Monday, July 17, 2017

తెలుగు రాష్ట్రం పై కేంద్రానికి ఎందుకీ శీతకన్ను



ఎప్పుడూ కవితలూ, కావ్యాలేనా అప్పుడప్పుడూ ఇలాంటి వాటిపై కూడా దృష్టి సారిద్దాం... 


తెలుగు రాష్ట్రం పై కేంద్రానికి ఎందుకీ శీతకన్ను 
********************************

దేశ భాషలలో లెస్స అనిపించుకున్న తేట తెలుగు వారి రాష్ట్రం పట్ల కేంద్రం తొంటి చెయ్యి చూపిస్తుండటంతో అన్నీ రంగాలలో అభివృద్ధి కుంటుపడుతున్నది.. 

తెలుగువారు తమ మెత్తని స్వభావాన్ని త్యజించి తమలోని చైతన్య శక్తిని వెలిదీసి తెలుగునాట మహోదయానికి కృషి చేయాలి.. 

స్వరాజ్యం వచ్చి 70 ఏళ్ళు కావస్తుంది..
ఆంధ్రరాష్ట్రం ఏర్పడి 64 ఏళ్ళు కావస్తున్నది.. 
విశాలాంద్ర జన్మించి 60 ఏళ్ళు దాటింది.. 
తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజన జరిగి 2 ఏళ్ళు దాటింది.. 
అయినా మార్పు లేదు.. 


అంధ్రప్రదేశ్ సువిశాలమైన దేశం... సారవంతమైన భూమి, సమృద్దిగా వున్న నదీ జలాలు, అనేక ముడి పదార్ధాలు, ఖనిజ సంపదలు, అన్నిటికీ మించి ఆర్ద్ర హృదయం గల ప్రజలు.. ఇవన్నీ ఆంధ్ర దేశపు అదృష్టాలు..అవకాశాలు.. అవకాశాల సద్వినియోగంలోనే పురోగమనం వున్న చరిత్ర ఉంది.. 

ఇక ఉభయ రాష్ట్రాల చుట్టూ ఉత్తర, దక్షిణ ప్రాంతాల కూడలి రెండు భూభాగాలుగా ఇక్కడ కలుస్తాయి.. రెండు సంస్కృతులు ఇక్కడ సమ్మేళనమవుతాయి.. ఉభయ రాష్ట్రాలకు అంటిపెట్టుకుని వున్న రాష్ట్రాలు మరింకే రాష్ట్రానికి లేవేమో.. మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు చుట్టూరా ఉన్నాయి.. తూర్పున సుధీర్గమైన సముద్ర తీరం ఉంది..

ఇకపోతే “తేట తెలుగు కమ్మదనం” 

తెలుగువారి పెద్ద అదృష్టాలలో ఒకటి వారి బాష, తియ్యగా, సరళంగా, హాయిగా ఉంటుంది తెలుగు.. సంగీత తరంగాలనే పొంగించగలదు దాని శబ్ద మాధుర్యం.... దీనికి తోడు సంగీతం, సంస్కృతం మొదలైన పరభాష మంచిని తనలో ఇముడ్చుకుని, నిండుతనాన్ని సంతరించుకున్నది మన తెలుగు బాష.. దేశంలోని అన్నీ బాషలకు అంతో ఇంతో అందుబాటులో వుండి వాటి విశిష్టతలను తనతో లగ్నం చేసుకోగలిగింది తెలుగు భాషే.. అందుకనే “దేశ భాష లందు తెలుగు లెస్స” అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నారు.. 
ఈనాడు ఎట్టి పక్షపాత బుద్దిలేని పాశ్చాత్య శాస్త్రవేత్తలు హోమ్ఫీల్డ్, మాక్లాయిడ్, డాక్టర్ కారే, డాక్టర్ కాంప్బెల్, మోరిస్, డాక్టర్ హాల్డేన్ లు మెచ్చుకున్నది.. కనుక భాషాదురభిమానం, సంస్కృతీ వైరుధ్యంతో సతమతమౌతూన్న భారతావనికి అంగరక్ష కాగల శక్తి మన తెలుగు రాష్ట్రాలకే వున్నదని చెప్పడంలో సంశయమే లేదు... 

అయితే ఇంతటి ప్రాభవం, కాగితం మీద మాత్రమే కనిపిస్తుంది.. ఊహాలోకంలో మెరుస్తుంది... ఇంతవరకు ఇది కలగానే మిగిలిపోయింది.. వాస్తవం ఇందుకు పూర్తిగా విరుద్దం.. పొరుగు రాష్ట్రాలను అభిమానిస్తూ అన్నీ రంగాలలో కేంద్రం తొంటి చెయ్యే చూపుతున్నది.. 

“ఇది ముమ్మాటికీ ఆంధ్రుల మెతకదనమే”

ఈ దురవస్థకు కారకులెవరు ?? 
ఇతరులను ఏమని ప్రయోజనం?? 
ఆందోళనలు జరిపితే తప్ప మన ఉనికిని అంగీకరించని ఈ దినాలలో ఈనాటి మనస్తత్వంతో తెలుగువారు బ్రతకడం నేర్చుకోవాలి.. తమిళనాడులో వారి భాషాభిమానాన్ని గుర్తుతెచ్చుకోవాలి.. తెలుగువారిలో వున్న లోపం కొంపమీదకు వస్తేగాని ఉత్సాహం చూపించరు .. దప్పికైతే బావి త్రవ్వుకునే మనస్తత్వం.. ఇది మారాలి.. 

ఇక సాహిత్యంలో సుగమ సాహిత్యం కావాలి.. అందుకనే తెలుగులో నవలలు, నవలికలు, కథలు పిచ్చటిల్లినయ్ .. శాస్త్ర రచన వెనకాడుతున్నది.. సంగీతంలో సుగమ సంగీతం కావాలి.. వాగ్గేయకారులు తెలుగులోనే సంగీత రచన చేసినా మన తెలుగువారికి శాస్త్రీయ సంగీతం ఎక్కువగా పనికి రాదు.. అలాగే ముడిసరుకును బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటారే కాని.. వాటితో సామాగ్రిని తయారు చెయ్యరు.. ఇవన్నీ తెలుగువారు అలవాటుపడ్డ, పడుతున్న సుగమైన మార్గాలు.. సదరు జీవితాలకు చెరగని చిహ్నాలు.. 

వారుపెట్టుకున్న కంపెనీలు, సంస్థలు ఎక్కువగా చితికిపోతుంటాయి.. అది క్రమశిక్షణ, కలసికట్టుతనం లేదనడానికి గుర్తు.. 

అభివృద్దిని సాధించాలంటే తెలుగువారు సహజంగా తమలో వున్న చైతన్య శక్తిని బయటకు పొంగించాలి.. శ్రమపడటం అలవరుచుకోవాలి.. కార్య దీక్షను పెంపొందించుకోవాలి.. 

జరిగిన చరిత్రను బట్టి పాఠాలు నేర్చుకొని ఆత్మ పరిశీలన గావించి దీక్షాకంకణులై మహోదయానికి కృషి చెయ్యాలి.. అప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ ను చూడగలం.. 

స్వస్తి.. ___/\___

Written by ; Bobby Nani

Wednesday, July 12, 2017

శ్రీమతికి ప్రేమలేఖ..



చాలా సున్నితమైన కవిత ఇది.. భర్త లోని సున్నిత భావాలను తియ్యగా భార్య హృదయానికి చేరవేసే మధుర కవితే ఈ భావకవిత్వం .... 
ఆది నుండి నేటి వరకు ఒక వెలుగు వెలుగుతూ వస్తున్న ఈ భావకవిత్వమంటే నాకు చాలా ప్రీతి... 

శ్రీమతికి ప్రేమలేఖ.. 
**************

శ్రీమతికి ఏమని ప్రేమలేఖ వ్రాయను 
చిలకమ్మా చెప్పవే సిగ్గు వీడి..!!

పూవులారా చెప్పరే నా సఖికి నేను 
మనసు విప్పి వ్రాయ దగిన మాటలు మీరు.. !!

అన్నమన్నమాట నే మరచితిని.. 
దానిపైన నాకు హితవు తప్పిన దెపుడో 
నా లోని అనురాగం ఒక క్షణమైనా 
నిన్ను నిల్వనివ్వదు ఒంటరిగా ఒక చోట.. !!

నా కంటి రెప్పలు నీ కొరకై ఎదురు చూతును 
గడచిన ప్రతీ నిమిషమును నే లెక్కింతు 
కలనైనా నిను చూడగ నే కోరుదు.. 
కలుగదే అంతటి భాగ్యం నాకు.. 
నాకన్నా నీకు ఆ భక్తే గొప్పదా.. 
నాకన్నా నీకు ఆ దేవుడే మిన్నా.. 
నను చేర బిర బిర మని రావే ప్రియా.. 
నా గుండెలపైనే వాలిపోవా..!!
నీ కొరకై 
శకమైనా.. 
సహస్రమైన 
ఎదురుచూపులాపను..
కనులు మూసే లోపల 
కళ్ళముందుకు 
బేగి వచ్చేస్తావ్ కదూ.. !!

Written by: Bobby Nani

Tuesday, July 11, 2017

\\\\హరిణలోచన////



మొదటగా స్త్రీ మూర్తులకు విన్నపం... ఇందులో మీరు ఇబ్బంది పడే వర్ణనలు వున్నాయని హెచ్చరిస్తున్నాను.. దయచేసి ఈ పోస్ట్ కి మాత్రం దూరంగా ఉండమని ప్రార్ధన.. 

ఇది ఆలు, మగల శృంగార కావ్యం.. ప్రతీ ఇంట జరిగే ఓ బృహత్కార్యం.. 

ఈ పోస్ట్ చదివేముందు మీకు మొదట “పాణి గ్రహణం” అంటే ఎంటో తెలియాలి.. నాలుగు మంత్రాలతో వరుడు వధువు చేతిని తన చేతిలోకి తీసుకోవడం అగ్ని సమక్షంలో జరుగుతుంది.... అంటే అగ్ని సాక్షిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. మంచి సంతానం కోసం, విధి విహితమైన కర్మలను నిర్వర్తించడం కోసం, పాణిగ్రహణం చేస్తున్నానని వధువు అనడం ఈ మంత్రాల ఆంతర్యం. 

వరుడు తన కుడిహస్తాన్ని కింద ఉండే విధంగా వధువు హస్తం పైన ఉండే విధంగా పట్టుకుంటాడు. కేవలం స్త్రీ సంతానాన్ని మాత్రమే కోరుతుంటే వరుడు వధువు వేళ్లు మాత్రమే పట్టుకునేవాడు... కాని ఇక్కడ సంతానంతోపాటు అన్నీ అని దాని అర్ధం.. అలాంటి పాణి గ్రహణమైన కన్యతో పరిణాయకుడైన వరుడు ఎలా జత కడుతున్నాడో చూడండి.. 

\\\\హరిణలోచన////
**************


చంద్రుడిలోని తెలుపే మెరిసి తెల్లబోయి చూసె నీ.. 
స్వఛ్ఛమైన మనసు నాకే ఇచ్చావని చెబితే.. 
తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసి ...
నువ్వూ,
నేనూ, 
ఒక్కటై 
సృష్టికార్యానికి శ్రీకారం చుడితే…!!
నీ తడిముద్దుల వెచ్చదనం, 
నీ ఎద శ్వాసల వేడితనం, 
ఊపిరాడనీయట్లేదే.. !!
తామర మొగ్గవంటి నీ దేహం.. 
పద్మపు, 
గంధపు,
సువాసనలు విరజిల్లుతూ, 
కళ్ళు కలువపువ్వులై నక్షత్రముల కాంతులతో.. 
నను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. 
పలుకులు మాత్రం చకోరులై, 
మృదు, మధుర స్వరాలను వినసొంపు గావిస్తున్నాయి.. !!
ప్రక్కకు తిప్పుకుందామనుకునే లోపే ఆమె అందాలపై 
తుమ్మెదలా వాలిపోయింది నా హృదయము.. 
చంద్రవంక నడుము, 
నాగువంటి వెన్ను, 
లోతు తెలియని ఉదర నాభి వృత్తం.. 
అరటాకు నడుముకు నవనీతమద్దె 
నయగారముల మడతలు.. 
తుమ్మెద రెక్కలవంటి 
ముదురు నలుపు వర్ణము గల ఆ తల కేశములు.. 
కోమలమైన ఆ ముని వ్రేళ్ళు .. 
నాగస్వరపు వంపు తేలిన సన్నని మెడాకృతి.. 
కనిపించి కనిపించని ఆ యవ్వన మెడపై 
శృంగార నాడీ కేశముల హొయలు.. అధరముల తాకిడికి
గిలిగింతలు పడే ఆ సొగసులు .. మరువగలమా.. !!
అవి అధరములా లేక మధుర సుధా సంకేతములా .. 
అప్పుడే పండిన ముదురు దోర దొండ ఫలములా.. 
రా రమ్మని ఆహ్వానములు పలుకకనే పలుకుతున్నాయి కదే.. 
ఇంతలో...
పీటముడి పడిన నాలుగు ఆ అధరముల మధ్యన అమృత రసం స్రవిస్తోంది.. 
దానిమధురం పుట్టనుంచి తీసిన తేనేలా తియ్యనైన మధువని తో మమేకమై ఉంది.. 
అబ్బా.. సఖీ.. 
చిలికిన వెన్న వలెనున్న ఆ ఎద పూ..బంతులు, 
చుట్టూరా లే లేత గులాబి రంగును పులుముకున్నాయి.. 
కటీరములు ఎడారిలోని ఇసుక తిన్నెలులా, 
పిక్కలు శంఖంలా .. 
మదనుని మందిరం తామర ఆకునుపోలి, 
స్వర్గానికి సాన్నిహిత్యం వహిస్తున్నట్లుగా... 
సృష్టికి మూలంలా... 
నను సమ్మోహితుడను గావిస్తోంది .. 
పాదాలు పద్మములవలె భూదేవిని ముద్దాడుతూ, 
వయ్యారంగా నా వైపు వస్తుంటే.. 
పరవశమొందిన నేను గాలి జొరబడని బిగుతైన 
పరిష్వంగములలో నిను బంధించి... 
సరస క్రీడలో నడుమ, నడుమ సుఖాతిరేకం వలన కలిగే 
స్పందనలకు, స్పర్శలకు నయన రెప్పలు భారంగా 
వాలుతూ ....
వాలిపోమా.. 
ఒదిగిపోమా .... 
ఒక్కటైపోమా..!!! 

Written by : Bobby Nani

Friday, July 7, 2017

\\\\ “స్త్రీ” స్వాతంత్ర్యం ////



ఇది కేవలం కొందరి స్త్రీ మూర్తులను ఉద్దేశించి మాత్రమే రాశాను.. నేను స్త్రీ వ్యతిరేఖిని కాదని మనవి చేస్తున్నాను... నాకు, నా కలం కి స్వ, పర బేధాలు లేవు..వుండవు కూడా.. నేను ఏ ఒక్కరిపట్లా పక్షపాతిని కాదు.. అలా అని నిస్పక్షపాతిని కూడా కాదు... అన్నీ రచనలు చేస్తాను.. అందరిమీదా చేస్తాను.. నన్ను కదిలించే భావన నాకేది కనిపించినా నేను, నా “లేఖిని” అస్సలు ఉండలేము.. వుండబోము కూడా.. ప్రతీ కన్నీటిలో, ప్రతీ సౌందర్య వర్ణనలో, ప్రతీ భావనలో “లేఖిని” ఉంటుంది.. 

\\\\ “స్త్రీ” స్వాతంత్ర్యం ////
******************

స్త్రీకి స్వాతంత్ర్యం లేదని 
అడుగడుగునా అణగత్రోక్కబడుతుందని 
మగవానికి బానిసగా 
బ్రతకవలసి వస్తుందని
స్త్రీలు కొందరీమధ్య 
చాలా మదనపడుతున్నారు 
బహిరంగంగా చెప్పుకుంటున్నారు..
బాహటంగా వాదిస్తున్నారు..
మగవారికి సమానంగా జీతాలు లేవని 
మంత్రివర్గాలలో సరైన ప్రాతినిధ్య లేదని 
ఇష్టమైన సినిమాలకు వెళ్లనీయలేదని 
క్లబ్బుకెళ్లడానికి కారివ్వలేదని 
ఎంతో మూగబాధననుభవిస్తున్నారు 
కొందరు ఇంట్లో పోరుపెడుతున్నారు 
పై చెప్పినవాటిలో కొంత నిజం లేకపోలేదు.. 
మానవజన్మఎత్తిన మనకు 
స్త్రీ, పురుష భేదం లేకుండా 
కావలసిన స్వేచ్చాస్వాతంత్ర్యాలుండాలి 
కాని వాటికి హద్డులుండాలి 
స్త్రీ లకే కాదు పురుషులక్కూడా ఉండాలి..
నిజంగా ఆలోచిస్తే 
స్త్రీకి స్వాతంత్ర్యం 
ఎక్కడ లోపించిందో 
అర్ధం కావట్లేదు.. 
స్కూళ్ళలో కాలేజీలలో 
ఉద్యోగాలలో అంతటా ఉన్నారు.. 
సినిమాలు, డ్యాన్సులు 
నాటికలు, నాట్యాలు, 
అన్నిట్లో పై చేయి మీదే 
కథలు అచ్చుపడాలంటే 
ఆడవారైనా వ్రాయాలి
ఆడపెరైనా వ్రాసుకోవాలి 
టైపిస్టుగా, స్టెనోలుగా, 
కంప్యూటర్ ఆపరేటర్లుగా 
స్త్రీలకే ప్రత్యేకత.. 
లేడీస్ బ్యాంకులు, 
లేడీస్ క్లబ్బులు, 
లేడీస్ సూపర్ బజారులు 
ఎక్కడ చూసినా లేడీస్ ఫస్ట్ 
రచయితలుగా పైకి వస్తున్నారు.. 
కవయిత్రులుగా పైకివస్తున్నారు.. 
అధ్యాపకులుగా చలాకీగా 
పనిచేస్తూ ఉన్నారు.. 
ఇంజనీర్లుగా, ఆర్కిటెక్టులుగా
ముందంజ వేస్తూనే ఉన్నారు.. 
సైకిళ్ళు నడుపుతున్నారు.. 
మోటారు సైకిళ్ళు నడుపుతున్నారు.. 
జీపులు, కార్లు, అన్నీ నడుపుతూనే ఉన్నారు.. 
జుట్లు కత్తిరించుకుంటున్నారు 
మగవాళ్ళ దుస్తులేసుకుంటున్నారు 
చీరలకు పంగనామాలు పెట్టి 
పాంట్లు వేసుకుంటున్నారు.. 
ఇంకా ఏమి చేస్తారండి.. ?? 
మగవాడు సిగరెట్టు త్రాగుతున్నాడు.. 
మద్యపానం చేస్తున్నాడు... 
క్లబ్బుల్లో తిరిగి 
లేటుగా ఇంటికోస్తున్నాడు.. 
అవీ మీరు చెయ్యదలుచుకున్నారా ?? 
ఇవీ కొంతమంది చేస్తూనే ఉన్నారండి.. 
అదృష్టం కొద్ది 
వారు మైనారిటీలో ఉన్నారు మనదేశంలో
ఈ స్వాతంత్ర్యాలన్నీ 
ఆడవారికి అధికంగా వున్న దేశాలను
ఓమారు చూడండి.. 
మానసికానందం లేక 
మసైపోతున్నారు 
అయినా...
మగవాడి బడాయంతా 
ఆడవారిపై 
ఒక పిల్ల పుట్టేవరకేనండి 
ఆ తర్వాత గీచిన గీత 
దాటడం లేదనికదా కొందరికి 
“henpecked” భర్తలనే పేరువస్తున్నది 
కొంతమంది ఆ పేరు సార్ధకం 
చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే 
కొందరేమో Inferiority Complex తో 
సతమతమవుతున్నారు ..
మనసు విప్పి మాట్లాడాలంటే 
కొన్ని సంసారాలలో మగవాడు 
కొన్ని సంసారాలలో ఆడవారు 
పెత్తనం చెలాయిస్తూనే ఉన్నారు.. 
ప్రత్యేకమైన పరిస్థితులలో 
ఒకచోట ఆడవారు
ఒకచోట మగవారు 
మానసిక బాధలకు 
గురి అవుతూనే ఉన్నారు.. 
అందుకే ఓ సోదరీమణులారా 
ఎవరికెంత స్వాతంత్ర్యం 
అవసరమో నిర్ణయించుకొని 
చెడుదారిన వెళ్ళే మగవాణ్ణి 
నయాన, భయాన 
మంచి దారిన పెట్టండి 
అతని స్వాతంత్ర్యాన్ని అరికట్టండి 
అనురాగాలు పెంచుకోండి 
కాని 
మీరా స్వాతంత్ర్యం కోరుకోకండి.. 
అమ్మాయిలూ 
మీ స్వాతంత్ర్యం అరికట్టడానికి 
ఒక్క మగవారే భాద్యులు కారమ్మా 
మీ అక్కలు, మీ అత్తలు 
మీ అమ్మలు, మీ అమ్మమ్మలు
కొంతవరకు బాధ్యులేమో ..!
పని పాటలు లేక 
ఊసుపోక 
నోరు పారేసుకొని 
మగవాళ్ళకు నేర్పి
పోరుపెట్టి 
తోటి స్త్రీ ని చులకనగా చూసి 
వారు ఇబ్బందులు పడుతున్నారు 
అందరికీ ఇబ్బందులపాలు చేస్తున్నారు 
వారి నాలుకలు అదుపులో ఉంటే
వారి చేతలు హద్దుల్లో ఉంటే 
మీ స్వాతంత్ర్యానికి ముప్పు లేదు.. 
మా ఆనందాలకు అవధిలేదు.. 
ఈ దేశంలో స్త్రీ కి 
మగవాడెప్పుడూ ఉన్నతస్థానమే ఇచ్చాడు.. 
సోదరిగా ప్రేమిస్తున్నాడు.. 
మాతృమూర్తిగా పూజిస్తున్నాడు.. 
భార్యగా చేసుకొని 
వలపుల వయ్యరిగా ఊహించుకొని 
తీయతీయని కలలు కంటూ 
ఆరాధ్య దేవతగా 
ఆరాదిస్తూనే వున్నాడు.. 
అందుకే 
మీ అనుమానాలు మానుకొని 
మనసులు పాడుచేసుకోక
వున్న స్వాతంత్ర్యాన్ని 
సద్వినియోగం చేసుకొని 
మగవాడికున్న స్వాతంత్ర్యాన్ని 
కొంతవరకు అరికట్టి 
దారితప్పి వెళ్ళేవాళ్ళను
సరైన మార్గంలోకి తిప్పుకొని 
మీ జీవితాలు స్వర్గమయం చేసుకోండి.. 
ఆ స్వర్గంలో 
మాకు కాస్త చోటివ్వండి.. !!! 

Written by: Bobby Nani

Thursday, July 6, 2017

“అక్షరారణ్యము” ..



ఎన్నో వేల సంవత్సరముల క్రింద కోతి రూపంలో సృష్టించబడిన మానవుడు తన రూపానికి రంగులు దిద్దుకుంటూ క్రమేణా మనం నేడు చూస్తున్న చక్కని ఆకారాన్ని అందుకున్నాడు.. అంతేకాదు మిగతా జంతుజాలం కంటే ఎన్నో రెట్లు తన మేధాశక్తిని పెంచుకున్నాడు.. ఆకాశానికి ఎగురుతున్నాడు.. చంద్రుణ్ణి చేరుకున్నాడు.. సముద్రాలను జయిస్తున్నాడు.. ఏవేవో ఘన కార్యాలు సాధిస్తూ ఉన్నాడు .. కాని తనను తాను జయించలేక పోతున్నాడు.. కోతిలో నుండి పుట్టాననే పేరు సార్ధకం చేసుకోవడానికే కాబోలు కోతి బుద్దులు మాత్రం మానలేదు.. 

గిల్లికజ్జాలు తెచ్చుకుంటున్నాడు... ఒక సోదరుణ్ణి చూసి సకిలిస్తున్నాడు.. ఇంకొకడిని చూసి ఇకిలిస్తున్నాడు.. ఒకరిమీద రాయి విసురుతున్నాడు... మరొకడిమీద తిన్నది పారవేస్తున్నాడు .. ఒకరికొంప పీకుతున్నాడు.. ఇంకొకరి కొంపకు నిప్పంటిస్తున్నాడు .. తన తోకను ఏదో కరిచిందని ఆ బాధ నివారణకు మందు వెతుక్కునే బదులు ఇంకొకడి తోకను కొరికి వాడూ బాధపడుతూ ఉంటే చూసి ఇప్పుడు ఇద్దరం సమానంగా వున్నాం పర్వాలేదు అని ఆనందిస్తున్నాడు.. 

సోదరులారా ..!!

ఆత్మ – పరమాత్మ – పూర్వజన్మ మొదలగు వాటి గురించి చేర్చించే అంత జ్ఞానం కాని పాండిత్యం కాని నాకు లేదు.. కాని ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను.. 

ఈ సృష్టిలోని ప్రకృతి ఎన్ని యుగాలనుండో అభివృద్ధి చెందుతూ వచ్చి ఇంత చక్కని రూపాన్ని దిద్దుకున్నది.. ఈ విశాల ప్రపంచం మీద ఎన్నో కోట్ల జీవరాశి వున్నది.. కాని జంతువులకు లేని బుద్ధిబలం కలిగి మానవజాతి ఒక విశిష్టమైన స్థానము సంపాదించుకుంది.. మనమెన్ని ఖండాలుగా విభజించినా, ఎన్ని దేశాలుగా ఏర్పరుచుకున్నా.. ఎన్ని రాష్ట్రాలుగా భాగించుకున్నా, ఎన్ని తెగలుగా, ఎన్ని మతాలుగా, ఎన్ని కులాలుగా ఊహించుకున్నా.. మనమంతా ఒక్కటే.. ఒకే సృష్టిలో పుట్టిన ఒకే సృష్టికర్త బిడ్డలం.. 

అనంతమైన ఈ సృష్టిలో మానవుడు భౌతికంగా (Physically) చూస్తే ఒక చిన్న అణువు మాత్రమే ... అంతేకాదు మానవుడు నూరేళ్ళ బ్రతుకుతున్నాడని విర్రవీగే ఆ కాలమంతా ఒక క్షణంతో సమానమే.. నీవు మట్టిలోనే కలిసేది అని తెలుసు.. ఆ చావు ఏక్షణమైన రాగలదని కూడా తెలుసు.. బ్రతుకుతున్నంత కాలం యెంత విర్రవీగినా ఆ క్షణం రాగానే అంతా శూన్యం అని తెలుసు.. 

ఇన్ని తెలిసిన మానవుడు మరి ఎందుకు మూర్ఖుడైపోతున్నాడు.. ??
ఎందుకు ఈ మారణహోమం తలపెడుతున్నాడు.. ??
ఎందుకు రక్త పాతం జరుపుతున్నాడు.. ?? 
ఎందుకు ఈ ఓర్వలేని తనం ??
ఎందుకీ రసాభాసలు ?? 
ఎందుకీ అసూయాద్వేషాలు ?? 
ఎందుకీ దగుల్బాజీ వేషాలు ??
ఎందుకీ రొమ్ములు, వీపులు చరుచుకోవడాలు ?? 
ఎందుకీ నీచాతి నీచమైన పనులు.. ?? 
ఒకవైపు అంతరాత్మ మొత్తుకుంటుంటే దాన్ని ధిక్కరిస్తూ ఎందుకీ తిక్క తిక్క వేషాలు వేస్తున్నాం ?? 

మిత్రులారా...!!

బుద్ధిబలం, విచక్షణాజ్ఞానం మనలో అంతర్గతమై ఉన్నవి .. వాటిని ఉపయోగించి ప్రేమానురాగాలను పెంచుకోండి.. దీనులను రక్షించండి.. కష్టాలలో ఉన్నవారిని ఆడుకోండి.. అనాధలకు ఆశ్రయమివ్వండి .. మంచిని పెంచండి.. మమతలు నింపుకోండి కాని హాయిగా బ్రతికేవారి జీవితాలకు చిచ్చుపెట్టకండి .. 

బ్రతికేది నాలుగు రోజులే .... ఇదంతా మిధ్య.. మనం ఎన్నో పిచ్చి వేషాలు వేసి, ఎందరినో హతమార్చి (ప్రత్యక్షంగా – పరోక్షంగా) సంపాదిస్తున్న ఆస్తులు, పదవులూ అన్నీ మనందరినీ మోసం చేసి ఒక్క క్షణంలో మాయమైపోతాయి.. 

అంతేకాదు నీవు చేయదలుచుకున్నది, అనుభవించేది, సంపాదించదలుచుకున్నది, ఆనందించదలుచుకున్నది ఎదుటివారు కూడా కావాలనుకుంటాడని తెలుసుకొని ఒకరిని ఏడ్పించకుండా, నష్టపరచకుండా, వారిని గంగలో ముంచకుండా, గొంతులు కోయకుండా సంపాదించు, ఆనందించు, అనుభవించు కాని ఈ కోతి బుద్దులు మానుకో... 

బుద్ది హీనులమై మనమిలా అసహ్యకరమైన పనులెందుకు చేస్తున్నాం అనేబాధ... 
మానవజాతి ఇలా నిర్వీర్యమైపోతే ఎలా అనే నా ఆవేదన, తపనలే నేను రాస్తున్న, రాయబోతున్న కవితలకు, కావ్యాలకు కారణ, ప్రాణ భూతాలుగా మారుతున్నాయి.. నేను చూసిన, నా కంట పడిన ప్రతీ భావనననూ మొదట నేను పొంది, స్వీకరించి మీకు అందించగలుగుతున్నాను.. 

అయినా మనలో మంచితనముంది.. విచక్షణాజ్ఞానం ఉంది.. ఈ ప్రపంచం మీద ఎందరో మహానుభావులు అప్పుడప్పుడు జన్మించి మనకు చేస్తున్న హితబోధలు కొంతవరకైనా మనం పాటిస్తే మానవ జాతి మనుగడ కొనసాగగలదని తెలియజెప్పడమే నా “అక్షరారణ్యము” .. ఈ కలం పేరు “లేఖిని” ... 

Written By : Bobby Nani

Wednesday, July 5, 2017

ఓ మనిషి !! వింటున్నావా ఓ కన్నీటి గాధ ..



దారిలో వెళ్తూ వెళ్తూ 
ఒక రోగగ్రస్తమైన కుక్కను చూసాను.. 
ఆ ముసలి కుక్క కళ్ళలో బాధ, అసహాయత, 
వెలువడుతున్నాయి.. !!
దాన్ని అలా చూసి ఊరుకోలేక, 
ఓదార్చగలనేమో అని దగ్గరకు వెళ్లాను..! 
నన్ను చూచి భయపడి లేవపోయి, 
సతికిలపడి నావంక దీనంగా నిస్సహాయతతో, 
చూచింది ఆ కుక్క..!!
ఆ చూపుల్లో మానవుడి మాట కంటే, 
స్త్రీల కన్నీటి గాథకంటే,
విదితమైన బాష ఒకటి నాకు ప్రస్పుటంగా కనిపించింది.. !!
ఓ మనిషి !!
నీ దుర్మార్గం వల్ల 
నేనిలా రోగిగా పడివున్నాను .. !!
మీరుతన్నే కాలి గాయాలనుండి, 
ఈ పాడుపడ్డ ఆలయంలో తలదాచుకున్నాను..!! 
దుమ్ము, బూడిద మనిషి హృదయంకంటే, 
సున్నితమైనవి కనుక, 
ప్రపంచంలో మీ అన్యాయపు పరిపాలన అంతం అగుగాక.. !!
అనే మాటలు దాని కళ్ళ నుంచి ఒక్కొక్కటిగా రాలుతున్నాయి..!! 
అంతటితో ఆగక మళ్ళి మొదలు పెట్టింది 
దాని ఆవేదనా అశ్రువులను ..!!
ఆనాటి నుంచి నేటివరకు, 
నమ్మక, విశ్వాసాలకు మారుపేరుగా సేవచేసాను మీకు..! 
మనిషిని కాపాడాను.. మనిషికై తపించాను, 
యజమాని రాకకై వేచి వున్నాను..! 
అతడు రాకుంటే ఏడ్చాను..! 
అయినా ఆశించలేదు పంచభక్ష్యాలు, 
వేసిన ఎంగిలి ఎముకలతోనే తృప్తిపడ్డాను..!
ముసలితనం రాగానే – ఇంటినుంచి పారద్రోలాడు మనిషి,
అల్లరి పిల్లల రాళ్ళకు గురిచేశాడు కృతజ్ఞుడు..!!
ఓ మనిషీ.. !!
మీరు మనుషులనూ కుక్కల్లాగే చూస్తారు.. 
యౌవనంలో దేశాన్ని రక్షించి 
మిమ్ము కాపాడిన సైనికులను 
వయస్సుమళ్ళగానే మట్టితో సమానంగా నెట్టివేస్తారు ...!!
ఓ మనిషీ ... !!
మీరు ఆడదాన్ని కూడా అలానే చూస్తారు..
మిసి మిసి వయస్సులో ఉన్నప్పుడు, 
ఆమె అందాలన్నిటినీ దోచుకుంటారు.. 
ఒడలు సడలగానే వద్దు పొమ్మంటారు.. 
ముద్దులకుప్ప అనుకున్న దాన్ని, 
మురికి కూపంలో తోస్తారు..!!
అంటూ వాపోయింది ఆ నోరులేని జంతువు,
మనిషి కృతజ్ఞత గూర్చి తన కళ్ళతో.. !!
అంతా అర్ధం చేసుకున్నట్లుంది, 
ఆ కుక్క మన చేతగాని హృదయాన్ని..!!

Written By : Bobby Nani
లేఖిని 05.07.2017 ✍️

Tuesday, July 4, 2017

\\\\ఎదురుచూపులు////



జత అంటే ఎంటో తెలుసా ?? 
ఒకరులేనిది మరొకరు లేరు అనేంతలా కలయికతో, కలిసివున్న వారిని లేదా కలిసి వున్న వస్తువులను అలా అంటారు.. పెన్ను, కాగితం మన మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.. అందుకే ఈ రెంటినీ కలిపి రాస్తున్నాను.. 

\\\\ఎదురుచూపులు////
*****************
లోకంలో వున్న భావనలన్నింటినీ 
భారంగా మోసుకొస్తున్న గాలి స్పర్శలకు 
రెప రెప లాడుతోంది 
ఓ తెల్లని కాగితం..!!


సిరా లేక దప్పికతో పిడసకట్టుకుపోయి 
నాలుక వ్రేల్లాడ దీసుకుకూర్చుంది 
కలము మొన భాగం..!!


వేలసార్లు రెప్ప వేయక 
ఎదురుచూపులతోనే 
కాలం గడిపేస్తోందొక ఆడతనం.. !!


ఆ కలం 
కాగితాన్ని ముద్దాడేదెప్పుడో, 
కాగితపు అందాలలొ 
అక్షరాలు నలిగేదెప్పుడో..!!


ఆ కాంతుడు 
వచ్చేదెప్పుడో,
ఈ కాంతను తనలో 
ఇముడ్చుకునే దెప్పుడో..!!


కరుగుతున్న ఆశల, 
తపనల వెల్లువలలో 
నలిగిపోతున్న సమాధానం లేని 
ప్రశ్నలే ఈ రెండూ..!!


కలము తాకని కాగితఁబుకు విలువలేదు.. 
కాంతుడు రాని కాంతకు స్థిమితఁబులేదు.. 
ఉభయుల ఆలోచనలోక్కటే..!!
ఇరువురి ఆశా, కోరికలూ ఒక్కటే.. !!


కలము కదులు 
నవ స్పర్శలకు 
కాగితమ్ముకు జీవం వచ్చును.. !!


కాంతుడు కదులు
ఈ కాంత దేహంబుపై 
నవ శృంగారభంగిమలతోడన్ 
ఆవిర్భించును మరో ప్రాణిన్..!!


ప్రసవ వేదన పడిన కాగితమ్ములు 
ఏకమై, మమేకమై లిఖితపత్రమాయే..!!


పురిటినొప్పులు వోర్చిన ఈ కాంత 
సుతుని జననముతో మాతృమూర్తిగా మారే..!!


ధన్యమైనది కాగితమ్ము జన్మ.. !!
ధన్యురాలైనది ఈ మాత జన్మ.. !!

Written by : Bobby Nani

Saturday, July 1, 2017

అసలు ఈ G.S.T. (Goods Service Tax) అంటే ఏంటి ??



ప్రస్తుతం ప్రతీ ఒక్కరి హృదయంలో వున్న ఆలోచన ఒక్కటే G.S.T. (Goods Service Tax) అసలు ఈ G.S.T. (Goods Service Tax) అంటే ఏంటి ??

అదెలా పనిచేస్తుంది ??

దాని నియమనిబంధనలు ఏంటి ??

నిన్నటివరకు జరిగిన G.S.T. ని ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి..

ఒక పరిశ్రమ తను తయారు చేసిన వస్తువుకు ప్రోడక్ట్ value, లేబర్ ఛార్జ్, వగైరా జతచేసి దాని విలువ 50 రూపాయలుగా పరిగణించి దానికి 10% add చేసి 50+ Tax 5 = 55 రూపాయలుగా మార్కెట్లో కి విక్రయానికి పెడుతుంది...

తరువాత రీటైలర్ అనేవాడు ఈ 55 విలువగల వస్తువును 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను కొనుగోలు చేస్తాడు..

(ఇక్కడ గమనించాల్సిన విషయం నేను మీకు వివరించే దానికి 10% గా వేసాను కాని వస్తువును బట్టి ఈ Percentage మారుతూ ఉంటుంది.. యెంత మారినా జరిగే విధానం ఇదే అని చెప్తున్నాను)

రీటైలర్ ఆ వస్తువుపై 55 రూపాయలు ఖర్చు పెట్టాడు.. కనుక అలా పెట్టినదానికి అతడు తన ఆదాయం 30 గా జోడించి + టాక్స్ తో కలిపి హోల్ సేల్ వారికి 55 (కొనుగోలు రేటు) +30(ఆదాయం) +8.5 (టాక్స్) = 93.5 (మొత్తం) రూపాయలకు విక్రయిస్తాడు..

తరువాత ఈ హోల్ సేల్ వ్యాపారి 93.5 రూపాయలకు కొన్న ఈ వస్తువుని తనుకూడా 30 రూపాయలు ఆదాయం చూసుకొని 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను విక్రయిస్తాడు...

హోల్ సేల్ వ్యాపారి ఆ వస్తువుపై 93.5 రూపాయలు ఖర్చు పెట్టాడు.. కనుక అలా పెట్టినదానికి అతడు తన ఆదాయం 30 గా జోడించి + టాక్స్ తో కలిపి దుకాణం దారునికి 93.5 (కొనుగోలు రేటు) +30(ఆదాయం) +12.35 (టాక్స్) = 135.85 (మొత్తం) రూపాయలకు విక్రయిస్తాడు..

తరువాత దుకాణం దారుడు 135.85 రూపాయలకు కొన్న ఈ వస్తువుని తనుకూడా 30 రూపాయలు ఆదాయం చూసుకొని 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను విక్రయిస్తాడు...

దుకాణం దారుడు ఆ వస్తువుపై 135.85 రూపాయలు ఖర్చు పెట్టాడు.. కనుక అలా పెట్టినదానికి అతడు తన ఆదాయం 30 గా జోడించి + టాక్స్ తో కలిపి కొనుగోలుదారులైన అంటే మనకు 135.85 (కొనుగోలు రేటు) +30(ఆదాయం) +16.58 (టాక్స్) = 182.43 (మొత్తం) రూపాయలకు విక్రయిస్తాడు..

చూసారా మిత్రులారా 50 రూపాయలు విలువగల ఒక వస్తువు మన చేతికి వచ్చేసరికి 182.43 రూపాయలు అయింది .. టాక్స్ మీద టాక్స్ మనం కడుతున్నాం నిన్నటివరకు

కాని ఈరోజునుంచి ఈ G.S.T. (Goods Service Tax) అమలు ఎలా వుంటుందో ఇప్పుడు మనం చూద్దాం..

ఒక పరిశ్రమ తను తయారు చేసిన వస్తువుకు ప్రోడక్ట్ value, లేబర్ ఛార్జ్, వగైరా జతచేసి దాని విలువ 50 రూపాయలుగా పరిగణించి దానికి 10% add చేసి 50+ Tax 5 = 55 రూపాయలుగా మార్కెట్లో కి విక్రయానికి పెడుతుంది... ఇక్కడవరకు ఈ ప్రక్రియ మాములే..

కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇంతకుముందు మనం మొత్తం అమౌంట్ కి టాక్స్ కడుతూ వచ్చాం... కాని ఇప్పుడు రీటైలర్ వ్యాపారి తను ఆదాయం చూసుకున్న అమౌంట్ కి మాత్రమే టాక్స్ కట్టాల్సి ఉంటుంది.. అదెలాగో చూద్దాం..


తరువాత రీటైలర్ అనేవాడు ఈ 55 రూపాయలు విలువగల వస్తువును తను ఆదాయం చూసుకున్న అమౌంట్ కు మాత్రమే (అనగా 30 రూపాయలకు మాత్రమే) 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను విక్రయిస్తాడు..

55(కొనుగోలు అమౌంట్) +30 (ఆదాయం అమౌంట్) +3 (టాక్స్) = 88

తరువాత ఈ హోల్ సేల్ వ్యాపారి ఈ 88 రూపాయలు విలువగల వస్తువును తను ఆదాయం చూసుకున్న అమౌంట్ కు మాత్రమే (అనగా 30 రూపాయలకు మాత్రమే) 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను విక్రయిస్తాడు..

88 (కొనుగోలు అమౌంట్) +30 (ఆదాయం అమౌంట్) +3 (టాక్స్) = 121

తరువాత ఈ దుకాణం దారుడు ఈ 121 రూపాయలు విలువగల వస్తువును తను ఆదాయం చూసుకున్న అమౌంట్ కు మాత్రమే (అనగా 30 రూపాయలకు మాత్రమే) 10% గవర్నమెంట్ కి టాక్స్ కట్టి తను విక్రయిస్తాడు..

121 (కొనుగోలు అమౌంట్) +30 (ఆదాయం అమౌంట్) +3 (టాక్స్) = 154

చూసారా మిత్రులారా నిన్నటివరకు మనం 182.43 రూపాయలు కట్టాం.. కాని ఇప్పుడు 154 కట్టబోతున్నాం.. ఇది G.S.T. (Goods Service Tax) అంటే.. ఇలానే vat అని, service tax అని తొక్కా, తోలు అని ఉన్నాయి... నేను కేవలం G.S.T. (Goods Service Tax) గురించి మాత్రమే చెప్పాను అన్న విషయం మిత్రులు గమనించాలి ...

Written by : Bobby.Nani