Monday, February 27, 2017

మన సింహపురి (నెల్లూరు)


చాలామంది మిత్రుల కోరిక మేరకు ఇలా రాయాల్సి వచ్చింది.. 
నాకు ప్రాంతాభిమానం కాని, కులాభిమానం కాని, మతాభిమానం కాని లేవు.. నేను మనిషినే నమ్ముతాను, మనిషిలోని అద్బుతమైన శక్తినే నమ్ముతాను.... 
కాని ప్రతీ రచయిత తమ పుట్టిన ఊరి గురించి, ఆ ఊరి ప్రాముఖ్యత గురించి రాస్తున్నారు .. ఈ ముఖపుస్తకంలో టపాల రూపంలో పెడుతున్నారు.. అలా మీరు కూడా మన నెల్లూరు గురించి రాయండి అనే కొందరి మిత్రుల ఆవేదన, వాంఛ మేరకు నేను పుట్టి పెరిగిన “విక్రమ సింహపురి” (నెల్లూరు) నగర విశిష్టతను, ప్రాముఖ్యతను, వైభోగాలను ఉద్దేశించి రాయసంకల్పించాను... 

మన సింహపురి (నెల్లూరు)
********************

విశాలాంధ్రమునకు ఈ నెల్లూరు గుండెకాయ వంటిది అనడంలో అతిశయోక్తి లేదు... విజ్ఞాన నిధులకు పుట్టినిల్లు, విద్యావేత్తలకు నిత్య నివాసము, కవితా నిధులకు జన్మస్థానము, కళోపాసకులకు మధుర నిలయము ఈ నెల్లూరు... 

తన దివ్యమైన లేఖినితో, తన మధురమైన భావములతో సానబెట్టి వజ్రములవంటి పడజాలముతో మెఱుగుబెట్టిన రత్నములవంటి పాదములతో మహాజ్యోతులవలె వెలుగొందు మానిక్యములవంటి పద్యములతో భారతమును రచించిన “మహాకవి తిక్కన” ఈ పినాకినీ (పెన్నా) తీర పరిసర ప్రాంగణము లందే వెలసెను గదా .. !!!

“తింటే గారెలే తినవలెను – వింటే భారతమునే వినవలెను” 

అన్న నానుడి పుట్టినది ఈ సింహపురమునందే... కవి తిక్కనకు జన్మస్థానము, ఖడ్గతిక్కనకు నివాసస్థానము కనుకనే కవి కోకిలను ప్రసాదించిన దీ నెల్లూరు పట్టణము... 

“కవి కోకిల దువ్వురి” కలములో కోటి కోకిలలు కాపురము చేసినవి. ఆ మహాకవి కుహరమునుండి లక్షల భావనా స్రవంతులు పెన్నలై ప్రవహించినది ఇక్కడే... సారస్వత నందనములో కొంగ్రొత్త సుమ వల్లరులను నాటి మధుర భావనామృతములు పోసి కంటికి రెప్పవలె కాపాడి పెంచి పెద్ద చేసిన మహానుభావుడతను. అందుకే ఆ మహాకవికి నిఖిలాంద్ర జగత్తు నివాళు లోసగినది. కవి లోకమునకు జేజేలు చెప్పినది. పండిత ప్రపంచము జోహార్లు సమర్పించినది.

అంతేకాదు.. ముస్లిం తెలుగు కవుల్లో ఆణిముత్యం “దావూదు కవి” ఆయన అన్న మాటలు “మట్టిని చదవని వాడు మనిషి కాలేడు – మనిషిని చదవనివాడు కవి కాలేడు” మనిషినీ, మనిషి జీవితంలో ఎగుడుదిగుళ్ళని ఆసాంతం చదివి కవిత్వం రాసినవాడు “షేక్ దావూదు” గారు... ఛందోబద్దు పద్య కవిత్వం పట్ల దావూదు కవికి వున్న ఆరాధన చివరిశ్వాస వరకు కొనసాగింది.. వైవిధ్యం, సరళమైన శైలి, పదబంధాల సమవేతంతో పదునైన పద్య రచనలో ఆయనది ఏడు నిలువులెత్తు ఎదిగిన వ్యక్తిత్వం... 

“దాసిపన్నా” దావూదు కవి గారి సాంప్రదాయక ఖండకావ్యం. అలాంటి భావ గాంభీర్య రచనా పటుత్వం గల రచనల కారణంగానే ఆయన విశ్వనాధ సత్యనారాయణ, దివాకర్ల వేంకటావధాని, పుట్టపర్తి, విద్వాన్ విశ్వం, జాషువా, తుమ్మల సీతారామ చౌదరి లాంటి ప్రఖ్యాత కవుల సరసన నిలవగలిగాడు... 

“నెల్లూరు నెఱజాణ” అనే పదాన్ని శృంగార కవి “శ్రీనాధుడు” సృష్టించారని ప్రతీతి .. నెల్లూరు జిల్లాలోని కృష్ణ పట్నం గ్రామంలో సిద్ధేశ్వర శివాలయంలో శృంగార కవి శ్రీనాధుడు నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి... ఓ సారి పెన్నా తీరాన వద్ద ఆయన కూర్చొని ఉన్నప్పుడు నెల్లూరు వనితలు చంకన మట్టి కుండలతో నయగారాలు చిలికే నడుము మడతలతో, ఊయలలా ఊగుతున్న కటీరములతో నడుస్తున్న కొందరు స్త్రీ లను జూచి “ఔరా” ఏమి ఈ వనితల సౌందర్య రహస్యములు అని అనుకుంటూ వారిని అలానే చూస్తూ నిలబడ్డాడట .. వారి కళ్ళల్లో “నెఱ” అంటే నేర్పరి తనం తొణికిసలాడుతూ కనిపించిందంట.. అంతే కాదు గడుసుతనం, సొగసుతనం, పొగరు, వగరు, మూతి విరుపుల్లు, చంప చెల్లుమనిపించే ముక్కుసూటి తనం, కళ్ళల్లో కామరసం చిలికించే వారి కనుచూపులు, మాటలు ఆయన్ని అమితంగా ఆకట్టుకున్నాయట అందుకే “జాణ” అని కలిపి “నెల్లూరు నెఱజాణ” అని పిలిచారంట .. “జాణ” అంటే చాలా అర్ధాలు వస్తాయి.. కళ్ళలో కామరసం స్రవించే దానా అని కొందరు అంటారు.. మరికొందరేమో సంభోగించే స్త్రీ అని అంటారు.. ఆయన ఏ ఉద్దేశంతో అనినా ఆ మాట నిలిచిపోయింది... 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు తిక్కన సోమయాజి, భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ పొట్టి శ్రీరాములు, పాలూరి శంకర నారాయణ, ఆచార్య, ఆత్రేయ, తిక్కవరపు వెంకటరమణారెడ్డి, దువ్వూరి రామిరెడ్డి, వై.వి.రావు, వెన్నెలకంటి రాఘవయ్య, విద్వాన్ కణ్వశ్రీ, బెజవాడ గోపాల రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, దొడ్ల సుబ్బారెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఇంగువ కార్తికేయ శర్మ, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎం.ఎస్.రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, మల్లి మస్తాన్ బాబు, నాకు తెలిసిన ప్రముఖుల మహానుభావుల పేర్లు ఇవి.. ఇంకెవరినైనా ఉదహరించకుంటే క్షంతవ్యుడను... 

ఆధ్యాత్మిక ప్రదేశాలకూ కొదవలేని మన సింహపురిలో శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవాలయము, శ్రీ గాయత్రీ దేవి విశ్వకర్మా దేవాలయం, జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షీ దేవి ఆలయం, వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దేవాలయము, మూలస్థానేశ్వర దేవాలయం (శివాలయం) వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువై భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుచున్నవి.. 

ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాలలో ముఖ్య పాత్ర వహించేవి, యాత్రికులను ఆకట్టుకునేవి నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, పులికాట్ సరస్సు, తడ వాటర్ ఫాల్స్(ఉబ్బలమడుగు ఫాల్స్), ఉదయగిరి కోట, వెంకటగిరి రాజావారి సంస్థానం, షార్ ( సతీష్ ధావన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ), కృష్ణపట్నం పోర్టు, సోమశిల డ్యామ్, కండలేరు డ్యామ్ లు గా నెల్లూరీయులను, దేశ విదేశాల యాత్రికులను అలరిస్తూ ముచ్చటగోల్పుచున్నవి .. 

ముఖ్యమైన సముద్ర తీరాలుగా కొత్త కోడూరు, మైపాడు, ముత్తుకూరు అని చెప్పుకోవచ్చు.. సెలవు దినములలో ఇక్కడ సందడి అంతాఇంతా కాదు.. 

నెల్లూరు జిల్లాకు ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. అంతే కాదు నెల్లూరు జిల్లా నాగరికతకు పుట్టినిల్లు... నెల్లూరు ప్రాంతాన్ని ఎన్నో వంశాలు పాలించాయి. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, తెలుగు చోళులు, పాండ్యులు ఏలారు. ఆ తర్వాత గజపతులు, విజయనగర రాజులు, మహమ్మదీయులు, గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబుల ఆధీనంలోనూ కొన్నిరోజులు కొనసాగింది. కాలక్రమేణ డచ్‌లు, ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమానికి వూపిరి పోసిన వారిలో శ్రీ పొట్టిశ్రీరాములు, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రేబాల లక్ష్మీనరసారెడ్డి, డాక్డర్‌ బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొణకా కనకమ్మ తదితరులు ఉన్నారు.

వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో నెల్లూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఇది తమిళనామం. ఆ భాషలో ‘నెల్లు’ అంటే వరి అని అర్థం. అలా నెల్లు+వూరు... క్రమేపీ నెల్లూరుగా వాడుకలోకి వచ్చిందంటారు. పచ్చని పొలాలతో ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్ల నల్ల+వూరు (మంచి వూరు) క్రమేపీ నెల్లూరుగా మారిందన్న వాదనా ఉంది. అంతే కాదు నెల్లి అంటే ఉసిరిక అని అర్ధం.. ఇక్కడ ఎక్కడ చూసినా నెల్లి చెట్లు అధికంగా కనిపించేవని అందుకే నెల్లి + ఊరు .. క్రమేపి నెల్లూరు గా మార్పు చెందినదన్న వాదనా లేకపోలేదు.. 


ఇకపోతే సింహపురి ఎలా వచ్చిందన్న వాదన ఒకప్పుడు నెల్లూరు దండకారణ్యంలో ఉందని చరిత్ర చెబుతోంది. దండకారణ్యంలో ఎక్కువగా సింహాలు సంచరిస్తూ ఉండేవి. నిద్రించే ఏనుగులకు సింహాలు కలల్లోకి వచ్చేవి, వాటికి భయపడే ఆ ఏనుగులు నిద్రలోనే మరణించేవనికథనం. అందువల్లే ఈ ప్రాంతాఁకి సింహపురి అనే పేరు వచ్చిందనే నానుడి ఉంది. ఒకప్పటి విక్రమ సింహపురి రాజ్యమే ఇప్పటి నెల్లూరు. 13వ శతాబ్దం వరకు మౌర్యుల చేత పాలింపబడి, ఆంధ్రప్రదేశ్‌లోనే ఆరవ అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెంది, ఆధ్యాత్మిక చరిత్రతో పాటు ఆహ్లాదానికీ, ఎన్నో అద్భుతాలకు కొలువై ఉన్నది మన నెల్లూరు.. 


సముద్రతీరం అంచున ఉండటం చేత ఇక్కడ చేపలకు కొదవే లేదు.. నెల్లూరు వాళ్ళు చేపల పులుసును వండటంలో సుప్రసిద్దులు... నిజానికి నేను చేపలను తినను.. ఎవ్వరిని అడిగినా ఇదేమాట చెప్తారు... అంతే మా మలైఖాజా నెల్లూరులో ముఖ్య పాత్ర వహిస్తుంది... ఏ శుభకార్యాలలో అయినా సరే ఇది దర్శనమివ్వాల్సిందే .. ఎన్ని తిన్నా ఎవిటెక్కని రుచి దానిది... అబ్బా తలుచుకుంటేనే నాకు లాలాజలం స్రవిస్తోంది.. యెంత గొప్పగా ఉంటుందో దీని రుచి .. నోట్లో అలా వేసుకోగానే వెన్నపూసలా మెత్తగా చక్కర పాకం నోటినిండా వచ్చేసి మధ్య మధ్యలో చక్కర పోలుకులు నాలుకకు తగులుతూ చిన నాలుకమీదనుంచి గొంతు ద్వారము మొదలు ఉదరములో పడేదాకా దాని రుచి నాభిదాకా మధురంగా ఉంటుంది... అంతే కాదు చిన్నపిల్లలకు విరోచనాలకు ఇది సంజీవని లాంటిది... 

ఇలా ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి మా నెల్లూరు, నెల్లూరోల్ల ముచ్చట్లు ... 
ఎకసేకలు పడటంలో మాకు మేమే సాటండోయ్ ... 
మాటకు, మాట, దెబ్బకు దెబ్బ ఇదేనండి మాకు తెలిసింది.. 
చాలా సహన పరులమండోయ్ .. 
తేడా వస్తే మాత్రం తాట తీసేదాకా వదలం... 
తియ్యని పెన్నా నీరు తాగేటోల్లం .. 
ముక్కుసూటిగా వ్యవహరించేటోల్లం ... 
ఇటు తమిళము, అటు తెలుగును మిక్స్ చేసి సరిక్రొత్త యాసతో మాట్లాడే మేధావులం ... 
మా ఆడపడుచులు చూడటానికి అందంగా ఉండే మల్లె తీగలండి .. 
ఎదవేషాలు ఏస్తే మాత్రం దూల తీరిపోగలదండి .. 
ఆ తీగలే మెడకు చుట్టుకునే యమపాశాలౌతాయి.. 
ఎవడి పనుల్లో ఆడుంటాడండి .. సమస్య వస్తే మాత్రం సమిష్టైపోతారండి... 
అదేనండి నాకు ఆల్లలో నచ్చేది.. ఎంతైనా నెల్లూరోల్లం కదండీ... 
కళలకు, క్రీడలకు ముఖ్యస్థానం కల్పిస్తామండి .. 
ప్రతీ రంగంలోనూ పోటీపడతామండి .. గెలిచినా, ఓడినా నెల్లూరోల్లమండోయ్ .. !!
కావలసిన వారికోసం ఎన్ని మెట్లు అయినా దిగేస్తామండి .. 
ఎందుకంటె మాకు కావాల్సింది ప్రేమా, ఆప్యాయతలే అండి.. వాటికే ప్రాధాన్యత ఇస్తామండి .. 
అందుకేనండి నెల్లూరోల్లం అయ్యాం.. విలువతెలియని వారి దగ్గర నలిగిపోతున్నాం.. 
కూసంత ప్రేమ చూపెడితే చివరి శ్వాస వరకు గుర్తుంచుకుంటామండి.. 
తర తరాల శత్రువు ఇంటికొచ్చినా అన్నం పెట్టి పంపే గుణమండి.. 
అందుకేనండి నెల్లూరోల్లం అయ్యాం.. 
నింగికి సగర్వంగా ఎగరేసిన నేల మాదండి.. పసిపిల్లల
అర్ధాకలి పేద బ్రతుకులు కూడా మావేనండి.. 
రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలిగే ధనికులున్నారండి .. 
రిక్షా లాగి నూరు రూపాయలతో కడుపునింపుకునే కుటుంబాలూ వున్నాయండి.. 
ఆత్మాభిమానాన్ని చంపుకునే బదులు ప్రాణాన్ని సమర్పించే మా చెడ్డ నెల్లూరోల్లం అండి.. 
తల తెగిపడినా, చేతులు నరికినా, కాళ్ళు విరిగి పడినా లెక్కచెయ్యక, 
నడుముతో ముందుకు నడిచే పౌరుషం కల విక్రమ సింహపురులమండి .. 
రచ్చబండ కబుర్లు, గణపతి నిమజ్జన డ్యాన్సులు మా బాగుంటాయండి.. 
తిండి ఉన్నా లేకున్నా వినోదం మాత్రం ఉండాలండి మా నెల్లూరోల్లకు .. 
అందుకే చిన్నా, పెద్ద తారతమ్య భేదాలు లేకుండా అన్నీ సిన్మాలను ఆదరిస్తాం.. 
ఎంతైనా నెల్లూరోల్లం కదండీ.. మేమంతేనండి.. !!!!

Written by : Bobby Nani

2 comments:

  1. పుట్టిన, పెరిగిన, ఉన్న ఊరిని అభిమానించటం యేమి దురభిమానం కాదు. నెల్లూరు నెల్లూరే, మొలకొలుకుల గురించి కోమల విలాస్ గురించి మర్చిపోయినట్టున్నారు.

    ReplyDelete
    Replies
    1. Hahahaha vatini maruvagalama..ippatike length yekkuvani chaalaa tagginchaanu Andi...

      Delete