Wednesday, March 8, 2017

ఎకసెక్కాలు...


ఎకసెక్కాలు...
**********

అవి కాలేజి చదివే రోజులు.. బావా, బామ్మర్ది అంటూ ప్రతోన్నీ ఎటకారంగా, ఎకసెక్కేంగా పిలిచే రోజులవి... కో ఎడ్యుకేషన్ కాకపోవడం వల్ల ఆడగాలికి నోచుకోకుండా అనాధ బ్రతుకుల్లా బ్రతుకుతున్న రోజుల్లో పరిచయమయ్యాడు ఓ కపిల పుత్రుడు.. ఆడి పేరే ఉండ్రాళ్ళ దినేష్.. అనుకోని అతిధిలా మా జీవితాల్లోకి రాహువు ప్రవేశించినట్లు ఓ అశుభ గడియలో జిడ్డులా సెరవేగంతో ప్రవేశించాడా నిత్య దరిద్రుడు.. వాడు రాకముందు కనీసం ఏ పర్వదినములలో అయినా తళుక్కున కాలేజీ (ప్రాంగణం) లో మెరిసేటోల్లం ... 

ఇక ఆనాటినుంచి ఎప్పుడూ కాలేజీ బయట వున్న “ఇరాని చాయ్” దగ్గరే మా అంతర్జాతీయ సొల్లు కబుర్ల మహా సభలు, సమావేశాలు.. మా వాక్చాతుర్యం, మా పంచ్ పలక్ నామాలు చూసి మరో 8 మంది సెడిపోవడానికి ఉచిత ఫీజు రాయతీ క్రింద చేరారు.. అబ్బో ఆ సభలు నువ్వా, నేనా అన్నట్లు పోటా పోటీగా సాగుతుండేవి ఆరోజుల్లో.. ఆ “ఇరాని చాయ్” వాడికి మా వల్ల అర్ధరూపాయి కూడా ఆదాయం లేకపోయినా ఏ రోజుకైనా బోణి చేస్తామని కళ్ళు కాయల్లా ఎదురుచూసే ఆడి ఉదార మనస్తత్వానికి, ఔదార్యానికి ఎప్పటికప్పుడు మేము, మా పరివారమూ విస్తుపోతూ వుండేవాళ్ళం.. అక్కడ వున్న 15 కుర్చీలలో ఓ పది మాకే సొంతమయ్యి ఉండేవి.... బోణీ చెయ్యాలనే ఆలోచన మాకు ఉన్నా జేబులో చెయ్యి పెడితే చిల్లులే ఎక్కువగా అగుపించేవి .... ఈడు పెడతాడని ఆడు.. ఆడు పెడతాడని మరోడు ఎదురు చూసి చూసి ఆఖరికి బిక్కమోహాలేసుకొని అక్కడనుంచి ఎల్లిపోయేటోల్లం ... అయినా ఆడి ఎదురుచుపుల్లో ఏమాత్రం ఏరోజూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గలేదు... 

పరీక్షలు దగ్గరౌతున్న సమయంలో ఎదవ నైట్ క్లాసులంటూ అందరం ఒక్కదగ్గర చేరేవాళ్ళం.. చేరి ఊరుకున్నామా .. ఊహు .. “పిశాచితో ఆట” అనే చెత్త గేమ్ ఒకటి సృష్టించాం .. మా జూనియర్స్ కూడా మా కోచింగ్ సెంటర్ లో వుండేవాళ్ళు.. పాపం వాళ్ళు అసలే పిల్ల తుగ్లక్ నాయాళ్ళు ..... వాళ్లతో పిచ్చి పిచ్చి గా ఆడేసుకునే వాళ్ళం.. గజ్జల చప్పుళ్ళు, సౌండ్ ఎఫెక్ట్స్, విసువల్ ఎఫ్ఫెక్ట్స్ అంటూ ఆ రోజుల్లోనే ఆ రాత్రివేల వారికి చుక్కలు చూపించేసేవాళ్ళం.. షోడా మూతలో కిరోసిన్ పోసి మైనం తోనూ, నీళ్ళతోను వృత్తాకారపు మంటలు సృష్టించి ప్రతోనికి మూత్రాభిషేకం జరిగేలా మా విన్యాసాలను అందరికీ రుచిచూపించే వాళ్ళం.. 

ఎప్పుడూ కాలేజికి వెళ్లకపోయినా ఫుల్ హాజరు ఉండేది .. హాజరు వేసినాక పక్క పీరియడ్ జంప్ అయిపోయే వాళ్ళం.. మా వికృత చేష్టలు చూసి పీరియడ్ అయ్యాక హాజరు వెయ్యడం మొదలెట్టారు.. మేము పీరియడ్ అయ్యాకే వచ్చి హాజరు వేసుకునే వాళ్ళం.. ఇలా ఒకరోజు ప్రిన్సిపాల్ కి తెలిసిపోయింది.. ఉత్త చెడ్డిమీద అందరినీ ఉతికి పారేశాడు.. పలానా అని తెలియదు అందుకే అందరికీ ఆనాడు వైభవోపేతంగా భరితపూజ జరిగింది.. ఈ భరితపూజలో అమాయకులు కూడా బలి ... పాపం ఆల్లకు ఎందుకు చావభాదుతున్నాడో కూడా తెలియదు... భరితపూజా కార్యక్రమాలు పూర్తి అయినపిదప అగుపించని దెబ్బలతో అస్తవ్యస్తంగా మారిన మా రూపు రేఖలతో ఎలాగోలా ఇంటికి చేరుకున్నాం.. ప్రక్కరోజు మాత్రం సైడు పాపిడి తీసి విభూది పెట్టుకొని “రామం” లా మొదటి గంటకు మునుపే వెళ్లి క్లాసు లో కూర్చున్నాం.. నా వెనుక వీపుకు చాలా సురుకుగా సురకలు తగుల్తున్నాయి.. ఏంటా ? అని చూస్తే నిన్న బలైన బామ్మర్దులు గుడ్లు మిటకరించి గుర్రుమని చూస్తున్నారు.. పోరా బోడిగాల్లారా అనుకొని నా ముందు కూర్చున్న శ్రావణ్ ని గిల్లాను.. పందులోల్లు వచ్చి పందిని పట్టుకుపోయేటప్పుడు ఆ పంది ఎలా అరుస్తుందో అలా వోండ్ర పెట్టాడు... ఆ దృశ్యాన్ని చూసిన నా ప్రక్క బెంచీ వాడు బూడిదలో బోర్లాడుతున్న కుక్కలా నిదానంగా అటు ఇటూ వాడి వొళ్లును ఊపుతూ నవ్వుతున్నాడు.. ఈలోపల ఉపాధ్యాయుని రాకతో మాలో మౌనం ఆవరించింది... 

కాసేపు బోర్డ్ మీద ఉపాధ్యాయులవారు అద్బుతంగా యేవో లెక్కలు వేసుకుంటూ ఏకధాటిగా ఉపన్యాసం ఇస్తున్నారు.. అలా వింటూ ఉండగా ఆయన నాసాయే పరీక్షగా చూస్తూ “ఆహా మహానుభావా ఎన్నాళ్ళకు నీ దివ్య మంగళ దర్శన భాగ్యం తండ్రీ” అంటూ ఓ రామదాసు లెవల్ లో మనల్ని స్తుతించడం మొదలెట్టాడు.. చచ్చానురా దేవుడా ఇప్పుడెం పెంట పెడతాడో... అసలే నిన్న జరిగిన పూజకు సంబంధించి ఒళ్లంతా పులిసిపోయివుంది అనుకుంటూ ఉండగానే.. ఇప్పుడు మనోడు ఈ లెక్కను రాసి చూపిస్తాడు అని అంటూ బాంబు పేల్చేసి నన్ను సాదరంగా ఆహ్వానించాడు.. లేవలేక లేవలేక లేచి కదల లేక కదలలేక కదులుతూ ఎలాగోలా బోర్డు దగ్గరకు వచ్చి చేరుకున్నాను.. వెనక్కి తిరిగి చూస్తే ప్రతోడి మోహంలో ఎదవ ప్రేతాత్మ కళ తొణికిసలాడుతూ వుంది.. అందరి మొహాలు ఎలిగిపోతున్నాయి.. ఇక ఏదైతే అదైంది బోడి పరువు గురించి మనకు దిగులేలా అనుకోని ఓ 10 నిమిషాలలో బోర్డ్ మొత్తం లెక్కతో నింపేశాను... 

అది చూసిన ఉపాధ్యాయులవారు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయి.. కొన్ని నిమిషాల తరువాత ఆ లెక్కను పదే పదే పేపర్ మీద వేసుకొని సరిచూసుకున్నారు.. ఇంత కరెక్ట్ గా వీడు ఎలా వేశాడో ఆయనకు అర్ధం కాలేదు .. ఎప్పుడూ క్లాసు లో కనిపించని వాడు ఇంతలా కష్టమైన లెక్కను ఎలా పరిష్కరించాడో ఆయనకు అర్ధం కాలేదు ... నన్ను లేపి క్లాసు మొత్తాన్ని చప్పట్లు కొట్టమని చెప్పారు... ఆనాడు మొదట మ్రోగిన ఆ చప్పట్ల శబ్దం ఈనాటికీ నా చెవుల్లో మోగుతూనే వుంది.. మేము ఎలా ఉన్నా యెంత అల్లరి చేసినా క్లాసు లో ప్రధమ స్థానంలోనే ఉండేవాళ్ళం .. అందుకే ఆనాటి ఉపాధ్యాయులు ఎక్కడైనా రోడ్ మీద చూస్తే నేటికీ ఆప్యాయంగా గుర్తుపెట్టుకొని మరీ పలకరిస్తారు.. వారి కన్నా ముందు నేను చూస్తే ఇక వారిని వదిలే ప్రసక్తే లేదు.. ఇందిరా మ్యడం, ప్రభావతి మ్యాడం, కొండారెడ్డి సర్, సదానందం సర్, సునీల్ సర్, లోక్ సింగ్ సర్, కోబ్రా సర్, రమణయ్య సర్, అప్పలరెడ్డి సర్ ఇలా ఎందరో మాకు విద్య నేర్పించిన గురువులు.. వారు ఎప్పటికీ పూజ్యనీయులే... ___/\___

ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే విద్యార్ధి జీవితక్షణాలు చాలా మధురమైన ఘట్టాలు ... మల్లి మల్లి తిరిగిరాని సుమధుర క్షణాలు.. వాటిని వున్నరోజుల్లోనే అనుభవించేయ్యాలి ... 

మూడ్రోజుల క్రిందట ఓ విద్యార్ధి అడిగాడు ... 

“అన్నా మీరు కవితలు రాస్తారు, కావ్యాలు రాస్తారు, కథలు రాస్తారు అన్నిట్లో గ్రాంధికం, సంస్కృతం, సహజ సరళి, వాడుక భాష కనిపిస్తూనే ఉంటుంది.. అప్పుడప్పుడు మీ ఆవేదన కూడా చూపించారు.. అశుర కవిత్వం అంటూ, తిట్టు కవిత్వం అంటూ కోపాన్ని రౌద్రాన్ని కూడా చూపించారు... కాని మొన్న మీరు నెల్లూరోల్లు ఎటకారాలు బాగా ఆడతారని చెప్పారు .. కాని ఇప్పటివరకు మీ మాటల్లో ఆ ఎటకారాలు నాకు కనిపించలేదు దయచేసి ఆ ఎటకారాన్ని కూడా చూపించండి అని అడిగారు...” 

ఆ విద్యార్ధి కోరిక మేరకు .. చాలా స్వల్పంగా ఎటకారాన్ని ఉపయోగించి మా జీవితంలో జరిగిన కొన్ని సంగతులను మల్లి పునరావృతం చేసుకుంటూ నేటి విద్యార్ధులకు ఓ చిన్న సందేశాన్ని అందించాలనే చిరు సంకల్పంతో ఈ పోస్ట్ రాసాను.. బాబీ నాని ఏంటి ఇలా అల్లరి చేసాడా అని అనుకోకండి.. ఇవన్ని కొన్ని సంవత్సరములకు ముందు మాటలు.. ప్రతీ వాళ్ళు అక్కడనుంచి వచ్చినవాళ్ళే.. అన్నీ చూసి వచ్చిన వాళ్ళే.. కాదంటారా..

చదివి అభిప్రాయాలు చెప్తారు కదూ.. 

Written by: Bobby Nani

2 comments:

  1. విద్యార్థి జీవితం, మధురక్షణాలు, ఎలా ఆనందించాలి అన్నవి చక్కగా వ్రాసారు. ఏదైనా పరిమితుల్లో ఉన్నంత కాలం ఇబ్బంది లేదు. పరిస్థితులు వికటిస్తే, చేయిజారిపోతే, చాలా మందికి దుఃఖాన్ని మిగులుస్తారు,.

    ReplyDelete