Friday, November 3, 2017

\\\\నా సంతకం ..////


\\\\నా సంతకం ..////
***************


నీ పెదాలమీదా, 
కళ్ళమీదా,
పెదాల అంచుల పగిలే నీ నవ్వుల మీదా, 
నా సంతకం ఉంటుంది చూసుకో.. !!

నీ ఆకలి ఆతృత మీదా, 
తడికెళ్ళ నిర్మలత్వం మీదా, 
తెల్లని వక్ష స్థలం వీచే 
వెన్నెల కాంతి గోళాల ద్రాక్షపళ్ళ మీదా,
నా సంతకం ఉంటుంది చూసుకో.. !!

నీ చిన్నప్పటి రెండు జళ్ళ 
గులాబీ గౌన్ల అమాయకత్వం మీదా,
చెంగు చెంగున గెంతే నీ పాదాల 
చిరుసవ్వడుల మధ్య కదిలే సప్తస్వరాల మీదా,
నీ కళ్ళకాంతి సంవత్సరాల మీదా, 
నా సంతకం ఉంటుంది చూసుకో.. !!

సంపెంగ పొదలాంటి నీ జడమీంచి 
గుప్పున బుసకొట్టే సువాసనల మీదా, 
ఉంగరాలుంగరాలుగా గాల్లో తేలుతూ 
నా కళ్ళకి హాయిగా తగిలే నీ శిరోజాలమీదా, 
మెత్తగా అగ్గిపుల్ల గీసినట్లు మండే 
నీ కనురెప్పల ఆల్చిప్పల మీదా, 
నా సంతకం ఉంటుంది చూసుకో.. !!


ముద్ద సరిగా దిగనట్లు విన్పించే 
నీ ముద్దు ముద్దు మాటల మీదా, 
నీళ్ళ వాగు పువ్వుల్లోంచి అమాంతం నడిచొచ్చే 
అందాల నీ నృత్య భంగిమల మీదా, 
గాలికి అల్లల్లాడే ఎర్రగులాబీ పువ్వులా 
సుతారంగా కదిలే 
నీ పాటల మాటల కంఠస్వరం మీదా,
నా సంతకం ఉంటుంది చూసుకో.. !!

ఇన్నాళ్ళూ నీకు దూరమై 
నీ గుండె ధ్వనిస్తున్న విరహ గీతాల్ని 
ఆకాశపు అంచున నిలబడి వింటున్నా.. 
నా గుండె నాకు దూరమై పోతున్నట్లూ ...
నరాల్లో నిస్సత్తువ వొళ్ళంతా పాకిపోతున్నట్లూ ...
మబ్బుల మధ్య నా కళ్ళు కాంతిని కోల్పోతున్నట్లూ ...
చూపులు కదిలిపోతున్న 
మొన్నటి నా మనస్థితి గుర్తుకొస్తోంది.. !!

వస్తున్నా ... నా చూపుల్ని పిండుకుంటూ,
అమాస్య నిశీధి జ్ఞాపకాల సరసాల మధ్య 
మనం దాచుకున్న నక్షత్రాల్ని అన్వేషిస్తూ, 
మేఘాల మధ్య పడవలా ఈదుతూ, 
గాలి కసరత్తుల మధ్య అనురాగాన్ని స్రవిస్తూ వస్తున్నా..!! 

అమాంతరం నేలను తాకిన పక్షిలా వస్తున్నా.. !!
వొడ్డును ముంచెత్తే తుఫాను వరదలా వస్తున్నా.. !!

Written by : Bobby Nani
 

No comments:

Post a Comment