Thursday, November 30, 2017

ఆమె అధరముల వద్ద నేనో పిల్లనగ్రోవిని..



ఆమె అధరముల వద్ద నేనో పిల్లనగ్రోవిని.. 
******************************

నువ్వు ఏ తెల్లవారు ఝామున 
మంచం దిగి నడచి పోయావో తెలియదు... 
వొంటరి దుప్పటి నన్ను 
ఊపిరాడకుండా కౌగిలించుకుంటోంది 
కలల్ని విడిచి కళ్ళు రానని మొండి చేస్తున్నాయి.. 
నువ్వు నడిచి వెళ్ళిన మంచం దగ్గరనుంచి ఓ మార్గంలా 
సువాసనా పరిమళాలు గాల్లో తేలుతూ వస్తున్నాయి.. 
ఒక్కసారిగా లేచి కూర్చున్నాను.. 
చీకటి కరిగి వెలుతురు ఉదయిస్తోంది.. 
ఆ పరిమళాలను శ్వాసిస్తూ 
అటువైపుగా అడుగులేశాను.. !!
దారిలో .. 
కొబ్బరిచిప్పలోని ముగ్గు పిండి పలకరించింది.. 
నను తాకే ఆ సుతిమెత్తని మునివేళ్ళు యెక్కడని.. !!
వెతుకుతున్నానన్నాను .. 
మరికొంత దూరంలో ..
కొమ్మమీద కోయిల దిగాలుగా ఉంది.. 
కుహూ కుహూ కి బదులుగా ఉహూ ఉహూ అంటోంది.. 
ఏమైందనడిగాను .. 
ఆమె కంఠస్వర మాధుర్యం తనకన్నా బాగుందని విలపించింది.. 
నవ్వుకుంటూ ముందుకు వెళ్లాను.. 
దట్టమైన పొగమంచు ఆనందంతో ఎదురైంది.. 
ఎందుకా ఆనందం అని అడిగాను.. 
ఆమె ఎదకు నా గుండె తగుల్తూంటే 
ఆమె ఊపిరి మల్లెల సువాసన గుబాళిస్తూంటే 
ప్రశాంతంగా సముద్రంలోకి జారిపోతున్న 
సూర్యుడిలా ఆమె కౌగిళ్ళ ఆనంద కెరటాల్లో 
కరిగిపోయానని చెప్పుకొచ్చింది.. !!
కోపంతో ముందుకు నడిచాను.. 
కొమ్మా, కొమ్మా పలకరిస్తుంది.. 
ఆకూ, ఆకూ ఆమెను వర్ణిస్తోంది... 
అలా వెళ్తూనే పర్వత శిఖరాల అంచుకు చేరుకున్నాను.. 
జఘనముల క్రిందకు జాలువారు కేశసౌందర్యముతో.. 
ఓ అద్బుతమైన నాట్య భంగిమతో ..
అటు తిరిగి నిల్చోని ఉషోదయాన్ని చూస్తోందామె..
గొంతు సవరిస్తూ... పలకరిద్దామనుకునే లోపే.. 
తనే నా వైపుగా తిరిగింది.. 
కనురెప్పలా అవి.. ఊ...హు.. గులాబీ రెక్కలు.. 
ఆమె కళ్ళ సూర్యరశ్మిలో చిలిపి కాంతి రేఖల్ని 
పోగు చేసుకుంటున్నా.. 
పాలపుంత ఆకాశంలో అదృశ్యమై 
నా ఎదుట నిలబడినట్లు తోచింది. 
నాకోసమే వచ్చావా.. అంటూ నన్ను అమాంతం హత్తుకుందామె .. 
ఆమె బిగుతు కౌగిళ్ళలో వెన్న ముద్దలా కరిగిపోతున్నా.. 
నిశ్శబ్దంగా కోరికల సముద్రంలోకి జారిపోతున్నా.. !!
నా చెక్కిలికి ఆమె కేశములు తాకుతున్నాయి.. 
అవి కేశములో... లేక నల్లని సిల్కు దారాల 
మల్లెల గుంపో నాకు తెలియలేదు.. 
నన్నో పిల్లనగ్రోవిని చేసి ఆమె పెదవులతో.. 
ప్రేమ గీతాల్ని ఆలపిస్తోంది.. 
అదో ఆనంద పారవశ్యం.. 
రెప్పలు రెండూ భారంగా మూతపడే తన్మయత్వం ...!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment