Thursday, March 2, 2017

తెగులు పడుతున్న “తెలుగు” బాష




తెగులు పడుతున్న “తెలుగు” బాష 
**************************

ఎప్పుడైనా ఒక బాష గొప్పతనం తెలియాలి అంటే అన్నీ బాషలు తప్పక తెలిసి ఉండాలి... అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అంతటివారు “దేశబాషలందు తెలుగులెస్స” అని సంబోధించారు... సి.పి.బ్రౌన్ గారు వేనోళ్ళ కొనియాడారు. అంతటి గౌరవపురస్కారాన్ని అందుకున్న తెలుగు నేడు యువత నోటిలో తెగులుగా మారి బయట పడుతుంటే లాగిపెట్టి దవడను చఱుచాలని ఉంటుంది.

“ఉచ్చారణ” అనేది చాలా ముఖ్యమైన అంశం మన తెలుగు బాషలో.. ప్రతీ పదాన్ని సరైన శబ్దాలతో ఉచ్చరించడంలోనే ఆ అందం, ఆ వేగం, ఆ శక్తి ఉత్పన్నం అవుతాయి.. సంస్కృతం లో ఇది ఇంకా ముఖ్యం.. ప్రతీ మంత్రానికి శబ్దం, వాక్కు అనేవి శక్తి ఉత్ప్రేరకములుగా ఉంటాయి.. అలా పలికితేనే ఆ మంత్రం యొక్క పరిపూర్ణ శక్తిని మనం గ్రహించగలుగుతాం.. అలా అని ప్రతీ బాషకు ఈ నియమాలు లేవు. కొన్నిటికి మాత్రమే ఈ ఉచ్చారణ అనేది అతిముఖ్యమైన విషయంగా పరిగణించబడుతుంది.. 

కొందరు విద్యార్ధులు మాట్లాడుకుంటున్న తెలుగు బాషను చూసి చాలా బాదేసింది.. కనీసం ఒక్క అక్షరం కూడా సరిగా పలకలేని వారి చదువులను చూసి జాలిపడాలో, వారి మాతృబాష తెలుగు అయినందుకు బాధపడాలో నాకు అర్ధంకాలేదు.. 

నేటి మా యువత ఇంగ్లీషును నేర్చుకోవడానికి, మాట్లాడటానికి మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు... కాని అలా నేర్చుకోవడంలో మాతృబాషను మర్చిపోతున్నారు.. నిజం చెప్పాలంటే కావాలనే చేస్తున్నారు.. నలుగురిలో తెలుగులో మాట్లాడాలంటే భయం... ఇంగ్లీషులో మాట్లాడితే గౌరవం, ఇంటర్వ్యూ లో తెలుగులో మాట్లాడకూడదు.. మాట్లాడితే బయటికిపోమ్మంటారు.. ఇలాంటి పరిస్తితులమధ్య వారు తెలుగును తెగులుగా మార్చేస్తున్నారు... రక్తంలో ఉన్న తెలుగును ఉగ్గుపాలవంటి కార్పొరేట్ స్కూల్ల ఇంగ్లీషు రసాన్ని పసితనమునుంచే తాగించేస్తున్నారు... ఇక వారికి తెలుగు ఏం తెలుస్తుంది... “A for Apple” అంటున్నారే తప్ప “అ అంటే అమ్మ” అని చెప్పేవారే కరువయ్యారు..

వీటన్నిటికీ ఒక ఉదాహరణగా కవితా వివరణ ఒకటి రాస్తున్నాను చదివి మీ అభిప్రాయం తెలపండి... 

నమస్కారం.. 
క్షమించండి.. కాదు కాదు .. సారి.. 
హాయ్.. హౌ ఆర్యూ!!!
ఊ .. బావున్నా..
మీ మాతృభాష ఏంటి ?? 
యు మీన్ మదర్ టంగ్ ..!!
తెలుగేనా మీది ??
యా .. టెలుగే.. టెలుగే...
సరే చెప్పండి తెలుగులో మొదటి కవి ఎవరు ?? 
యు మీన్ ఇన్ టెలుగు ..!
ఐ థింక్ టిక్కనా రైట్ .. 
చాలా బాగా చెప్పారు .. కాని తిక్కన కాదు.. నన్నయ 
ఓ అయాం షో సారి.. 
ఇది బుల్లి తెరలో కనిపించే వొళ్ళుమండే వికృత చేష్టలు ... 

అమ్మా.. అమ్మా ఇవాళ చందమామను చూస్తూ బువ్వ తినాలనుంది.. 
బాలమిత్ర కథలు చదివి బుజ్జాయిలా బజ్జోవాలనుంది.. 
అచ్చంగా తెలుగులోనే జోలపాట పాడవా అని అడిగిన బిడ్డకు ఓ తల్లి సమాధానం.. 
తప్పురా.. ఏమిటా కూతలు.. “మమ్మీ” అని పిలువు,
వెధవా ఎంసెట్టో, ఎడ్ సెట్టో రాసేద్దువు 
ఈ తెలుగెందుకు సెకండ్ లాంగ్వేజీ – సంస్కృతమైతే మంచి మార్కులు వస్తాయి.. 
హిందీయో, ఫ్రెంచో అయితే మరీ మంచిది.. 
ఏ ఉద్యోగం అయినా ఇంగ్లీషులో అప్లికేషను నుంచి అంతా ఇంగ్లీషులోనే .. 
తెలుగెందుకు బడిపంతులు అవుతావా.. 
నడు నడు స్పీడ్ సీడ్ 
ఊర్నుంచి .. సిటీకి 
సిటీ నుంచి దేశానికి
సంపాదించు... అమ్మేయ్ ... 

ఇది ఆ తల్లి వాంఛ... 

ఎక్కడుందండి తెలుగు ?? 
మన చిన్నప్పటి పాఠ్యంశాలల్లో తప్ప.. 
విశ్వదాభి రామ – ఎప్పుడో నీకు రాం రాం పలికితిమి కదా.. 
భాస్కరా, సుమతీ – లేదు మాకసలు మతి..
పండు వెన్నెలా, వెండి మబ్బులూ.. 
జాజి పూలూ, వాన జల్లులూ...
జోడేడ్ల నాగలి, గుండె తడి మట్టి వాసనా అలానే వున్నాయి.. 
నును వేడిలో శీతల గాలులూ 
కలల అలల సీతాకోకచిలుకలూ అలానే వున్నాయి.. 
తరాలుగా అమ్మ ఒడి 
చీర ఉయ్యాల మెత్తని సవ్వడి అలానే వున్నాయి.. 
మేమే అన్నీ మర్చిపోయాము.. !!!
నడ మంత్రపు యంత్రాలన్నీ, నోరుతిరగని మాటలన్నీ దిగుమతైనా...
శరీరాలు, జ్ఞానాలు ప్రపంచమంతా ఎగుమతైనా .. 
మనసంతా అమ్మ ప్రాణం చుట్టూ ముడిపడి వున్నట్లు 
“తెలుగు” అంటే నాలాంటి వారికి ప్రాణం లేచి రాదూ.. 
సవతి తల్లి ముళ్ళ కౌగిలిలా మరే భాషైనా 
గొంతు మారిపోదూ .. 
అవును.. గాలి పీల్చేందుకు కూడా సమయం లేదు మనదగ్గర.. 
బిజీ, బిజీ సంపాదించాలి దస్కాలెన్నో.. 
అమ్మేయాలి సంస్కృతులనెన్నో.. 

Written by: Bobby

11 comments:

  1. మీ ఆవేదన సబబైనదే, మీ విశ్లేషణ కూడా బాగుంది
    బాబూ నానీ, ఏమనుకోకండి గానీ "బాష" కాదు, "భాష" అనాలి.

    ReplyDelete
    Replies
    1. ముందుగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్..
      ఆఫీసులో హడావిడిగా రాయడం మూలంగా అక్షర దోషాలు జరిగినవి.. అందుకు క్షంతవ్యుడను ..

      తెలుగువారు అయివుండి, తెలుగు సరిగా పలకలేక మరియు పలకగలిగి వున్నవారు కూడా పలకలేక పోవడం చాలా బాదాకరం .. ఈ రోజుల్లోని పిల్లలను మనం చూస్తున్నాం కదా ! కనీసం తెలుగు అక్షరాలను చదవలేకున్నారు... కార్పొరేట్ చదువులు అంటూ పాశ్చాత్య భాషతో పాటు, పాశ్చాత్య సంస్కృతులను అలవాటు చేస్తున్నారు ... స్వదేశి సంస్కృతులను మర్చిపోతున్నారు... ఒప్పుకుంటున్నాను పెద్ద పెద్ద సంస్థల యందు పనిచెయ్యాలంటే పాశ్చాత్య భాష తప్పక వాడాలి.. ఆ భాషను నేర్చుకోవద్దు అని నేను చెప్పట్లేదు.. మాతృభాషను మరువద్దు, ముఖ్యంగా అవహేళన చెయ్యొద్దు అని చెప్తున్నాను..

      ఇది ఇలానే కొనసాగితే రాబోయే తరాలవారు తెలుగు అంటే ఏంటి ? అనే పరిస్థితికి చేరుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ...

      Delete
  2. సరళమైన పదాలతో మనకి పట్టిన తెగులుని బాగా వివరించారు. నాకైతే మనభాష జీవభాష కాబట్టి ఎప్పటికి నిలిచే ఉంటుందని నమ్మకం. అయితే దాని స్వరూపం ఎలాఉంటుందో మాత్రం ఊహించలేను.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞుణ్ణి అండి..

      మన పొరుగు రాష్త్రం అయిన తమిళనాడు లో వారి భాషకు యెంత విలువను ఇస్తారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఆధార్ కార్డు లో కూడా మొత్తం తమిళం లో వుండటం మనం చూస్తున్నాం.. అంతెందుకు పెద్ద పెద్ద విద్యాలయాలలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ తమిళం లోనే వుంటాయి.. ఇలాంటి రోజు మన ఆంద్ర దేశంలో రావాలని కోరుకుంటూ..

      Delete
  3. బాగా వ్రాసారండీ. మీ బ్లాగు చదువుతుంటాను. బావుంటుంది. ఇప్పుడు తరం వారికి అటు తెలుగు రావట్లేదు. పోనీ ఆంగ్లం వస్తోందా అంత బాగా అంటే అదీ అంతంత మాత్రం గానే ఉంటోంది.

    ReplyDelete
  4. తెగులు ఏమిటో తెలుగు సరళ పదాల్లో చక్కగా చెప్పారు.

    ReplyDelete
  5. ఈ క్రిందిచ్చినదేమిటో చెప్పుకోండి చూద్దాం (నిన్ననే టీవీలో వినిపించింది) 😳. మా తెలుగుతల్లికి మల్లెపూదండ ☹️.

    కట్టెకు దారం చుట్టి మజ్జిగలో వేస్తామే అది.

    ReplyDelete
    Replies
    1. ఆ కట్టె కవ్వమాండీ ?😀

      Delete
    2. దానికొచ్చిన తిప్పలేనండి. వా వా వా (ఏడుపన్నమాట - తెలుగు భాష దుస్థితి చూసి 😢😢)

      Delete