“చలి” నను కౌగిలించిన వేళ...
**********************
చెక్కిలి మీద
సనసన్నగా తాకుతూ
చిరు గాలుల ముద్దులతో
ఓ పిల్లగాలి నను చుట్టేసింది.. !!
నాకన్నా ముందే
త్వర త్వరగా ఇంటికి చేరిపోయే
సాయంత్రాల వెలుగు రేఖ
నను జాలిగా చూస్తోంది.. !!
వణుకుతున్న
పుడమితల్లి వంటి మీద
రంగు రంగుల దుప్పట్లు
నను దయతో కప్పుతున్నాయి.. !!
మరణశయ్యపై నున్న సూర్యుని
చిట్టచివరి వెచ్చని కిరణం
నను ముద్దాడి ముద్దాడి
విషాదంగా వెళ్తోంది.. !!
రెక్కల మీద మంచు
ముత్యాలు పొదుగుకొని
పక్షులు ఆలపించే
సామూహిక వీడ్కోలు గీతాలై
నను లాలిస్తున్నాయి.. !!
చిటారు కొమ్మమీంచి
రాలుతున్న చిట్ట చివరి ఆకుల
వెచ్చని ఊపిరులు
ఆర్తిగా నను స్పృశిస్తున్నాయి..!!
అయినా చలి తగ్గదే..
చలి కప్పిన దేహానికి
చెలి స్పర్శే మందనిపించింది..
చేతులు చాచి
బిగుతు బాహువుల్లోకి
“చెలి”నాహ్వానించాను
వెనువెంటనే
గుండెలోని పిల్ల
గుండెలపై వాలింది..
చలి కౌగిళ్ళనుంచి విడిపడి
చెలి పరిష్వంగములో
ఒదిగిపోయాను..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment