Wednesday, September 20, 2017

తల్లితండ్రుల్లారా మేల్కోండి ...!!!



తల్లితండ్రుల్లారా మేల్కోండి ...!!!

(రెండు సంవత్సరముల క్రితం వ్రాసింది మరలా మీకోసం..)

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి ... కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు
“నేను పడ్డ కష్టం, శ్రమ నా బిడ్డ పడకూడదు”

ఇది తల్లి, తండ్రుల పవిత్ర ప్రేమకు చిహ్నం... కాని ఇక్కడ మీరో విషయం మర్చిపోతున్నారు... మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు.. అదే మీ పిల్లల విషయంలో మీరు ఖటినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం వారు... వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది... కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు. కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి... "అతి ప్రేమ, అతి గారాబం, అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు"..

మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నారు. ఇదే నేడు సమస్యగా మారింది. “స్వీటీ” అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లితండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు. చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను స్వీటీలో పెంచారు. ఉన్నత చదువులు చదివి.. పెళ్లాయ్యాక... భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది. ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా స్వీటీ ఒక్కటే కాదు..ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి పెంపకంలోని లోపాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ప్రతి తల్లితండ్రులు పిల్లలకు అన్నం విలువ, డబ్బు విలువ తెలియచేయాలి... కొన్ని సందర్భాలలో చేతినిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు.. అలాగే కొన్నిసార్లు తినిడానికి అన్నీ దొరికినా చేతిలో డబ్బులు ఉండవు.. ఇటువంటి పరిస్ధితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం, డబ్బు విలువ తెలుస్తుంది... అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది.. అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం, తిట్టడం చేయడం వలన మొండిగా/మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది... కనుక తల్లితండ్రులు ఈ రెండింటిని సమానంగా చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి...ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి.... వారికి కష్టం... నష్టం... సుఖం అన్నీ తెలియాలి. లగ్జరీగా పిల్లల్ని పెంచడం నేటి ఫ్యాషన్‌. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ఇలా పెరిగిన వారు చిన్న కష్టాలకే హడలుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి.


ఉదాహరణకు : పెద్ద ప్రైవేటు స్కూల్లో చదివే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకసారి తీసుకువెళ్ళండి ... అక్కడ పిల్లలు అనుభవిస్తున్న పరిస్థితులు, సౌకర్యాలు, కష్టాలు, నష్టాలు, ఆనందాలు, సరదాలు, అనుభవాలు అన్నీ వారికి చూపించండి.. అప్పుడే వారు యెంత సౌకర్యాల్ని పొందుతామో తెలియడమే కాకుండా అవగాహన కూడా వస్తుంది.. తమ తల్లి, తండ్రులు తమ మీద చూపిస్తున్న ప్రేమ, భాద్యత కూడా వారికి తెలుస్తుంది...
కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కష్టాలు వున్నాయో, వారి కుటుంబ పోషణకు సంబంధించే సరుకులు కూడా కొనుటకు ఎలా ఇబ్బంది పడుతున్నారో వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు.. ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు.. కాని అది సరైనది కాదు. పిల్లలకు విచ్చలవిడి తనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం..మీరు సంపాదించే ప్రతీ రూపాయి యెంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి.. అలానే ప్రతీ రూపాయి మీరెంత కష్టపడి సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకు తెలియాలి.. తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి.. ముఖ్యంగా తల్లి తండ్రులు వాల్లకు చదువు కంటె జీవితంలో జనరల్ విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి.. చదువు ఒక్కటే ఉంటె ఈ కాలంలో సరిపోదు. కొందరు పిల్లలు సెలవు దినాల్లో ఏదైనా పనికి పంపుతుంటారు కారణం వాళ్ళు సంపాదించి పెడతారని కాదు.. వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని .. నా చిన్నప్పుడు నన్ను ఇలానే మా తాతయ్య గారు పంపేవారు. దశరా సెలవులకు, వేసవికాలం సెలవులకు మధ్యాహ్నం దాకా పనిచేసివచ్చి తరువాత సంవత్సరం చదువుకు ప్రిపేర్ అయ్యేవాడిని... అలా అని ఆటలమీద శ్రద్ద తక్కువేమీ కాదు అన్నిటికన్నా వాటిల్లోనే ముందు ఉండేవాడిని..

ఇలా ప్రతీ తల్లి, తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా, సరైన శిక్షణ, అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు. గొప్ప వాళ్ళు కాకపోయినా సమాజంలో మంచి మనుషులుగా మిగులుతారు... ప్రతీ గొప్ప వారు డబ్బునుంచి వచ్చిన వారు కాదు కష్ట, నష్టాల్లోనుంచి వచ్చిన వారు కూడా... కారణం వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్ని తెలుసు.. నాయకులు ఏ.సి రూముల్లో కూర్చొని పనిచేస్తే సరిపోదు.. ఆ పని చేస్తే ఎవరికి మేలు కలుగుతుంది, ముందు ఎవరికి ఉపయోగపడాలి, ఏ పని ఏ ఏ సమయాల్లో సమయానుకూలంగా చెయ్యాలనే విషయం వారు స్వయంగా కష్ట, నష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది...

పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ... వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య. అందుకే దయచేసి తల్లి, తండ్రులారా మేల్కోండి.. 

రేపటి భావితరానికి మీరు పూబాటలు వెయ్యండి..

స్వస్తి __/\__

Written by : Bobby Nani

2 comments:

  1. visit website for earning: www.4job.in

    ReplyDelete
  2. మంచి విషయాలు తెలియచేశారు.

    ReplyDelete