Tuesday, May 8, 2018

జీవం నిదురించు వేళ...


జీవం నిదురించు వేళ
నే మేల్కొని ఉంటాను
ప్రసూతి భావాలు మునివేళ్ళ కొసలనుంచి 
జల జలామని రాల్తూ, 
నల నల్లని సిరాను ఒడుపుగా పట్టి 
నిగ నిగల సొగసులతో 
నిక్కార్సైన పద మాధుర్యములను
ప్రసవిస్తుంటాయి ..!!

బయట శోకంతో నిండిన ఆకాశం 
చుక్కలను రాలుస్తోంది.. 
చంద్రుడు పరచిన వెండి తువాలు మీద 
పడుకుని చూస్తున్నా..
ఏ తార ఏ రహస్యం చెపుతుందో 
విని రాద్దామని.. 
ఓ మిణుగురు పురుగు 
వెన్నెల్లో చీకటి ప్రయాణాలు చేస్తూ 
అలసి దారి మరిచిపోయిందట.. 
దారి చూపిద్దామని లేవ బోయాను.. 
చంద్రుణ్ణి దాచేసిన మేఘాలు 
ఢమఢమల ధ్వనితో అకాల వర్షం 
దవుడుతీసేలా చేసింది.. 
మిణుగురు పురుగును జేబులో వేసుకొని 
ఇంట్లోకెళ్ళి గొళ్ళెం పెట్టాను.. 
బయట వర్షం ... వెయ్యి చేతులతో నా 
తెలుపు కొడుతూ ఉంది.. 
వీధిలో రౌడీగాలుల చేతుల్లో 
పసి కొమ్మలు విల విల కొట్టుకుంటున్నాయి.. 
ఎంత దూరాన్నించి వచ్చిందో 
ఏ సందేశం చెప్పాలని వచ్చిందో 
ఈ వర్షం ..!!

వెంటనే తలుపు తీసి బయటకు వెళ్లాను 
ఆకాశానికేసి చూస్తూ నిస్తేజుడనై నిలబడిపోయాను.. 
ఒక్కో చినుకు ఒక్కో వ్యధ, వేదనను మోసుకొచ్చి 
నాపై కుమ్మరిస్తోంది.. 
వర్షంతో పాటుగా నేనూ కన్నీరు కారుస్తూ ఉండిపోయానలా..
రేపటి ఉషోదయానికి రాలిన చినుకులను పోగేస్తూ, 
కొంగ్రొత్త కవనమునకు నూతన ఊపిర్లు ఊదాలనే కృతికర్తనై..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment