SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
ఆమె ఒక్కసారిగా కోపంతో.. ఇప్పటికే నా వ్యక్తిగతాన్ని మీకు చాలా చెప్పేశాను ఇక చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. అసలు మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి ?? అని ఆమె కసురుకోగా..
తన జేబులో వున్న మ్యాప్ ని తీసి ఆకాష్ తనకు చూపిస్తాడు.. ఆ దీవిలో జరుగుతున్న పరిణామాలను .. తను చూసిన ఆ విచిత్ర మనుషులను ఆమెకు వివరిస్తాడు..
ఆమె భయంతో నాకు కూడా అలాంటి గతే పడుతుందా ?? అంటూ అడుగుతుంది..
లేదు నీకు అలా ఏమి జరగదు మేము నీకు తోడుగా వుంటాం.. దయచేసి నీ గురించి మొత్తం మాకు చెప్పు .. సమస్యను ఎదుర్కోవడానికి మనం పరిష్కారాన్ని కనుగొనవచ్చు.. అని అంటాడు ఆకాష్..
ఇంతకీ ఆమె వారికి చెప్తుందా తన గురించి... తెలుసుకుందాం పదండి..
13th Part
ఇవన్ని నీకు ఎలా తెలుసు ?? అని అడిగాను.. సరే అయితే .. ముందు మీరు ఇద్దరూ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాల్ని ఎవ్వరితోనూ చెప్పరని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది..
తప్పకుండా అంటూ ఇద్దరూ మాట ఇస్తారు..
మా గ్రామాన్ని వదిలి మేము ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు .. కాని అలా చెయ్యలేము.. ఎందుకంటె ఆ గ్రామంలో మా తర తరాల నుంచి ఓ రహస్య కొలను ఉంది .. దాన్ని బయట వారికి తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్నాము.. దానిపేరు “చంద్రిక కొలను” అందరికీ సహజంగానే కనపడే కొలను అది.. కాని పున్నమి రోజు నడి రేయిన మాత్రం ఆ కొలనును చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.. ఎన్నో తరాల నుంచి మేము త్రాగే నీటి వనరు అదే... ఎప్పుడూ ఎండదు.. చుట్టుపక్కల ఎక్కడ గుంటలు త్రవ్వినా ఉప్పునీరే పడుతుంది అందుకే అందరం ఎన్నో శతాబ్దాలనుంచి ఆ కొలనునే నమ్ముకొని ఉన్నాము..
“చంద్రిక” అంటే వెన్నెల వెలుగు అని అర్ధం… సంపూర్ణమైన వెన్నెల వెలుగు ఆ కొలనుపై పడగానే నీలం రంగు గా ఆ కొలను మారిపోతుంది.. అందులో ప్రకాశవంతమైన వెలుగులు విరజిమ్ముతాయి.. నీలాకాశం నేల మీదకు వచ్చిందేమో అన్నంత సుందరంగా ఉంటుంది ఆ కొలను… అడవి మధ్యభాగంలో వుండటం చేత ఆ కాంతులు పరులు ఎవ్వరూ చూడకుండా చుట్టూరా దట్టమైన చెట్లు కాపు కాస్తున్నాయి.. అందుకే అది అంత రహస్యంగా ఈ నాటికీ వుంది..
నా చిన్నతనంలో నేను ఆ కొలను దగ్గరే ఎక్కువ గడిపేదాన్ని ఆ కొలను చుట్టూ ఎక్కడా లేనన్ని రకరకాల, రంగురంగుల పూలమొక్కలు, మల్లెలు, మాలతి, మధు మాలతి, రాదామనోహరి, జాజి, మొదలైన పూ పొదలు, నేరేడు, మారేడు, మోదుగ, వెలగ, ఇలా నానావిధ ఫల, పుష్ప, వృక్షాదులు ఉండేవి.. అంతే కాకుండా “చంద్రిక కొలను” పై, మొదటి రవి కిరణం పడి అందులోనుండి వివిధ వర్ణాలను కళ్ళకు కనిపిస్తూ కనువిందుచేస్తుంది... అడవిలో అదో అందమైన దృశ్యం.. రోజు ప్రాతఃకాల వెలుగులలో ఆ “చంద్రిక కొలను” చుట్టూ వున్న ప్రకృతి మాత కౌగిలి యెంతో శోభాయమానంగా, స్వర్గతుల్యంగా, ఎప్పుడూ నూతనత్వంగానే కనిపిస్తుంది నాకు.. అందుకే నా బాల్యం అంతా నేను అక్కడే గడిపేశాను…
చుట్టూ పక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల గుబుర్లలో చిలుకలు, పావురాళ్ళు, గువ్వలు, గోరింకలు, చకోరలు, మొదలైన పక్షులు నివాసముంటూ .. తొలిసంధ్య కిరణాలను చూసి ఆనందంతో మనసారా పాడుకుంటూ ఆహార వేట కోసం స్వేచ్చగా విహరిస్తుంటాయి... ఆ పక్షుల స్వరగానం నన్ను ఎంతగానో అలరిస్తుంది.. ఆ పారవశ్యపు సంగీత నాదాన్ని వింటూ నా సుఖ, దుఃఖ, బాధలను మర్చిపోయేదాన్ని..
అలా ఎప్పటిలానే నేను ఆ కొలను దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఓ వానర సమూహం నాపై హటాత్తుగా దాడి చేసింది.. భయంతో కేకలు పెడుతూ అడవిలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. అవి చాలా దూరం నన్ను వెంబడించాయి .. అలా భయంతో పరుగెడుతూ పరుగెడుతూ ఓ కొండ మొదలు భాగానికి చేరుకున్నాను.. అప్పటికే సమయం సంధ్యాస్తమయం కావస్తోంది.. తిరిగి వెళ్ళే దారి తెలియదు.. భయంతో వణుకుతూ అలానే ఆ కొండ మొదలు భాగంలో చేతులు, కాళ్ళు ముడుచుకొని ఓ రాయిని ఆనుకొని కూర్చుని వున్నాను.. దూరంనుంచి ఒక చిన్న పాప స్వరం నాకు వినిపించి, వినిపించనట్లుగా వినపడుతోంది… ఈ దట్టమైన అడవిలో ఎవరిదాస్వరం అని అనుకుంటూ ఆలోచిస్తుండగా…
దూరాన వున్న సముద్రపు కెరటాల గంభీర్యం నన్ను మరింత భయపెడుతున్నాయి.. అవి ఎలా ఉన్నాయంటే .. కోపంగా చూస్తున్న సముద్రుని ఊపిరి ఉచ్వాస, నిచ్వాసలా ఉంది … కెరటాలు ఆకాశమంత ఎత్తు ఎగసి విరిగి పడుతున్న చప్పుడు. విలయ తాండవమాడుతున్న సముద్ర రౌద్ర సౌందర్యం నా చెవులకు స్పష్టంగా వినిపిస్తోంది.. దట్టమైన మబ్బులు ఆకాశాన్ని కబలిస్తున్నట్లుగా పై పైకి ఎగబాకుతున్నాయి .. వర్షపు తుంపరులు మంచు ముత్యాలవలె నింగినుంచి జల జల మని రాలుతూ ఉన్నాయి … ఆ తుంపరులు అప్పుడప్పుడూ ఒక క్షణం తెరిపిస్తూ మరో క్షణం మైమరపిస్తూ, ఇంకో క్షణం నన్ను తడిపేస్తూ రాలుతున్నాయి..
ఇంతలోనే ఆకాశం కదిలిపోయేలా ఓ మెరుపు, దాని వెనుకగా ఒక ఉరుము, గుండె ఝల్లుమని ఆగినంత పనైంది.. గాలి ఏం వూగినా అన్నీ ఊగుతున్నాయి.. సుడులు చుట్టుకుంటూ రింగులు రింగులుగా అంతా స్పష్టంగా నాకు వినిపిస్తూనే వుంది, కళ్ళకి కట్టినట్టు. సరుగుడు చెట్ల కొమ్మలు విరిగి పడుతున్న చప్పుళ్ళు. కొబ్బరిమట్ట గాల్లో తేలుకుంటూ నేల మీద ధబ్బున పడ్డ చప్పుల్లు .. అన్నీ క్షణాల్లో చక చకా జరిగిపోతున్నాయి.. వర్షం చిన్నగా మొదలౌతుండగా … ఇందాక వినిపించిన పసిపాప స్వరం మల్లి వినిపించింది.. ఉలిక్కిపడి లేచి అయ్యో పసిపాప ఏమన్నా నా లానే తప్పిపోయి ఇక్కడకు వచ్చి ఉంటుందేమో అని అనుకుంటూ ఆ స్వరం ఎక్కడ నుంచి వస్తుందో వెతక సాగాను.. .
సముద్రం వైపుగా వినిపిస్తుంది ఆ స్వరం… లేచి గబగబా పరుగులు తీశాను.. నిజంగానే అక్కడ ఒక చిన్న పాప బోర్లా పడి ఉంది… దగ్గరకు వెళ్లి చూస్తే … ఆ పాప కాలికి గాయం తగిలి రక్తం కారుతోంది..
నా రెండూ చేతులతో ఎత్తుకొని… తనని ఓదారుస్తూ ఏం కాదు.. ఏం కాదు అని ధైర్యం చెప్తూ తీసుకెళ్తుండగా …
ఒక విషపు చేప నన్ను గాయపరిచింది… కొన్ని క్షణాల్లో ఆ విషం నాపై ప్రభావం చూపుతుంది అని చెప్పి..
వర్షం వచ్చేలా ఉంది.. !
నేను వర్షంలో తడవకూడదు ..
దయచేసి నన్ను వర్షం తగలని ప్రదేశానికి తీసుకువెల్తావా అక్కా.. అని అడిగి స్పృహకోల్పోయింది..
ఆ సమయంలో ఆ పాప అడిగిన మాటలు నన్నో తల్లిగా మార్చి… నా హృదయంలో తీరని ఆవేదనాలజడులను సృష్టించాయి.. కన్నెనైన నేను ఆ క్షణంలో ఓ తల్లిగా మారిపోయాను…
తనెవరో నాకు తెలియదు..
తనని మా ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదు..
చాలా అందంగా బొద్దుగా ఉంది.. షుమారు ఓ 6 ఏళ్ళు ఉండొచ్చు…
ఈ పాప ఇక్కడకు ఎలా వచ్చింది ? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో..
ఒకవేళ సముద్రపు దొంగలు ఈ పాపను ఎక్కడనుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెల్లిపోయారా ??
సరే ఇవన్నీ కాదు ముందు ఆ పాపను ఎలా కాపాడాలి ? అనుకుంటూ ఉండగా ..
నా చిన్నతనాన నా పెదనాన్న గారు చెప్పిన విరుగుడు మొక్కల వైద్యం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది.. ఆ మొక్కల పసురు తీసి గడియ గడియకు ఓ సారి తాగిస్తే ఎలాంటి విషం అయినా విరుగుడు అవుతుంది.. పాపను కొండకు దిగువ భాగాన వున్న ఓ పెద్ద రాతికింద పడుకోబెట్టి ఇక ఆ మొక్కలకోసం వెతకనారంభించాను…
అప్పుడే టప టప మని మాడు పగిలేంత పెద్ద పెద్ద చినుకులతో వర్షం మొదలైంది.. దానికి తోడు గాలికూడా తయారయ్యింది.. ఆ గాలి వానలో నేను మాత్రం చాలాసేపటి నుంచి మొక్కలకోసం వెతుకుతూనే వున్నాను..
ఓ మంచి పని చేస్తున్నప్పుడు పరీక్ష ఎదురౌతుందంటే ఏమో అనుకున్నాను.. స్వయంగా ఇప్పుడు చూస్తున్నాను..
వర్షానికి నేల మీద వున్న సన్నని రాళ్ళు ముల్లుల్లా నా కాళ్ళను కోసేస్తున్నాయి..
వర్షపు చినుకులు నా నేత్రాలకు తగిలి ఎదురుగా ఏముందో కనిపించకుండా చేస్తున్నాయి..
నాపైనే ఓ జలధార ఏర్పడి తలనుంచి కాలి బొటనవ్రేలు వరకు నిరంతర ప్రవాహ ధారలా పారుతోంది..
వణుకుతూ, వణుకుతూ ఓ పెద్ద వృక్షం కిందకు చేరుకున్నాను.. ఆ వృక్షానికి మనిషి పట్టేంత బిలం ఉంది.. ఇక్కడ కాసేపు నిల్చుందాం అని ఆ బిలంలోకి ప్రవేశించాను.. అందులో నాకు కావాల్సిన మొక్కలు కుప్పలు తెప్పలుగా వున్నాయి.. అప్పుడుకాని నాకు అర్ధం కాలేదు.. ఆ మొక్కలు నీడనే పెరుగుతాయని..
ఇక ఆలస్యం చెయ్యకుండా సరిపడా మొక్కలను కోసుకొని పాప దగ్గరకు వెళ్లాను.. గుండ్రని రాతితో బాగా నలగ్గొట్టి పాపకు తాగించాను.. అప్పటికే తన గాయం దగ్గర అంతా బూడిదరంగు లా మారిపోయి ఉంది.. ఇక దైవం మీద భారం వేసి పక్కన కూర్చున్నాను..
ఇంటికి వెళ్ళే దారి వెతుకుదామని అనుకున్నాను … కాని ఈ వర్షంలో అది అసాధ్యం.. అందుకే నేనే, నా స్వంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈ పాపకు ఏమైనా జరిగితే నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని అనుకుంటూ ఉండగా పాపలో మెల్లిగా కదలికలు రావడం గమనించాను…
ఆ క్షణం నా కళ్ళల్లో ఓ తెలియని మెరుపు…
అనేక గడియలు ప్రసవవేదన పడిన తల్లికి తన బిడ్డను చూడగానే ఎలాంటి భావన కలుగుతుందో ప్రస్తుతం నాలోనూ అదే కలిగింది..
వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తూనే ఉంది.. చూస్తూండగానే చీకటి పడిపోయింది.. నాలో భయం కూడా మొదలైంది..
నన్ను నేను రక్షించుకోవడమే కష్టం.. అలాంటిది ఈ పసిపాపను కూడా రక్షించే భాద్యత నాపై ఉంది అని అనుకుంటూ …. మనసులో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాను .. కంటిపై కునుకులేకుండా చుట్టూరా గమనిస్తూ ప్రతీ చిన్న చప్పుడుని ఆలకిస్తూ ఉన్నాను..
అలా ఉండగా .. పాప లేచి కూర్చుంది..
ఎలా ఉంది తల్లి నీకు ఇప్పుడు… అంటూ తన కేశములను నా చేతివేళ్ళతో స్పృశిస్తూ అడిగాను…
నువ్వు లేకుంటే నేను ఈ క్షణానికి ఏమై ఉండేదాన్నో అని అంటూ..
మా జాతిలోనే మిగిలిన ఏకైక జీవిని నేను ...అని కృతజ్ఞతలు తెలిపింది..
ఏంటి ఈ పాప జాతి, జీవి అంటూ ఏదేదో మాట్లాడుతుంది…! అని అనుకున్నాను నేను…
అలా ఆలోచిస్తూ ఉండగా..
అక్కా నాకు మరలా ఊపిరి పోసావ్ అందుకు నీకు నేను ఓ కానుకను ఇస్తాను .. రేపు తెల్లవారుజామున నీకు ఆ కానుకను ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది..
చూడటానికి మాత్రం పసిబిడ్డ లా ఉంటుంది .. కాని ఇంత పరిపక్వంగా ఎలా మాట్లాడుతుందని నాకు అర్ధం కాలేదు..
పాప నువ్వెవరు ?? ఇక్కడకు ఎలా వచ్చావ్ అని అడగగానే…
నా గురించి రేపు ఉదయానే నీకు అంతా తెలుస్తుంది అని చెప్తుంది…
సరేలే ఆ విషయం రేపు చూసుకుందాం అని అనుకొని .. ఇక ఇద్దరం కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం.. …మెల్లిగా వర్షం కూడా ఆగిపోయి నీలాకాశం కాస్త నలుపు వర్ణమును పులుముకొని, జిగేల్ జిగేల్ మనే తారాజువ్వల కాంతులతో … నిర్మలంగా మారిపోయింది.. ఆ రోజు అందులో నిండు పున్నమి కూడానూ … చూడు యెంత అందగాడో ఆ చంద్రుడు .. అని మాట్లాడుకుంటూ ఉండగా.. ఎందుకో నాకు వున్నట్లువుండి “చంద్రిక కొలను” గుర్తుకు వస్తుంది..
పెద్దనాన్న గారు తప్పకుండా నా గురించి ఆలోచించి ఉంటారు ..ఇంత రాత్రి అయినా నేను ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా “చంద్రిక కొలను" అందాలను చూడటానికి అక్కడికి వెళ్లి ఉంటానని నా కోసం అక్కడకు వచ్చి వెతుకుతూ వుంటారు..
ఎలాగో నేను ఈ అడవిలోనే ఉన్నాను కాబట్టి .. కొంచం దూరం లోపలకు వెళ్లి వెతికితే ఆ వెలుగులు నా కంటపడి నేను ఇంటికి చేరే మార్గం తప్పకుండా తెలుసుకోగలను అని భావించి..
ఇక అనుకున్నదే తడువుగా .. నేను నిన్ను ఒక దగ్గరకు తీసుకెళ్తాను.. ఆ ప్రదేశం నీకు చాలా నచ్చుతుంది అని ఆ పాపకు చెప్పి అక్కడనుంచి ఆ పాపను తీసుకువెళ్ళాను …
నిజం చెప్పాలంటే ఈ రోజు పౌర్ణమి కాకుండా వుండి వుంటే మేము అడుగు కూడా కదపలేక పోయేవాళ్ళం.. అంత చీకటిగా ఉంటుంది ఆ అడవి.. ఆ చంద్రుని వెండి పూతవంటి వెలుగులలో నడుస్తున్న నాకు చాలా ఆనందం కలుగుతోంది..
ఏంటి అక్కా అంత ఆనంద పడిపోతున్నావ్.. ?? అని ఆ పాప అనగానే…
ఇలా పౌర్ణమిరోజు అడవిలో ఒక్కదాన్నే ఉండటం తొలిసారి.. ఏదో తెలియని చల్లని పిల్లగాలి వంటి ఆనందం నన్ను ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. అని చెప్పాను..
నువ్వు చెప్పిన ఆ “చంద్రిక కొలను” ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాని నేను నీకో అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను..నాతో వస్తావా ?? అని ఆ పాప అడగగానే ..
ఇక్కడ నాకు తెలియని మరో అందమైన ప్రదేశమా ?? ఎక్కడ ?? అని అడిగాను..
అదిగో వినిపించట్లేదా ?? ఆ సముద్రపు కెరటాల భీకర శబ్ద ఘోష.. ప్రతీ పౌర్ణమికి, అమావాస్యకు సముద్ర కెరటాలు భీకరంగా మారుతాయి.. భయంతో చూసే వారికి భయమే కలుగుతుంది.. నిజమైన సముద్ర అందాలను చూస్తే ఆ సముద్రం మనకు అమ్మ లా కనిపిస్తుంది.. చూస్తావా ?? అని అనగానే…
నువ్వు ఇంతలా చెప్తుంటే ఎందుకు చూడను.. పద వెళ్లి చూద్దాం అని నేను అన్నాను..
మార్గ మధ్యంలో నాకో సందేహం వచ్చింది..
ఎందుకు ?
ఈ సముద్రం ప్రతీ పొర్ణమికి, అమావాస్యకు ఇంత భయంకరమైన అలలతో ఉంటుంది.. ? అని నాలో నేనే అనుకుంటుండగా..
అది విన్న ఆ పాప ఇలా చెప్పడం ఆరంభిస్తుంది..
చంద్రుని స్థితి గతులను బట్టి భూమి తన ఉపరితల ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది.. ఇది చాలామంది మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉంటారు ..
నిజానికి గ్రహణ సమయంలో కాని, ఇలా 15 రోజులకు ఒకసారి వచ్చే ఈ పౌర్ణమి, అమావాస్యలకు ఎందుకు ఈ సముద్రం స్పందిస్తూ ఉంటుంది ??
ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది..
సముద్రపు నీటి మట్టాన్ని దగ్గరిగా చుస్తూ సముద్రములో ప్రయాణించే సాగర పుత్రులకు ఈ విషయం బాగా తెలుసు… ఎవరన్నా కనుక చంద్రుని ప్రభావం భూమిమీద లేదు అంటె వాళ్ళు దాన్ని ఒప్పుకోరు.. ఎందుకంటె అంత పెద్ద సముద్రం పైనే చంద్రుని ప్రభావం ఉంటె... ఇక మనిషి ఒక లెఖ్ఖా.. అని వారి ప్రగాఢ నమ్మకం..
ఇక సముద్రం లోపల జలచరాల విషయానికి వస్తే, అడుగు భాగాన చాలా స్వల్పంగా ప్రకంపనలు ఉంటాయి.. అప్పుడే పుట్టిన పిల్లలకు ఈ విషయం అర్ధం కాక చాలా భయపడిపోతుంటాయి ..
చెప్తాను పదా అని అంటూ నా చెయ్యి పట్టుకొని ఆ సముద్రం దగ్గరకు తీసుకెళ్ళింది..
ఆ సముద్రాన్ని చూసి నాకు మొదట భయం కలిగింది..
తరువాత చంద్రుని వెన్నెల కిరణాల వెలుగులో నీలిరంగుతో కనిపించే ఆ సముద్ర జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, జలచరాలతో పోటీపడే కెరటాలు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పిల్ల చేపలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన ఆ సముద్ర సౌందర్యానికి ఆ రాత్రివేళ అంతే లేకుండా ఉంది.. కళ్లు తిప్పుకోలేనంత ప్రకృతి అందాన్ని నింపుకున్న సముద్ర తీరం అది.. నిజంగానే అద్బుతంగా ఉంది.. అని ఆ పాపకు చెప్పాను..
నేను చెప్పిన సౌందర్యం ఇది కాదు… అని అంటూ తన నోటికి రెండు చేతులు అడ్డుపెట్టుకొని నోటినుంచి ఓ విచిత్ర శబ్దాన్ని అరవసాగింది. ఆ పాప ..
To be continued …
Written by : BOBBY
Ado vere lokam loki tesukeltunnaru mammalni nani garu.me varnana adbutham.
ReplyDeleteThank you Andi...
Deleteసూపర్బ్ 👌👌👌👌👌
ReplyDelete