నవయవ్వనంలోనే
చిరిగిన వంటితో
రక్తాకాశాన్ని నిర్మిస్తున్నది
ఎవరీమె ??
కురులు విరబోస్తే
వరులు నదులు దాటారని విన్నాను..
నఖ నక్షత్రాలతో విశ్వాంతరాళాలను
భూతలం మీద నిర్మించిందని చెప్పారు..
తన పాదాల వెంట
సామ్రాజ్యాలను నడిపించిన ఆమె
ఇప్పుడు సంక్షుభిత కాసారంలా శుష్కమవుచున్నది
నరక కూపాలను గుండెల్లో దాచుకొని గమిస్తూ
నఖక్షతాలలో ఎర్రబడ్డ కాశ్మీరమయ్యింది..
ఎవరీమె ??
కనుకొలకుల్లో గొల్ల కొండలు
పరిభ్రమించాయని పాడారు..
తోడేలు చీల్చిన గొఱ్ఱేలా కొండకోనపై
వేలాడుతున్నదేంటి..??
వెదురు బొంగు యీలలో
శృతి కలిపిందని విన్నాను..
ఖండాంతరాంతరాళ నల్ల సంద్రాల ఝుంఝుంను
మోసుకొస్తున్నదేంటి ??
పాద నర్తనతో పంచభూతాలను
నడిపించిందని విన్నాను..
నేడు త్రిలింగ దేశము జానెడు నేలనివ్వ నిరాకరిస్తోందే
యీమె ఈ దేశానికి మూలమా.. ?
ఈ దేశం ఈమెకు మూలమా.. ?
నిరాకరించిన కవులే
ఆమెను అందుకోలేక
నీడల జాడలలో నిరక్షరాలు పొదుగుతున్నారు
ఆమె గుంపుగా నున్నప్పుడు
కవి వ్యక్తిగా
ఆమె దేశమైనప్పుడు కవి గుంపుగా
ఆమె ఖండమైనప్పుడు కవి దేశంగా
ఆమె ప్రాకృతికమైనప్పుడు కవి వైయక్తికంగా
అందనంత ఎత్తుగా ఆమె ఎదిగిపోతున్నది..
ఆమెలోనే నిండిపోవాలని
ఆమె (ఒడి)లోనే పోవాలని ఆరాటం
ఆమె రాజ్యమని అందుకోబోయాను
కానీ,
ఆమె ప్రకృతని అప్పుడే తెలిసింది.... !!
Written by : Bobby Nani
No comments:
Post a Comment