గత నిశీథము...
************
సమస్త జీవరాశి
మరణమనే తాత్కాలిక మృత్యుఒడిలో
వొల్లుమరిచి కునుకు తీస్తున్నాయి..
దూరాన సముధ్రుడి వీర ఘర్జనలు
చెవికి తాకుతున్నాయి...
చిమ్మ చీకట్లు చిందులేస్తూ
చిరుగాలితో చిలిపి సరసాలాడుతున్నాయి.. !!
అప్పుడే
గాజుల గలగలలు,
మువ్వల అలజడులు,
సువాసనా పరిమళములు,
నన్నావైపుకు ఆకర్షించాయి..
తన్మయత్వపు అడుగులేస్తూ
ముందుకు కదిలాను.. !!
దూరాన,
సముద్ర తీర అంచున
కోటి తారల కాంతుల
తళుకు, బెళుకుల్లలో
నిండు పున్నమి వెలుగుల్లలో
ఇసుక తిన్నెలపై
అభ్యంగన స్నానమాచరిస్తోంది
ఓ తామరనేత్రిని..!!
పిండారబోసిన చంద్రుని వెలుగుల్లో
“చంద్రవదన” లా,
మంచు ముత్యంలా,
శ్వేత మయూరములా,
తడసిన దేహంతో,
అలసిన హృదయంతో,
ఊరువులపైబడు కేశ సౌందర్యములతో,
బెరుకు, బెదురు చూపులతో
నలుగుపిండి స్నానమాచరిస్తోందా ముదిత..!!
కాంతి వంటి ఆమె పసిడి దేహం చుట్టూ
తుమ్మెదలు తచ్చాడుతున్నాయి..
సముద్రుడు ఆమె అందాలను అందుకోవాలని
ఎగసి పడే కెరటాల హోరుతో కబురంపుతున్నాడు..
ఆకాశ రాజు సప్త వర్ణాలను చిమ్ముతున్నాడు..
పిల్ల తెమ్మెరలు ఆమె కౌగిళ్ళకై పరితపిస్తున్నాయి..
ఆమె అణువణువునా నీటి బిందువులు
ముద్దాడుతూ స్వైరవిహారము గావిస్తున్నాయి..
దగ్గరకెళ్ళి తేరిపారా చూసాను..
ఆమె నయనములలో లోకమంతా
దాసోహమయ్యే శక్తిని చూచాను...
ఆమె అధరములలో గులాబీ రెక్కలకు
అరువివ్వగల రంగును గుర్తించాను..
ఆమె మేను లో పాలమీగడ
పోలిన ఛాయను గమనించాను
ఆమెను తాకిన గాలిలో సుగంధ పరిమళాలు
పువ్వులై నా నాసికను ముద్దాడుతున్నాయి..
నిస్సందేహంగా ఆమె నా స్వప్న దేవతే..!!
నేత చీర అందాలతో,
కనువిందుల సింగారపు సిగ్గుల నవ వధువులా,
పేరంటానికి తరలిన కిన్నెర ముత్తైదువులా,
కనకమహాలక్ష్మి అవతారము దాల్చఁగ
శుభకామన మధుభూషణమై నా మది పులకించఁగ
మనసులోని మాటలు నా
గుండె గూటి నుంచి ఎగిరిపోయి
ఆమె హృదయ క్షేత్రంలో కొలువు తీరాయి..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment