ఓ మిత్రుని కోరిక మేరకు.. “మరణం ఎలా ఉంటుందో రాయమని చెప్పాడు”... కాని ఎలావుంటుందో అనే దానికన్నా ఎలా వుంటే బాగుంటుందో రాయాలనిపించింది.. దయచేసి నా గురించి అని అనుకోకుండా ఓ కవితగా చదవమని అభ్యర్ధన.. __/\__
గత నిశీధము ..
***********
నిశ్శబ్దం భళ్ళుమంది...
చీకటి నిగిడి ఒళ్ళు విరిచింది..
వెలుగు తన వెనకన నక్కి కూర్చుంది..
కోయిల గ్రొంతుక కర్ణకఠోరమై వినిపించ సాగింది..
మైళ్ళ ఆవలనున్న సంద్రపు కెరటాల భీకర
ఘోష కర్ణమునకు తాకుతోంది..
విధిలించిన రెక్కల చప్పుడు భీషణమై
భయాన్ని బంధీని చేసింది..
వాయువు ప్రచండమై వృక్షాలను
ఊపి పెకలిస్తోంది..
నెలరేడు భీతి చెంది మేఘాల మాటుకు
బెదరి దాక్కున్నాడు..
తారలు తత్తఱపడి వెల వెల బోయాయి..
నిశీధి మృత్యువు పళ్ళికిలించి
వికటాట్టహాసము గావిస్తోంది...
పూసిన పువ్వులకు
నవ్వులు కనుమరుగయ్యాయి..
నేల కంపిస్తోంది..
నీరు విలపిస్తోంది..
ఆకాశం బ్రద్దలౌతోంది..
ఎండుటాకులు బద్రము చెప్పి
స్థానాన్ని విడిచి పరుగెడుతున్నాయి..
మండూకములు నాలుకలు వ్రేల్లాడదీసి
నేలపై పడివున్నాయి..
గుడ్లగూబ కళ్ళుమూసి నిద్రిస్తోంది..
మిణుగురులు రెక్కలు రాలి ప్రాకుతున్నాయి ..
చరుక్కు మనే కొరడాల శబ్దం..
పచ్చి నెత్తురు వాసన..
కొరడా అంచులకు వ్రేల్లాడి నేలపై రాలే
చిక్కని రక్తపు చుక్కలు ...
ఈడుస్తున్న సంకెళ్ళ చప్పుళ్ళు..
హఠాత్తుగా
ఎవరివో అడుగుల అలికిడులు..
గుండె ఝల్లుమనేలా ఓ ఆక్రందన ..
ఒళ్ళు జల్లుమనేలా కిర్రుమని
తీసిన తలుపు శబ్దం..
హృదయపు కవాటాలను వణికించేస్తున్నాయి..
కనురెప్పల మాటున భయం ఆవరించింది..
భారంగా, భయంగా నయనములు తెరిచాను..
ఎదురుగా మృత్యువు ప్రచండమై నిలుచుంది..
ఆఖరి గడియలు నను చూచి వెక్కిరిస్తున్నాయి..
క్షణములు శరములై దూసుకొస్తున్నాయి..
మృత్యువు తన జూలువిదిల్చి
అస్త్రములు నాపై సంధించెను ..
ఆ క్షణమున నాలో
భయము లేదు..
బెరుకు లేదు..
ఉన్నదల్లా నా చేతిలో
సిరా చుక్కలు చిందించే కలము మాత్రమే..
అదే నా ఆయుధం..
అదే నా కవచం ..
మృత్యాస్త్రములు కలముకు వంచి
అడలిపోయి, సడలిపోయి, వడలిపోయి..
చివరికి నా కంఠఁబందు పువ్వారుల అల్లికలై నిలిచెను..
మరణం నన్ను తాకింది..
తనలో నన్ను ఇముడ్చుకుంది...
నే విడిచిన అక్షర శరములను తాకలేక పోయింది..
అక్షరాలకు “మరణమే” శరణమని నిట్టూర్చింది..
అవును ..
నేను గెలిచాను...నా
అక్షరం నను విజేతగా మార్చింది...
ఇక నా అధ్యాయం ముగిసింది..
నిష్క్రమించాను... ఈ లోకం నుంచి
భావాలు వెల్లువలై ప్రవహించే అనంతంలోకి..
Written by : Bobby Nani
మీ బ్లాగ్ ఈ రోజే మొదటి సారిగా చూసాను చాల బాగుంది .
ReplyDeleteమీ రచనలు బాగున్నాయి.
మరణం గురుంచి నా కలం లోంచి .................
రణం రణం రణం ...
మరణం
మరణం ఒక రణం
నిర్విరామ ఉస్శ్వాస, నిశ్వాసల
రణరంగంలో ఆఖరి నిశ్వసే మరణం
సహజ, అనాలోచిత, ఉద్రేక, రోగ,
స్వయంకృత, విధిలిఖిత, గ్రహ పీడిత,
పాప కర్మ ల సహిత మరణం
శిశు, మాతృ, పితృ,సహా జీవిత భాగస్వామి మరణం
రణం, రణం, రణం , మరణం
బంధు, మిత్ర, పరిచయ, సహచర మరణం
రణం, రణం, రణం , మరణం
మరణం ఒక రణం
నిర్విరామ ఉస్శ్వాస, నిశ్వాసల
రణరంగంలో ఆఖరి నిశ్వసే మరణం
మరణం ఒక రణం
అంకితం : 5-8-2016 న మరణించిన మా బంధువు లోకేష్ కు అశ్రునయనాలతో.... హేమకుమార్