Monday, October 16, 2017

గడచిన బాల్యం..



గడచిన బాల్యం.. 
************


చిన్ననాటి జ్ఞాపకాలు 
చెరగనివి, చెరిగిపోనివి.. 


నేటి బాల్యాన్ని చూస్తుంటే బాదేస్తుంది.. 
టెక్నాలజీ అనే భూతం బాల్యాన్ని చిదిమేస్తోంది.. !!


నేను అదృష్టవంతుణ్ణి నా బాల్యంలో ఈ టెక్నాలజీ భూతం లేదు.. 
మట్టికి, మానుకు దగ్గరగా ఆడుకున్నాను.. 
మమతకు, సమతకు మధ్యన మెలిగాను .. 
పారుతున్న ఏటి నీటిని కడుపారా తాగాను... 
ఇసుకలోని బంకమన్నుతో బొమ్మరిల్లు కట్టాను.. 
నేస్తాలతో చెట్టూ, చేమ, వాగు, వంక 
కలియ తిరిగాను.. 
దో .. దోర జామపండును కోయకనే 
కొరికి కొరికి ఉడుతలా ఆరగించాను...
చిన్నారుల బుడ్డీలతో చిలిపి అల్లర్లు గావించాను.. 
చిటారుకొమ్మన కోతికొమ్మచ్చిలాటలాడాను .. 
కోడింబిళ్ళతో విన్యాసాలు 
మిట్టా – పొలం తో మిత్రులకు చుక్కలు 
కుందుడు గుమ్మ తో స్నేహితులకు ఆయాసాలు.. 
దాగుడుమూతలు దండాకోర్ అంటూ నేస్తాలకు ముచ్చెమటలు.. 
తరుంకునే ఆటతో తలమానిక చేష్టలు .. 
కబడీ తో కబర్ధారనే హెచ్చరికలు.. 
బొంగరాలాటతో గింగిరాలు.. 
గోలీల ఆటల్లోని గలగలలు.. 
క్రికెట్ ఆటల్లో కేరింతలు.. 
ఆడి ఆడి అలసిన దేహాలకు 
ఆరుబైట మంచంపై 
తారాజువ్వల తళుకు బెళుకులలో 
పిండారబోసిన వెన్నెల స్వర్గాన్ని తలపిస్తుంటే.. 
అమ్మచేతి గోరు ముద్దలు మాధుర్యాన్ని అందిస్తాయి.. 
నానమ్మ, తాతయ్యల చిలిపి కబుర్లు, 
అలసిన కన్నులు రెప్ప వేసేదాకా తాతయ్య చెప్పే 
కథలు, పురాణ గాధలు, మహాత్ముల జీవిత చరిత్రలు 
వింటూ కలల లోకానికి పయనమయ్యే 
ఆనంద క్షణాలెన్నో 
నా బాల్యంలో గడిపాను.. !!
మరొక్క మారు అవకాశమిస్తే మళ్ళి తనివితీరా 
అనుభవించాలనిపించే మధుర జ్ఞాపకాలు నా బాల్యం.. 
నా ఒక్కడిదే కాదు.. 
మూడు పదులు వున్న ప్రతీ ఒక్కరివి 
ఇంచు మించుగా ఇలానే వుంటాయి.. 
కాదంటారా.. ?? 


క్షణం తీరికలేని సమయంతో..
తాతయ్య, నానమ్మ లేని ఇళ్ళలో.. 
ఎడముఖం, పెడముఖమైన 
తల్లితండ్రులతో ఉంటూ,
ఇరుకైన కుటీరములలో,
మమతానురాగాలు, 
ఆప్యాయతానురాగాలు లేని 
మసిబారిన పోదరిల్లలో మసులుతూ, 
సెల్లు, ట్యాబ్, కంప్యూటర్, 
వైఫై, ఇంటర్నెట్ ఇవే 
జీవితమనుకొని బ్రతికే మనస్తత్వాల మధ్యన
ఎదుటిమనిషి కళ్ళలోకి చూస్తూ 
ఆప్యాయంగా మాట్లాడాల్సిన మనుషులు 
నేడు సెల్లును చూస్తూ గడిపేస్తున్నారు.. 
పిల్లలు మంచు గదుల్లో చెమట తెలియని ఆటలు 
స్క్రీన్లపై ఆడుతున్నారు.. 
మన పిల్లల బాల్యమే ఇలా ఉంటే.. 
రేపటి భావితరాల వారి బాల్యం తలుచుకుంటేనే 
ఊహకు అందట్లేదు.. 
మట్టికి దూరమైపోతున్నాడు నేటి మానవుడు..!!

Written by : Bobby Nani

1 comment: