SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
ఆ సముద్రాన్ని చూసి నాకు మొదట భయం కలిగింది..
తరువాత చంద్రుని వెన్నెల కిరణాల వెలుగులో నీలిరంగుతో కనిపించే ఆ సముద్ర జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, జలచరాలతో పోటీపడే కెరటాలు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పిల్ల చేపలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన ఆ సముద్ర సౌందర్యానికి ఆ రాత్రివేళ అంతే లేకుండా ఉంది.. కళ్లు తిప్పుకోలేనంత ప్రకృతి అందాన్ని నింపుకున్న సముద్ర తీరం అది.. నిజంగానే అద్బుతంగా ఉంది.. అని ఆ పాపకు చెప్పాను..
నేను చెప్పిన సౌందర్యం ఇది కాదు… అని అంటూ తన నోటికి రెండు చేతులు అడ్డుపెట్టుకొని నోటినుంచి ఓ విచిత్ర శబ్దాన్ని అరవసాగింది. ఆ పాప ..
అసలైన సౌందర్యం మరోటి ఉందా ??
అయితే తెలుసుకుందాం పదండి..
14th Part
ఒక్కసారిగా ఆ సంద్రం మీద తెల్లని కాంతులతో కనుచూపు మేరంతా నక్షత్రాలవంటి వెలుగులు మిణుకు మిణుకు మంటూ ప్రసరించాయి.. పైన నల్లని ఆకాశం … క్రింద సంద్రం పై తెల్లని కాంతులు … నిజంగా ఇది ఓ సుందరమైన దృశ్యం…
ఇదంతా ఏంటి ?? అని అడిగాను..
దగ్గరకు రా ..! చెప్తాను అంటూ… నన్ను ఆ సంద్రం దగ్గరకు తీసుకువెళ్ళి ..
నేను ఎవరు అని అడిగావ్ కదా..! నేను ఈ సముద్రానికి చెందిన ఏకైక జలకూనను… అని చెప్తుంది..
అర్ధం కాలేదు.. అని సమాధానం ఇచ్చాను..
ఇక్కడే ఉండు అని తను నోటితో మరో శబ్దం చేయ సాగింది..
ఆశ్చర్యంగా కొన్ని వెలుగును చిమ్ముతున్న పెద్ద పెద్ద చేపలు వొడ్డు దగ్గరకు వచ్చి ఆడుతున్నాయి… ఇది నిజంగా కలనా లేక ఇలనా అనే సందిగ్ధంలో ఉండగా.. ఆ పాప మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళగానే తను ఓ పెద్ద చేపలా వెండి పొలుసులతో దగ దగ మంటూ వెలుగులు చిమ్ముతూ మారిపోయింది.. ముఖం మాత్రమే మనిషిని పోలినట్లు ఉంది.. అక్కడకు వచ్చిన ఆ వెలుగుల చేపలు... ఆ పాపను లోపలకు తీసుకొని వెళ్ళిపోయాయి.. చూస్తుండగానే అంతా నా కళ్ళముందే జరిగిపోయింది..
దూరంనుంచి ఆ పాప నాకు సైగ చేసి చెప్పింది .. ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని.. నేను అలా నిస్తేజంగా ఉండిపోయి చూస్తూ ఉన్నాను..
కొన్ని నిమిషాల తరువాత ఆ పాప మరలా బయటకు వచ్చింది.. మామూలు మనిషిలా ఓ చిన్న పాప లా మారిపోయింది.. నడుస్తూ నా ఎదుట వచ్చి నిల్చుంది..
ఇప్పుడు అర్ధం అయిందా … నేను ఎవరినో ?? అని ఆ పాప నన్ను అడిగింది..
నేనేమో అలానే మౌనంగా ఉన్నాను… నా ముందు ఏం జరుగుతుందో నాకు అర్ధం కాని పరిస్థితి…
అక్కా నన్ను చూస్తే కోపంగా వుందా.. అని అడిగింది..
కోపం ఎందుకు.. ?? నేను అనుకున్నాను.. నీ మాటల పరిపక్వతను బట్టి, ఇంత దట్టమైన అడవిలో నీ ధైర్యాన్ని బట్టి… నువ్వు మామూలు అమ్మాయివి కాదు అని అనుకున్నాను… కాని నువ్వు ఇలా సముద్రపు జల కూనవని అనుకోలేదు.. అని చెప్పాను..
నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అక్కా.. నిన్ను నేను అక్కలానే భావించాను.. అందుకే నా ఉనికిని నీకు చెప్పాను.. నన్ను పట్టుకోవాలని ఎందరో మనుషులు వెతుకుతున్నారు.. మనిషిని నమ్మని నేను మొట్టమొదటిసారిగా నిన్ను నమ్మాను.. నిజంగా నాకు అక్క ఉంటే ఇలానే ఉంటుందేమో నాతొ.. అని అనిపించింది.. అందుకే నీకో కానుకను తెచ్చాను.. ఇలా దగ్గరకు రా అక్కా అని పిలిచింది..
నేను నా మోకాళ్ళ మీద కూర్చుని తనకు దగ్గరగా వచ్చాను…
నా మెడలో ఓ హారం వేసింది.. అది చూడటానికి చాలా పురాతనమైనదిలా కనిపిస్తుంది.. ఆ హారానికి తాబేలు ఆకారంలో ఒక లాకెట్ కూడా ఉంది… ఆ లాకెట్లో ఓ చిన్న తాబేలు హుక్కుకు వ్రేల్లాడుతూ ఉంది.. ఇంతవిలువైన హారం నాకెందుకు అని నేను అడిగాను..
చెప్పాను కదా.. నా అక్క స్థానంలో నీకు ఇస్తున్నాను..కాదనకుండా తీసుకో.. అని చెప్పి బలవంతం పెట్టింది… అతికష్టం మీద తీసుకోవాల్సి వచ్చింది..
సరే ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ “చంద్రిక కొలను" వద్దకు వెళ్దామా అని అడిగింది….
నువ్వు వస్తావా ?? అని అడిగాను..
చెప్పాను కదా.. వస్తానని..
అవుననుకో కాని నీ ఇల్లు ఇదే కదా.. మల్లి నాతొ వస్తావా ?? అని అడిగాను …
మాట ఇచ్చాను కదా అక్కా.. తప్పకుండా వస్తాను.. పద వెళ్దాం.. అని నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిచింది.. ఆ పాప..
ఇద్దరం కలిసి ఆ కొలను వెలుగులను వెతుకుతూ నడుస్తున్నాము.. కొంతదూరం వెళ్ళాక.. దూరాన నీలిరంగులు వెలుగుతున్నట్లు మా ఇద్దరికీ కనిపించింది..
వేగంగా నడుస్తూ నేను ముందుకు వెళ్లాను..
నా వెనుకగా వచ్చిన పాప అలానే నిలబడిపోయి కళ్ళు విట్టార్పి చూస్తుంది..
చంద్రిక కొలను చుట్టూరా వున్న పచ్చని చెట్లు, చేమలు నీలిరంగును పులుముకొని చాలా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి.. ఆ కొలను లో నీరు చాలా పైకి వచ్చి నిండుకుండవలె ఉంది... నీలిరంగు మండూకములు చెంగు చెంగున గంతులేస్తున్నాయి.. మరోవైపు నీలిరంగు కుందేళ్ళు కొన్ని అక్కడ ఉన్న చిన్న చిన్నమొక్కలను తినేస్తున్నాయి.. ఆ దట్టమైన చెట్లమధ్యన ఓ నీలిరంగు ప్రపంచం ఉన్నదేమో అన్నంతలా ఆ ప్రదేశం ఉంది.. నిజానికి మేము ఇద్దరం కూడా నీలిరంగులా మారిపోయి ఉన్నాము..
ఇదే నేను చెప్పిన ఆ ప్రదేశం .. ఎలా ఉంది ? అని ఆ పాపను అడిగాను..
నేను ఎన్నడూ చూడలేదు ఇంత అందమైన ప్రదేశాన్ని.. నిజంగా మనం భూమిమీదనే వున్నామా ?? అనే సందేహం కలుగుతోంది.. అని ఆ పాప సమాధానమిస్తుంది..
చెప్పాను కదా.. నాకు ఇష్టమైన ప్రదేశం, నా ప్రపంచం ఇదే..
అక్కా నేను ఒకటి అడగనా అని అంటుంది ఆ పాప ..
ఏంటి ? అడుగు అని సమాధానమిచ్చాను ..
నాకు ఆ కొలనులో దిగాలని ఉంది.. దిగొచ్చా ?? అని అడుగుతుంది ఆ పాప..
నిజానికి ఇందులోకి ఇప్పటివరకు ఎవ్వరూ దిగలేదు.. అందరం ఆ నీళ్ళను చేతులతో తాకుతూనే ఆడుకుంటాం .. కాని నువ్వు ఎలాగో చిన్న పిల్లవి కదా.. అందులోనూ సాగర పుత్రికవు కనుక నువ్వు వెళ్లి నీ కోరిక తీర్చుకో అని చెప్పాను..
తను చాలా సంతోషిస్తూ ఆ నీటిని తన చేతులతో తాకుతూ .. ఆహా ఈ నీటి స్పర్శే నన్ను ఇంతలా ఆనందింప జేస్తుందే.. ఇక లోపలకు వెళ్తే ఇంకెంతలా ఉంటుందో అని ఒక్కసారిగా ఆ కొలనులోకి దూకి లోపలకు వెళ్ళిపోయింది ఆ పాప..
కొన్ని క్షణాల అనంతరం ఆ పాప పైకి వచ్చి లోపల ఏముందో నీకు తెలుసా.. ?? అని అడుగుతుంది..
ఏముంది అంటూ నేను సమాధానం ఇచ్చాను..
లోపల చాలా లోతుగా ఉంది … యెంత లోతు గా వుందంటే నా కంటి చూపు కింద నేలను చూడలేకపోతుంది.. సముద్రం అంత లోతుగా ఉంది … ఇంత లోతుగా ఈ కొలను వుండటం నాకు చాలా ఆశ్చర్యం గా వుంది.. నువ్వు కాస్త సమయం ఇస్తే కొన్ని నిమిషాలు మొత్తం తిరిగి వస్తాను.. అని చెప్తుంది..
ఆ పాప సముద్ర కన్య.. అలాంటిది ఆమెకే అంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే ఈ కొలను గురించి తెలుసుకోవాలని అనిపించింది .. వెంటనే సరే అని చెప్పి…. నేను ఇక్కడ ఎదురు చూస్తూ వుంటాను త్వరగా వచ్చేయ్ అని ఆ పాపకు చెప్పాను..
సరే అంటూ అత్యంత ఉచ్చుకతగా ఆ పాప లోపలకు వెళ్ళిపోయింది.. చాలా సమయం తరువాత పైకి వచ్చింది .. వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు తనలో కనపడటం లేదు.. నాకెందుకో ఆందోళన మొదలైంది… దగ్గరకు వచ్చి కూర్చుంది.. కాని పెదవులు పెగలడం లేదు.. మౌనంగా ఉంది .. నేనే కొంచం సమయం అనంతరం మాట్లాడటం మొదలు పెట్టాను..
ఏమైంది ?? లోపల ఏముంది.. ?? నువ్వెందుకు అలా అయిపోయావ్ ?? అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసాను.. దానికి తను నావైపు దీనంగా చూస్తూ ఇలా చెప్పనారంభించింది..
నేను లోపలకు వెళ్ళగానే ఆ నీళ్ళల్లో ఒక్క జలచరం కూడా నాకు కనిపించలేదు.. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.. ఇంత లోతైన నీటిలో ఒక్క ప్రాణి కూడా లేకుండా ఉండటం నాలో తెలుసుకోవాలన్న ఆసక్తిని మరింత రేకెత్తించింది.. అందుకే లోపల అంతా తిరిగాను.. ఈ కొలను మామూలు కొలను కాదు అనిపించింది.… పైకి చూసేందుకు తక్కువ వెడల్పుతో వుండే ఈ కొలను లోపల చాలా విశాలంగా వుంది.. షుమారు రెండు వందల అడుగులు అనుకుంటా లోపలకు వెళ్ళే కొద్ది ఈ కొలను చుట్టుకొలత పెరుగుతూ పోతూ నేల అడుగు భాగం మొత్తం ఈ కొలనే ప్రవహిస్తూ వుంది… ఈ నీరు అంతా ఎక్కడనుంచి మొదలౌతున్నాయో చూద్దాం అని మరింత లోపలకు వెళ్లాను.. సముద్రం అంత లోతు అనుకున్నా కాని సముద్రంలో అడుగు భాగాన కూడా నాకు ఊపిరి అందేది.. ఇక్కడ నాకు ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టం అనిపించింది.. మొదటిసారిగా నీటిలో భయమేసింది… ఇక ముందుకు వెళ్తే మల్లి రావడం జరగనిపని అని తెలుసుకొని తిరిగి వచ్చే ప్రయత్నంలో లోపల ఎక్కడో ఆకుపచ్చని కాంతులు కనపడటం చూసాను... ఏదైతే అదైంది అని అనుకోని ఆ కాంతులవైపు కదలసాగాను….
అక్కడకు వెళ్ళగానే చాలా ఆశ్చర్యం కలిగింది .. ఆ ఆకుపచ్చని కాంతి ఒక వలయంలా ఉంది … ఆ వలయంలో శ్వేతవర్ణము గల రెండు చేపలు తిరుగుతూ ఉన్నాయి …. ఇక నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అనిపించి తిరిగి వచ్చేసాను.. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను.. ఏదో శక్తి అక్కడ వుంది అని మాత్రం చెప్పగలను.. ఆ శక్తే ఈ “చంద్రిక కొలను”కు కేంద్ర బిందువు.. ఆ రెండు చేపలు మామూలు చేపలు లా లేవు.. పైన చంద్రుని కాంతి అంత లోతులో వున్న ఆ చేపలపై పడుతోంది.. మరో విషయం ఏంటంటే ఆ చేపలకు వయస్సు నాకు తెలిసి శతాబ్దాలు ఉండొచ్చు… ఇక ఈ విషయం మనం ఇంతటితో మర్చిపోదాం.. ఆ రహస్యాన్ని అలానే ఉంచేద్దాం.. మనవల్ల అది మరొకరికి తెలిసి ఈ అద్బుతమైన కొలనుకు ఆటంకం కలగటం నాకు ఇష్టం లేదు అని ఆ పాప నాకు చెప్పింది…. అంతే కాదు … అంత లోతుకు వెళ్ళినా కూడా నేల అడుగుభాగమే తనకు కనిపించలేదని కూడా చెప్పింది…
అలా చెప్పి ఆ రోజు వేకువనే తన సాగరంలోకి వెళ్ళిపోయింది ఆ పాప .. అది జరిగిన రెండవరోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ షిప్ లో పడేశారు.. ఇది నా జీవితం అని చెప్తుంది..
మరి పెళ్లి కాసేపట్లో జరుగుతుందనగా నిన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారని ఇందాక చెప్పావ్.. అని ఆకాష్ అడుగుతాడు.. మొదట మీ చూపులు నాకు భయాన్ని కలిగించాయి అందుకే అలా అబద్దం చెప్పాను.. ఆడపిల్లను నా జాగ్రత్తలో నేను వుండాలి కదా అని సమాధానం ఇస్తుంది..
To be continued …
Written by : BOBBY
Anta bagundoo....anta visualize chesukuntunnaru.me varnana chaduvutunte aa place lo unnatlu a place ni chustunnatlu undi nani garu .really great u r.....
ReplyDeleteThank u mam.... __/\__
Delete