పూర్వం నే రాసిన టపా ... చదవండి బాగుంటుంది..
నేటి కవులకు, రచయితలకు, కవయిత్రిలకు, రచయిత్రిలకు చేప్పెంతటి వాడిని కాదు.. అయిననూ ఒక్కసారి దీన్ని చదవగలరని చిరు విన్నపం..
అక్షరాలు అటకెక్కాయ్ ...
పదాలు పల్లకీలో ...
పరదేశం పారి పోయాయ్ ...
వాక్యాలు వరదలో ...
కొట్టుకుపోయాయ్ ...
కవిత కదిలేదెలా దిగులు వదిలేదెలా... !
ఈ కవితను మరో మాటలో చెప్పాలంటే
ఆటకెక్కిన అక్షరాలను ఆకట్టుకునే తుమ్మెదలా..
పరదేశం వైపు పరుగులు తీస్తున్న పదాలు ప్రకృతి చెంత చేరి...
వరదలలో వెళ్తున్న సెలయేటి సరాగాలైన వాక్యాలను ఒకచోట కలిపి...
వర్షించే మేఘాలు ముందుకు పయనిస్తూ...
అన్నిటినీ ఒకేచోట చేర్చి, కూర్చి...
ప్రళయబద్దమైన కవిత ఒప్పొంగిన వేళ...
వదిలెనులే చింత, దిగులెల్....!
కవితలు బాహ్య ప్రవాహానికి ఎదురెల్లి అందరి మనసును హత్తుకునేలా, గుర్తుండిపోయేలా ఒక రచయిత కాని, కవి కాని రాయాలంటే వారి మానసిక స్థితి యెంత నిగ్రహంతో వుండాలి చెప్పండి... వారు ఎలాంటి పరిస్థితులను అనుభవించి వుండాలి ??
వారిని వారు ఎన్నిరోజులు మలుచుకొని వుంటారు ??
ఎన్నో అహోరాత్రుల శిక్షణను పొందివుంటారు ... ఇవన్నీ ఈరోజు మన మస్తిష్కంలో నుంచి వచ్చినవి కానే కాదు.. ఎన్నో సంవత్సరముల నిర్విరామ కృషి ఫలితం ... ఈరోజుల్లో ఒక కవిత్వాన్ని కాని, ఒక రచనను కాని చదివేవారు, రాసేవారు ముఖ్యముగా వారికి కలగాల్సిన అనుమానాలు ఇవి..
కాని ఎంతమంది ఇలాంటి ఆలోచనాధోరని కలిగివున్నారు ??
ఎందరో కవులు, రచయితలు, కవయిత్రిలు, రచయిత్రిలు వున్నారు..
ముఖ్యంగా ఒక కవితను కాని, రచనను కాని రాయాలంటే అయిదు విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన భాద్యత ఆ రచయితకు లేదా కవికి వుంటుంది..
1. మన మానసిక స్థితి : ఒక విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని యధాతధంగా రాసిపారెయ్యడం కవిత లేదా రచన అనిపించుకోదు.. నిజానికి ఆ విషయానికి కావాల్సినది పరిష్కారం కవిత్వం, రచన కాదు.. సమస్య గురించి రచయిత ముందుగా తాను ఆవేదన చెంది, పాఠకుడిని చైతన్య పరచదల్చుకుంటే ఆ విషయానికి సరి అయిన కవిత్వ రూపం కాని అర్ధవంతమైన రచనను కాని అందించి మనసుకు హత్తుకునేలా సున్నితంగా చెప్పగలగాలి కానీ తిట్లు, విద్వేషాలు, శాపనార్థాలూ, బూతులు కవిత్వం కాదు. కేవలం ఒక వర్గాన్ని గురించో, కులాన్ని గురించో, మతాన్ని గురించో, ప్రాంతాన్ని గురించో మీరు పరిమితం అయితే ఆ వర్గం, కులం, మతం, లేదా ప్రాంతం ఇవి మాత్రమే మీకు సంబంధించిన సమస్యలు అయితే వాటిపైనే మీరు కవిత్వాలు, రచనలు రాస్తూవుండే సంకుచిత మానవుడు కవి ఎలా అవుతాడు? విశ్వ నరుడే కవి కాగలడు కదా.. !
ఆవేశాల్లోనుంచీ, ఆక్రోశాల్లోంచీ పుట్టేది ఒక స్థాయి కవిత్వం మాత్రమే. కేవలం అది దిగులుని, దుఃఖాన్ని మాత్రమే “గ్లోరిఫై” చేయడం కవిత్వం కానే కాదు. కవిత్వం చదివే పాఠకుడి మానసిక స్థాయిని పెంచాలి. ఉత్తేజితం చెయ్యాలి. కవిత్వం కాని రచన కాని చదివిన తరువాత మనిషి మరి కొంచెం ఉన్నతుడు కావాలి. ఇది నేను నమ్ముతాను, ఆచరిస్తాను.. అందుకే ప్రతీ అక్షరానికి కృతజ్ఞతలు తెల్పుతూ రాస్తుంటాను..
రచయిత అనేవాడు అన్ని బాహ్య ప్రభావాలనూ, ప్రలోభాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి. అన్ని సామాజిక విలువల వలువలను (మురికి గుడ్డలను) వదిలినట్టు వదిలేయాలి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి, ఏకాగ్రత, చిత్తశుద్ది, స్థితప్రజ్ఞత, ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో తనకు తానే మమేకమవ్వాలి, మైమరిచిపోవాలి .. అప్పుడు అలాంటి మానసిక స్థితిలోంచి పుట్టేదే నా దృష్టిలో గొప్ప కవిత.
ఇకపోతే 2. పదాల ఎంపిక.. : ఎట్లాంటి పదాలను వాడాలి...? సరళమైన పదాలనూ, వినసొంపైన తేట తెలుగు పదాలనూ, వాడాలి. ఏ ఏ పదాలు కలిస్తే కవిత కాని, రచన కాని అందం పెరుతుందో రచయితకు అవగాహన వుండాలి... ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం చెడుతుందో కూడా తెలిసివుండాలి... .పదాలను పొదుపుగా వాడడంలో నైపుణ్యాన్ని సాధించాలి. సంసృతం, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీల్లాంటి భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను రంగరించి కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు.
తెలుగు కవిత్వం తెలుగులోనే ఉండడం సమంజసం. ఢమఢమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం, రచన అయిపోదు. చదివే పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే నిజమైన కవిత్వం... ఇది ప్రతీ రచయిత, రచయిత్రి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయంలో ఒకటి... “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా వుంటుంది” కాబట్టి అందరికీ అర్ధమయ్యే భాషలో రాయడం మంచిదని నా ఉద్దేశం..
ఇకపోతే 3. కల్పనా శక్తి... : ఇది ముఖ్యమైంది.. రచయితకు ముఖ్యంగా కావలసింది భావనా బలం, కల్పనా శక్తి. అలాగని ఊహలోంచి ఊహ, ఊహలోంచి ఊహలోకి వెళ్ళిపోతూ పాఠకులను గందరగోళానికి గురిచేయకూడదు. సరళంగా, ప్రకృతి సహజంగా చెప్పగలగాలి. రచనకు ఒక తుది, మొదలూ రెండూ ఉండాలి అన్న విషయం జ్ఞప్తికి వుండాలి.. ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్ళిపోయి పాఠకుడిని గజిబిజి గల్లీల్లో వదిలేసి రాకూడదు. పదచిత్రాలే కవితకుకాని, రచనకు కాని ప్రాణం, వెన్నుపూసవంటివి....
ఇక 4. రూపం .. : వచన కవిత్వం అన్నారు కదా.. అని తుది, మొదలూ లేకుండా వాక్యాలు, వాక్యాలు రాసిపారెయ్యడం పరిపాటిగా మారింది నేటి తెలుగు దేశంలో. రాయాలి కాని దానికి ఒక నియమ, నిబంధన వుండాలి... చందో బందో బస్తులు తెంచుకుందంటే దానర్ధం ఒక రూపం, నిర్మాణం, లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. పక్కపక్కన పేర్చితే వ్యాసమయ్యే వాక్యాల సముహాన్ని, ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వం, రచన అనడం మహాపరాధం. చక్కని రూపం, లయ మంచి రచనకు, కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు అని ప్రతీ రచయిత, రచయిత్రి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయంలో ఇదికూడా ఒకటి...
ఇకపోతే చివరిది 5. వస్తువు.. : ఎంచుకున్న వస్తువు రచయిత మనసుకు బాగా దగ్గరదై ఉండాలి. ఎంత చిన్న విషయమైన రచన కావచ్చు. నిత్య జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటననుంచైనా రచన పుట్టవచ్చు. నిర్జీవ వస్తువులు కూడా రచనావస్తువులు కావచ్చు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం..
చివరగా ఒక్క విషయం.. రచయిత కాని, కవి కాని ఏకాంతంలో తన రాతలను మెరుగులు దిద్దుకొని, తాను పూర్తిగా సంతుష్టుడై సంతృప్తి చెందాకే చదువరుల ముందు ఉంచడం మంచిది.. తద్వారా తెలుగు పాఠకులకి పుంఖాలు, పుంఖాలుగా వెలువడున్న రచనాసంకలనాల సముద్రాల్లో కొట్టుమిట్టాడే బాధ తప్పుతుంది అని నా అభిప్రాయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో వంద పంక్తులు కూడా వచ్చేస్తాయి.. ఇక వుంటాను..
స్వస్తి.. __/\__
Written by : Bobby Nani