Friday, March 10, 2017

మా “బంగారం”...



“బంగారం” అనే పేరు నిజంగానే స్వర్ణం నుంచి పుట్టిందా.. 
ఊహు .. నే....నూ ... నమ్మను..!!
“బంగారం” అని ప్రేమగా పిలిచే నా చెలి స్వరం నుంచే జనియించింది.. !
నాలుగు రోజులు కనిపించకుంటే చాలు బుంగమూతి పెట్టె దాని 
ఎరుపు వర్ణ అధరముల నుంచి పుట్టింది.. !
తిరిగి నేను “బంగారం” అన్నప్పుడల్లా 
సిగ్గులోలికే తన సొగసులనుంచి జన్మించింది.. !
ఏమైనా నీ నుంచే నేర్చుకోవాలే.. 
ఆ మాటల్లో మైమరిపించే పరవశం.. 
ఆ ముఖ నవరస హావభావాల కవళికలు ..
ఆ మూతివిరుపుళ్ళ ముచ్చట్లు.. 
ఆ మౌనపు నిశ్శబ్ద సందేశాలు.. 
ఆ సరస చమత్కారపు పలుకులు.. 
ఆ శృంగారపు క్రీగంట చూపులు.. 
పాలమీగడ వంటి నీ దేహానికి 
పసిడి మెరుగులు అద్దుతున్నాయి .. 
నీ యవ్వన కన్నెప్రాయములను 
పదిలపరుస్తూ వన్నెతెస్తున్నాయి ... 
అందుకే మరి.. నిన్ను బంగారం అనేది.. 
నువ్వెంత దూరాన ఉన్నా నాకు ఎప్పుడూ దగ్గరే.. 
నానుంచి నను తాకి వెళ్తున్న గాలికి చెప్తాను నీ 
క్షేమ సమాచారాలు అడగమని.. !!
రేయి అయితే చాలు ప్రతీ తార నీ గురించే...
ఎన్ని చెప్తాయో..! 
యెంత అందంగా వర్ణిస్తాయో.. !
వింటున్న నా చొట్ట బుగ్గలే సిగ్గులొలుకుతాయి.. 
ఒకటి చెప్పనా.. 
ఈ రంగుల ప్రపంచంలో ఓ కవిగా, 
కలల ప్రపంచంలో ఓ ప్రేమికునిగా .. 
నీ కౌగిలిలో బంధీగా, 
గంతులేసే హృదయంతో, 
ఆనందాశ్రువులు రాలుతూ మౌనంగా నిలిచిపోయాను.. 
ఎందుకో తెలుసా.. ??
నా కన్నీరుని తుడిచే కామధేనువై నిలిచావు.. 
నా కడుపునింపే కన్నతల్లిలా మారావు.. 
నా కడుపున పుట్టిన కన్నబిడ్డలా లాలించావు.. 
ఇంకేం కావాలి ఏ మగఁడు కైనా.. 
మధురాన్ని కురిపించే నా మనసు
అర్పిస్తుంది నీకు సమస్త నీరాజనం.. 
నీ రాకకై.. 
నిను చూసేందుకై .. !
వస్తావు కదూ.. !!!!

Written by : Bobby

2 comments:

  1. ఫొటో చాలా బావుందండీ. సేవ్ చేద్దామనుకుంటే కుదరడం లేదే!

    ReplyDelete
    Replies
    1. hahahaha Akshara chorulavalla ala bandhinchavalasi vachhindi .. kshaminchaali

      Delete