Wednesday, April 26, 2017

//// ఓ మహిళా..!! “చైతన్యము” నీ చిరునామానా ?? \\\\


“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”

“స్త్రీ” ని గౌరవించకున్నా పర్వాలేదు.. కనీసం మనిషిగా అయినా చూద్దాం. 
మనకు రక్త మాంసాలను పంచి పెట్టింది కూడా ఓ స్త్రీ నే అన్న విషయం మనం మరువకూడదు.. 
తొమ్మిది నెలలు తన గర్భాలయంలో సంరక్షించి మనల్ని ఇంతటి వారిని చేసింది .. 
అయిననూ ఆమె అంటే లోకువ, అబల అనే చిన్న చూపు .. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆమె లేని అక్షరాలే ఉండవు.. అంతటి చరిత్రను సృష్టించి “సబల” గా నిరూపించి, “అబల” లా అనిగిమనిగి బ్రతకడం ఆమెలో వున్న ఔదార్యాన్ని ప్రజ్వలిమపజేస్తుంది.. ఒక్కసారి వెనక్కి వెళ్లి గతకాలపు పుటలను పరీక్షిస్తే సువర్ణాక్షరాలతో ధగ ధగమని పసిడికాంతులతో విరాజిల్లుచున్నది .. అలాంటి వారిని ఒక్కసారి స్మరించుకుంటూ నా చిరు కవిత.. 


//// ఓ మహిళా..!! “చైతన్యము” నీ చిరునామానా ?? \\\\
****************************************


నవయుగాన, యువజగాన చేతన కేతన మెత్తిన 
ఓ మహిళా ... “చైతన్యము” నీ చిరునామానా ??
కాదని అంటారా ఎవరైనా ??
యుగయుగాలుగా కరుడుకట్టిన చాదస్తభావాలు, 
దుర్మార్గుల, దుస్తంత్రుల కుటిల నీతిమార్గాలు, 
నీ అప్రతిహత, మహిమాన్విత చరితముందు బలాదూర్లు..!


“సీతవై” పత్యనురక్తవై, పవిత్ర మూర్తివై, జగన్మాతవైనావు..!
“ద్రౌపది”వై ధీర, గంభీర ముద్రవై, ధర్మా ధర్మ విదగ్ధవై జ్వలించినావు..!
“సత్య” వై అమిత పరాక్రమోపేతవై, కృష్ణమనరసింహాసనాసీనవై, 
వీర సౌందర్య వైభవోపేతవైనావు..!
“మొల్ల”వై సుమగంధాల వల్లివై, ఆంధ్రదేశ ప్రాంగణ 
రంగవల్లివై, కీర్తి కిరీటాల హరివిల్లువై విరిశావు.. !
“ఝాన్సీ లక్ష్మి”వై చరిత్ర స్థితిగతులను తిరగారాశావు..!
మానవతా కరుణాల ప్రతిబింబానివై, సేవకు నిర్వచనానివై, 
ప్రేమకు సాకారానివై “మదర్ థెరిస్సా” వై తరించావు.. !
రాజనీతి చదరంగంలో ప్రతిభాసంపద్వైభారవ విజ”ఇందిర”వై 
“భారతరత్న”వైనావు..!
సంగీత సామ్రాజ్య రసరాట్టువై, నాదబ్రహ్మోపాసన తపస్వినివై 
వాణీవీణా నిక్వాణరంజిత “సుబ్బలక్ష్మి”వై “పద్మవిభూషిణి”వై నావు..!
లలిత లావణ్య సీమలో సౌందర్య రాశివై, విశ్వ విజేతవై, 
“ఐశ్వర్య” సముపేతవై, కోట్ల జనహృదయాంక ప్రియవై, 
విశ్వగగనాన అందాల సిరులొలికించావు ..!
రసగంగవై, సోయగాల పొంగువై, సరస భారతీనర్తన పదకేళీ 
విన్యాస తరంగవై, చిర “యశస్సు”ముపార్జిత భారంగవై గణుతికెక్కావు..!
అంతరిక్షాన అలుపెరగని ప్రణయాన సాంకేతిక సమున్నత 
జ్ఞానవినీతవై “సునీత”వై విశ్వమానవ వినుత గీతివై, 
విహాయస విహారివై విస్తరించావు..!
ఆకాశమే హద్దని, ఆంక్షలే వద్దని, ఆద్యంతనభారవినీదని 
నాగరికతలోనే “నారి” అని నిరూపించినావు..!
వర్తమానానికి నిర్వచనమై, భారవిష్యత్పదార సోపానమై
సాహసమే సాకారమై, అప్రతిహతంగా సాగుతున్న నీ ప్రస్తానం..!
మా”నవ” చరిత్రలో పొందుతుంది శాశ్వత స్థానం .. !
భారవినీది ! భారవితనీది !
గమనం నీది ! గమ్యం నీది !
రాగం నీది ! వేగం నీది !
ఈ యుగం నీది ! ఈ జగం నీది !
ఓటమి ఎరుగని చరితగా, 
రసహృదయం చిందిన కవితగా, 
కాలం చెక్కిన గతిలో, సువర్ణాక్షరాలు నీ చిరునామా !
ఓ మహిళా ..! 
కాదనగలమా ..!!
ప్రోజ్వల వైభవప్రాభవాలు మరిచేమా.. !!! 


చివరగా : ఓ స్త్రీ మూర్తి కన్నీటికి కారణం ఓ మగాడే అని అంటున్నారు.. 
అదే స్త్రీ మూర్తి ఆనంద కన్నీరుకు కూడా కారణం ఓ మగాడే అని ఎవరూ గుర్తించట్లేదు ఇది శోచనీయం.. 


Written by : Bobby Nani

No comments:

Post a Comment