Monday, October 3, 2016

ఓ మంచి మాట...



ఓ మంచి మాట... 
************

ఉదయాన మీరు బాగా ఆలస్యంగా నిద్రలేస్తారు... ఆ రోజు మీరు చెయ్యాల్సిన పనులు చాలా వుంటాయి.. అబ్బబ్బా అనుకుంటూ మీ ఆవిడను హడావిడి పరుస్తూ పనుల్ని ముగించుకొనేసరికి ఆఫీసు టైము దగ్గరపడుతుంది.. 

పడుతూ లేస్తూ బయలుదేరుతారు.. టైమును లెక్కపెట్టుకుంటూ మాటి మాటికీ వాచీని చూసుకుంటూ వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.. తిక్కతో మీ వంట్లో రక్తం జయ్ జయ్ మంటూ ప్రవహిస్తుంది.. 

ఎలాగో ఆఫీసుకు చేరుకుంటారు.. ఇంట్లో పెళ్ళానికి భయపడే చండా మార్కుడైన మీ ఆఫీసరు మీ మీద గయ్ గయ్ మని అరుస్తాడు.. కోపాన్ని దిగమింగుకుంటూ లోలోపల వాణ్ణి నానా బూతులు తిట్టుకుంటూ ఆ అరుపుల్ని భరించి ఆఖరికి వెళ్లి సీట్లో కూర్చుంటారు.. 

బోలెడంత పేరుకుపోయిన పని.. దేన్ని ముందు చెయ్యాలో తెలియని స్థితి.. సాయంత్రం దాకా ఫైళ్ళతో కుస్తీ పట్టి ఇంటికి బయలుదేరుతారు.. 

దారిపొడుగునా ట్రాఫిక్ గందరగోళం .. మీ వెనక నుంచి చెవుల్ని చిల్లులు పరిచే హారన్లు .. బండినాపి వెనుక హారను మోగించే వెర్రి నాయాల్ని ఆపి .. వాడిని కారులోనుంచి బయటకు లాగి చాచి రెండు ఇచ్చుకోవాలనిపిస్తుంది .. అయినా నిగ్రహించుకుంటారు.. 
తల పగిలే పోటుతో ఇంటికి చేరుకుంటారు.. పిల్లలు ఏదో విషయం మీద పోట్లాడుకుంటూ వుంటారు.. మీరు వాళ్ళ మీద అరుస్తారు.. భార్యదేమీ తప్పు లేకపోయినా ఆమె మీద కూడా అరుస్తారు.. 

“నన్ను కాసేపు వంటరిగా వదలండి “ అంటారు.. 

ఆ వంటరితనం లభించేసరికి మీలో పశ్చాత్తాపం మొదలవుతుంది.. భార్యా పిల్లలమీద అనవసరంగా ఎందుకు అరిచానా అని.. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయతలో మీ మీద మీరు జాలి చెందుతారు, నిట్టూర్చుతారు ఆ క్షణాన ... 

ఇంక ఆ రాత్రి మీ కెంతకీ నిద్ర పట్టదు.. నరకప్రాయమే .. 

ఆరోజు సంఘటనలన్నీ పునర్విమర్శించుకుంటే మీ కేమనిపిస్తుంది ?? 

ఆ రోజుంతా మీరెంతో మానసిక ఒత్తిడిని అనుభవించినట్లు కదూ !!

ప్రక్కరోజు మీ పొరుగింటి పెద్ద మనిషికి గుండెపోటు వస్తుంది.. అందుకు గల కారణం ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవ్వటం అంటారు డాక్టర్ గారు.. 

వెంటనే మీరు కూడా డాక్టర్ కు చూపించుకునేందుకు వెళ్తారు.. అన్నీ పరిక్షలు చూసిన డాక్టర్ మీకు బీపి బాగా ఎక్కువగా వుందని అంటాడు.. అతిగా టెన్షన్ ఫీలవ్వకండి, మానసిక ఒత్తిళ్ళుకు దూరంగా వుండండి అని సలహా ఇస్తారు.. 

నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు మీరు తట్టుకోలేక ట్రాంక్విలైజర్స్ (నిద్ర మాత్రలు) లేక తాగుడుకు అలవాటు పడతారు.. 

ఈ అన్నీ సందర్భాలలోనూ మానసిక ఒత్తిడి అనేది మీకు ఎదురౌతుంది... 

అసలు ఏమిటి ఈ మానసిక ఒత్తిడి అంటే ?? 

సమాజం ఆధునికం అవుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి అనే పదం ఎందుకని ఎక్కువగా వినిపిస్తుంది.. ?? 

దీనినుంచి ఎలా బయట పడాలి .. 

స్వతహాగా అసహనంగా గొంతెమ్మ కోర్కెలతో, పోరాట మనస్తత్వంతో, దూకుడు స్వభావంతో (Aggressive) గా వుండేవారు పెద్దగా యాంబిషన్స్ లేకుండా ప్రశాంతంగా జీవనాన్ని గడిపేవాల్లకంటే తేలికగా, త్వరగా ఒత్తిడికి లోనౌతూవుంటారు. . అలాగే మీకు ఇష్టంలేని తరహా జీవనాన్ని గడపాల్సి వచ్చినప్పుడు మీ మీద ఒత్తిడి దాడిచేస్తుంది.. జీవితంలో జరిగే దుర్ఘటనలు, సంక్షోభాలు, విడాకులు, ఆత్మీయులు చనిపోవడం లేదా విడిపోవడం, పరీక్షలు, ఆర్ధిక సమస్యలు, కుటుంబకలహాలు ఇవన్నీ మనల్ని అత్యంత ఒత్తిడి లోనికి నెట్టి నలిపేస్తాయి.. 

నేటి ఆధునిక జీవితంలో అనివార్యంగా ఎదుర్కొనే భయాలు, అనిశ్చిత స్థితి (Uncertainty), జనసాంద్రత, శబ్ద కాలుష్యం లాంటివి తెచ్చే వొత్తిల్లు చాపకింద నీరులా మనకు తెలియని అపకారాన్ని కలుగజేస్తున్నాయి... 

మనం తీసుకొనే ఆహారంలో కూడా రసాయనాలు మనకు తెలియకుండానే మనకు చికాకును పెంచి వొత్తిడిని కలిగిస్తున్నాయి.. 

కాఫీ, టీ, కోలాలలో వుండే కెఫీన్, సిగరెట్లలో నికోటిన్, వగైరాలు తాత్కాలికంగా మన మనస్సును ఉపశమింపజేసినట్లు అనిపించినా దీర్ఘకాలం మీద మనకు అవి అపకారాన్నే కలిగిస్తాయి.. తట్టుకోలేని స్థితికి తీసుకు వెళ్తాయి.. అందుకే మానసిక ఒత్తిడిని ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది అంటూ విభజించుతారు .. దయచేసి ప్రకృతికి దగ్గరగా వుండండి .. . దొరికిన కాస్తసమయాన్ని కుటుంబం తో గడపండి.. అందరూ కలిసి ఔటింగ్ కి వెళ్ళండి.. సంతోషంగా గడపండి.. సాధ్యమైనంతవరకు ఒత్తిడిని దూరం చెయ్యండి.. 

మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. 
ఆలోచించండి.. 
ఆచరించండి.. 

స్వస్తి.. __/\__

Bobby Nani

No comments:

Post a Comment