విరహ కవిత్వం రాయడం కవి యొక్క నైపుణ్యతను, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.. విరహంలో కూడా చుట్టూ వున్న ప్రకృతిని మిళితం చేస్తూ రాయడం వల్ల ఆ కవితకు మరింత సౌందర్యాన్ని చేకూర్చవచ్చు.. ఇందులో ఆమె ప్రస్తావన లేకుండా కేవలం ఆమెపై గల భావాలను మాత్రమే ఉద్దేశించి రాయడం జరిగింది.. అందరికీ కాకపోయినా విరహంలో వున్న కొందరికైనా నా ఈ కవిత మనసుకు తాకుతుందని ఆశిస్తున్నాను.. చదివి అభిప్రాయం చెప్తారు కదూ..
దుఃఖసాగరం ఆవలి వైపున్న నా
ప్రియ నేస్తమా.. !
నన్నూ ఆ దరికి చేరమంటున్నావా .. ??
రావాలనే ఉంది కానీ ..
నువ్వెక్కిన వయ్యారి నావ
నేనేక్కితే తిరగబడతా నంటోంది..
తన శరీరం మీద పడ్డ
నీ చరణార విందాల జాడలు
చెరిగిపోతాయనేమో ..!!
నువ్వెళుతుంటే
హృదయాన్ని చీల్చుకొని
తారల్ని రాల్చిన ఆకాశం
నే బయలుదేరుతుంటే
చిమ్మ చీకటి ముసుగేసింది..!!
నీ ముఖ చంద్రబింబం వాడుతుందేమోనని
మబ్బులచాటుకెళ్ళిన సూరీడు
నాపై నిప్పుకణికల్ని విసురుతున్నాడు.. !!
అయినా
వాటి పిచ్చిగానీ
నేనటువైపున ఎందుకు లేను..
ఎలానో నా హృదయం నీతోనే ఉందిగా.. !!
ఉగాదులొచ్చినా,
యుగాలు దాటినా,
నీకై ఎదురుచూస్తూ
కాలపు సంకెళ్ళను
లెక్కపెడుతూ ఉండిపోతానలా..!!
అప్పటికీ
ఇప్పటికీ
ఎప్పటికీ
నాకు దూరం నీ దేహం మాత్రమే
మనసెప్పుడూ నీతోనే.. నీలోనే.. !!
Written by : Bobby Nani
No comments:
Post a Comment