ముగ్ధత్వంతో కూడిన ఓ ప్రేమ..
**********************
ఎలా చెప్పను ఆమెకు..
ప్రతీ క్షణం తన ధ్యాసేనని..
ప్రతీ గడియా ఆమె ఆలోచనేనని ..
ఎన్నో ఊసులు .. తన గురించి
అవన్నీ తళుక్కున హృదిలో మెరవగానే
పెదవులపై ఓ చిరునవ్వు మొలుస్తుంది.. !!
ఆమె ఊహల్లో విహరిస్తుంటాను..
నెమలి రంగు చీరకట్టి
కుచ్చిల్లలో దూర్చిన కొంగు జారి
పైట నిలవనంటుంటే..
పరధ్యానంలో వున్న ఆమె
పైట సవరించుటలో
తెలియకుండా కుచ్చిల్లలో దోపిన చేతి వేళ్ళకు
అంటుకున్న పిండి,
నడుము చల్లంగ తాకి
జివ్వుమన్న నవనాడులతో
ఈ లోకానికొచ్చిన ఆ పడతి సిగ్గులే నాకు
కనిపిస్తున్నాయి.. !!
సంధ్యాస్తమ సమయంలో
మొక్కలకు నీరోసే సమయాన
పిక్కలపైకెత్తిన చీర కుచ్చిల్లతో
వాలుజడల వయ్యారి కులుకులతో
సగం తడిసిన దేహంతోనున్న ఆమెను
ఓ పిల్ల తెమ్మెర ఆర్తిగా వచ్చి హత్తుకుంది..
కనురెప్పలు రెండూ భారంగా మూతపడిన వేళ
చిగురుటాకు నుంచి చెక్కిలిపై రాలిందో నీటి బిందువు..!!
అరవై క్షణాలలో
ఇంత ఇష్టానికి ముగింపుంటుందంటావా..??
మనిద్దరికీ లింగభేదాలెక్కడివి ?? ఒకే దేహమైతే.. !!
నీ నుంచి నే కోరుకునేదొక్కటే
చీకటి రాత్రుల్లో,
నచ్చిన ఏకాంతాల వెన్నెలలు తోడై
పక్క పక్కగా నడుస్తూ
ఎక్కడో ఎదురెదురుగానో
పక్క పక్కన చేయీ చేయీ
రాసుకుంటూ,
లోలోన రగులుతున్న జ్వాల
ఎగిసిపడుతున్న వేడి ఆవిర్లు విరజిమ్ముతుంటే
వెన్నెల ఆరబోతలలో
మసక ఆనవాల్లతో నిను పోల్చుకుంటూ
మత్తు దిగని పదాల సొగసు
కవిత్వపు దేహంపై యవ్వనపు ఛాయల్లో
ఉభయులమూ పారాడాలి..
కాటన్ చీర దాచలేని నడుము మడతల్లో
బారాలకి.. చేతి సాయపు భరోసా లేపనాలు పూస్తూ..
నిన్నదుముకుంటూ .. వెచ్చని ఆశలతో
అంతముండని వాంఛతో
రేయంతా కాదే ..
జీవితకాలమంతా నిడివి కలిగిన
సుదీర్ఘ రేయిలో అలుపెరగని
జంట ప్రయాణం చెయ్యాలి..
మరి చేస్తావా .. ??
Written by : Bobby Nani
No comments:
Post a Comment