలపట్ల, భోగాలపట్ల, వైరాగ్యం చెంది, నిత్యమైన, శాశ్వితమైన, ఆనంద స్వరూపమైన పరమాత్మ పట్ల ఆసక్తికలిగి, ఆ పరమాత్మ కొరకు తపిస్తూ, సాధనలు చేస్తారో అట్టి వారినే ఉపనిషత్తులు పరమాత్మ సన్నిధికి చేర్చేది. సాధనలు అంటే ఏదో ఠాలాఠోలీ సాధనలు కాదు.. ఏదో చేశామంటే చేశామనే రకం కాదు.. చేసి చేతులు దులిపేసుకోవడం కానే కాదు..
మానవుడు సంసారధ్యేయంతో, లౌకిక విషయాలపట్ల ఆసక్తితో, భోగాలపట్ల వ్యామోహంతో, ఈ ఒక్క జన్మనే దృష్టిలో పెట్టుకొని శాస్త్రాలన్నింటినీ తిరస్కరించి, మహాత్ముల యొక్క, జ్ఞానుల యొక్క సలహాలను, సూచనలను పెడచెవిన పెట్టి, గురువులను ధిక్కరించి, మొండిగా, మూర్ఖంగా ఈ సంసార లంపటంలోనే కూరుకుపోతే భగవంతుడు ఊరుకుంటాడా.. ?? అడుగడుగునా విచారణలకు, శిక్షలకు గురిచేస్తూనే ఉంటాడు..
మరణించిన తరువాత ధర్మాధర్మ విచారణ పేరుతో యమధర్మరాజు కోర్టులో ముద్దాయిగా నిలబడాలి.. ఆయన వేసే శిక్షలను అనుభవించాలి.. మరి అక్కడ కోర్టులో నిలబడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిత్ర గుప్తుడు అడిగే వాటికి బిక్క మొగం వేస్తే ఏం లాభం.. ??
అక్కడ నిన్ను రక్షించడానికి ఏ డిఫెన్స్ లాయరూ ఉండడు .. కనుక ఆ విషయాలన్నీ ఇక్కడే బాగా ఆలోచించుకొని తగినవిధంగా తయారైపోవాలి..
అసలు యమధర్మరాజుకు ఎదురుపడకుండా తప్పించుకునే వుపాయమేదో ఇప్పుడే ఇక్కడే ఆలోచించుకోవాలి.. భజ గోవిందంలో దీనికి సూటిగా ఉపాయం చెప్పారు శంకరులవారు ..
“భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికా పీతా ..!
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్యమేన సచర్చా..!!”
భగవద్గీత అధ్యయనం – (జ్ఞానం) గంగాజలపానం – మురారి అర్చనం (అహం కారమనే రాక్షసుడే ముర – అతణ్ణి సంహరించిన వాడే మురారి.. కనుక అహంకారాన్ని అంతం చేసి పరమాత్మగా నిలిచిపోవాలి) ఈ మూడూ చేసినవారికి ఇక యమునితో ఎట్టి వివాదమూ లేదు..
యమధర్మరాజుకు సంబంధం లేకుండా, ఆయన కంట పడకుండా, ఆయనతో వివాద పడకుండా ఉండాలంటే ఆయన మాటలలోనే చెప్పిన ఈ కఠోపనిషత్తును ప్రతీవారు తప్పక తెలుసుకోవాలి.. యముని భయం తీరాలంటే ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయాలి..
ఈ ప్రపంచంలోని సమస్త దుఃఖానికి ఆపదలకు మూల కారణం అజ్ఞానమే.. తానెవరో తనకు తెలియకపోవడమే .. మానవుడు ఈ దేహమే తాను అని భ్రమపడుతున్నాడు. ఇదే అజ్ఞానం.. దేహం ఎన్నటికీ “నేను” కావడానికి వీలులేదు.. జనన మరణాలు లేకుండా శాశ్వితంగా ఎల్లప్పుడూ అంతటా వుండే చైతన్యమైన ఆత్మయే నేను.. ఏ మార్పులూ లేని, ఏ పరిమితులూ లేని, ఏ కల్మషమూ లేని ఆనంద స్వరూపమైన ఆత్మయే నేను.. అట్టి ఆత్మను శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని, విచారణ చేసి బాగుగా ధ్యానించి, సుస్పష్టముగా గ్రహించి, అనుభవించుటయే జ్ఞానం.. అట్టి ఆత్మగా సర్వకాల, సర్వావస్థల యందు ఎరుక కలిగి ఉండిపోవడమే మోక్ష మార్గం..
భగవంతుని ధ్యానం అంటే ప్యాకేట్లకు ప్యాకెట్లు పాలు కొని కుమ్మరించడం కాదు..మీ ఆత్మను భగవంతుని సన్నిధిలో నిలపడం.. భగవంతుడు అలంకార ప్రియుడే కాని దానికన్నా ముందు నిష్కల్మష ఆత్మా ప్రియుడు... పూజా, పునస్కారాలు, నైవేద్యం, నివేదన ఇవన్నీ కాస్త పక్కన పెట్టి మొదట మీ పవిత్ర ఆత్మతో ధ్యానించండి.. తనతో మాట్లాడండి.. తన శక్తిని గ్రహించండి..
మళ్ళి చెప్తున్నానని మరోలా అనుకోకండి.. ముఖ్యంగా యువత
భగవంతున్ని నమ్మినా, నమ్మకున్నా మనమధ్య మనకే తెలియని ఓ అతీత శక్తి ఒకటి ఉందని గ్రహించండి.. మనిషి పుట్టకముందే శాస్త్రాలు పుట్టి ఉన్నాయన్న యదార్ధాన్ని గ్రహించండి.. అవే మనకు మార్గదర్శకాలు.. కనిపించే శక్తి శాసనాలు.. నమ్మడం, నమ్మకపోవడం అనేది మీ ఇష్టం.. కాని ఇది శాస్త్రం.. ఇదే ధర్మం..
స్వస్తి.. ___/\___