//// కవీశ్వరూపం \\\\
****************
ఒక “కవి” కి ఉండాల్సిన విలక్షణమైన లక్షణం ఏంటో తెలుసా.. తను భరించరాని దుఃఖంలో ఉన్నా.. తన నయనాల వెంట కన్నీరు నిరంతర ధారలా ప్రవహిస్తున్నా సరే .. తన భావాలతో ఏ ఋతువులోనైనా ఆమనిని సృష్టించగలడు .. తన రాతలతో మకరందాన్ని స్రవింప జెయ్యగలడు, తన అక్షరాలతో నూతన అధ్యాయానికి తెరదించనూగలడు... అలాంటి కక్షావైక్షకుడు, సంభృతశ్రుతుడు అయిన “కవి” గురించి, తన మనస్తత్వం, తన ఆవేశం గురించి రాయాలనిపించింది. అందరిపై తన అక్షర మాలికలను కుమ్మరించే తనపైనే రాయాలని ఈ “కవి విశ్వరూపం” మీకు అందిస్తున్నాను..
సాధారణ మానవుడు
స్ఫటికంలాంటివాడు
ప్రక్క రంగులకు లోబడి
వ్యక్తిత్వం కోల్పోతాడు
కవిని మాత్రం సూర్యునితో
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడు వన్నెలు జీర్ణించుకొని
ఏకవర్ణం చిమ్ముతాడు
తన అక్షర శరములతో.. !!
మంచుగుడ్డలు కప్పుకున్న
మానవుల మెదళ్ళలో
వెచ్చని కిరాణాలందించే
వాడే కవి,
వాడే రవి...!!
అవనిలోని ప్రత్యనువూ
కవికొక బ్రహ్మాండం
అతనిగుండె కదుపలేని అణుశకలం
లేనే లేదు..!!
అణువులోన నిద్రించే
అతర్జాతీయత్వాన్ని
పనిగట్టి వీపుదట్టే
ప్రబల దార్శినికుడు కవి.. !!
పరమాణువు ముఖములోన
తెరుచుకునే మరణదంష్ట్రల
మాటలతో కరిగించే
మహా మాంత్రికుడు కవి..!!
సాటివాళ్ళు మూఢత్వపు
సారా మైకంలో పడి
ప్రేలుతుంటే జాగృతి.. దీ
పాలెత్తిన వాడు కవి..!!
బురదలోన బ్రతికే ...కు
మ్మరి పురుగుల లేవనెత్తి
బంభారాలుగా మార్చే
బ్రహ్మత్వం కవిలో ఉంది ..!!
చెదలు దిన్న హృదయంతో
మసిబట్టిన మనస్సుతో
మాటలు గిల్కేవా...
డేనాటికి కవికాడు ..!!
పరుల బాధ తన బాధగ
పంచుకున్నవాడే కవి..
పరుల సుఖంలో శిరస్సు
పైకెత్తినవాడే కవి.. !!
పుచ్చపూలు గచ్చపొదలు
జిల్లెడులు, పల్లేరులు
కవి కలం సోకితేనే
కల్పవృక్షాలవుతాయి..!!
తుహినాచల శిరం నుండి
తురగలించే జలపాతాలు
కవి గుండెలో విధ్యుత్తును
కల్పించక మానవు..!!
జగత్తులో ఏ మూలో
పొగచూరిన నరజాతుల
వీపులపై విరుగుతున్న
వెండి కొరడా దెబ్బలతో
కవి కళ్ళలో ఎర్రదాళ్ళు
పొంగి ప్రవహించును ..!!
పడమటి బెహార్లు హుషారుగా
పరచిన బంగారు వలల్లో
పావురాళ్ళ కాళ్ళిరుక్కుంటే
కవి గొంతుక లోయలోనుంచి
గర్జించిన చప్పుడు ..!!
పచ్చిగడ్డిలా పెరిగిన పల్లె వాళ్ళపై
ఆకాశంనుంచి రాకాసులు
అగ్నివర్షం కురుస్తుంటే
కవి శిరస్సును చీలుస్తూ
ఎగుస్తుంది విస్పోటక ప్రతినాదం..!!
ప్రయోజనం లేకుండా పొడిచే
పగటి చుక్కలకు
దూరంనుంచి తో .... కాడించే
ధూమాకేతువులకు,
ఎవడి కాంతినో అరువు దెచ్చుకొని
నిగనిగలాడే చంద్రబింబానికి,
పనిలేకుండా పరిభ్రమించే
అనంత గ్రహ గోళాలకు,
క్షణం సేపు మిడిసిపడే
మిణుగురు పుర్వులకు,
అకారణంగా ముఖం చిట్లించుకునే
ఆస్తమ సంధ్యకు,
అణువణువూ ఈ బ్రహ్మాండంలో
వున్న జీవికీ, మృత్పిండానికి
కర్మసాక్షి ఈ కవియే
ఈ కవియే భారవియే...!!
ప్రణయం ఒక తుమ్మెదలా
మనస్సులో మర్మరిస్తుంటే,
ప్రేయసి ఒక తుమ్మెదలా
ఎదలో కదలాడుతుంటే,
భవిష్యత్తు ముళ్ళులేని
ప్రసవ పథంలా కనిపిస్తే,
బ్రతుకొక చక్రాలు లేని
ప్రసవ రధంలా ఎదురొస్తే,
కవిగొంతుక తేనే తేనేగా
పల్కక తప్పదు..!!
కవిలో సౌరభాలు
రెక్కలు విప్పక తప్పదు..!!
శరన్నిశీధాలు పగళ్ళపై
దురాక్రమణ సాగించి
మృత్యుభాను ముడికొప్పును
జీవన పురుషుడు సడలించి
సెలవేసిన విద్వేషాన్ని
సౌహార్దం కత్తిరించి
జగత్సర్ప మొక్కమాటు
సడలిన కుబుసాన్ని విడిస్తే
కవి హృదయం నాగస్వరమై రవలిస్తుంది.. !!
కవి గీతం రాగాంకురమై రావణిస్తుంది.. !!
పిరికితనం వారసత్వంగా
సక్రమించిన శరణాగతుల
పిల్లి గొంతులలో సాహస
భీషణమర్ధల ఘోషలు
పెకలించే శంఖస్వరం..!
ఇదే కవితా స్వరూపం..!!!
ఇదే కవి విశ్వరూపం.. !!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment