Wednesday, December 6, 2017

జీవన వాహిని..


చర చర బిర బిర చేర ..రావే 
నీ అడుగుల సడి నే నృత్యము విన!!

ప్రేయసి అనురాగ భావనా 
జీవన వాహిని.. రావే!!

సిగ్గుల మొగ్గలు శిరమున దాల్చి 
బుగ్గల నిగ్గుల కెంపులు పొంగగ 
గగన వీధిలో ఇంద్ర ధనువు వలె 
కదిలి రావే నా ముంగిటకు !!

గిరి శిఖరాల పరువులు తీసే 
మేఘ మాలికల లోన దాగిన 
తటిల్లతను తలపించు రీతిలో 
తరలి రావే నా చెంత చేరగా!!

పొంగి పొరలు జలపాతపు శోభను 
పొంచి చూచు రాయంచ విధాన 
నడిచి రావె అందాల భామినీ 
నడకలోని నీ కులుకులు చూడ !!

అందీ అందని చందమామ వలె 
అడవిలోన చరియించు లేడి వలె 
మెయిలు రాకకు పరవశించిన 
ముద్దుల శిఖి వలె నర్తించ రావే !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment