Monday, October 30, 2017

మీరు నమ్మినా, నమ్మకున్నా మన మధ్యన అంతుచిక్కని, ఊహకందని రహస్యాలు ఎన్నో వున్నాయి..


మనిషికి శరీరం, ఆత్మ రెండూ ఉన్నాయి... శరీరాన్ని స్థూలరూపమని, ఆత్మను సుక్ష్మరూపమని అంటారు. శరీరం నశిస్తుంది కాని ఆత్మకు చావు లేదు. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. చావు అంటే శరీరానికి, ఆత్మకు కలిగే ఎడబాటు. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడమే మరణం. ఆ తర్వాత శరీరం ఎన్నటికి ఉనికిలోకి రాదు. ఇది అందరికీ తెలిసినదే.. కాని మనకు తెలియని మరో ప్రపంచం మన ఊహాగానాలకు సైతం అందకుండా అవతలి వైపున మరోటి ఉందని మనకు తెలియదు.. కొన్ని కొన్ని సంఘటనలు, విషయాలు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు లేదా విన్నప్పుడు మాత్రమే మనకు అది నిజమనిపిస్తుంది... 

ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని సంఘటనలు కొందరికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కాని మనకు తెలియనిది మన చుట్టూ అనేకం ఉందని మనం గ్రహించాలి.. 

ఇక విషయంలోకి వెళ్తే.. 

రెండు సంవత్సరముల క్రితం నెల్లూరు టౌన్ హాల్ నందు యువ రచయితల గౌరవార్ధం గా ఓ సన్మాన సభను నిర్వహిస్తూ తోటి రచయితనైన నన్ను సదరు సభకు ఆహ్వానించడం జరిగింది.. ఆ సభలో అందరూ వారి వారి ప్రసంగాలతో శ్రోతలను మంత్రముగ్ధులను గావిస్తున్నారు... కాని నన్ను మాత్రం ఒకే ఒక్క ప్రసంగం మాత్రం బాగా ఆకట్టుకుంది.. అది గౌరవనీయులైన శ్రీ జ్ఞానేశ్వర్ గారు ప్రసంగించినటువంటి ఆయన జీవిత ప్రయాణము ... 

ఆయన ఏమన్నారంటే ?? 

నేను ఈ రోజు ఇక్కడ, ఈ సభలో మాట్లాడుతున్నాను అంటే నా నుంచి మీకేదో తెలపాలని భగవంతుడు భావిస్తున్నట్లు ఉన్నాడు ... అని అంటూ నాకు గుండె జబ్బు ఉంది ... ఒకరోజు అనుకోకుండా విపరీతమైన నొప్పితో కుప్పకూలి పడిపోయాను.. మావాళ్ళు నన్ను హాస్పిటల్ కి తీసుకువచ్చారు.... నా గుండెకు సంబంధించిన వాల్స్ అన్నీ బ్లాక్ అయిపోయినట్లు డాక్టర్లు గ్రహించారు .. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని అన్నారు.. అదే సమయంలో నేను కొన్ని క్షణాలు కదలకుండా పడిపోయాను.. డాక్టర్లు నా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం గమనించారు వెంటనే నా గుండెను స్పందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు .. కొన్ని క్షణాల్లో అప్పటివరకూ నేను అనుభవిస్తున్న నొప్పి తగ్గిపోయింది.. ఏంటో తెలియదు చాలా నూతన అనుభూతి నన్ను ఆవరించింది. దూదిలా నా దేహం మారిపోయింది .. చాలా హాయిగా అనిపించింది అలా అనిపించిన కొన్ని క్షణాల్లోనే నా కళ్ళు తెరుచుకున్నాయి.. ఎదురుగా నా చుట్టూ ఓ అయిదు మంది దాకా డాక్టర్లు వున్నారు.. తరువాత ఆపరేషన్ పూర్తి అయింది కొన్ని రోజులతరువాత నేను డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఓ డాక్టర్ నా దగ్గరకు వచ్చి మీకో విషయం తెలుసా ?? మీ గుండె కొన్ని క్షణాలు ఆగిపోయింది.. అంటే మీరు వైద్య పరంగా ఆ క్షణాలలో మరణించారు అని అన్నారు.. ఆ విషయం నాకు తెలుసు డాక్టర్ దాన్ని నేను అనుభూతి చెందాను.. అంతే కాదు నేను గాలికన్నా తేలికగా మారడం గ్రహించాను ... ఒకే స్థానంలో నేను ఉండలేకపోయాను కదిలిపోతూ వున్నట్లు నాకు అనిపించింది.. అది ఎలా అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగామి తన బరువు తెలియకుండా, గురుత్వాకర్షణ లేని అనుభూతిని ఎలా అయితే పొందుతాడో సరిగ్గా అలాంటి అనుభూతినే నేను ఇక్కడ పొందాను.. ఎవరో నన్ను మళ్ళి వెనక్కి బలంగా లాగినట్లు అనిపించింది ... అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ మీరంతా వున్నారు అని ఆయన చెప్పిన మాటలకు డాక్టర్ కి ముచ్చెమటలు పట్టాయని ఆయన తెలుపారు.. అంతే కాదు ఇక అప్పటినుంచి నా రచనలు మరింత శక్తివంతమైనవి అయ్యాయని ఆయన అన్నారు.. నాలో పాజిటివ్ ఎనర్జీ, ఆత్మస్థైర్యం పెంపొందాయని ఆయన పేర్కొన్నారు..

కాస్త నా పరిబాషలో శాస్త్రీయ పరంగా చెప్పాలంటే ... మన మధ్య పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనే రెండు ఉంటాయి .. అది కొందరు దేవునిగాను, దెయ్యంగాను అనుకుంటూ ఉంటారు.. అవన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి ?? 

ఏదైనా ఒక గంట చిన్న శబ్దం తో మ్రోగుతూ ఉంటే చెవులనుంచి శబ్ద తరంగాలు సూటిగా మన దేహంలోని ప్రతీ అణువునూ స్పృశిస్తూ ఆ గంట నుంచి వస్తున్న వినసొంపైన ధ్వని ఇంకా ఇంకా వినాలి అనిపించేంత ఉచ్చుకతను మనలో కలిగిస్తూ ప్రేరేపిస్తాయి .. అలాగే బాగా చలిగా వున్నప్పుడు వెచ్చని మంట వొంటికి తగులుతుంటే కూడా మనలో ఓ నూతన శక్తి ఉత్పన్నం అవుతుంది.. ఇలాంటి వాటినే పాజిటివ్ ఎనర్జీ అంటారు.. 

ఇకపోతే నెగటివ్ ఎనర్జీ అంటే ఏంటి ??

పైన చెప్పిన అదే గంటనే తీసుకుందాం .. చిన్న శబ్దంతో మ్రోగుతున్న ఆ గంట పెద్ద శబ్దంతో కర్ణభేరి చిట్లేలా వినపడుతుంటే, మనం ఆ శబ్దాలను వింటూ అక్కడ ఉండగలమా ?? మనలో తెలియని వికారమైన కోపం, బాధ ఉత్పన్నం అవుతాయి.. ఆ సమయంలో విచక్షణ కోల్పోతాము.. సరిగా ఆలోచించలేము.. చాలా అసహనంగా, విసుగ్గా అనిపిస్తుంది.. అలానే ఎక్కువ చలిగా వున్నప్పుడు మంటకు మరింత దగ్గరగా వెళ్తే చర్మం చర చరమని కాలుతూ ఉండేలా ఉండగలమా.. ఉండలేము.. ఇలాంటి వాటినే నెగటివ్ ఎనర్జీ అంటారు.. మన శరీరం ఏది పడితే అది తనలోకి తీసుకోలేదు.. తను భరించేది మాత్రమే తీసుకుంటుంది.. తనకు కావాల్సింది మాత్రమే స్వీకరిస్తుంది.. 

ఇప్పుడు ఉపనిషత్తులు పరంగా వస్తే.. మన దేహానికి, ఆత్మకు ఓ బలమైన సంబంధం ఏర్పడి ఉంటుంది.. వెండి గీత వంటి ఓ త్రాడు ఆత్మకు, దేహానికి మధ్య వారధిలా ఉంటుంది.. అంతేకాదు ఆ రెంటినీ కలిపి కట్టబడిన ఓ రబ్బరు త్రాడులా సాగుతూ వాటి మధ్య దూరం ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ కలిసిఉంటుంది... 

మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం .. వొల్లుతెలియకుండా నిద్రపోతున్నాడేంటి వీడు అని.. అలాంటి సందర్భాలలో మన ఆత్మ దేహం నుంచి బయటకు వస్తుంది.. ఆ వెండి గీత గుండా ప్రయాణించి మనకన్నా ముందు మన ఆత్మ ఈ వాస్తవ ప్రపంచంలో తిరిగి వస్తుంది.. చాలా మందికి ముందు జరిగే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి.. (include me).. అంటే వారి ఆత్మ వారికన్నా ముందుగానే ఆ దృశ్యాన్ని కాని, విషయాన్ని గాని చూసి లేదా విని వచ్చి ఉంటుంది.. నిజానికి కొందరు అది మర్చిపోయి ఉంటారు.. అదే దృశ్యం గాని, విషయం గాని వారి చెవిన పడినా, చూసినా ఇది ఇంతకుముందే జరిగిన అనుభూతికి వారు లోనౌతూ ఉంటారు.. మరి కొందరి విషయంలో అలా కాదు.. వారికి గుర్తుంటుంది కాని ఇది నిజమా, అబద్దమా అనే అయోమయ ఆలోచనల్లో ఉంటారు.. నిజమని తెలిసిన రోజున ఆశ్చర్యపోతూ అందరికీ చెప్తే నవ్వుతారని ఎవ్వరికీ చెప్పుకోలేక వారిలో వారే మదనపడుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందనే ఆవేదనతో ఉంటారు... 

ఇలాంటి మరో సంఘటన మన భారతీయ సంతతికి చెందిన మహిళ అనితా మూర్జానీ గారికి జరిగింది.. ఆమె అమెరికాలో హాంకాంగ్ లో స్థిరపడ్డారు.. ఆమె క్యాన్సర్ వ్యాధితో శరీరమంతా నిమ్మకాయ వంటి కణతులతో బాధపడుతూ వుండేవారు.. అలా వుండగా ఓ రోజు ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు.. నాలుగు రోజులు తరువాత డాక్టర్ లు ఆమె చనిపోయిందని నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.. ఆ తరువాత ఆశ్చర్యకరమైన సంఘటన యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది.. అదేంటంటే ఆమె తిరిగి బ్రతకడమే కాకుండా ఆమెకు వున్న క్యాన్సర్ వ్యాధి కూడా పూర్తిగా నయమైపోయింది.. 

విషయంలోకి వెళ్తే ..

ఆమె చెప్పిన మాటలు .. నా శరీరంలో విపరీతంగా కణతులు పెరిగిపోయాయి.. నా ఊపిరితిత్తులలో నెమ్ము చేరిపోయిది.. నా అవయవాలన్నీ పనిచెయ్యడం ఆగిపోయాయి.. అప్పుడే డాక్టర్ లు నేను చనిపోయానని నా కుటుంబ సభ్యులకు తెలిపారు.. నేను చూస్తూ వున్నాను.. నా శరీరం నిర్జీవంగా అక్కడ పడివుంది..నా చేయి పట్టుకొని నా భర్త ఏడుస్తూ వున్నారు.. డాక్టర్ లు కూడా అక్కడే నిలబడి నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వున్నారు.. నా చుట్టూ ఏం జరుగుతుందో నేను చూడగలుగుతున్నాను.. ఆ సమయంలో నా చుట్టూ వున్న పరిధి చాలా విశాలంగా మారిపోయింది.. నా చుట్టూ వున్న వాతావరణమే కాకుండా అంతా కొత్త అనుభవానికి నేను లోనయ్యానని, నాలుగేళ్లగా క్యాన్సర్ తో విపరీతమైన బాధను అనుభవించానని ఆమె తెలిపారు.. నా శరీరం నుంచి బయటకు వచ్చాక చాలా తేలికగా వున్నట్లు, మళ్ళి వెళ్ళాలని అనిపించలేదని ఆమె అన్నారు .. ఎందుకంటె నా శరీరంలో అన్నీ భాగాలు పాడైపోయాయని ఆమె పేర్కొన్నారు .. ఆ అనుభూతిని స్వయంగా చూస్తేనే తెలుస్తుందని.. దాన్ని వర్ణించడం సులభం కాదని ఆమె అన్నారు.. నా వాళ్ళందరినీ నేను చూస్తూ వున్నానని, అంతే కాకుండా నా సోదరుడు అయిన అనూప్ భారతదేశం నుంచి ఆఖరి చూపు నన్ను చూసేందుకు హాంకాంగ్ వస్తున్నట్లు, తను విమానంలో వున్నట్లు కూడా నాకు కనిపించిందని, తనతోనే ప్రయాణించానని చెప్పారు.. అంతే కాకుండా ఎప్పుడో చనిపోయిన నా తండ్రిగారు, నా ఆత్మీయ మిత్రుడు కూడా కనిపించారని వారితో మాట్లాడాకే తిరిగి నేను నా శరీరంలోకి ప్రవేశించానని ఆమె చెప్పిన మాటలకు ఆశ్చర్యం అనిపించక మానదు...

మా నాన్న గారు నీకు ఇంకా సమయం ఉందని నువ్వు తిరిగి వెళ్లాలని చెప్పారు.. అంతే కాకుండా నువ్వు జీవితంలో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు... అలానే నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో కారణం కూడా తెలిపారని అని ఆమె అన్నారు.. నిజానికి ఆమె చెప్తున్న మాటలు నమ్మసఖ్యంగా లేవు కాని ఓ సంఘటన ఇందుకు తార్ఖాణంగా కనిపిస్తోంది.. అదేంటంటే ఆమె కోమాలో వున్న సమయంలో ఓ డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారు.. అయితే అతను గాని, మిగిలినవారు కాని ఆమెకు తెలిసే అవకాశం ఎక్కడా లేదట .. ఆమె కొమానుంచి బయటకి వచ్చిన మరుక్షణం ఆ డాక్టర్ పేరు , అతను చేసిన ట్రీట్మెంట్ వివరాలు చూసినట్లు ఆమె ఆ డాక్టర్ తో చెప్పడమే కాకుండా ఆయన్ని పేరుపెట్టి పిలిచానని ఆ డాక్టర్ ఆశ్చర్యంతో వుండిపోయాడని ఆమె చెప్పారు.. అలా ఆమె చెప్పినదానికి ఓ నిదర్శనం గా మారిపోయింది.. ఆ తరువాత నేను చాలా చాలా త్వరగా కోలుకున్నాను.. నా కణతులు వారం రోజుల్లోనే 75 శాతం తగ్గిపోయాయి.. అని ఆమె చెప్పారు.. 

ఇదే విషయాన్ని మన భారతీయ తత్వవేత్త అయిన శ్రీ సుధాకర్ శర్మ గారు ఇలా చెప్తున్నారు.. మన దేహంలో పంచ ప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి ఈ పంచ ప్రాణ శక్తులు ఎప్పుడైతే శరీరంనుంచి ఉపక్రమిస్తాయో దానినే మనం మరణం అని భావిస్తాము.. పంచప్రాణాలైన ఈ అయిదు బయటకు వచ్చినా కూడా ఉప పంచప్రాణాలైన నాగ, కూర్మ, త్రికల, దేవదత్త, ధనంజయ అనే అయిదు ఉప పంచప్రాణాలు ఒక్కోసారి దేహాన్నే ఆశ్రయించుకుని అంటిపెట్టుకొని ఉంటాయి అవి వున్నప్పుడు కూడా మానవుడు పునర్జీవితుడు కావడం, భావమే, సంభవమే అని అన్నారాయన.. 

మనకు వున్న నూటొక్క నాడులలో వంద నాడులు నిర్జీవం అయినప్పటికి కూడా నూట ఒకటో నాడి ఉన్నంతవరకు ప్రాణం తిరిగి వస్తుందని మన శాస్త్రాలు చెప్తునాయి.. సరిగ్గా ఇలాంటి విషయమే అనితా మూర్జానీ గారిలో కూడా జరిగింది... ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె తనకు జరిగిన ఈ అనుభవాన్ని ఓ పుస్తక రూపంలో వ్రాసారు.. ఆ పుస్తకం పేరే "Dying to be me"...

మీరు నమ్మినా, నమ్మకున్నా మన మధ్యన అంతుచిక్కని, ఊహకందని రహస్యాలు ఎన్నో వున్నాయి.. అవి మనలోనే దాగి వున్నాయి.. విజ్ఞాన పరిధి యెంత విస్తరించినా, మానవ స్థాయి యెంత ఎత్తుకి ఎగసినా .. ఇలాంటివన్నీ ఒకరు చెప్తేనో, వింటేనో కలిగే అనుభూతులు కానే కాదు... అది స్వయంగా అనుభవించాల్సిందే.. 

స్వస్తి __/\__

Written by : Bobby Nani
 

No comments:

Post a Comment