Monday, May 14, 2018

ఓ ప్రశ్నార్ధక కవి..


నాటి కాలపు కవులను ఒక్కసారి పరిశీలిస్తే ఏ ఒక్కరూ వారి వారి అంతిమదశలో సుఖంగా జీవితం ముగించినట్లు లేదు.. ఏదో ఒక సమస్య.. కొందరు వేదనతో, ఇంకొందరు పేదరికంతో, మరికొందరు దుఃఖాలతో, ఇలా వారి వారి జీవితాలు ముగిసిపోయాయి.. కొన్ని దశాబ్దాలను ఏక చక్రాధిపతిగా విరాజితమైన కవులు చివరి దశలో చరమగీతాలాపనలతో స్వస్తి చెప్పారు... అలాంటి కవిని గూర్చి చిన్న అక్షర మాల.. 


చిరిగిపోయిన జేబుల్లో చేతులాడించుకుంటూ 
తిరుగుతా నేనొక్కన్నే 
నే కప్పుకున్న బొంతకు గుడ్డకన్నా కంతలే ఎక్కువ 
విచ్చుకున్న గగనం కింద కవిత్వానికి ఊడిగం చేసే బానిసన్నేను..!!
అక్షరము తప్ప మరేదీ రాదు.. !!

వెదజల్లుతా నెన్నో ఉజ్వల ప్రణయ స్వప్నాలు.. 
వున్న ఒక్క లాల్చీ మోకాళ్ళ మీద చిరిగిపోయింది.. 
ఆకాశంలో ఆశ్రయ చిహ్నంగా చంద్రబింబం విరిసింది. 
పట్టులా మెరుస్తున్న నక్షత్రాల హాసం 
బఠానీల్లా ప్రాసల్ని ఒలుస్తున్న స్వప్నజీవిపై కురిసింది.. !!

మైకం కల్పించే హిమకరణ చషకంలో నా నుదురు తడిసింది.. 
భాద్రపదరాత్రుల దారి ప్రక్కల ఒంటరినై కూర్చుని వున్నాను...
ముట్టడించినవి నన్ను ... నా వెర్రి నీడలు 
అక్షరాల కోసం నా వద్దనే వెతుకుతున్నట్లుగా.. 
చిరిగిపోయిన చెప్పుల్లో కాళ్ళు దూర్చుకుని
హృదయానికి ఒక పాదాన్ని వీణలా మలిచి
ఈ నిశీధమునకు జోలపాడుతూ, హత్తుకున్నాను 
రేపటి ఉషోదయానికి ఓ ప్రశ్నార్ధక కవినై ..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment