Tuesday, April 18, 2017

//// స్వప్నిక \\\\



//// స్వప్నిక \\\\
*************
అలసి తాళ వృక్షానికి తలవాల్చాను.. 
దాడి తరువాత యుద్దరంగంలా ఉంది ఆ బయలు.. 
రాత్రి తన నిశ్శబ్దపు నల్లని ముసుగు ముడతల్లో 
కప్పింది జీవరాసులను..
కానరాని చెయ్యేదో నా భుజం నొక్కినట్లు అనిపించింది..
కనురెప్పలు భారంగా ముడతలు పడుతున్నాయి.. 
ఆత్మ శృంఖలాలను తెంచుకుంది..
భూమి ఊగుతోంది..
ఆకాశం వణుకుతోంది.. 
నన్నేదో మంత్రశక్తావరించింది..
మనవుడెన్నడూ చూడని 
అందాల ఉద్యానవనంలో ఊడిపడ్డాను ..
ఆ దేవుడు పంపిన అందాల భరణిలు 
సౌందర్య రాసులు, ఆణిముత్యాల్లాటి కన్యలు 
వందలకొలది కమ్ముకున్నారు నా చుట్టూ.. 
ప్రేమ గీతాలను వల్లిస్తూ, 
తాంబూలములను నోటికందిస్తూ,
బంగారు వీణలను మీటుతూ ఉండగా 
ఇంతలో కనిపించింది అకస్మాత్తుగా 
నవరత్నాలు పోదిగించిన బంగారు సింహాసనం..
మెరిసే నగలతో శృంగారించి 
రంగు రంగుల వస్త్రాలతో 
రమణీయమైన హొయలుతో 
వచ్చి ఆసీనురాలైంది 
ఒక అందాల భరణి ఆ సింహాసనం పై.. 
అంతా నిశ్శబ్దం ..
అప్పుడు మాట్లాడింది ఆమె.. !!
“నేను స్వప్న దేవతను”
స్వప్న అనుభవాలకు రాణిని 
నిన్ను పిలిపించాను 
మానవులకు సందేశం పంపడానికి .. 
ఈ స్వప్న నగరం ఒక పెళ్ళి విడిది, 
పెళ్ళి బట్టలతోనే ప్రవేశం ఇక్కడకు 
ఈ నగరం స్వర్గతుల్యం 
“ప్రేమ” అనే దేవదూత కాపలా కాస్తుంది.. 
నుదుట ప్రేమతిలకం లేనిదే లేదు ప్రవేశం 
మీ నరులకు ఇలా చెప్పు అంటూ మొదలెట్టింది ..
“ఇక్కడ నదుల్లో అమృతం ప్రవహిస్తుంది 
పొలాల్లో బంగారం పండుతోంది 
పక్షులు ఆకాశంలో ఎగురుతూ, 
దేవదూతలతో కలిసి పాడుతాయి సంగీత గమకములు .. 
ఇక్కడి పుష్పాల సుగంధాన్ని వాళ్ళకు అందించు 
స్వప్న కుమారుడికే ఈ పసిడి తివాసి బయల్లులో ప్రవేశం 
అని చెప్పు”.. !!
మరొక్క విషయం మరవకుండా మరీ మరీ చెప్పు మనిషికి.. !!
“అందిచ్చాను మనిషికి, 
ఆనందించమని సంతోష కలశాన్ని,
మూర్ఖత్వంతో కాలదన్ని పారబోశాడు దాన్ని ...
చీకటి రక్కసులు నింపారు.. ఆ 
కలశాన్ని దుఃఖ రసంతో.. !
ఆస్వాదించాడు మనిషి దానిని ఆతృతతో ...!
మారిపోయాడు తాగుబోతుగా..!
అయ్యాడు మత్తుకు దాసుడుగా”... !!
“కలలు కనడమే దేవలోకానికి రహదారి” అంటూ 
నన్ను దగ్గరకు పిలిచి ముద్దులిచ్చి..
“స్వప్న లోకంలో కాలం గడపనివాళ్ళు 
పగటికి బానిసలని చెప్పు” అంది 
నా చెవికి దగ్గరగా వచ్చి.. 
అంతలో అందాల దేవకన్యలు 
ఒక్కొక్కరిగా బారులు తీరి పైకి వెళ్ళిపోయారు.. 
మళ్ళి భూమి ఊగినట్లు 
ఆకాశం వణికినట్లు అనిపించింది.. 
మెలుకువపోర నాపై ఉషఃకాంతులను చిలకరించింది.. 
కళ్ళు తెరవగానే 
తాటిచెట్టు క్రింద దుమ్ము ధూళిలో 
మాగంటి కునుకుతో మేలుకున్నాను.. 
చిరునవ్వుల ఉదయ కిరణాలను తిలకిస్తూ.. 
“స్వప్న లోకంలో కాలం గడపనివాడు 
పగటికి నిజంగా బానిసే” అనే మాటలు 
వెలువడ్డాయి నా పెదవుల్లో నుండి.. 

Written by : Bobby Nani

No comments:

Post a Comment