Saturday, October 21, 2017

\\ స్వేచ్చ //



\\ స్వేచ్చ // 
**********


కొద్దికొద్దిగా సూర్యరశ్మిని ఏరుకుంటూ 
అనుభవాల్ని త్రవ్వుకుంటున్నాను.. 
నాలో కన్నీరింకిపోయింది.. 
కవిత్వం కరిగిపోయింది.. 
ఏ కవిని కలుద్దామని వెళ్ళినా 
వాని జేబులో మనిషిననుకుంటాడు.. 
ఏ పుస్తకం చదువుదామని కొన్నా 
కాపీ కవితల ఖజానాలే కనిపిస్తున్నాయి.. 
విప్లవోద్యమం నగరాల్ని విడిచి
అడవులకు పారిపోయిందగ్గర్నుంచీ 
నాలో నిస్పృహజనిత నిర్లిప్తత తాండవిస్తోంది.. 
నోరిప్పి నిరసిస్తే గాల్లో కలిసిపోతున్న ఆర్తనాదమౌతోంది.. 
ఇమేజరీల మధ్య ఇరికిస్తే గాజు గోడల మీద 
నిస్సహాయంగా జారిపోతున్న అక్షర బిందువౌతోంది.. 
ప్రపంచం మొత్తం కవిత్వాన్ని బహిష్కరించినట్లు 
కలలొస్తున్నాయి..!!
నిజంకోసం నా అన్వేషణ దేశాల్ని దాటిపోతోంది.. 
నా భావాల కనుపాపల్ని ఏనాడో 
గాల్లోకి వదిలేసాను.. 
ఏ యువకవి గుండెల్లోకి దూసుకెళ్ళాయో .. ఏమో 
ఏవార్తా తెలియటం లేదు.. 
లేలేత సంకేతాల్ని కోసుకుందామని 
తోటలన్నీ తిరుగుతున్నా.. 
ఎండుటాకుల ప్రవాహమే ఎడురొస్తోంది, 
నేనేరుకున్న నేత్రాలనే మీ కోసం
అక్షర వజ్రాలుగా పొదుగుతున్నా.. 
మీరాదరించినా, 
ఆదరించకున్నా, 
నా కవిత్వం ఒక దిగులెరగని ప్రవాహం.. 
నాలోంచి మీ వైపు ఉధృతంగా పెల్లుబికే 
ఒక మహాద్బుత జలపాతం.. 
హెచ్చరికలు లేకుండా నాపై వచ్చి వాలే 
ఒక అప్సరస అనురాగ గీతం.. !!
అమృత క్షణాల్లో నే గొంతెత్తి పాడిన అత్యాధునిక సంగీతమే 
నా ఈ కావ్యం ..!!

కవిత్వం నన్నావహించినప్పుడు నేనొక 
అహంభావిగా మారిపోతాను.. 
గొంతులోంచి దూకే బంగారు మణుల్ని చూసి 
మీకంటే ముందుగా నాకు నేనే ఆశ్చర్యపోతాను 
గాలికి ఊగే పువ్వుల్లోంచి నాకొచ్చే 
ఆహ్వానాలే నా కవితలు..
పువ్వు, పువ్వునీ పలకరించే 
మాటలే నా అక్షరాలు.. 
సింహాసనాలు నా ప్రపంచాన్ని కనుక్కోలేవు.. 
నా రక్తంలో ప్రవహించే ఎర్రపూల పడవలే నా ఆలోచనలు.. 

కవిత్వం నా అజీర్ణానికి ఆయువు పట్టవుతోంది
నా దేహంలోని ఒక్కొక్క అంగాన్నీ కొరుక్కు తింటోంది.. 
ఎవరితోనో ఒకర్తో హాయిగా ముచ్చటిస్తే తప్ప నా ఆకలి తీరదు. 
కదుల్తున్న బస్సుల్లోనే నా హృదయం కవితల్ని ప్రసవిస్తోంది.. 
శబ్ద చిత్రాలు, అదృశ్య దృశ్య చిత్రాలు నా ముందొక 
అద్బుత ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తాయి.. 
విచిత్ర స్వప్నాలు నా కవితా వాక్య ప్రవాహాల్లో 
అప్సరసల్ని ఆవిష్కరిస్తాయి.. 
అక్షర కన్యల్ని నా కౌగిట్లో కట్టిపడేస్తాయి.. 
నిత్య నూతనత్వంలో జలకాలాడుతూ 
కొత్త ఊపిరికోసం గాల్లో గాలిస్తూ ఉంటాను.. 
అపురూపంగా నేనేరుకున్న వాక్యాల్ని మీ 
గుండెల్లోకి విసిరేస్తాను.. 
నల్దిశలా జీవనదులై ప్రవహిస్తాయనే చిన్న ఆశతో..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment