ప్రియతమా ...!
ప్రతీ సాయంత్రం నీ కోసం,
మొలకెత్తే క్షణాలు,
చంద్రకాంత పుష్పాలై విరబూస్తాయి.. !!
ప్రతీ రాత్రి గాఢమైన చెంపలనానుకున్న
వెన్నెల స్వప్నాలు గదిలో దోబూచులాడతాయి..!!
ఎటు చూసినా చలివేషం వేసుకున్న
మంచు మాపటివేళ,
వణికే చెట్లలా ఎక్కడో నువ్వు..
ఇక్కడేమో నేను... హుం .. !!
హృదయాల నెగళ్ళ మీద కాగే ప్రేమాశ్రువులు,
శీతసుమాల సుగంధాలను ఆస్వాదించలేవు..!
చుట్టూ పరిమళాల మౌనాలు...
కురవని తడి చుంబనాలు...
హత్తుకోలేని గాఢా లింగాలు...
రేయంతా విస్తరించే జాబిలి మొహంలా ..
గద్గదస్వరంగా కంఠం చివరన ఆగిపోతుంది..!
తెరతీయని నీ ఆత్మీయతానురాగాలు,
పిల్లని చలినూగై దేహాన్ని అతుక్కుంటుంది..!!
హిమరాత్రి అద్దిన ప్రేమైక సౌందర్యం
తెల్లారి నీహారికల దరహాసం
భళ్ళున నులి వెచ్చని యంత్రాలై మిగిలిపోయాము..
కాలానికి ఈ చివరన నువ్వు – ఆ చివరన నేను లా .. !!!
Bobby Nani : 02nd Jan 2017
No comments:
Post a Comment