"మదిలోని భావాలన్నీ అక్షరాలను వరిస్తాయి…
అక్షరాలన్నీ మదిలోని భావాలను ప్రేమిస్తాయి…"
నిజమే ...
అందుకే నేను “అక్షర”మయ్యాను..
శబ్దం నా లక్షణం,
పదే పదే ప్రయోగిస్తే భావం నా లక్ష్యం..
నా లక్షణం తోనే లక్ష్యాన్ని సాధించే మధురక్షణాన్ని..
లక్ష్యం నుండే నా జననం, లక్ష్యం లోకే నా పయనం..
విడిగా చూస్తే నా జీవితం అర క్షణం..
నిఘంటువులో నా లోతు అహోబిలం..
నా పరిధి శత సహస్ర జ్యోతిర్వర్షం..
శబ్దార్ధ సర్వస్వమూ నా సాక్షాత్కారం..
అరుణ కిరణపు తీక్షనాన్ని,
ధైర్యవంతుల లక్షణాన్ని నేనే.. !
క్షరాన్ని కాదు నేనక్షరాన్ని ...!!
క్షయాన్ని కాదు నేనక్షయాన్ని..!!
శాఖా గ్రంధాలయాలలో నిక్షిప్తమైన అవక్షేపాన్ని..
నవీన విశ్వవిద్యాలయపు ప్రతీ ప్రశాఖలో ..
అలక్ష్యం అవుతున్న అద్బుత నిక్షేపాన్ని...
సాహితీ గావక్షకం నుండి వీక్షిస్తే విరూపాక్షుని విశ్వరూపాన్ని ..
నా పూర్వ ప్రాభవం గత జన్మపు మోక్షం..
పద్యపు పల్లకీ కుదుపులకు సన్నబడిన నుడికారపు నడుమును..
నన్నయ నేర్పిన నడకకు,
తిక్కన తీక్ష నినాదం తోడైతే..
పోతన పూసిన తేనె పూతను..
శ్రీనాధుని శృంగార నౌషధాన్ని నే నక్షరాన్నే..
విశ్వనాధుని కల్పవృక్షం కింద సేదతీరుతూ..
కృష్ణశాస్త్రి మందారమారుతాన్ని ఆస్వాదించే నాటికి
నాది ఫ్రౌఢ వయస్సు..
లుప్త శిల్పమై జవసత్వాలుడిగిన
నాకు తిలోదకాలిచ్చింది తెలుగు త్రిమూర్తులు..
వారి అంశతో దత్తాత్రేయుని రూపం వచ్చింది నాకు..
శ్రీ శ్రీ రాబందుల రెక్కల చప్పుడుతో నిద్ర లేచా..
మైలమ భీమన కలల ఖడ్గ సృష్టి చేశా..
దాశరధి అగ్నిధారనై రుధ్రవీణనై వినిపించా..
సినారె విశ్వంభరలో నక్షత్రాన్నై దారిచూపా..
శేషేంద్రుని శేషజ్యోత్సనై ఎర్ర కోరిక కోరా..
అంతేనా..
వెన్నేల్లో ఆడుకునే ఓ అందమైన ఆడపిల్లనైనాను..
ప్రేయసి పెదవులపై ప్రణయ వేదాన్నైనాను..
తాపసి ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రణవ నాదాన్నైనాను...
కవి కలం పడేటి ప్రసవ వేదనని కూడా నేనే ..
ఇప్పుడు, ఇప్పుడు నే నిప్పుడు
“నాని” నయనం తాకే ప్రతీ భావన ఘీంకారాన్నై ..
ప్రజా విప్లవ ప్రవాహ తాలోత్తాలపు తరంగాగ్రాన్నై..
అక్షుబంధిత ధర్మ దేవతకు ప్రత్యక్ష సాక్షినై..నే నక్షరాన్నయ్యాను..
ఇప్పుడు నే ...లక్ష కోణాలతో క్షుద్ర సమాజపు పాప ప్రక్షాళనకై నడుంకట్టిన
వజ్ర దీక్షావతరాన్ని..
అనుమానపు అర్ధ విజ్ఞానం కాదు నేను కోరేది..
పునఃపరీక్షతో పరిణతి చెందే పరిపూర్ణ జ్ఞానం..
హెచ్చుతగ్గులకై ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతాలు
కాదు కావాల్సింది..
ప్రేమపూరిత గురుకులం పొందుపరచిన తడిఆరని
అక్షరాల ఆపేక్ష సిద్దాంతాలు..
అక్షరంలో అంతరిక్షాన్ని..
మనోంతఃరిక్షంలోని అక్షర నక్షత్రాన్ని..
న్యాయా న్యాయ విచక్షణని ..
విలక్షణమైన లక్షణాన్ని నేనే ..
అందుకే “అక్షర”మయ్యాను.. !!!
Written by: Bobby Nani
No comments:
Post a Comment