వివాహ పద్దతిలో రావలసిన మార్పులు
****************************
ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే..
ఆచరించమని చెప్పట్లేదు.. ఆలోచించమని చెప్తున్నాను.. !!
ప్రేమలేని పెళ్ళి ఉన్నంత కాలం .. పెళ్ళి లేని ప్రేమలు వుంటూనే ఉంటాయి..
ప్రేయసి, ప్రియుల పరస్పర సాహచర్యం, అవగాహన, సమ్మతి ప్రేమగా వికసించిన దశలో వారిరువురి సంతోష ప్రదమైన కలయికే వివాహం.. ఆ వివాహ బంధంలో భర్త రక్షకుడు, భార్య రక్షితగా ఉండదు.. అక్కడ నిజమైన భాగస్వామ్యం ఉంటుంది.. అలా కాక కేవలం లైంగిక నీతికి, వంశోద్ధరణకు, సంప్రదాయ విలువలకు ప్రాతినిధ్యం వహించే వివాహాలు దంపతుల మనస్సుకూ, మమతకూ విలువకట్టవు.. ఆ పెళ్ళిళ్ళకు కులాలు, అంతస్తులు, అధికారాలు, బంధుత్వాలు ప్రాతిపదికలుగా ఉంటాయి.. ఆ పెళ్ళి వల్ల స్త్రీ తన స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతుంది.. తన వ్యక్తిత్వాన్ని విస్మరించి కేవలం వంట ఇంటికి, పడక ఇంటికి పరిమితమై పోతుంది..
అసలు కుటుంబ వ్యవస్థకు దాంపత్య జీవితం చుక్కానిలాంటిదైతే.. అదే దాంపత్య సౌఖ్యానికి వివాహం పునాదివంటిది.. కనుక వివాహం అనేది వధూవరులకు మాత్రమే సంబంధించి ఉంటుంది.. కాని ఆ కుటుంబం సమాజ వ్యవస్థ గతి క్రమానికి మార్గదర్శకం అవుతుంది.. అందువల్లే సమాజ ప్రగతికి అనుగుణంగా వైవాహిక పద్దతులు, దాంపత్య వ్యవస్థలను సరిదిద్దుకుంటూ, మార్పులను గౌరవిస్తూ, విలువలను గుర్తిస్తూ, మనమే ఆధునిక విధానాలను అన్వేషించాలి..
అసలు వివాహ వ్యవస్థ సమూలంగా మారాలని ఆధునికులు అలజడి చేస్తుంటే.. ఏ పరిస్థితిలోనూ మార్పు అసహజమని వివాహబంధం శాశ్వతమని, అది చాలా పవిత్రమైనదని సనాతన సంప్రదాయ కర్తలు ఘోషిస్తున్నారు..
కనుక వివాహ బంధనాలు ఏనాటివి ??
అవి ఈ నాటికీ అనుసరణీయాలా .. కాదా
అసలు ఈ వివాహ పద్దతులు ఎందుకు మారాలి ??
ఎలాంటి మార్పులు రావాలి ??
అనే దానికి ముందుగా వివాహ పద్దతుల పూర్వాపరాలు విచారించటం ముఖ్యం..
అప్పుడే మార్పులు, చేర్పులు, కూర్పులు గురించి చెప్పుకోగలం..
నాగరిక సమాజం ఆవిర్భావం నుంచి వివాహ వ్యవస్థ ఏదో ఒక రూపంలో వుంటూనే ఉంది.. అది మనం కానీ, మన పూర్వీకులు కానీ ఆలోచించి ఒక నిర్దిష్ట రూపం ఏర్పరిచినట్లు దాఖలాలు లేవు. మానవుడు జంతుదశ నుంచి విడిబడిన దశలో గుంపులుగా జీవించేవారు.. అప్పుడు వయోతేడాలు, రక్త సంబంధాలు గురించి ఆలోచన వుండేది కాదు.. ఉమ్మడి వివాహ బంధంతో ఉండేవాడు.. పరిణామ దశలో ఒక్క జంటగా మాత్రమే మన గలిగేలా స్థితి వచ్చింది.. సమాజ గుర్తింపుకు, చట్టపరమైన హక్కులకు వివాహ విధి అవసరమైంది.. దేశ కాల పరిస్థితులను బట్టి కొన్ని పద్దతులు వచ్చాయి.. మతాల వారిగా, కులాల వారీగా కొన్ని ఆచారాలు పాటిస్తూ వచ్చేవారు.. క్రైస్తవ వివాహం దేవుని సాక్షిగా మత గురువు ఆధ్వర్యములో విధిగా చర్చి లోనే జరగాలి.. ఇందులో వధువు వరునికి విధేయతగా ఉంటానని ప్రమాణం చెయ్యాలి.. ముస్లింల వివాహం ఇంత మహార్తో ఫలాని ఆయన నిన్ను పెళ్లాడుతాడు ఇష్టమేనా అని అడుగుతారు.. ఇది వధూవరుల మధ్య ఓ పవిత్ర ఒప్పందం క్రింద లెక్క..
1956 లో ప్రత్యేక వివాహ శాసనం వచ్చింది.. ఇందులో విభిన్న జాతుల, కులాల, మతాల, దేశాల, బాషల, తెగల వారి మధ్య ఈ వివాహాలు చెల్లుతాయి.. వారికి భారత వారసత్వ శాసనం వర్తిస్తుంది..
సనాతన హిందూ వివాహ విధానంలో కన్యాదానం, పాణిగ్రహణం, సప్తపది ఉంటాయి.. పురుషర్ధములైన ధర్మము, అర్ధము, కామము, మోక్షము కేవలం భార్య వద్దే దొరకునని అందుచేతనే నా ఇంట లక్ష్మిని మీ ఇంటకు పంపిస్తున్నాను అని చెప్తూ తండ్రి ఆ వరునికి దానమిస్తాడు..
ఆదర్శ వివాహంలో కట్న కానుకలకు తావు ఉండదు.. మహూర్త బలం ఉండదు.. వధూవరులు ఒకరినొకరు ఎన్నుకొనుట జరుగుతుంది.. మనసులు మార్పిడే అందుకు గుర్తు.. జీవితాంతం కలిసి వుంటాం అనే ప్రమాణం ఉండదు.. ఈ పెళ్ళికి ఆడంబరాలు అసలే వుండవు..
ఈ మధ్య కాలంలో స్వేచ్చా ప్రణయం ఒక వాదంగా వచ్చింది.. పరస్పర ప్రేమానురాగాలు, సానుభూతి స్పందన వారి కలయికకు ఆలంబనాలుగా ఉంటాయి.. ప్రేయసి, ప్రియుడు కూడా బల్కుకొని కలిసి కాపురం చేస్తారు.. ప్రేమ లోపించిన నాడు ఏ రభసా, సామాజిక దౌష్ట్యం లేకుండా, కోర్టుకు ఎక్కకుండా విడిపోతారు..
వివాహపద్దతుల్లో రావలసిన కొన్ని ముఖ్యమైన మార్పులు నా అభిప్రాయాలలో..
ప్రేమ వివాహాలకు అనుగుణమైన వాతావరణాన్ని ప్రస్తుత సమాజం కల్పించాలి.. అన్నా, చెల్లి కలిసి వెళ్తున్నా అనుమానిస్తున్న సమాజ వక్ర దృష్టి మారాలి..
యువతకు వివాహ నిర్ణయాలలో పెద్దల ప్రమేయం లేనినాడే వరకట్న సమస్యలు తొలగిపోతాయి..
కుల, మత తేడాలు నశించి పోతాయి.. స్త్రీ, పురుషుల హెచ్చుతగులు అంతరించి పోతాయి..
కట్నాలకు, ఆడంబరాలకు వెచ్చించే ధనాన్ని ఆమె విద్యకు వినియోగిస్తే ఆమె కాళ్ళపై ఆమె నిలబడుతుంది..
అప్పుడు తగిన భార్యకై పురుషులే అన్వేషిస్తారు...
స్త్రీకి మాత్రమే పెళ్ళి అవసరం అనే భావదాస్యం తొలగిపోతుంది.. పురుషుని రక్షణ మీద, పోషణ మీద ఆధారపడి జీవించే స్థితి స్త్రీకి తొలగిపోతుంది.. తనను తాను పోషించుకోగల స్త్రీ స్వేచ్చ, నిర్ణయాలు చేసే స్తోమత ఆమెకు వస్తుంది....
మారాల్సింది వివాహ పద్దతులు మాత్రమే కాదు.. మన మనస్సులలో, మన విధి విధానాలలో, మన ఆచార వ్యవహారాలలో మార్పు రావాలి.. అమ్మాయిలు స్వతంత్ర బుద్దిని, చొరవనూ, ధైర్య సాహసాలను ప్రదర్శించాలి. తమ జీవిత భాగస్వాములను ఎన్నుకొనే స్వేచ్చ వారికి రావాలి.. భావాలలో కలయిక, ఆప్యాయత, అనురాగం లేనివారితో పెళ్ళి జరిగితే అది నరకప్రాయం అవుతుంది..
మహిళల్లారా జాగ్రత్త వహించండి.. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. ఇదొక్క విషయంలోనే కాదు.. మీకు జన్మించిన మగ బిడ్డలను కూడా స్త్రీ, పురుష సమానత్వంతో పెంచండి.. ఈరోజు పిల్లాడే రేపు పురుషుడై ఎంతో మంది మహిళల కన్నీటికి కారణభూతమౌతాడు .. అందరి మహిళల గురించి ఇక్కడ ప్రస్తావించలేదని మనవి చేస్తూ వున్నాను..
స్వస్తి __/\__
Written by : Bobby Nani
No comments:
Post a Comment