Saturday, March 25, 2017

40 యేళ్ళు వెనక్కి వెళ్తే ఒకరోజు...



40 యేళ్ళు వెనక్కి వెళ్తే ఒకరోజు... 
*************************

ఓ పెద్దావిడ గురించి నేను రెండు సంవత్సరముల క్రితమే ఒక పోస్ట్ రూపంలో రాసున్నాను.. ఎంతమంది మిత్రులు ఆమె గురించి చదివారో నాకు తెలియదు ... కాని అది చదివిన వాళ్లకు మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి ఒక అవగాహన వస్తుంది...

నెల్లూరు నగరంలోని కోర్ట్ పరిసర ప్రాంతాలలో వేరు శనగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ పెద్దావిడ ఆమె.. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఆమెతో కాసేపు మాట్లాడటం అలవాటు నాకు.. అలా ఆమెతో సంభాషించిన మాటలు మీకోసం ఇక్కడ రాస్తున్నాను..

రెండు రోజులక్రిందట నేను ఆమెను చూసి .. వెళ్లి ఎలా వున్నారు అమ్మమ్మ గారు అని పలకరించాను...

నువ్వా నాయనా ..!! 
బాగున్నాను..
మరి నువ్వెలా వున్నావ్ ?? 
సరిగా తింటున్నావా ?? 
అని ప్రశ్నలు కురిపించేస్తుంటే .... అంతా బాగానే వుంది అమ్మమ్మగారు మీరు నా కంటికి ఈ రోజు ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు ఏమైంది ? అని అడిగాను. 
గడుసోడివే బలే కనిపెట్టావ్. అని మాటలు కొనసాగిస్తుండగా ... అమ్మమ్మగారు ముందు కారణం చెప్పండి అని అడిగాను. ఆమె వెంటనే ఈ రోజు నా కుమారుడు ఒకడు చనిపోయిన రోజు నాయనా... కొన్ని పాత జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ వున్నాయని సమాధానం చెప్పింది... బయటపడకపోయినా ఆమె కళ్ళలో కన్నీరును ఆమె ఆపలేకపోయారు....

అటుపక్కగా తిరిగి ఆమె చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకొని... వాడు ఎలా చనిపోయాడో నీకు నేను చెప్పాలి నాయన ఎందుకంటె మీ రోజులకు, మా రోజులకు వున్న వ్యత్యాసం నీకు తెలియాలి అని ఇలా చెప్పడం మొదలు పెట్టారు....

మాది చాలా పేద కుటుంబం నేను మా వారు, మాకు ముగ్గురు మగపిల్లలు ఇదే మా కుటుంబం ఇల్లే మా ప్రపంచం ఆయన ఒక కౌలు దారు దగ్గర పొలం పనులు చేసేవారు.... నన్ను, ముగ్గురు పిల్లల్ని పోషించడం చాలా కష్టతరంగా జరిగేది.... మా పిల్లలు కూడా ఏదో ఒక పనికి వెళ్ళేవారు .... మా ఊరినుండి టౌన్ కి వెళ్ళడానికి ఒకే బస్సు వుండేది... ఉదయం 8 గంటలకు .... మరలా అదే బస్సు సాయంత్రం 6 గంటలకు వస్తుంది అలా రోజులో ఆ బస్సు రెండుసార్లు మాత్రమే వస్తుంది...

ఒకరోజు నా చిన్నోడు అమ్మా నాకు చాలా కడుపులో నొప్పిగా వుందని చెప్పాడు.. నేను వేడి చేసి వచ్చిందేమో అనుకోని ఇంట్లోని వైద్యాలు చేసాను... కొంచం సేపు తగ్గింది అని చెప్పాడు పోనిలే తగ్గిపోయింది కదా ఇవాల్టికి పనికి వెళ్ళకుండా ఇంట్లోనే వుండి పడుకోరా అని చెప్పాను. మధ్యాహ్నం కొంచం ఎక్కడో నొప్పి అని చెప్పగానే వాడికి "అంబలి" పెట్టి మల్లి పడుకోమని చెప్పాను. ("అంబలి" అంటే చాలామందికి తెలియకపోవచ్చు రాగి పిండి, సద్దన్నం కలిపి వుడకపెట్టి చేస్తారు కొందరు మరోలా కూడా చేస్తారు ఇది తాగితే శరీరంలో వున్న వేడిని తగ్గించి చలవదనాన్ని ఇస్తుంది అందుకే పెద్దవాళ్ళు అప్పట్లో ఇలా చేసేవారు.)

సాయత్రం 7 కావస్తుండగా వాడికి తట్టుకోలేనంత కడుపునొప్పి వచ్చేసింది... నాకు, మావారికి కాళ్ళు, చేతులు ఆడలేదు వున్న ఒక్క బస్సు 6 కి వెళ్ళిపోయింది. ఇంక రేపు ఉదయం వరకు బస్సులేదు. టౌన్ కి వెళ్లి పెద్దాసుపత్రి లో చూపించాలని బండి మాట్లాడమని చెప్పాను... ఆయన తిరిగి తిరిగి రాత్రి 9 కి ఇంటికి వచ్చారు ఎవ్వరూ రావట్లేదు చాలా డబ్బు ఇవ్వమని అడుగుతున్నారు... మనదగ్గర అంత లేదు. ఎవరినన్నా అడుగుదామంటే అరువు ఇచ్చేవాళ్ళు కూడా లేరు.. రేపు పొద్దున్నే వెళ్దాం అని చెప్పాడు...

నా బిడ్డ నొప్పితో అల్లాడిపోతున్నాడు. నాకేమో భయంగా వుంది. ఆయన ఇద్దరు పిల్లలు పడుకొని నిద్రపోతున్నారు.. నేనేమో వాడిపక్కనే కూర్చొని తగ్గిపోతుంది లే నాయనా కాస్త ఒర్చుకోరా రేపు పొద్దున్నే మనం పెద్దాసుపత్రికి వెళ్దాం.... అని ధైర్యం చెప్పుతూ .. ఆమాట, ఈ మాటా చెప్తూ వున్నాను... వాడేమో అమ్మా నాకు చాలా నొప్పిగా వుంది .... నా వల్ల కావట్లేదు అమ్మా అని ఏడుస్తున్నాడు... నేనేమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్నాను. కన్నీటిని దిగమింగుకొని నేను భయపడుతూనే వాడికి ధైర్యం చెప్పుతూ వున్నాను...

తెల్లవారిజాము 5 గంటలు కావస్తుండగా వాడు కదలడం ఆగిపోయాడు... రేయ్ చిన్నోడా అని పిలిస్తే నిశ్చలంగా ఉండిపోయాడు... నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది... నా బిడ్డ రాత్రంతా నొప్పితో విలవిలలాడుచు చివరికి నా వడిలోనే తన తుదిశ్వాస విడిచాడు.... ఆ రోజుల్లో టౌన్ కి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఒక గగనం... కాని ఈ రోజుల్లో ??

ఎంతో మారిపోయింది... అప్పుడు వాడికి వచ్చిన కడుపు నొప్పి పేరు 24 గంటల కడుపు నొప్పి (appendicitis) అంట ఆ నొప్పి చాలా భయంకరమైన నొప్పిఅని విన్నాను.... ఆ రోజు రాత్రి నేను, నా బిడ్డ ప్రత్యక్షంగా ఈ భూమిమీద నరకం చూసాము...

కాకపోతే వాడు ఆ రాత్రి వరకే అనుభవిస్తే ... నేను మాత్రం నా జీవితాంతం అనుభవిస్తున్నాను..

ఇదంతా ఎందుకు చెప్పానంటే ... ???

నాకు తెలిసినవారి ఇంట్లో ఒక కుక్క వుంది దానికి ఏదో జబ్బు చేసిందంట ... దానికోసం వాళ్ళు ఒక కారు పిలిపించి మద్రాసు లో వున్న ఒక డాక్టర్ అప్పాయింట్ మెంట్ రెండు రోజులకు ముందే తీసుకొని ఆ కుక్కకు బాగుచేయించి వచ్చారు... ఈ కుక్కకు వున్న అదృష్టం కూడా ఆ రోజు నా బిడ్డకు లేకుండా పోయిందే అని బాదేసింది.. అని ముగించింది..

ఇదంతా విన్న నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు... 
నా మనసంతా దుఃఖం తో మారిపోయింది... 
వెంటనే ఆమె కళ్ళు తుడుచుకొని .... అప్పటికి ఇప్పటికి నీకు తేడా తెలుసా ?? అని ప్రశ్నించింది .... 
తెలుసు అని అన్నాను ....
అయితే చెప్పు అని మళ్ళి ప్రశ్నించారు ...అమ్మమ్మగారు ...

అమ్మమ్మగారు పూర్వం మనుషుల మీద ప్రేమ, విలువలు, ఆప్యాయతలు, అనురాగాలు, దగ్గరగా వుండి హాస్పిటల్ లు చాలా దూరంగా ఉండేవి .... ఇప్పుడు అవి కొందరిలో దూరం అయ్యి హాస్పిటల్ లు మాత్రం చాలా దగ్గరగా అయ్యాయి అని చెప్పాను...

నిజం చెప్పావ్ నాయనా ... అదే ప్రేమానురాగాలు నా పెద్దోడికి వుండి వుంటే వాడి తమ్ముడు చనిపోయిన విషయం కూడా మరిచి నన్ను ఇలా చూసుకుంటాడా చెప్పు అని బదులిచ్చింది...
జీవితాన్ని ద్వేషాలతోనూ, లోపాలతోనూ, కోపాలతోనూ ఎంచడం కన్నా ప్రేమ, మంచితనం తో గడిపితే మనకూ, సమాజానికీ మంచి జరుగుతుంది... మన ఆలోచనలు ధర్మబద్ధంగా ఉండాలి. తినినా, వినినా, అనినా, కనినా, కన్నుముసినా ,కర్మచేసినా అన్నీ మితంగా, హితంగా ఉండాలి అనేది నా ఉద్దేశం.... నేరస్తుణ్ణి మనస్సు శిక్షించినంతగా ఏ చట్టం శిక్షించలేదు... అందుకే ఆ తల్లి తన బిడ్డ గురించి ఇన్ని సంవత్సరములు గడిచినా తనుమాత్రం మానసికంగా ఇంకా శిక్షను అనుభవిస్తూనే వుంది...

పెద్దవారి ఆలోచనలు, జ్ఞాపకాలు, అనుభవాలు మనం యెంత వీలయితే అంత పదిలం చేసిపెట్టుకోవాలి అవి మన తరువాతి తరాలవారికి మనం చూపించే మార్గదర్శకాలు అవుతాయి....

ఇన్ని పంక్తులు వస్తాయని ఊహించలేదు ఇక్కడవరకు చదివిన మీకు నా శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను...

స్వస్తి.... __/\__

Written by : Bobby Nani

4 comments:

  1. <"ఆ రోజుల్లో టౌన్ కి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఒక గగనం... కాని ఈ రోజుల్లో ??"
    ---------
    ఈ రోజుల్లోనూ మారుమూల గ్రామాల పరిస్ధితి పెద్ధ మెరుగ్గా లేదండి ఈ విషయంలో. ఏజన్సీ గ్రామాలయితే మరీనూ. మేరా భారత్ మహాన్.
    ఆ ముసలావిడ బాధ జీవితాంతం ఉండిపోయేదే.

    ReplyDelete
    Replies
    1. Thank u sir.. mee aathmeeya spandanaku.. __/\__

      Delete
  2. పెద్ద వారి ఆలోచనలకు అనుభవాలకు మీరిచ్చిన అక్షర రూపం బాగుందండీ.

    ReplyDelete