Monday, October 23, 2017

నా దేశంలో స్త్రీ



నా దేశంలో ప్రతీ స్త్రీ మూర్తి పసిబిడ్డను వెనుక పెట్టుకొని పోరాడిన ఝాన్సీరాణి లక్ష్మీభాయ్ లా ఉండాల్సిన అవసరం లేదు.. తన మాన ప్రాణాలను కాపాడుకోగల శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటే చాలు.. అవి మీ నెత్తురులోనే ఉన్నాయి.. కాకపోతే తరతరాల పురుషాధిక్యత వల్ల మీరు ఇందుకు అలవాటుపడిపోయారు .. సాత్వికం అన్నీ వేళలా మంచిది కాదమ్మా.. కన్ను, మిన్ను తెలియక కామ మృగాల్లా సంచరిస్తున్న వీరికి భయానకం కూడా రుచి చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.. నిన్న పత్రికలో చూచిన ఓ వార్తకు చలించి వ్రాస్తున్న అక్షరాలివి.. !!

నా దేశంలో స్త్రీ 
ఇంకా ఉడుకెత్తని అగ్నిపర్వతం
పెదాలు బిగ బట్టినా 
పిడికిళ్ళెత్తని మహాశక్తి 
కొమ్మలు కొమ్మలుగా 
విస్తరిస్తున్న నేలతల్లి 
పురుడు పోసుకుంటున్న 
ప్రకృతి కాంత..!!

ప్రకృతి ఒక మహాశక్తి 
నిశ్శబ్దంగా దండెత్తే భీకర తుఫాను 
ప్రకృతినవమానిస్తే ప్రకృతి కినుకవహిస్తే 
నీచుల రక్తం వరదలై పారుతుంది.. 
విసన కర్రలే విచ్చు కత్తులై విజ్రుంభిస్తే 
రాక్షస పురుషాహంకారం కాళ్ళ బేరానికొస్తుంది..!!

నా దేశంలో స్త్రీ 
ఇంకా రాజుకుంటున్న కుంపటి
నెమ్మదిగా అంటుకుంటున్న అడవి 
తరతరాల బానిసత్వం, 
అవమానం, కోపం, క్రోధం 
అ మహాశక్తి నయన ఖడ్గాలలో కేంద్రీకరిస్తే 
మానభంగ సింగాలు మట్టి గరుస్తాయి.. !!

నా దేశంలో స్త్రీ 
ఇకపై మంటల జండాలతో మాత్రమే నడవాలి 
మాటల తూటాలతోనూ,
కళ్ళ కత్తులతోనూ, 
చేతుల గాండీవాలతోనూ, 
తన మానాన్ని తనే కాపాడుకోవాలి..!!
మృగ పురుషాహంకారాన్ని
మెడలో పుర్రెలా వ్రేలాడేసుకోవాలి.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment