Thursday, November 2, 2017

//// జీవిత రహస్యం..\\\\


//// జీవిత రహస్యం..\\\\ 
*****************

జీవితం రహస్యంగానే ఉంటుంది.. 
నీ చుట్టూ పహారా కాస్తున్న చెట్లు మాత్రం 
మౌనంగానే ఉంటాయి.. 
ఎన్నో యేండ్ల అనుభవాన్ని గడించినా, 
జీవన రహస్యాన్ని గమనించినా, 
నీకూ, నాకూ, ఏమీ చెప్పవు.. 
జడపదార్ధాలనుకునేవు .. కానే కావు 
రోజుకో కొత్త ఆకు చిగురిస్తుంది.. 
ఓ కొత్త పూవు పూస్తుంది 
పూసిన పువ్వులోంచి కాయ పోడుచుకొస్తుంది 
కాయలోంచి విత్తొస్తుంది 
విత్తు మళ్ళీ నేల లోకే పాకుతుంది.. 
నిటారుగా నిలబడి తపస్సు చేస్తుంది.. 
రెండాకుల్ని చాపి సూర్యుణ్ణి, గాలినీ పిలుస్తుంది.. 
నిన్నూ, నన్నూ చూస్తూ నవ్వుతూ ఎదుగుతుంది.. 
జీవితం మాత్రం రహస్యంగానే ఉంటుంది.. 
రహస్యంగానే ఉండిపోతుంది.. 
ఈ రాళ్ళూ, రప్పలు
ఈ మురికి గుంటలూ, పూరి గుడిసెలూ
ఈ జనాలు ఎక్కడ పట్టినా గంటలు గంటలు నిలబడటాలు 
ఇవన్నీ నీకు ఎందుకో అంతుపట్టదు 
నాల్గు రాళ్ళ కోసం నక్కకీ, కుక్కకీ నమస్కారాలెట్టడం 
సంస్కారాలను పక్కన పెట్టడం.. 
రెండక్షరాల, రెండు క్షణాల ప్రేమ కోసం 
జీవితాన్ని ఈడుస్తూ బరువుల్ని మోయడం 
యేభై ఏళ్ళకే ముడుచుక పోవడం .. హరీ మనటం
ఎందుకో యెంత గింజుకున్నా అర్ధం కాదు.. 
ప్రకృతికి పొట్టకోసి పరీక్షిస్తున్నాం ఉండమంటారు.. 
చివరికిదంతా ప్రకృతి సిద్దం తప్ప మరేం కాదంటారు.. 
మరణాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటావు నువ్వు.. 
అందరూ ఎందుకు మరణిస్తున్నారో తెలీదు నీకు.. 
తెలుసుకోవాలనుకుంటావు ...పురాణాలు తిరగేస్తావు.. 
పుణ్య పురుషులతో సుదీర్ఘంగా చర్చిస్తావు.. 
ఏదో తెలుసుకున్నట్లే అన్పిస్తుంది.. 
అర్ధమయినట్లే తోస్తుంది.. 
తపస్సు చేస్తున్న మునులు కలలోకి వస్తారు.. 
తిరుపతి వెంకన్న నిన్నే పిలుస్తున్నట్లు తోస్తుంది.. 
తల నున్నగా రుద్దుకుంటూ ఇంటికి వస్తావు.. 
వచ్చిన వారం దాకా హరినామ సంకీర్తనల్లో లీనమౌతావు.. 
రహస్యం తెలిసిపోయినట్లే తోస్తుంది.. 
మళ్ళీ నిన్ను 
మోకాళ్ళ లోతు నీళ్ళనుంచి లేచి వస్తున్న 
కన్నెపిల్ల కవ్విస్తుంది.. 
అరటి చెట్లూ,
చెట్ల తోపులూ నిన్నూపేస్తాయి 
నిన్నటికీ, 
నేటికీ తేడా తెలీదు నీకు.. 
నిన్న తిన్న పకోడీలు మళ్ళీ నీకు నోరూరిస్తాయి.. 
జీవితం రహస్యంగానే ఉండిపోతుంది.. 


పొలాల్లో పెరుగుతున్న పచ్చ గడ్డీ 
గుంపులు గుంపులుగా పుట్టుకొస్తున్న కొబ్బరి చెట్లూ 
యెర్ర రంగు పులుముకున్న ఆకాశపు సాయంత్రం 
వానతో వెలిసే రంగుల హరివిల్లు 
సముద్రం నీలంలో స్నానం చేస్తున్న తెల్ల కొంగలూ 
ఇవన్నీ సంభ్రమాశ్చర్యాలలో 
నిన్ను ముంచేసి ఆలోచించనివ్వవు 
నీ ప్రశ్నలకి సమాధానమివ్వవు.. 
జీవితం మరీ రహస్యం అయిపోతుంది.. 
తెర వెనుక నిల్చోని తోలుబోమ్మలాడిస్తున్న 
రహస్యాంగన అతి రహస్యంగానే ఉండిపోతుంది..
ఇదే జీవిత రహస్యం.. 
ఎవ్వరికీ అంతుచిక్కని మర్మ రహస్యం.. !!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment