Saturday, January 28, 2017

4జి వాడే వినియోగదారులు అందరూ ఒక్క క్షణం ఇది చదవవలసినదిగా మనవి..



“వినాశకాలే విపరీత బుద్ధి..” 
కన్నీరు కారుస్తూ కనుమరుగవుతున్న చిరు జీవులు.. 
****************************************

4జి వాడే వినియోగదారులు అందరూ ఒక్క క్షణం ఇది చదవవలసినదిగా మనవి.. 

వేగం .. వేగం ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వేగమే .. పండు ముసలివారు దగ్గరనుంచి పడుచోడి దాకా ఈ వేగాన్ని అందుకోవాలని, ఆస్వాదిచాలని పరితపించే వాళ్ళే, ప్రయాత్నించేవాల్లె .. అందులో ముఖ్యమైనదే ఈ 4జి నెట్వర్క్.. వేగవంతమైన అంతర్జాలాన్ని అందిస్తున్న ఈ 4జి నెట్వర్క్ లో కొన్ని లోపాలు, నష్టాలు, ఉన్నాయని ఊహించకపోవడం చాలా బాధాకరం.. 

ఒక పుష్పం నుంచి మరో పుష్పం మీద వాలి, తమ కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం అనే ఓ అమోఘమైన సృష్టికార్యం మొక్కలలో జరుగుతోంది అన్న విషయం అందరికీ విధితమే. కాని తెలియని విషయం ఏంటంటే.. 

ఇలా ఉత్ప్రేరకాలుగా ఉంటూ, ఆయా మొక్కల ప్రత్యుత్పత్తికి బాటలు పరుస్తూ, తద్వారా సమస్త ప్రకృతి మాతను పచ్చగా కళకళలాడేలా, శోభాయమానంగా చేసి, మనకు, జంతువులకు, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించేలా చేస్తున్న ప్రతి కీటకమూ ఒక విధంగా ప్రాణప్రదాతలే... 

కానీ, ఇప్పుడు ఆ చిరు కీటకాలే చిన్నబోయి ప్రాణాలు విడుస్తున్నాయి. రసాయనాల వాడకం, కాలుష్యం, ముఖ్యంగా 4జి నెట్వర్క్ ల లాంటి మరెన్నో కారణాలతో మానవుని విపత్కర వింత చర్యలకు కన్నీరు కారుస్తూ, కనుమరుగైపోతున్నాయి.... 

తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు తదితర కీటకాలను 'పాలినేటర్స్‌' అని అంటాము.. పొలాల్లో ఉపయోగించే హానికార రసాయనాలు, వాయు కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, కరువు, కీటకాల నివాసాలను రూపుమాపడం తదితర కారణాల వల్ల పాలినేటర్స్‌ అనూహ్య స్థాయిలో మత్యువాత పడుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిరీష్ కుమార్ గారు గడచిన 24 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం లో IIT బొంబాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ Parth MN అనే ఇంటర్వ్యూలో మానవ ఆరోగ్యం, మరియు పర్యావరణం పై ప్రభావం చూపే కొన్ని ఆసక్తికరమైన నిజాలను తెలియజేసారు.. 

రానున్న 10 ఏళ్ళలో మన భారతదేశపు పంటలలో 31% పంటను నష్టపోతామని స్పష్టం చేసారు... ఇప్పటికే 80% పంట మన చేతికి వస్తుంది.. ఈ 4జి నెట్వర్క్ ఇలానే కనుక కొనసాగితే 49% పంట మాత్రమే చేతికి అందుతుంది.. మీకు తెలుసా ?? మనం తినే వంద రకాల ఆహార పదార్థాల్లో సుమారు డెబ్బైపదార్థాలు కేవలం తేనెటీగల వల్ల కలిగే మొక్కల పరాగసంపర్కం వల్లే ఉత్పత్తి అవుతున్నాయి అని.. ప్రాణాన్ని ప్రసాదించే చిరు జీవులను మన చేతులారా మనమే నాశనం చేస్తూ.. “వినాశకాలే విపరీత బుద్ధి..” అనే మాటను తూచాతప్పకుండా అక్షరాలా నిజం చేస్తున్నాం.. 

ప్రాణికోటికి 70 శాతం ఆహారాన్ని అందిస్తున్న ఈ పాలినేటర్స్‌ జీవన్మరణ సమస్య ... రసాయనాల వాడకం, మానవుని వికృత చేష్టలు, కాలుష్యం, ముఖ్యంగా 4జి నెట్వర్క్ ల వల్ల అనూహ్యంగా తగ్గుతున్న ఈ పాలినేటర్స్‌ సంఖ్య అమలు కాని ప్రభుత్వ నిబంధనలు, బరి తెగిస్తున్న అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు భారీ నుంచి అతిభారీ మూల్యం చెల్లించక తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు... 

ఒక సంస్థ నిర్వహించిన ప్రయోగంలో కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలిసాయి.. 
మన ఇంట్లో వైఫై నుంచి వచ్చే తరంగాల వల్ల “పాచి” ని 96 గంటల్లో నాశనం చెయ్యొచ్చు ... 

3జి నుంచి వచ్చే తరంగాలనుంచి అదే “పాచి” ని 72 గంటల్లో నాశనం చేయ్యోచ్చు.. 
4జి నుంచి వచ్చే తరంగాలనుంచి అదే “పాచి” ని కేవలం 42 గంటల్లో నాశనం చేయ్యోచ్చు.. అని ఓ ప్రముఖ సంస్థ అధ్యయనం చేసి నిరూపించింది.. అంతే కాదు మానవ డి.ఎన్.ఏ. లో కూడా కొన్ని మార్పులు వస్తున్నట్లు తెల్పింది.. దీనిపై మరింత అధ్యయనం అవసరమని త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేసింది.. 

ఒక తేనెటీగ తన మనుగడను ఎలా నిలుపుకోగలుగుతుందో తెలుసా...?? 

తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో ఆ జీవి చనిపోతుంది. ఇది తెలిసిన విషయమే..... కాని ఇది కాకుండా తేనెటీగలు మరో పద్దతిని కూడా అవలంభిస్తున్నాయి... ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్‌' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు..... అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు..... అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి.... తద్వారా వాటి చుట్టూ పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి.... ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి..... వాటి మనుగడకోసం అవి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ... మనిషి మాత్రం వాటిల్ని సింపుల్ గా చంపేస్తున్నాడు.. నిజానికి మనం చంపేది తేనెటీగలను కాదు.. మన ముందు ముందు తరాల సంతతిని .. 

స్వస్తి.. ___/\___
Written by : Bobby Nani

SOCOTRA (The Mysterious Island) from Bobby... 9th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

నువ్వు ఇక ఇక్కడ పని చెయ్యాల్సిన అవసరం లేదు… బాగా చదువుకో … నాకు తమ్ముడులా వుండు… ఈ ఇల్లు నీదనుకో పని వారిని వేరేవాళ్ళను మాట్లాడాను .. 
ఓ పెద్దావిడ భర్తా, పిల్లలు చనిపోయి ఒంటరిగా బ్రతకలేక బ్రతుకుతోంది.. ఆమె రేపట్నుంచి మన ఇంటికి వస్తుంది.. ఇక నీకు ఇవన్నీ వద్దు.. 
నువ్వేం చదవాలనుకుంటున్నావో చదువు.. నేను చదివిస్తాను అని చెప్పి ఆ రోజునుంచి నేను పూర్తిగా మారిపోయి … నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో ప్రేమాభిమానములు కలిగి జీవిస్తూ వున్నాను.. 
నా తల్లిదండ్రుల కోసం వెతకని చోటులేదు.. అయినా వారి ఆచూకి నాకు దొరకలేదు.. 
ఇలా వుండగా ఓ రోజు…

ఆ రోజు ఏమైందో చూద్దాం పదండి..
9th Part

మళ్ళి అతనికి ఒక కల వచ్చింది... ఆ కలలో తన సమస్యను తీర్చిన అఘోరా పదే పదే కనిపించాడు.. 

నీ అవసరం వచ్చింది… సహాయం చేస్తావా ?? అని అడుగుతున్నట్లు.. 

నేనేమో తప్పక చేస్తాను అన్నట్లు చెప్తున్నాను… 

దానికి ఆయన ….. అయితే నీలా కాకుండా ఓ నిర్భాగ్యుడిలా కదిలి రా .. 

ఏమిలేని వారు ఎలా ఉంటారో వారిలా నా దగ్గరకు రా.. నా దగ్గరకు వచ్చే నీ ఈ ప్రయాణంలో నువ్వు అనుభవించిన కష్ట, సుఖ, దుఃఖాలను నాకు వివరించు.. నేను అరేబియా సముద్రానికి దగ్గరవున్న ఒక విచిత్ర దీవిలో వున్నాను.. రా ఇక్కడకు రా .. అని పదే పదే చెప్తూఉంటాడు.. 

అందుకే నేను ఈ ప్రయాణంలో ఏమీ మీతో మాట్లాడకుండా మౌనంగా వున్నాను.. 

ఆయన ఎందుకలా అన్నారా ?? 

నేనేం చెయ్యగలను ఆయనకు సహాయం ?? 

ఇలాంటి ప్రశ్నలు నన్ను మౌనంగా ఉండేలా చేసాయి.. మీరంతా మాట్లాడక, అవన్నీ విన్నాక నా గురించి చెప్పాలనిపించి చెప్పాను.. 

చివరగా ఒక్కమాట : మీరు నన్ను మొదట చూసినప్పుడు “వాడు” అని సంబోధిస్తూ అసహ్యించుకున్నారు.. ఇంగ్లీష్ లో మాట్లాడాక “ఆయన” అంటూ గౌరవించారు.. ఇప్పుడు నా గురించి మొత్తం చెప్పాక “గొప్పవారు" అనే భావన మీ మనసులో వుంది కదా.. అంటే కళ్ళతో చూసే మనిషిని మనం అపార్ధం చేసుకున్నాం.. చెవులతో విన్న మనిషిని గౌరవించాం … మనసుతో చూసిన మనిషిని నమ్ముతున్నాం.. ఒక మనిషికే ఇన్ని రంగులను మనం అద్దుతున్నాం … ఇక్కడ చాలామంది భగవంతుడు లేడు .. 

వుంటే మనల్ని ఇలాంటి పరిస్థితికి తెచ్చేవాడా అని కొందరు అంటున్నారు.. 

భగవంతుడు వున్నాడు కనుకనే అందరం ప్రాణాలతో ఉన్నామని ఎవరూ అనట్లేదు.. 

స్వార్ధం అనే మేఘం మిమ్మల్ని కప్పివుంది.. దాని పొరను తొలగించి చూడండి .. మీకు సత్యం తెలుస్తుంది … అని చెప్పి వేగంగా వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు.. ఆ అపరిచితుడు.. 

ఇక ప్రసన్న కుమార్ భాటియా మాట్లాడుతూ .. అద్బుతమైన ప్రసంగాన్ని మనకు అందించారు మోహన్ గారు.. 

మీరు కాని ఈ లాంచీ ఎక్కకుంటే మేము చాలా మంచి విషయాలను కోల్పోయి వుండేవాళ్ళం.. కృతజ్ఞతలు తెల్పుతున్నాను.. అని చెప్పి .. 

ఇక ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. అందరూ ప్రశాంతంగా పడుకోండి.. రేపు వేకువనే లేచి ఇక్కడనుంచి ఎలా బయటపడాలో వెతుకుదాం అని చెప్పి.. ప్రస్తుతానికి సెలవ్ అంటారు…. 


అందరూ ఆ రాత్రివేళ కొంచం ఇబ్బందిగా వున్నా ఎలాగోలా నిద్రపోయారు.. 

వేకువన సూర్యభగవానుని తొలిసంధ్యా నులువెచ్చని కిరణాల తాకిడికి ఒక్కొక్కరుగా నిద్రనుంచి లేస్తున్నారు .. 

కళ్ళు తెరిచి చూడగానే చుట్టూరా విచ్చుకునే పుష్పాల సోయగాలు, అందమైన సముద్రతీరఅంచులు, రంగు రంగుల పక్షుల కిలకిలారావాలు, చెంగు చెంగుమంటూ గెంతుతూ వెళ్ళే అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, సెలయేటి సరాగాలు, జలపాతాల పరువల్లు, ఎప్పుడూ చూడని జలచరాలు, భూమిమీద మరెక్కడా కనిపించని అరుదైన జంతు, వృక్ష జాలం, ఇలా చెప్పుకుంటూ పోతే యెంతో అద్బుతంగా వుంది ఈ దీవి… రాత్రి చీకటిలో సరిగా కనిపించలేదు కాని ఓ అద్బుతమైన ప్రదేశానికి వచ్చి పడ్డాం అని అనుకుంటూ వుండగా అందరూ యెంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు ప్రసన్న కుమార్ భాటియాకు …


82 మంది ప్రయాణీకులు ఇరుక్కున్న ఆ దీవిలో బయటపడే మార్గాల కొరకు ఎనిమిది బృందాలుగా (ఒక బృందానికి పదిమంది చొప్పున) మారి తలో ఒక దిక్కున వెతుకుతున్నారు.. అక్కడ కలప చాలా వుంది పడవ తయారు చెయ్యాలంటే దాదాపుగా 9 పడవలు చెయ్యాలి… అదీకాక అందరం క్షేమంగా బయటపడతామన్న నమ్మకం లేదు.. 

ఇలాంటి ప్రశ్నలు ఎన్నోవుండగా.. 

ఏదో పెద్ద శబ్దం వినపడుతోంది అందరూ ఒక దగ్గరకు వచ్చి చూస్తూ వున్నారు.. అది హెలికాఫ్టర్ శబ్దం .. అందరూ సంతోషంగా పరిగెత్తుకుంటూ ఎత్తైన చోటుకు వచ్చి చేతులు ఊపుతున్నారు సహాయం చెయ్యండి అన్నట్లు.. కాని బాగా గమనిస్తే ఆ హెలికాఫ్టర్ అంత సౌకర్యంగా వున్నట్లు లేదు.. నియంత్రణ కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.. వెనుకనుంచి ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి.. గిరికీలు కొడుతోంది ఆ హెలికాఫ్టర్.. 

అయ్యో పాపం అనుకుంటూ చూస్తున్నారు ఆ ప్రయాణీకులు .. 

చూస్తూ ఉండగానే పెద్ద శబ్దంతో పేలి పోయింది ఆ హెలికాఫ్టర్.. అది పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు పేరాచూట్ లోనుంచి ఒక వ్యక్తి దూకేసాడు.. తను తిన్నగా వారు ఉంటున్న దీవిలోకే వచ్చి పడ్డాడు.. వారి అందరినీ చూసి తను చాలా ఆనందపడి .. వెంటనే స్పృహ కోల్పోయాడు.. 


అక్కడవున్నవారంతా తనని తీసుకువచ్చి కొంచం విశ్రాంతిని ఇవ్వగానే తను మళ్ళి మెల్లిగా కళ్ళు తెరిచి మాట్లాడటం మొదలు పెట్టాడు.. ఇక ఒకరి గురించి మరొకరు చెప్పుకొని బాదపడ్డారు.. అప్పుడు ఆ పేరాచూట్ అతను … నా దగ్గర శాటిలైట్ ఫోన్ వుండాలి .. వెంటనే దాన్ని తీసుకురండి నేను సమాచారం అందిస్తాను మనల్ని వారు కాపాడుతారు.. అని అంటాడు… ఆ మాటలకు ఊపిరి తీసుకున్న అక్కడవారు .. దేవుడు నీ రూపంలో ఇక్కడకు వచ్చాడేమో అంటూ తనని పొగడ్తలతో ముంచేస్తారు.. 

తను శాటిలైట్ ఫోన్ ద్వారా అత్యవసర సహాయ సమాచారాన్ని అధికారులకు తెల్పుతాడు.. త్వరలో ఇక్కడకు ఒక నౌక వస్తోందని వాళ్ళు తిరిగి సమాచారం అందిస్తారు.. ఇక అందరిలో సంతోషం వెల్లివిరుస్తుంది .. ఆటలు, పాటలు సాగుతున్న సమయంలో … 

దూరాన ఉన్నటువంటి ఓ చెట్టు గుబురుల మధ్యన ఓ వికృత ఆకారంలో వున్న మనిషి ఆకారాన్ని చూస్తాడు ప్రసన్న కుమార్ భాటియా మొదటి కుమారుడు అయిన ఆకాష్.. 

ఉలిక్కిపడి మళ్ళి చూడగానే అక్కడ ఏమి కనిపించదు… 

బ్రమ అనుకోవడానికి లేదు .. ఎందుకంటె అంత స్పష్టంగా ఆ వికృత ఆకారాన్ని చూసాడు అతడు.. మళ్ళి ఈ విషయం చెప్పి అందరి ఆనందాన్ని పాడుచెయ్యడం ఇష్టం లేక దాని గురించి ఆలోచించ సాగాడు.. 

ఏంటి ఆ ఆకారం ?? 

అదేమన్నా హానికరమైనదా ?? ఇలాంటి ప్రశ్నలతో తనలో తనే మదనపడుతూ వున్నాడు.. చీకటి పడుతోంది.. 

ఆకాష్ అందరినీ మంట మండుతున్న దగ్గరకు చేర్చి .. తను నిలబడి ఒక ముఖ్య విషయాన్ని మీకు చెప్పాలని ఇక్కడకు రమ్మన్నాను.. అందరూ చాలా సంతోషంగా వున్నారు.. ఈ సంతోషంలో మీరు అజాగ్రత్త గా కూడా వుంటున్నారు.. ఇది మనకు తెలియని ప్రదేశం.. కొత్త ప్రదేశం .. ఇక్కడ ఏమున్నాయో మనకు తెలియదు.. అందంగా వుంది.. 

కాని అందం వున్నచోట ఆపద కూడా పొంచి వుంటుంది.. ఈ సంతోషం మన మధ్య ఎప్పటికీ ఉండాలంటే అందరం ఆ నౌక వచ్చే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి .. దయచేసి నా మాటను వినండి అని ప్రసంగిస్తాడు.. 

అందరూ లేచి నిలబడి … తప్పకుండా మీ మాటను మేము వింటాము .. మంచికోసమే కదా మీరు చెప్పారు అని అంటారు అందరూ… ఇక అందరూ వెళ్లి ఆ గుడారాలలో పడుకోవడానికి వెళ్తారు.. కాని ఆకాష్ మాత్రం ఆ మంట దగ్గరే కూర్చుని ఆలోచిస్తూ వుండగా.. ప్రసన్న కుమార్ భాటియా .. మిగిలిన తన ఇద్దరు కుమారులు అక్కడకు వచ్చి ఏమైంది అని అడుగుతారు.. 


ఈ లోపు ఆ అఘోరా కోసం వెళ్తున్న మోహన్ అనే సాఫ్ట్ వేర్ అతను కూడా అక్కడకు వచ్చాడు.. అందరూ కలసి యెంత అడిగిననూ…. 

ఏం లేదు …. మనమంతా తెలియని ప్రదేశంలో వున్నాం కదా.. మన లాంచీ ఇదే ప్రదేశంలో ప్రమాదానికి గురైంది.. అలానే నిన్న హెలికాఫ్టర్ కూడా ప్రమాదానికి గురైంది.. ఎందుకో ఈ ప్రదేశం ప్రమాదాలకు నిలయం లా నాకు అనిపించింది.. అందుకే అందరినీ హెచ్చరించాను అని చెప్తాడు ఆకాష్.. 

సరేరా ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకు.. అని లేచి వెళ్తాడు ప్రసన్న కుమార్ భాటియా.. తమ్ముళ్ళు కూడా అదే చెప్పి నిద్రొస్తుంది అన్నయ్య బాయ్ ..గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతారు.. 

అందరూ వెళ్ళాక దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అఘోరా కోసం వెళ్తున్న అపరిచితుడైన మోహన్… 

ఏంటి ఆ వికృత ఆకారాన్ని చూసావా ?? అంటాడు .. 

ఆకాష్ ఆశ్చర్యంగా తనవైపు చూస్తూ మీకెలా తెలుసు ..! అని అంటాడు.. 

నేను చూసాను అని చెప్తాడు… 

అది ప్రమాదకరమైనదా ..?? 

ఏమో నాకు తెలియదు ఆకాష్ … 

కాని అది మన అందరి చుట్టూనే తిరుగుతోందని మాత్రం చెప్పగలను అంటాడు మోహన్.. 

ఇప్పుడేం చేద్దాం ..?? అంటాడు ఆకాష్.. 

ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే చకచకచకమని చాలా వేగంగా వారి వెనుక ఎవరో పరిగెత్తిన చప్పుడు వినిపిస్తుంది.. 

వెనక్కి తిరిగి చూడగా.. దూరాన ఆ వికృత ఆకారం వెళ్ళడం గమనిస్తారు ఇద్దరూ … ఇక ఆలస్యం చెయ్యకుండా వెంటనే లేచి దాన్ని వెంబడిస్తారు … కొంత దూరం వెళ్ళాక దట్టమైన ఆ దీవి మధ్య భాగం లో వున్నట్లు వారికి అనిపిస్తుంది... చేతిలో వున్న టార్చ్ తో చుట్టూరా వెతుకుతారు.. ఎక్కడా ఏమి కనిపించదు…


తిరిగి రావాలనుకుంటుండగా ఓ విచిత్ర శబ్దం వినపడుతుంది.. ఆ శబ్దం తిన్నగా వారు ఉంటున్న ప్రదేశానికి కొన్ని గజాల దూరంలో నేల అడుగుభాగం నుంచి వస్తుంది.. వారు ఇద్దరూ ఆశ్చర్యంతో లోపలకు ఎలా వెళ్ళాలో వెతకనారంభిస్తారు .. 

ఈ లోపల దూరానా ఒక చిన్న పడవ రావడం గమనిస్తారు.. అందులో ఓ లాంతరు వెలుగుతో ఆ పడవ వీరు ఉంటున్న దీవి వైపుగా మెల్లిగా కదులుతూ వస్తోంది.. 


ఇద్దరిలో ఒకటే ఆలోచన.. 

ఇంత అర్ధ రాత్రి వేళ పడవలో ఎవరు ఇక్కడకు వస్తున్నారు..?? 

ఎందుకు వస్తున్నారు ?? 

అసలు వారు ఎవరు ?? 

ఇలాంటి ఆలోచనలు ఎన్నో వారి మస్తిష్కంలో పరుగులు తీస్తున్నాయి.. 

ఇక్కడేదో జరుగుతోంది .. 

వెంబడించిన ఆ వికృత రూపం, 

నేల అడుగునుంచి వస్తున్న శబ్దం, 

నిర్మానుష్యమైన ఈ దీవిలో ఈ అర్ధ రాత్రివేళ ఓ పడవ… 

ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ సమస్య వుంది అని ఆ సాఫ్ట్ వేర్ మోహన్ అంటాడు.. 

నిజమే…. ఇదేంటో మనం కనిపెట్టాలి ... 

అలా ఆ పొదల మాటుకు వెళ్లి గమనిద్దాం పదండి అని ఆకాష్ అంటాడు.. (వీరు ఆ సముద్రానికి కొంచం ఎత్తులో వున్నారు.. ) అనుకున్నట్లే ఇద్దరూ ఆ సమీప పొదల మాటుకు వెళ్లి చూస్తూ వుండగా .. పడవ ఆ దీవికి వచ్చి ఆగింది..

To be continued …

Written by : BOBBY

Friday, January 27, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 8th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

మూడవ రోజు : నా మంచం పై నేను పడుకొని వున్నాను… టైం ఉదయం 10 అవుతోంది.. కాని ఎంతకీ లేవట్లేదు.. పనిపిల్లాడు వచ్చి పనులు చక చకా చేసేసి నాకు తినడానికి టేబుల్ మీద పెట్టి లేపడానికి వస్తున్నాడు..

మూడవరోజు ఏమైందో అని చాలా టెన్షన్ పడుతున్నారా .. . ?? ఆలస్యం ఎందుకు పదండి ...

8th Part

సార్ ఏంటి ?? ఇంకా లేవలేదు .. ఈ పాటికే ఎప్పుడూ లేసేస్తారు కదా.. ఇవాళ ఏమైంది..అని ఆ పనిపిల్లాడు అనుకుంటూ ... 

నన్ను లేపే ప్రయత్నం చేస్తున్నాడు.. 

సర్, సర్ లేవండి …. టైం చుడండి 10 దాటిపోతుంది.. 

అని చాలాసార్లు లేపడానికి ప్రయత్నించిననూ నేను లేవకపోవడంతో .. 

ఏంటి యెంత లేపినా లేవట్లేదు ?? అని అనుకుంటూ ఆలోచనలో పడిపోతాడు.. 

ఇక ఆగలేక పక్కన ఇంట్లో నివాసముంటున్న నా స్నేహితుడికి ఈ విషయం చెప్పాలి అంటూ వెళ్తాడు.. 

పక్కన ఇంటి స్నేహితుడు : ఏంటి బాబు ?? ఇలా వచ్చావ్ లేచాడా మీ మారాజు.. 

పనివాడు : లేదు అన్నా, యెంత లేపినా లేవట్లేదు … అందుకే మీ దగ్గరకు వచ్చాను.. మళ్ళి లేట్ అయితే ఎందుకు లేపలేదు ? అని కొడతాడు .. దయచేసి రండి అన్నా.. వచ్చి లేపి వెళ్ళిపొండి …

పక్కన ఇంటి స్నేహితుడు : వాడు రోజు రోజుకీ వెధవలా తయారు అవుతున్నాడు.. పద వస్తున్నా .. 

పనివాడు :సరే అన్నా.. 

పక్కన ఇంటి స్నేహితుడు : రేయ్ ఏంటి రా అంత పడి పడీ నిద్రపోతున్నావ్ అంట… 

లేవరా బాబు.. టైం చూడు .. 

ఏంటి ?? ఎప్పుడూ లేనిది యెంత లేపినా లేవట్లేదు.. ?? 

ఏమైంది ?? 

(అని ముక్కు దగ్గర చెయ్యి పెట్టగాని శ్వాస రాకపోవడం గమనించాడు ఆ పక్కన ఇంటి స్నేహితుడు..) 

అయ్యో ఏంటి ఈ ఘోరం వీడికి శ్వాస ఆడట్లేదు.. 

గుండె కూడా కొట్టుకోవట్లేదు.. 

శరీరం చాలా చల్లగా మారిపోయింది.. .. (భయపడుతూ, టెన్షన్ పడుతూ) అరేయ్ బాబు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చెయ్ అని పెద్దగా అరుస్తాడు.. 

పనివాడు : బోరున ఏడుస్తూ.. (అంబులెన్స్ కి ఫోన్ చేసాడు ).. 

కాసేపట్లో అంబులెన్స్ రావడం, హాస్పిటల్కి తీసుకుపోవడం కూడా జరిగింది.. ఏవేవో పరిక్షలు చేసిన డాక్టర్ బయటకి వచ్చి ఇతను చనిపోయి చాలా గంటలు అయిపోయింది .. అప్పటికీ గుండెను ఎన్నో రకాలుగా స్పందించి చూసాం.. లాభం లేదు.. 

పక్కన ఇంటి స్నేహితుడు : (ఏడుస్తూ ) ఇలా ఎలా జరిగింది డాక్టర్ .. 

డాక్టర్ : తను నిద్రలోనే బాగా భయపడినట్లు వున్నాడు.. మధ్య రాత్రిలోనే ప్రాణం పోయింది.. 

పక్కన ఇంటి స్నేహితుడు : నిద్రలో భయపడినా మరీ చనిపోయేంతలా భయపడతారా డాక్టర్ .. 

డాక్టర్ : అవును అండి చాలా స్వల్ప కేసులు చూసాము ఇలాంటివి .. తన గుండె కూడా చాలా బలహీనంగా వుంది .. అందుకే తను ఇంత తక్కువ వయస్సులోనే చనిపోయాడు.. మీరు ట్రీట్మెంట్ కి అయిన డబ్బు కట్టేసి బాడీని తీసుకువెళ్ళండి .. 

పక్కన ఇంటి స్నేహితుడు : అలాగే డాక్టర్.. 

ఇంటికి నా శవాన్ని తీసుకువచ్చారు.. చాలా వేగంగానే నా మరణ వార్త అందరికీ తెలిసిపోయింది.. నా శవం పక్కనే కూర్చుని చూస్తున్నాను… 

చాలా సమయం అయింది .. నా పక్కన ఇంటి స్నేహితుడు తప్ప ఇంకెవ్వరూ అక్కడ లేరు.. 

కనీసం దారినపోయే వారు కూడా అక్కడ ఆగకుండా .. చూడకుండానే వెళ్ళిపోతున్నారు.. వెళ్తూ వెళ్తూ అబ్బా పోయాడా ఈడు.. దరిద్రం వదిలిపోయింది ఈ కాలనీకి..అని అంటూ 

డబ్బు, డబ్బు అంటూ పిశాచిలా బ్రతికాడు ఇప్పుడు నెత్తిన పెట్టుకు పోయాడా … అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. 


సరే ఆఫీసులో ఎవరన్నా బాధపడుతున్నారేమో అని అక్కడకు వెళ్లాను.. 

వాళ్ళు అందరూ అక్కడ ఎవరి పనుల్లో వారు ఉంటూ మధ్య మధ్యలో నా గురించి మాట్లాడుకుంటూ వున్నారు.. ఇక ఇవాల్టి నుంచి ఆ మోహన్ గాడి గోల లేదు.. ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకోవచ్చు.. వాడి స్థానంలోకి ఎవరు వెళ్ళాలో నిర్ణయించండి మంచి వారిని ప్రమోట్ చెయ్యండి … అని మాట్లాడుకుంటూ వున్నారు.. 

కార్ డ్రైవర్ .. కార్ లో వున్న నా సూట్ కేస్ లో వున్న డబ్బును తీసుకొని వెళ్ళిపోయాడు.. ఇలా నాకు తెలిసిన వారందరూ నా గురించి ఇంత నీచంగా మాట్లాడుకుంటూ వున్నారు.. 

తిరిగి తిరిగి మళ్ళి నా శవం దగ్గరకు వచ్చాను.. 

నా పక్కన ఇంటి స్నేహితుడు తన భార్యతో మాట్లాడుతున్నాడు.. వాడు పోయాడు ఇక ఆస్తి మొత్తం మనదే… వాడికంటూ ఎవరూ లేరు.. చాలా తెలివిగా వ్యవహరించి మొత్తం ఆస్తి చేజిక్కించుకోవాలి.. వాడి దహన సంస్కారాలు మనమే చేసేసి అందరిని నమ్మించి మనం స్థిరపడిపోవాలి .. 

అని మాట్లాడుకుంటూ వున్నారు…. ఇవన్ని విని, చూసి అలా బాధపడుతూ కూర్చున్న నాకు ఒకరు గుర్తుకు వచ్చారు.. వాడే నా పని పిల్లాడు… 

వెంటనే వాడిని వెతికాను …. వాడు తన వూరు వెళ్ళాడని, అక్కడకు వెళ్లాను.. వాళ్ళ అమ్మ, నాన్న వాడితో నా గురించి మాట్లాడుతున్నారు.. 

అరేయ్ మీ సర్ చాలా దుర్మార్గుడు కదా.. మంచి శాస్తి చేసాడు ఆ భగవంతుడు .. నిన్ను యెంత క్షోభ పెట్టాడు వాడు.. అని మాట్లాడుతుండగా... 

అమ్మా నన్ను అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు .. అక్కడ నా అవసరం చాలా వుంది.. కార్యాలు అయిన తరువాత నేను వస్తాను .. అని ఆ పనిపిల్లాడు అనగానే .. 

అలాంటివాడిదగ్గరకు వెళ్ళడమే మహా పాపం…. అలాంటిది నువ్వు కార్యం కూడా చేస్తావా .. ఏం వద్దు.. నోరు మూసుకొని వెళ్లి ఇంట్లో పడుకో… రేపు వెళ్లి ఏదైనా పని చూసుకొని... చదువుకో.. ఇక ఇదంతా మర్చిపో.. అని చెప్తారు.. 

ఆ పిల్లాడు లోపలకు వెళ్లి తలుపువేసుకున్నాడు.. 

ఇక నేను వెళ్ళబోతూ, ఎందుకో ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడో ?? చూసి వెళ్ళాలని అనిపించింది.. లోపలకు వెళ్లాను … ఆ పిల్లాడు నా ఫోటో పట్టుకొని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు.. 

మీరు నాకు క్రమం తప్పకుండా జీతం ఇచ్చారు .. మంచి భోజనం పెట్టారు, బాగా చదివించారు.. మీ ఇంట్లో నాకు చోటు కల్పించి నన్ను ఒక తమ్ముడులా చూసుకున్నారు .. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లి బ్రతకాలి .. నాకు వున్న ఒక్కగానొక్క మార్గదర్శి మీరు .. మీరే నన్ను వదిలి వెళ్ళిపోయారు .. ఇప్పటిదాకా మీరు నాకు అన్నం పెట్టారు… మరచిపోలేకున్నాను మిమ్మల్ని.. మీరు చనిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను .. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్లాడి నిష్కల్మషమైన మనస్సుకు నేను చలించిపోయాను.. 


ఇంతమంది నన్ను అసహ్యించుకుంటుంటే అందరికన్నా ఎక్కువ బాధపెట్టిన ఈ పిల్లాడు నన్ను ఇంతలా అభిమానిస్తున్నాడే.. వీడి మనసులో నా స్థానం నేను తెలుసుకోలేకపోయానే.. 

నేను చేసిన అన్యాయాల్ని అన్నిటిని మర్చిపోయి ఇలా మాట్లాడే ఓ నమ్మకమైన పిల్లాడిని నేను చాలా కష్టపెట్టానే అని కుమిలిపోయాను.. 

ఇక అక్కడనుంచి నా శవం దగ్గరకు వచ్చాను.. నన్ను తీసుకుపోవడానికి ఏ ఒక్కరూ కూడా రాలేదు.. ఆఖరికి డబ్బులు ఇస్తేనే వేరేవాళ్ళు వచ్చి మోశారు… 

అప్పటికే సంధ్యాస్తమయం కావస్తోంది.. నాకేమో భయం వేస్తోంది.. నేను నిజంగానే మరణించాన?? 

ఏంటో నాకే అయోమయంగా వుంది.... 

ఒకవేళ నాకు మరో జీవితం కనుక ఉంటే ఇలాంటి మరణం మాత్రం నాకు వద్దు.. 

నేను యెంత తప్పు చేసానో నాకు తెలిసింది.. డబ్బే ప్రధానమనుకున్నాను .. 

నిజమే ఈరోజు ఆ డబ్బే నన్ను నలుగురు మనుషులను కూడా మాట్లాడి సాగనంపుతోంది .. 

ఆ డబ్బే నా మిత్రుడను శాసిస్తోంది.. 

ఆ డబ్బే నా పదవిని మరొకరికి అందజేసింది.. 

ఆ డబ్బే నన్ను మోసం చేసి డ్రైవర్ పారిపోయేలా చేసింది.. 

కాని ఆ డబ్బు నా పని పిల్లాడిని మాత్రం తాక లేక పోయింది.. 

నా వారు ఎవరో, పరాయివారు ఎవరో, ఆ డబ్బే నాకు చూపించింది.. 

నిజమైన మానవ సంబంధాల, ప్రేమాభిమానములకు డబ్బు తలవంచక తప్పదని తెలుసుకున్నాను.. 

అని నాలో నేను అనుకుంటుండగా నా దేహాన్ని గుంటలో పెట్టి మట్టి కప్పేసారు… నాకు ఊపిరి ఆడనంతపనైంది.. నేను ఆ గుంటలో గిల గిల కొట్టుకుంటున్నాను.. కళ్ళు తెరవలేక పోతున్నాను .. మొత్తం మట్టితో కప్పబడి వున్నాను.. శ్వాస ఆగిపోతున్న సమయంలో… ఎవరిదో ఓ చెయ్యి …… నా చేతిని పట్టుకొని అమాంతం పైకి లాగింది.. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకున్నాను.. మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను.. ఎదురుగా ఆ అఘోరా వున్నాడు..

మనసుతేలికైపోయింది.. 

అమాంతం ఆయన కాళ్ళపై పడిపోయాను… ఆయన నన్ను లేపి మొత్తానికి నీ పొరపాటును నువ్వు తెలుసుకొని ఈ కార్యాన్ని సాధించావ్ … ఇక నీకు ఎలాంటి సమస్యా లేదు.. 

వెళ్లి నీ జీవితాన్ని ఆనందించు అని చెప్పాడు… ఆ క్షణాన నాకు ఎందుకో నా జీవితాన్ని ఆనందించాలని అనిపించలేదు.. ఆయనతోనే ఉండిపోవాలనిపించింది.. అదే మాట ఆయనకు నేను చెప్పాను.. దానికి ఆయన నవ్వుతూ నీ అవసరం నాకు పడితే తప్పక నిన్ను కలుసుకుంటాను అని చెప్పారు.. 

నాకు ఒక సందేహం వుంది తీర్చండి అని నేను అడగగానే…. నిరభ్యంతరంగా నీ సందేహాన్ని అడుగు అని చెప్పారు.. 

నిజంగానే నేను చనిపోయి పూడ్చిపెట్టబోయానా ?? 

ఇదంతా ఏంటి ?? అని అడుగగా.. 

ఇదంతా నీకు వస్తున్నటువంటి భవిష్యత్తులో జరగబోయే కల యొక్క నిజరూపం.. ఆ భయంకరమైన జరగబోయే కలను నేను మూడు భాగాలుగా విభజించి నిన్ను నువ్వు తెలుసుకునే లా పరిచయం మాత్రమే చేసాను.. నీవు నీ తప్పును తెలుసుకోకుండా వుండి వుంటే మాత్రం భవిష్యత్తులో ఆ కల నిన్ను లొంగదీసుకొని నీ ప్రాణాన్ని బలి చేసుకునేది.. అది జరగకుండా నేను వర్తమానాన్ని, భూత కాలాన్ని నీకు పరిచయం చేసాను.. నువ్వు నీ తప్పు తెలుసుకునేలా చేసాను.. నీ మనసు మునుపటిలా మారితే మళ్ళి నిన్ను ఆ కల వెంటాడుతుంది.. ఇక నీ మనసు అలా మారదని ఆశిస్తున్నాను.. అని అంటాడు అఘోరా.. 

మరో చిన్న సందేహం అడగాలని వుంది .. 

అడుగు.. 

ఈ మూడు రోజులు నేను చుసినదంతా నిజమేనా.. ?? వాళ్ళ మనస్తత్వాలు నిజమైనవేనా.. ?? 

నువ్వు చూస్తున్నది నిజమైనప్పుడు అవి ఎలా కల్పితాలు ఉంటాయి.. అంతా నిజం.. భూత కాలము, వర్తమానము నిజం.. భవిష్యత్తు మాత్రం నీ చేతుల్లోనే వుంది.. అని చెప్పాడు.. 

ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా ? అని అడుగగా.. 

లేవు అని చెప్పాను.. 

శుభం .. వెంటనే బయల్దేరు.. ఇక ఇక్కడికి రావాలనే ఆలోచన కూడా చెయ్యకు.. ఈ “అస్తమయ పురం” నిబంధనలు నీకు గుర్తు వున్నాయ్ కదా.. జాగ్రత్త …. కోరి కష్టాలు తెచ్చుకోకు.. ఇది సమస్యలు ఉన్నవారికే సంజీవిని.. లేనివాళ్ళకు మరో సమస్య అవుతుంది.. చెప్పింది అర్ధం చేసుకొని వెనక్కి చూడకుండా వెళ్ళు.. 

వెంటనే …. 

అని కోపంగా కొంచం అరిచినట్లు చెప్తాడు.. 

ఇక నేను అక్కడనుంచి వచ్చేసాను.. నా ఇంటికి వెళ్లేసరికి రెండు రోజుల సమయం పట్టింది.. ఓ అర్ధ రాత్రి వేల ఇల్లు చేరుకున్నాను.. తలుపు దగ్గరకు వచ్చి బెల్ మొగించగానే నా పనిపిల్లాడు తలుపు తెరిచాడు.. వాడిని చూడగానే అమాంతం కౌగిలించుకోవాలని అనిపించింది.. కాని ఇలా కాదు అని మనసులో అనుకోని.. వెళ్లి నిద్రపోయాను.. 

చాలా రోజులతరువాత ఓ ప్రశాంతమైన, సుధీర్గమైన ఘాడ నిద్రను నేను అనుభవించాను..

ఉదయాన పని పిల్లాడికన్నా ముందుగానే లేచాను.. నా పనులు అన్నీ నేను చక చకా చేసుకొని వాడిని తీసుకొని కార్లో వారి వూరికి వెళ్లాను.. 

వాళ్ళ అమ్మకు దగ్గర వుండి ట్రీట్మెంట్ చేయించి వారికి ఏ లోటు లేకుండా చేసి డబ్బు సాయం కూడా చేసి .. అమ్మా మీ అబ్బాయిని నేను దత్తత తీసుకుంటున్నాను.. 

వీడి భాద్యత ఇక నాది మీరేమంటారు ?? 

మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరకు పంపిస్తాను .. అని అనగానే .. 

అంతకన్నా భాగ్యమా అయ్యా .. తీసుకువెళ్ళండి.. వాడు బాగుంటే అదే చాలు అని చెప్తుంది ఆ పని పిల్లాడి అమ్మ.. 

ఇదంతా చూస్తున్న ఆ పనిపిల్లాడికి ఏమి అర్ధం కావట్లేదు.. 

ఇక ఇంటికి తీసుకు వచ్చిన తరువాత వాడు పని చేయ్యబోతుంటే.. 

నువ్వు ఇక ఇక్కడ పని చెయ్యాల్సిన అవసరం లేదు… బాగా చదువుకో … నాకు తమ్ముడులా వుండు… ఈ ఇల్లు నీదనుకో పని వారిని వేరేవాళ్ళను మాట్లాడాను .. 

ఓ పెద్దావిడ భర్తా, పిల్లలు చనిపోయి ఒంటరిగా బ్రతకలేక బ్రతుకుతోంది.. ఆమె రేపట్నుంచి మన ఇంటికి వస్తుంది.. ఇక నీకు ఇవన్నీ వద్దు.. 

నువ్వేం చదవాలనుకుంటున్నావో చదువు.. నేను చదివిస్తాను అని చెప్పి ఆ రోజునుంచి నేను పూర్తిగా మారిపోయి … నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో ప్రేమాభిమానములు కలిగి జీవిస్తూ వున్నాను.. 

నా తల్లిదండ్రుల కోసం వెతకని చోటులేదు.. అయినా వారి ఆచూకి నాకు దొరకలేదు.. 

ఇలా వుండగా ఓ రోజు…

To be continued …

Written by : BOBBY

Thursday, January 26, 2017

“గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...



మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...

నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ?? 

నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది .. 

ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. 
ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. 
మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట.. 

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. 
నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ...

ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... 
అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు.. 

ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం.. 

స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్ లో ఒక్క ఉపాధ్యాయుడు అయినా ఒక చిన్న ప్రసంగాన్ని చేసి అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ఎప్పుడొచ్చింది ? .. ఎందుకొచ్చింది ? .. ఈరోజుకు ఎన్ని సంవత్సరాలు అయింది అనే విషయాలను తెలియజేసి వుంటే నేడు విద్యార్ధులకు ఈ దుస్థితి పట్టేది కాదు.. 
దయచేసి ఇకనుంచి అయినా విద్యార్ధులకు ఒక స్పష్టతను, అవగాహనను కలిగించమని ప్రార్ధిస్తున్నాను.. 

ఇకపోతే మన భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు ఈ “గణతంత్ర దినోత్సవం” ... . భారత దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది.. కానీ, ఈ జనవరి 26, 1950 న భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించి మన దేశం పూర్తి గణతంత్ర దేశం అయిన రోజు ఈ రోజు.. 
ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయింది.. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు....

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ గణతంత్ర దినోత్సవమును జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు అని మనవి చేసుకుంటూ ..

దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడను ప్రార్దిస్తూ..

మిత్రులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...

జైహింద్ ___/\___

Tuesday, January 24, 2017

“రంగుల ప్రపంచం”..




ఒక రైతుకు “వరి” శిక్ష... మరో రైతు నెత్తిన “పత్తి” కత్తి... ఇంకో రైతుకు నిలువెల్లా “కూర” గాయాలు... మరో రైతుకు భారంలా “వేరుశనగ”... ఘోరంగా “ఉల్లి”... చేదుగా “చెరుకు”... ఏ రైతును చూసినా కష్టమే.. ఏ సాగును చూసినా నష్టమే.. పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ... ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు... ఇది ఒక్క ఏడాది కథ కాదు... ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా సాగుతున్న కన్నీటి వ్యథ... ఈ వ్యథను చుసిన, విన్న వారి కళ్ళు చమర్చక మానవు.. అలాంటి ఒక కన్నీటి బిందువే నా ఈ చిరు కవిత.. 

ఈ అశ్రువుల అక్షరాలను రైతుకి అర్పిస్తూ.. “రంగుల ప్రపంచం” రాస్తున్నాను.. చదివి అభిప్రాయం చెప్పగలరు.. 

“రంగుల ప్రపంచం”..
*************

పోగవుతున్న భావాలను 
పదిల పరిచేందుకు, 
పెన్ను, కాగితం తీసుకున్నా..! 
వసంతాన్ని కౌగిట చేర్చి,
చిగురాకుల సందుల్లో చిందులేస్తూ,
కానరాని కోకిలమ్మ
సరాగాలు పాడే తీరును 
రాద్దామనుకున్నా..!
కాని,
భుజాన నాగలిని నిలిపి..
ఒళ్లంతా కమిలిన గాయాలతో,
కాడెద్దులా మారి దున్నుతున్న
ఓ రైతు కనిపించాడు.. !
రక్తంతో తన పొలాన్ని తడుపుతూ.. 
కన్నీళ్ళతో చేనును దున్నుతూ ..
అన్నపూర్ణను అందరికీ అందించాలనే, 
తపనతో భగీరధునిలా మారిన ఆ 
సంకల్పబలాన్ని చూస్తున్న నాకు 
అన్నం “మేకు” అయిందనో, 
“ముద్ద” అయిందనో, 
ప్రక్కకు నెట్టే నేటి మనుషుల 
మనస్తత్వ పోకడలు ఒక్కసారిగా
జ్ఞప్తికి వచ్చాయి.. !!
నీటికోసం నింగివంకా, 
పంటకోసం నేలవంకా, 
ఆశపడుతూ..పరుగుపెడుతూ.. 
నేలతల్లిని నమ్ముకొని,
ఉన్నదంతా అమ్ముకొని, 
బిడ్డల కన్నా “చేనే” ప్రాణమనుకొని, 
పొలాల మధ్య తిరుగుతూ 
బక్కచిక్కిన ఈ కర్మలోకపు 
కర్షకుడి కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించట్లేదు .. ఈ నాడు .. 
నీరుతో తడవాల్సిన భూములు 
రైతుల కన్నీళ్ళతో తడుస్తున్నాయి.. 
పచ్చగా పలకరించాల్సిన పంటలు 
బీడులై దీన స్థితితో చూస్తున్నాయి.. 
నిజంగానే ఇదో “రంగుల ప్రపంచం”.. 
“విద్య” వ్యపారమౌతోంది.. 
“వైద్యం” అంగట్లో వస్తువౌతోంది.. 
“బంధాలు” సెంటిమెంట్లు అవుతున్నాయి.. 
“అమ్మ” అద్దెకు దొరుకుతోంది.. 
“నాన్న”కు చిరునామానే అవసరం లేదు..
“క్రమశిక్షణ మా ప్రత్యేకత” అన్న నినాదం.. 
“కంప్యూటర్ మా లక్ష్యం” గా మారుతోంది.. 
“జాతీయగీతం” పరదేశం ఆలాపన చేస్తుంది.. 
దేశాన్ని అమ్మేవారు “దేశభక్తులు” అయ్యారు.. 
పొలాలు “స్మశానాలు” అవుతున్నాయి.. 
ఇక్కడ 
అన్నం, నీళ్ళు దొరకవు.. 
సెల్ పోన్లు, కలర్ టీవీలు, 
టాబ్ లు, కార్లు చౌకగా దొరుకుతాయి.. 
ప్రేమ అమ్మబడుతుంది “తూకాని”కి.. 
రక్తం చిమ్మబడుతుంది “ఉత్త పుణ్యానికి” 
అదో మాయా ప్రపంచం.. 
అదే “రంగుల ప్రపంచం”..

Written by : Bobby

Saturday, January 21, 2017

ప్రపచం చూడబోతోంది ...



ప్రపచం చూడబోతోంది ... 
******************

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఏకంగా 103 ఉపగ్రహాలను ఒకే ఒక్క రాకెట్‌ ద్వారా పంపబోయే మొట్టమొదటి దేశంగా మన భారతదేశం మొదటి స్థానంలో నిలవనుంది. ప్రతీ భారతీయునికి అందబోయే ఓ గొప్ప గౌరవం ఇది .. అందులో మన తెలుగు దేశంలో ఈ రాకెట్ పంపడం.. ముఖ్యంగా నా నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట నుంచి పంపడం నాకు మరింత గర్వకారణంగా ఉంది.. 

ఇప్పటికే 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలు, 2016లో 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్రను తిరగరాసింది మన దేశం. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాలుగా రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. 

2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 

2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపించి మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా .... మన ఇస్రో ప్రస్తుతం 20 ఉపగ్రహాలను పంపించిన మూడో దేశంగా నిలిచింది. 

ఫిబ్రవరి మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 103 ఉపగ్రహాలు ప్రయోగం అనంతరం ఒకే దఫాలో అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొట్టమొదటి దేశంగా భారత్‌ ఆవిర్భవించనుంది. 

ఇంతటి గొప్ప కార్యం గురించి ఎవ్వరూ నోరు మెదపకుండా ఉండటం నిజంగానే ఇది శోచనీయం... 

ఒక ప్రాంతానికి సంబంధించిన జల్లి కట్టు, కోడి పందెంల గురించి మాత్రం గింజేసుకుంటున్నారు, రక్కేసుకుంటున్నారు, ఒకరికొకరు గోకేసుకుంటున్నారు ... వీటిపై చర్చలు, గొడవలు, బూతులు, తమిళుల సత్కార పద ప్రయోగాలు.. 

నిర్మొహమాటంగా మన గురించి మనం చెప్పుకోవాలంటే “ఎదుటివారిని స్తుతించడంలో మనకు మనమే సాటి”... యావత్ భారతదేశం సగర్వంగా తల ఎత్తుకునే రోజు రాబోతుంది.. ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన వున్న మన దేశం వాటిని దాటి మరింత ముందుకు వెళ్లబోయే క్షణం అది.. 

ఇది ఓ రేపటి చరిత్ర.. అలాంటి విషయాన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం గమనార్హం... అయినా మనకు ఇవన్నీ ఎందుకు ?? 

గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం వచ్చిందా .. పొద్దుగాలే లేచామా.. కార్యాలయానికి, కాలేజీకి వెళ్ళామా .... మొహమాటానికి జెండా వందనం చేసామా.. రెండు చీకులేట్లు సప్పరించామ... దేవులాడుకుంటూ కొంపకు వచ్చి తొంగున్నామా .... లేక ఊరంతా తిరిగామా.... ఇదే కదా ఆ రెండు రోజుల మన భాగోతం ... 

బాహుబలి మొదటివారం యెంత గ్రాస్ చేసిందో నిద్రలో వున్న మిమ్మల్ని అడిగినా చెప్పేస్తారు.. 
150 సినిమాలో చిరంజీవి గారి డాన్సులు గురించి చర్చలు, రచ్చలు, రావిళ్లు .. 
శాతకర్ణి బాలక్రిష్ణ గారి గురించి విమర్శలు, ప్రసంశలు.. ఇవే మనకు ముఖ్యం.. 

రెండున్నర గంట సినిమాకు పంచే మన సంతోషం కొన్ని దశాబ్దాల చిరిత్రకు ఇవ్వలేమా ?? 
సినిమా కన్నా మన జీవితంలో మరేది ముఖ్యం కాదా.. ??
హీరోలకే నా నువ్వు ఫ్యాన్ .. మన దేశానికి.. దాన్ని నడిపించే ముఖ్యులకు కాదా.. ?? 

రేపటి మన ఘనత సువర్ణాక్షరాలతో ప్రపంచ చరిత్రలో మొదటి స్థానంలో లిఖించబడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెల్పుతున్నాను.. 

జైహింద్... 

Written by : Bobby

SOCOTRA (The Mysterious Island) from Bobby... 7th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

అప్పటికే సమయం రాత్రి పదకొండుంపావు .. 
ఆ మంటకు దగ్గరౌతున్న కొద్ది గుండె వేగం పెరుగుతోంది.. 
చివరికి ఎలాగోలా దగ్గరకు చేరుకున్నాం .. 
కాని అక్కడ ఎవరూ లేరు..!!
ఆ అఘోరా కోసం మా కళ్ళు వెతుకుతున్నాయి.. 
ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే నిలబడిన మాకు ఒక ఖఠిన స్వరం వినిపించింది … 
అది ఎక్కడనుంచి వినిపిస్తుందా అని చూస్తే ..! 
సరిగ్గా మాకు రెండు అడుగుల దూరంలో వున్న అప్పుడే పూడ్చిపెట్టినటువంటి గుంటలో నుంచి అని గ్రహించాము.. 
అంత చలిలో కూడా మాకు చెమటలు పడుతున్నాయి .... 
భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి…. 

ఏంటి చాలా టెన్షన్ పడుతున్నారా .. . ?? మరెందుకు ఆలస్యం పదండి ...

7th Part

అలా చూస్తూ ఉండగానే ఆ గుంటలోనుంచి అవలీలగా ఒక వ్యక్తి బట్టలు లేకుండా పైకి లేచి నిల్చున్నాడు.. 
తన జుట్టు తలపై చుట్టలు, చుట్టలుగా చుట్టుకొని వెనుక భాగం నుంచి నేలను తాకుతూ చాలా పొడవుగా వుంది… 
ఆ అఘోరా కళ్ళు నిప్పు కణికలవలే వున్నాయి.. 
కనుబొమ్మలు చాలా పెద్దవిగా వున్నాయి.. 
అలానే చూస్తూ నిల్చున్న మాకు ఇలా రండి అని పిలిచాడు ఆ అఘోరా.. 
బెరుకుగా వెళ్లి వరుసక్రమంలో నిలబడ్డాం .. 


మొదటి వ్యక్తిని తీసుకువెళ్ళి చాలాసేపటికి వచ్చాడు.. అలానే నా ముందు నిల్చున్న నలుగురిని తీసుకువెళ్ళి తను ఒక్కడే వచ్చాడు. నాకేమో భయంతో చెమటలు పడుతున్నాయి.. 

మనిషి చూస్తే ఇంత వికృతంగా వున్నాడు వాళ్ళను అలా పక్కకు తీసుకెళ్ళి తినేస్తున్నాడా ఏంటి ? 
అసలే అఘోరాలు నరమాంస భక్షకులు అని విన్నాను.. అనుకుంటూ నాలో నేనే భయపడుతూ వుండగా..

అవును నేను నరమాంస భక్షకుడనే కాని బతికిన వారిని కాదు… లోకంలో అత్యంత పాపాలను చేసి మరణించిన వారిని మాత్రమే సేవిస్తాను అని మెల్లిగా చెవి దగ్గరకు వచ్చి చెప్పాడు ఆ అఘోరా … 

ఆశ్చర్యంతో, భయంతో చెమటలు పడుతున్న నాకు “నువ్వేం భయపడకు నీ సమస్య తీరుద్దిలే ..!!” అంటూ మరో మాట చెప్పి నన్ను రమ్మని పిలిచాడు.. 

ఏమీ అర్ధం కాని అయోమయస్థితిలో ఆయన వెనుకగా నడిచాను … 

కొంతదూరం తీసుకెల్లాక అక్కడ ఉన్నటువంటి ఒక గుంత దగ్గర ఆగి ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు అడుగు…. నీకు సమాధానం చెప్తాను …. అని చెప్పాడు.. 

“నాకు ఒక కల" ….. అనగానే 

అదితప్ప మరేదైనా అడుగు... దానిగురించి నాకు తెలుసు .. ఏం చెయ్యాలో కూడా తెలుసు అంటాడు.. !!

ఇందాక నా ముందు వున్న నలుగురిని ఏం చేశారు అని అడిగాను ?? 

ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. 

సమస్యలను మనమే సృష్టించుకుంటాం, మళ్ళి మనమే బాధపడుతూ వుంటాం.. ఇలాంటి వలయాకారపు చట్రంలోనే నేటి మానవ జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి.. ప్రారబ్ధ కర్మలు అనుభవించక తప్పదు .. కాకపోతే ఆ అనుభవించే బాధను మాత్రమే నేను తగ్గించే సహాయకుడను అని చెప్పాడు.. 

ఇవన్నీ వింటున్న నాకు ఏమి అర్ధం కాలేదు.. 

మళ్ళి నావంక తీక్షనంగా చూస్తూ “నువ్వు అన్నిటికీ సిద్దపడే ఇక్కడకు వచ్చావా ?? “ 

అని అడిగాడు.. కొంచం తడబడుతూనే అవును అన్నట్లుగా తల ఊపాను.. సరే.. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు నీకు సమ్మతమైతేనే నేను మొదలు పెడతాను లేకుంటే ఇప్పుడే నువ్వు నిరభ్యంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవచ్చు .. అని చెప్పాడు.. 


ఇక ధైర్యం తెచ్చుకొని …… చెప్పండి అని అన్నాను.. 

ఆయన ఇలా చెప్పడం ఆరంభించాడు.. 

నువ్వు ఇక్కడ మూడు దినములు ఉండాల్సి వస్తుంది.. ఈ మూడు దినములలో ఒక్కో దినం, ఒక్కో గుంటలో గడపాల్సి వస్తుంది … అలా మూడు దినములు మూడు గుంటలలో నీ దేహం ఉంటుంది .. కాని నీ ఆత్మ ఈ మూడురోజులు నీ దేహంలో వుండదు… ఈ మూడు దినాలకు, మూడు గుంటలకు, మూడు ప్రత్యేకతలు వున్నాయి.. వాటిని వివరిస్తున్నాను జాగ్రత్తగా విను.. 

మొదటిదినం : నువ్వు దాటివచ్చిన భూత కాలంలోకి నువ్వు ప్రవేశిస్తావు… నీ కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ నువ్వు అనుభవించి వచ్చిన ప్రతీ విషయాన్ని నువ్వు దగ్గర వుండి చూస్తావ్.. 

రెండవ దినం : ప్రస్తుతం నువ్వు ఉంటున్న వర్తమానంలో జరిగే వాటిని, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను, నీ గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో తదితర విషయాలను నువ్వు చూస్తావు .. 

మూడవ దినం : పై భూత, వర్తమానం ఆధారంగా నువ్వు భవిష్యత్తు లో ఎలా వుండబోతున్నావన్న విషయాలను స్వయంగా నీ కళ్ళతో చూస్తావు .. 

ఈ మూడిటిని దాటితేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది.. 
మరో ముఖ్య విషయం …
చాలా భయాన్ని నువ్వు అనుభవించాల్సి వుంది.. భయపడకు నీకేం కాదు.. 
పై విషయాలను నువ్వు అంగీకరిస్తే ఇప్పుడే నేను నా పని మొదలుపెడతాను.. అని చెప్పి నా వంక అలానే చూస్తూ నిలబడి వున్నాడు.. 


వణుకుతున్న నా గొంతుతో నా ఆత్మను బయటకు తీస్తున్నారా .. ??

మరి నా దేహానికి ఏం కాదా ?? 

మళ్ళి నేను మూడు రోజులు తరువాత యధావిధిగా ఉండొచ్చా ?? అని అడిగాను.. 

ఆయన చిరునవ్వు నవ్వుతూ…. అది నీ చేతుల్లోనే వుంది.. అని అన్నాడు.. 

అర్ధం కాలేదు అని చెప్పాను.. 

నీ భయాన్ని నువ్వు జయిస్తే …. విజయం తధ్యం అని చెప్పాడు.. 

ఇక ఎలా అయితే అలా అయింది అని మనసులో అనుకోని … సరే కానివ్వండి అని సిద్దం అయిపోయాను … 

సరే ముందుగా అగ్నిలో అభ్యంగనస్నాన మాచరించి రా అని చెప్పాడు.. 

అగ్ని లో స్నానం ఏంటి అని అర్ధం కాక మళ్ళి ఏంటి ?? అని అడిగాను.. 

నువ్వు విన్నది, అనుకున్నది నిజమే.. ఆ కనిపిస్తున్న మంటలో వెళ్లి నిలబడి రా... అని చెప్పాడు… 12 అడుగుల ప్రకాశవంతమైన ఎగసిపడుతున్న ఆ మంటలలోకి నేను వెళ్ళాలా.

వెళ్తే మళ్ళి రావడమా ?? 

ఇవన్నీ ఆలోచనలతో అడుగు ముందుకు పడక అలానే నిస్తేజంగా వున్న నన్ను చూసి .. 

సందేహం వున్నచోట సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేము ... అని చెప్పాడు.. 

అగ్ని ఎలాంటి దాన్ని అయినా పునీతం చెయ్యగలదు .. దానికి అంతటి శక్తి వుంది.. నీ దేహానికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదు నువ్వు నేరుగా అందులోకి వెళ్ళు అని చెప్పగానే … కొంచం భయం వేసినా నమ్మకంతో వెళ్ళాను .. నిజం చెప్పాలంటే అదో అద్బుత సన్నివేశం… నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను.. అప్పుడే అర్ధం అయింది ఆయన మామూలు వ్యక్తి కానే కాదు అని.. 


అందులోనుంచి బయటకు వచ్చాక వెళ్లి ఆ గుంటలో పడుకో అని చెప్పాడు.. అలానే వెళ్లి పడుకున్నాను.. ఈ మూడు దినములు నీ దేహానికి ఎలాంటి మకిలి పట్టకుండా ఆ అగ్ని ప్రతినిత్యం సంరక్షిస్తుంది… ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పాడు.. నేను పడుకున్న కొన్ని నిమిషాలకు … 

మొదటి రోజు : నా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ దగ్గర నేను నిలబడి వున్నాను… నాతోపాటు చదువుకునే నా స్నేహితురాలు నాకు కనపడుతోంది.. ఆమెపేరు కల్యాణి .. రెండు జడలు వేసుకొని చాలా అందంగా వుంది.. క్లాసురూములో తన వెనుకనే నేను ఎప్పుడూ కూర్చుని వుంటాను.. తనని చాలా రకాలుగా విసిగిస్తున్నాను… 

తన రెండు జడలలో కాగితాలు పెట్టడం, తనపై ఇంకు జల్లడం, తన భోజనాన్ని లాక్కొని స్నేహితులకు పెట్టెయ్యడం.. ఇలా యెంతో అల్లరి చేస్తున్నాను.. ఆ కళ్ళల్లో నీరు తప్ప పెదవులనుంచి ఒక్క మాట కూడా అనదు .. తను నా ప్రవర్తనపై బాధ మాత్రమే చూపిస్తుంది.. కోపం, ద్వేషం చూపట్లేదు… ఆరోజు నాకు నిజంగా తెలియలేదు. తను యెంత బాధపడుతూ వుందో.. 

ఇప్పుడు తెలుస్తుంది.. 

ఇంటికి వెళ్లాను అమ్మ, నాన్న యెంతో ప్రేమగా చూసుకుంటూ వున్నారు..ఒక్కగానొక్క సంతానాన్ని నేను.. నేనే వారికి లోకం.. నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే నాతో బాగా ఆడుకునేవాడు… అవన్నీ అలా కళ్ళముందు కదులుతున్నాయి… చూస్తుంటే కళ్ళల్లోనుంచి నీరు వచ్చేస్తుంది... ఇలాంటి అందమైన జీవితాన్ని నేను నా అహం వల్ల నాశనం చేసుకున్నానా ?? 

అందరినీ దూరం చేసుకొని ఏం సాధించాను ?? 

నా మీద నాకే అసహ్యం వేస్తుంది .. అని అనుకుంటూ ఆ రోజంతా అలాంటి జ్ఞాపకాలతోనే ప్రయాణించాను .. 

రెండవ రోజు : ఎప్పటిలాగానే ఉదయాన లేపలేదని ఆ పని పిల్లాడిని కాలుతో కొడుతూ లేచాను.. 

వాడేమో ఏడుస్తూ … 

నిన్న లేపినందుకు కొట్టారు కదా సర్ … అంటూ బాధపడుతున్నాడు.. అదేంటో అవన్నీ చేస్తున్నప్పుడు అనిపించని భావనలు ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు తప్పు అనిపిస్తున్నాయి.. 

పని పిల్లాడు నా దగ్గరకు వచ్చి సర్ నేను రెండు రోజులు ఇంటికి వెళ్లి వస్తాను .. నాకు సెలవు ఇప్పించండి అని అడుగగా… 

ఎందుకురా?? 

మనం ముందే ఒప్పందం చేసుకున్నాం కదా..!!

సెలవులు పెట్టనని అన్నావ్.. అన్నిటికీ ఒప్పుకొనే కదా నిన్ను నేను చదివిస్తున్నాను, మల్లి జీతం కూడా ఇస్తున్నాను .... నిజమే సర్ కాని ఇంట్లో అమ్మ పరిస్థితి అస్సలు బాలేదంట కబురు చేసారు.. ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను సర్ .. 


అని కళ్ళలో నీరుపెట్టుకొని ప్రాధేయపడుతూ వున్నాడు.. అస్సలు కుదరదు మాట అంటే మాటే అని నిక్కచ్చిగా చెప్పేసాను.. 

సరే సర్ మీరు చెప్పినట్లే నేను వుండిపోతాను .. కాకపోతే నాకు కొంచం డబ్బు ఇవ్వగలరా ??

నా జీతంలో పట్టుకోండి … 

కనీసం డబ్బు అయినా పంపుతాను అని అనగానే … అయినా ఇది నెల మధ్యన కదా ఎలా ఇవ్వగలను?? 

మరో 10 రోజులు ఆగు అప్పుడు ఇస్తాలే అని చెప్పి అక్కడనుంచి వచ్చేసాను… కార్ డ్రైవర్ ని పెద్ద పెద్దగా తిడుతున్నాను…

తను చేసిన తప్పు ఓ ఐదు నిమిషాలు లేట్ గా రావడం.. అందుకు గల కారణం తన పిల్లల్ని స్కూల్ లో వదిలి వచ్చేసరికి 5 నిమిషాలు ఆలస్యం అయింది. 

కార్లో ఆఫీస్ కి చేరుకున్నాను.. 

అప్పటివరకు నవ్వుకుంటూ వున్న పనివారు నేను వచ్చేసరికి మొహాలు చాలా అసహ్యంగా పెట్టి వచ్చాడు “శని గాడికి పనిగాడు” అని తిట్టుకుంటూ కోపంతో నన్నే ఉరిమి చూస్తూ వున్నారు.. 

నిజంగా నాకు అప్పుడు ఇవన్ని తెలియలేదు.. నేను గమనించలేదు కూడా.. 

ఆఫీస్ కి రావడం రావడమే అక్కడ పనిచేసే సర్వెంట్ ని అరుస్తూ వచ్చాను.. నా క్యాబిన్ లో సరిగా తుడవట్లేదని .. 

నేను వెళ్లి కూర్చున్న కొన్ని నిమిషాలకే డమేల్ అని పెద్ద శబ్దం తో రంగు రంగుల కాగితాలు పేల్చారు.. స్నో బాటిల్ తో ఒకరిపై మరొకరు చల్లుకుంటూ వున్నారు.. ఎవడిదో పుట్టిన రోజు అంట… కేకులు, ఆ క్యాండిల్స్, ఆ చప్పట్లు, ఆ అరుపులు, కేకలువేస్తూ తెచ్చిన ఆ కేకుని ఒకరికి మరొకరు పూసుకోవడాలు చేస్తున్నారు.. ఇవన్ని చూస్తున్న నాకు కోపం చిర్రెత్తుకు వచ్చింది.. 

లేచి పెద్దగా అరిచి ఇది ఆఫీస్ అనుకున్నారా ?? 

మీ ఇల్లు అనుకున్నారా ..?? 

మీరు అసలు మనుషులేనా ?? పుట్టినరోజు లో ఏముంది పెద్ద విషయం …. రోజులు కొన్ని లక్షల ప్రాణులు పుడుతూ ఉంటాయ్, చస్తూ ఉంటాయ్ దాన్ని ఏదో ఘనకార్యం సాధించిన వారిలా భావిస్తున్నారు.. ముందు లక్షలు సంపాదించడం నేర్చుకోండి … ఇవన్ని కాదు.. 

కూటికి లేనోడు కూడా పుట్టినరోజు ఘనంగా చేసుకోగలడు .. కాని గొప్పవాడు వుండి కూడా చేసుకోడు.. నేను అంతే .. ఎందుకంటె ఈ సరదాలు చేసుకునే సమయంలోనే మనం మన సంపాదనను కోల్పోతున్నాం.. ఈ సమయాల్లో ఇంకెంతో డబ్బును సంపాదించొచ్చు .. అని అరవగానే .. 

మీకు చెప్పాల్సిన అవసరం లేదు... మేము మేనేజ్మెంట్ ని పర్మిషన్ అడిగే ఈ సెలేబ్రేషన్స్ చేసుకుంటున్నాం.. మీకు అంత ఇబ్బందికరంగా వుంటే మీరు వెళ్లి డబ్బు సంపాదించుకోండి. మాకు అవసరం లేదు.. అని అందరూ తిరిగి అనేసరికి అక్కడనుంచి వీళ్ళు మారరు అనుకుంటూ వచ్చేసాను.. 

రోడ్ లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు .. వీరి తల్లిదండ్రులు అంత భాద్యతారహితంగా వీళ్ళను ఎలా ఆడుకోనిస్తున్నారు.. 

ఆడుకుంటే ఏం వస్తుంది?? 

చదువుకుని మంచిగా ఫారెన్ లో స్థిరపడమని ఏ ఒక్కరు ఎందుకు చెప్పట్లేదు… అందుకే ఇక్కడ మనుషులు ఇలా వున్నారు.. సర్దుకుపోయే ఈ బానిస మనస్తత్వాల మధ్యన నేను నలిగిపోతున్నాను… అని అనుకుంటూ, నసుక్కుంటూ, తిట్టుకుంటూ … 

మరో రెండు సంవత్సరాలలో వీళ్ళను, ఈ దేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతాను .. అప్పటివరకు భరించాలి వీళ్ళందరినీ .. తప్పదు .. అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను … అలా ఆ రోజంతా అలాంటి జ్ఞాపకాలతోనే ప్రయాణించాను .. 


మూడవ రోజు : నా మంచం పై నేను పడుకొని వున్నాను… టైం ఉదయం 10 అవుతోంది.. కాని ఎంతకీ లేవట్లేదు.. పనిపిల్లాడు వచ్చి పనులు చక చకా చేసేసి నాకు తినడానికి టేబుల్ మీద పెట్టి లేపడానికి వస్తున్నాడు..

To be continued …

Written by : BOBBY

Friday, January 20, 2017

“యువ” కవులే కాని, “నవ” కవులు లేని యుగం మనది..


“యువ” కవులే కాని, “నవ” కవులు లేని యుగం మనది..
******************************************

ఈ రోజుల్లో కవిత వ్రాస్తున్నంత మంది యువకులు, యువతులు ఇంతకుముందు వుండి ఉండకపోవచ్చు.. అయితే కొందరి కవితల్లో మాత్రం “నవత” కనిపించడం లేదు.. 


ఉడుకుతనం, దురుకుతనం, తిట్లు, పట్లు, మాటల ఫీట్లు, రాజకీయ విమర్శలు, వర్గ నినాదాలు, మాటల్ని బోల్తాకొట్టించి, నవ్వు పుట్టించి, చప్పట్లు కొట్టించుకోవడాలు, పూర్వకవుల నుంచి, జానపద సాహిత్యం నుంచీ భావాలు, వాక్యాలు కూడా కొట్టేసి అక్కడక్కడా మసిపూసి, స్వంతం చేసుకొని కీర్తి గడించడాలు .. ఇదీ ఈ నాటి ఆధునిక కవితా స్వరూపం.. సినిమాలు, పత్రికలు వంటి ప్రచారసాధనాలను కైవశం చేసుకొని తమ గిప్పిట్లో పెట్టుకొన్న వాళ్ళు తదితరులకంటే అత్యధికంగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించడం జరుగుతున్నది.. అందరికీ అట్టివాళ్ళే ఆదర్శ కవులు అవుతున్నారు.. ఇది ఈనాడు ఆధునిక కవితా రంగాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యం.. 

కవిత రాయడానికి కొంచం ఆలోచన కావాలి అన్న ఆలోచనే ఇప్పుడు కవితలు రాస్తున్న కొందరికి లేదు.. అసలు వారి ప్రతిభను నమ్మట్లేదు.. కొంచం భాషపై పట్టుకోసమైనా పూర్వ గ్రంధాలు చదువుదాం, వివిధ రంగాలకు సంబంధించి కనీస విజ్ఞాన్ని అయినా సంపాదిద్దాం, ప్రకృతిని, జీవనైజాన్ని పరిశీలిద్దాం.. ఉచితానుచితాలను గ్రహిద్దాం, గతాన్ని పునాదిగా చేసుకొని వర్తమానం సామగ్రిగా, భవిష్యత్తును ఇతోధిక సముజ్వలంగా నిర్మిద్దాం.. అనే ఆలోచనే లేదు ఎవ్వరికీ.. ఇక అందుకు కృషి ఎలా వస్తుంది ?? 

ప్రయత్నమెలా జరుగుతుంది.. ?? 

నిజానికి ఇదే ఈ యుగధర్మం.. బ్రతుకుదెరువును వెతుక్కోవడమే ప్రధాన లక్ష్యంగా పరిణమించిన ఈనాడు అన్ని విద్యలతోపాటు కవిత వ్రాయడం అనేది కూడా ఒక బ్రతుకుదెరువు సాధనంగా మారింది.. వాస్తవానికి చాలా ముఖ్య సాధనంగా కూడా అవుతోంది.. ప్రచారం, పేరు, గౌరవం, సత్కారాలు తద్వారా ఆర్ధిక లాభం.. హోదాగలవారి పరిచయం, పదవులలోకి ప్రవేశం వగైరా కవిత వ్రాయడం మూలకంగానే సులువుగా సాధ్యమౌతున్నాయి.. అందువల్ల రైల్వేస్టేషన్లలో భోజనసదుపాయాలవలె నేటి కవిత ఉడికీ ఉడకని మెతుకులు కాక తప్పడంలేదు.. 


స్వస్తి ___/\___


Written by : Bobby Nani

SOCOTRA (The Mysterious Island) from Bobby... 6th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఇదంతా వింటున్న ఓ పిల్లడు లేచి .. తాత గారు మరి ఇప్పుడు మీరొక్కరే వున్నారు అమ్మమ్మ గారు రాలేదా అని అడుగగా… కంటి అద్దాలను తీస్తూ చమ్మగిల్లిన తన కళ్ళను తుడుచుకుంటూ పోయిన ఏడాది తను భగవంతునిలో ఐఖ్యం అయింది నాయనా.. ఈ రంగుల లోకంలో ఒంటరిగా నన్ను విడిచి వెళ్ళిపోయింది అంటూ తడిఆరి వణుకుతున్న తన స్వరంతో అంటాడు.. ఆమె విడిచిన జ్ఞాపకాలతో ఇలా వూర్లు పట్టుకొని ఈ వయస్సులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతూ వున్నాను.. అంటూ చెప్పి అక్కడనుంచి వెళ్లిపోతాడు.. 

నిజంగా ఆ పెద్దాయన మాటలు నన్ను, నా హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఈలోపు మరో 15 ఏళ్ళ యువకుడు ముందుకు వచ్చి పెదనాన్న గారు నేను మాట్లాడవచ్చా అని అడుగుతాడు.. 

ఆ పిల్లవాని కుతూహలానికి ముచ్చటపడి .. అంతకన్నా ఏం చెప్తాడా అనే ఆతురతతో దానికేం భాగ్యం నాయనా రా ఇలా వచ్చి మాట్లాడు అంటూ దారిని ఇస్తాడు ప్రసన్నకుమార్ భాటియా..

ఇంతకీ ఆ పిల్లాడు ఏం చెప్పాలని వచ్చాడు.. మరి తెలుసుకుందాం పదండి ...

6th Part

ప్రతీ ఒక్కరికి తల్లి, తండ్రి వుండే వుంటారు.. అలాంటి వాటికి నోచుకోలేని ఓ దురద్రుష్ట వంతులలో నేను ఒక్కడిని... కనీసం నాకు పేరు పెట్టే వారు కూడా లేకుండా అతి దుర్భరమైన జీవితాన్ని ఉగతెలిసిన నాటినుంచి గడుపుతూ వస్తున్నాను.. చిన్నప్పుడు బాలల వసతి గృహంలో ఎందుకున్నానో తెలిసేది కాదు.. 


ప్రతీ ఒక్కరికి వారానికొకసారి అయినా వారి వారి తల్లి, తండ్రులు వచ్చేవారు.. 

నా కోసం ఎవ్వరూ వచ్చేవారు కాదు .. అక్కడ ఉన్నవాళ్ళను అడిగితే రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అంటూ అలా అలా పదేళ్ళు గడిపించేశారు … 

ఓ రోజు నా తల్లి, తండ్రి అంటూ ఇద్దరు వచ్చారు .. 

నా ఆనందానికి ఆ రోజు ఎల్లలు లేవు, హద్దులు లేవు … 

ప్రపంచాన్ని జయించిన సంతోషం తో ఉన్న నన్ను వారితోపాటు వారి ఇంటికి నన్ను తీసుకుపోయారు.. 

తీసుకెళ్ళిన అదే రోజు నుంచి వారి ఇంటి పని మొత్తం నా చేతే చేయించే వారు.. 

వారికి మరో ఇద్దరు చిన్న పిల్లలు వుండేవాళ్ళు … 

కాని వాళ్ళకు ఏమి పని చెప్పేవారు కాదు .. 

నాకు అర్ధం అయ్యేది కాదు.. 

వాళ్ళతోపాటు నన్ను ఆడుకోనిచ్చే వారు కాదు..!!

ఒకరోజు అడిగాను నా చేత మాత్రమే ఇవన్ని ఎందుకు చేయిస్తున్నారు ?? 


వారి ఇద్దరి చేత చేయ్యించట్లేదు ఎందుకని ? అని .. 

వారు చిన్న పిల్లలు కదా…!

నువ్వు వారికన్నా పెద్ద కదా..!

“పెద్దవాళ్ళు పని చెయ్యాలి, చిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి” అని సమాధానం ఇచ్చారు ... 

నిజమే అనుకొని ఎన్నోసార్లు నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను.. 

నేను చేసేది ఎవరికోసం ?? 

నా అమ్మ, నాన్న, తమ్ముళ్ళ కోసమే కదా..!

ఏం కాదు అనుకొని…. అలా చేస్తూ మరో నాలుగు ఏళ్ళు తెలియకుండానే గొడ్డులా చాకిరీ చేసేసాను ... 

ఒకరోజు వారు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా విన్నాను.. 

వాడికి ఇప్పుడిప్పుడే ఉగతెలుస్తోంది మనం నిజమైన తల్లి, తండ్రులం కాదని తెలిస్తే వెళ్ళిపోతాడేమో కదండీ .. ! 

అప్పుడేం చేద్దాం..?? 

అని మా అమ్మ... అనుకుంటున్న ఆమె అనగానే తెలియకుండానే కళ్ళలో ప్రవాహ ధార ఆగలేదు.. 

తల్లి, తండ్రి అనే బంధంతో నన్ను ఇన్నేళ్ళు వాడుకున్నారా ?? 

అంటే ఈ లోకంలో తల్లి, తండ్రి అనే బంధాలు కూడా కలుషితం అయిపోయాయా … !

అని వెక్కి వెక్కి రోదించాను .. 

ఈ ప్రపంచంలో నా కన్నీళ్ళు తుడిచేవారు ఎవ్వరూ లేనందుకు మరింత బాధ కలిగింది ఆ సమయంలో... 

నేను ఒక్కడినే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్లు ఆ క్షణం అనిపించింది.. ఇక ఈ మనుషులకు దూరంగా ఉండాలని ఆనాడే నిర్ణయం తీసుకొని అందుకోసం అన్నీ దిగమింగుకొని వేచి వేచి చూసాను.. 

సరిగ్గా ఈ రోజుకు నాకు 15 ఏళ్ళు వచ్చాక ఆ అవకాశం దొరికింది .. కుటుంబం మొత్తం విదేశాలకు తినింది అరిగించుకోవడానికి వెళ్ళారు.. ఈ సమయం నాకు అనుకూలం... అందుకే అక్కడ నుంచి ఇలా ఈ లాంచీ ఎక్కి వచ్చేసాను…. 

నాకు ఇష్టం వచ్చిన ప్రదేశానికి నేను వెళ్లి ఒంటిరిగానే జీవితాన్ని గడపాలని ఎవ్వరిని నమ్మకూడదు అని వెళ్తున్నాను.. ఈ పదిహేనేళ్ళ నా జీవితం నాకు నేర్పిన పాఠంలో నా మిగిలిన సంపూర్ణ జీవితాన్ని నేను లాక్కోరాగలననే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను.. 

ఎందుకో మీ లాంటి పెద్దల మాటలు, మీరు పడిన కష్ట, సుఖ, దుఃఖాలు విన్నాక వాటితో పోల్చుకుంటే … నావి పెద్ద కష్టాలే కాదని అనిపించింది.. నా ఈ బాధను మీతో పంచుకోవాలనిపించింది…

అని అంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి, అన్నీ విన్న పెద్దలకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను … అని తన రెండు చేతులు జోడించి ఆ రాయి దిగి నిలబడ్డాడు... ప్రసన్నకుమార్ భాటియా ఆ పిల్లాడిని కౌగిలించుకొని ఆశీర్వదించి పంపుతాడు.. 

ఈలోపల ఓ నలభై ఏళ్ళ వ్యక్తి లేచి అక్కడే నిలబడి వున్నాడు… 

(అతని గురించి చెప్పేముందు అతని బాహ్య ప్రవర్తన, బాహ్య సౌందర్యం గురించి చెప్పాలి.. అతను లాంచీ ఎక్కినప్పటినుంచి ఎవ్వరితోను మాట్లాడలేదు… ఇప్పుడేమో లేచి ఏదో చెప్పాలని నిల్చున్నాడు.. అదీ కాక తను చూడటానికి మాసిన బట్టలతో, బాగా పెరిగిన జుట్టుతో కొంచం ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు.. )

ప్రసన్నకుమార్ భాటియా చాలా ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు.. ఎవ్వరితోను మాట్లాడని ఇతను లేచి నిలబడి ఏదో మాట్లాడేందుకు చూస్తున్నాడు … ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడు ? 

అని ఆశ్చర్యంతో మనసులో అనుకుంటూ వున్నాడు ప్రసన్నకుమార్ భాటియా… 

ఇక ఆగలేక ఏమండీ లేచి నిలబడ్డారు… ఏదో మాట్లాడాలనే కదా..!! 

మరెందుకు అక్కడే ఆగిపోయారు….??

రండి ధైర్యంగా ఇలా వచ్చి మాట్లాడండి … అని ఆహ్వానిస్తాడు ప్రసన్నకుమార్ భాటియా… 

అయిననూ అతనిలో చలనం లేదు..కొన్ని క్షణాల అనంతరం మెల్లిగా అడుగులు ముందుకు వేస్తాడు ఆ అపరిచితుడు.. 

మొత్తానికి ప్రసన్నకుమార్ భాటియా దగ్గరకు చేరుకొని మాట్లాడటం మొదలు పెడతాడు.. 

Hai Everybody.. అంటూ కొన్ని మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడి అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తాడు.. అందరూ ఆశ్చర్యంగా అతనివైపే చూస్తున్నారు.. 

అతని మాటతీరు, ఆ కంఠస్వరం అమృతంలో ముంచి తీసిన ద్రాక్ష పండులా మధురంగా మళ్ళి, మళ్ళి వినాలనిపించేంతలా వున్నాయి.. అతని మాటలకు, రూపానికి అస్సలు పొంతనలేదు…. అని అందరూ అనుకుంటున్న సమయంలో తనే ఇలా మాట్లాడటం మొదలు పెడతాడు... 


మీరు అందరూ ఇలా అనుకుంటూ వున్నారని నాకు తెలుసు... దాన్ని నేను వివరిస్తాను.. అని చెప్పనారంభించాడు … 
మీరు చూస్తున్న ఈ రూపం, మీరు వింటున్న ఈ మాటలు మీకు వింతగానే ఉంటాయి…. దానికి కారణం తెలియాలంటే కొన్ని రోజులక్రితం ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి .. నేను ముంబై నగరంలో ఓ పెద్ద ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తూ వున్నాను.. 

నాకున్న తలపొగరు, అహం, అంతా ఇంతా కాదు.. నేను చేసిన పాపాలు అన్నీ, ఇన్నీ కాదు.. 

భయంలేని బ్రతుకును, బ్రతుకుతూ విచ్చలివిడితనానికి అలవాటుపడి కనిపించే ఈ రంగుల ప్రపంచమే నిజమనే భ్రమలో బ్రతుకుతున్న రోజులవి.. ఎవ్వరినీ మనిషిగా కూడా చూడకుండా ఆఖరికి రక్తసంబంధీకులందరినీ దూరం చేసుకొని ఒంటరిగా, ఒక్కడినే బ్రతుకుతూ వున్నాను.. నాతోపాటు ఒక పని పిల్లవాడు మాత్రమే ఉంటాడు.. 

వాడి గురించి చెప్పాలంటే వాడిని నేను ఎన్నో రకాలుగా హింసించే వాడిని .. అలా ఉంటూ వుండగా ఒకరోజు భయంకరమైన కల ఒకటి నన్ను కలవరపెడుతూ, నిరంతరం వెంటాడింది.. ఒకే కల పదే పదే వచ్చేది.. నిద్రపోతే చాలు ఎవరో డి.వి.డి. ప్లేయర్ లో ఒకే సన్నివేశాన్ని పెట్టి పదే పదే ప్లే చేస్తున్నట్లు నాకు ఆ కల ప్లే అయ్యేది.. ఇలా దాదాపుగా కొన్ని వారాలు నన్ను వెంటాడుతూనే వుంది …. 

నిద్ర పోవాలంటేనే భయపడి వణికిపోయాను.. భయం లేకుండా వున్న నన్ను ఆ కల వణికించేస్తుంది.. ఎందరినో కలుసుకున్నాను… ప్రతీ మతాన్ని ఆశ్రయించాను వెళ్ళని గుడి లేదు, వెళ్ళని చర్చ్ లేదు, వెళ్ళని మసీదు లేదు ఇలా నిద్రలేక, ఆ కలను భరించలేక ఈ భూలోకంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ వుండగా…….

ఒకరోజు నా బాధను చూడలేక నా దగ్గర పనిచేసే పిల్లాడు ఒక సలహా ఇచ్చాడు …. 

ఆ పని పిల్లవాడి ఊరు ఒక చిన్న కుగ్రామంలో వుందట .. అక్కడనుంచి ఉత్తర దిశ వెంబడి ఓ 40 మైళ్ళ ప్రయాణించిన తరువాత “అస్తమయ పురం” అనే ఓ చిన్నగ్రామం వస్తుందట .. 


విషయం ఏంటంటే ఆ “అస్తమయ పురం” అనే గ్రామంలో ఎవరూ వుండరట.. చనిపోయిన వారిని మాత్రమే అక్కడ పాతిపెట్టి వస్తారని, అక్కడ అన్నీ సమాధులే ఉంటాయని .. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ గ్రామం మొత్తం ఇప్పుడు వెలవెలబోతూ వుందని.. కొన్ని సంవత్సరాలక్రితం యేవో భయాల వల్ల అందరూ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళారని చెప్పాడు.. 

ఎందుకో, ఏమిటో నేను అడగలేదు.. అక్కడకు ప్రతీ అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు (నెలపొడుపు) యవ్వన చంద్రకాంతులు ప్రసరించే ఆ రాత్రి వేళ ఒక అఘోరా వస్తాడని, తన మాటలు శూలాళ్ళలా ఉంటాయని, ఎన్నో సమస్యలను తను తీరుస్తాడని చెప్పి .. 

మరో ముఖ్య విషయం ఆ రోజు తప్పితే మరే రోజు అక్కడకు పగటిపూట కూడా వెళ్లరాదని హెచ్చరించాడు. ఇదంతా నేను ఒకప్పటిలా వుండి వుంటే మాత్రం బాగా నవ్వుకునే వాడిని .. ఇప్పుడు నాకో మార్గం దొరికిందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను… 

నెలపొడుపు రావడానికి ఇంకా 10 రోజులు సమయం వుంది.. ఈ లోపు ఏర్పాట్లు చేసుకోవాలి … అని మనసులో అనుకొని ప్రయాణానికి సిద్దమయ్యాను.. 

2 రోజులకు మునుపే నా ప్రయాణాన్ని కొనసాగించి అక్కడకు చేసుకున్నాను.. చంద్రుని నుంచి వెలువడే ఆ మొదటి రోజు యవ్వన చంద్రకాంతికోసం ఎదురు చూస్తూ వున్నాను.. నా సమస్య పరిష్కారం కోసం వేచి వున్నాను… 

ఇంతలో ఆ రోజు రానే వచ్చింది… 

ఈ ఊరు నుంచి నలభై మైళ్ళు వెళ్ళాలి నాతో పాటు చిత్రమైన సమస్యలు వున్నవారు మరో నలుగురు వున్నారు.. 

మేము ఐదు మందిమి మాత్రమే అక్కడకు వెల్లబోతున్నాం.. మిగతా ఎవరూ అక్కడకు రాకూడదు అనే నిబంధన వుంది.. 

“అస్తమయ పురం” గ్రామానికి 5 మైళ్ళ దూరం వరకు ఒక ఆటో అతను మా ఐదుగురిని దించి... ఇక ఇక్కడనుంచి కాలి నడకనే వెళ్ళాలి మీరు తప్ప మరెవ్వరూ మీ వెంట రాకూడదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు.... 

భయపడుతూనే ఆ రాత్రివేళ అక్కడనుంచి కాలినడక మొదలు పెట్టాం.. 

చుట్టూరా ఖటిక చీకటి, టార్చ్, మొబైల్, కెమెరా తీసుకురాకూడదు అని హెచ్చరించి వున్నారు ఆ గ్రామస్తులు .. కేవలం ఎవరికి వారు లాంతర్లు పట్టుకుని వెళ్తున్నాం.. ఎదురుగా ఏముందో కూడా కనిపించని దట్టమైన చీకటి దుప్పటి కప్పినట్లు వుంది .. 

కిందేమో అడుగు అడుగుకీ ఎండుటాకుల శబ్దం…

నరాలు చిట్లేలా చలి, ఒళ్ళు ఝల్లుమనేలా దూరాన నుంచి వస్తున్న తోడేళ్ళ కూతలు… 

ఆ ప్రదేశం అంతా మరణం కోసం వేచి చూస్తున్న మృత్యువులా మారి వుంది..

ఇన్నిరోజులు నన్ను భయపెట్టిన కలను వెతుక్కుంటూ నిజంగానే ఆ భయంకర ప్రదేశానికి కావాలనే నాకు నేనుగా వెళ్తున్నానా ? అనే సందిగ్ధంలో పడిపోయి వుండగా.. 

దూరాన ఒక పెద్ద మంటను మేము గమనించాం.. ఆ మంట దాదాపుగా 12 అడుగుల ఎత్తుకు ఎగసి మండుతోంది..

 
దగ్గరకు వెళ్ళే కొద్ది ఊపిరి భారంగా మారిపోతోంది.. 

అప్పటికే సమయం రాత్రి పదకొండుంపావు .. 

ఆ మంటకు దగ్గరౌతున్న కొద్ది గుండె వేగం పెరుగుతోంది.. 

చివరికి ఎలాగోలా దగ్గరకు చేరుకున్నాం .. 

కాని అక్కడ ఎవరూ లేరు..!!

ఆ అఘోరా కోసం మా కళ్ళు వెతుకుతున్నాయి.. 

ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే నిలబడిన మాకు ఒక ఖఠిన స్వరం వినిపించింది … 

అది ఎక్కడనుంచి వినిపిస్తుందా అని చూస్తే ..! 

సరిగ్గా మాకు రెండు అడుగుల దూరంలో వున్న అప్పుడే పూడ్చిపెట్టినటువంటి గుంటలో నుంచి అని గ్రహించాము.. 

అంత చలిలో కూడా మాకు చెమటలు పడుతున్నాయి .... 

భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి…. 


To be continued …

Written by : BOBBY