SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
వారు ఎలా తీసుకున్నా పర్వాలేదు... కాని అందరికీ ఈ విషయాన్ని వెంటనే చెప్పి హెచ్చరించాలి అని నిర్ధారించుకొని ప్రతీ ఒక్కరికి నిదానంగా, సౌమ్యంగా వారికి అర్ధమయ్యేలా విషయాన్ని తెలియజేస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా…
మరి ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటి ?? అని ఒక వ్యక్తి అడుగుతాడు..
అదే ఇప్పుడు మనం అందరం ఆలోచించాలి ...అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా…
ఇంతలోనే గాలి జోరు పెరిగింది.....
గాలి పెరిగిందంటే ఏదో ఉప్పెన వస్తుందనే కదా.. అదేంటో చూద్దాం పదండి మరి..
5th Part
గాలి వాటుకి మా లాంచి పడుకొని లేస్తుంది.. వాతావరణం (అసలు ఆ పదాన్ని ఈ సందర్భంలో వాడొచ్చో లేదో కూడా తెలీదు) తొందర్లోనే మారే సూచన్లు కనిపిస్తున్నాయి. వాతావరణం అంతా దట్టమైన ఆవిర్లు కమ్ముకుని వున్నాయి. ఉప్పునీరు ఆవిరి కాగా పుట్టిన ఆ ఆవిర్లలో దట్టమైన మబ్బులు ఇంకా ఇంకా కిందికి వంగి కాలవర్ణాన్ని సంతరించుకున్నట్లుగా వున్నాయి... తటిల్లతల తళుకులు దట్టమైన ఆ ఆవిరి తెరలని ఛేదించలేకున్నాయి. ఆ నల్లని నీరు, ఆ మసక మసక వెలుతురు – ఆ ప్రాంతం అంతా ఏదో చెప్పరాని ప్రళయతాండవం కోసం కట్టిన వేదికలా భయంకరంగా మారిపోయింది..
మహోగ్రమైన వాతావరణ మార్పులు ఆసన్నమైనప్పుడు భూమి మీద ఎన్నో జీవాలలో లాగానే మా అందరి మనసులో కూడా ఎదో కల్లోలం మొదలయ్యింది. వంపులు తిరిగిన మబ్బులు భారంగా, భయంకరంగా కనిపిస్తున్నాయి. పెనుతుఫాను ఆసన్నమైనప్పుడు గాలిలో వుండే గాంభీర్యం వాటిలో కనిపిస్తోంది. గాలి భారంగా వుంది. సంద్రం నిబ్బరంగా అలల ఉధృతి పెరుగుతూ వుంది.
దూరం నుంచి మబ్బులు అల్లకల్లోలంగా మన మీద పడుతున్నట్లుగా వస్తున్నాయి… వాటి సంఖ్య తక్కువగానే వున్నా పరిమాణంలో మాత్రం చాలా పెద్దగా వున్నాయి. సూర్య భగవానుడను అమాంతం మింగేసి చీకటిమయం చేసాయి….వాతావరణం అంతా ప్రళయావేశంతో నిండిపోయింది. ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సమయంలో మా అందరిలో ఒక్కటే ఆలోచన …
ఇక్కడనుంచి బయట పడగలమా ??
ఈ లోపే గాలి మరింత ఉధృతం అయ్యింది. పైన వేళ్లాడుతున్న విశాలమైన మేఘజాలం భయంకర పెనుతుఫానులకి ఆవాలంగా మారిపోయింది..
అశుభం పకలడం మంచిది కాదని పెద్దలు అంటారుగాని ఈ సమయంలో అనకుండా ఉండలేకపోతున్నా అని రెండో వాడు అయిన లోకేష్ అంటాడు...,
“వాతావరణం చాలా చాలా దారుణంగా వుంది.”
ప్రసన్నకుమార్ భాటియా లో ఉలుకు పలుకు లేదు. ఆయన వదనం గంభీరంగా వుంది. ఎదుట ముంచుకొస్తున్న ప్రళయపు వేగాన్ని నిశితంగా చూస్తూ ఏమనుకున్నాడో ఏమో కాని బయటికి మాత్రం ఓ సారి నిట్టూర్చాడు.
“భయంకరమైన తుఫాను ముంచుకొచ్చేలా వుంది,” అంటూ అందరికీ దిక్చక్రం (అనగా సముద్రం, ఆకాశం కలిసినట్లు కనపడే ప్రదేశం) కేసి చూపిస్తూ. “ఆ నల్లని మబ్బులని చూడబోతే సముద్రాన్ని కబళించేలా వున్నాయి.” అని బిగ్గరగా అరుస్తాడు..
ఎటు చూసినా సముద్రమే ఒంటరి అఘాధంలో వొంటరిగా ప్రయాణిస్తున్న అనుభూతి ప్రతీఒక్కరిలో కలిగిపోయింది …
అప్పటివరకు ఆహ్లాదంగా సంతోషపెట్టిన సంద్రం.. ఒక్కసారిగా మృత్యువును పోలివుండటం, గంభీరంగా మారడం చూసి భగవంతుడను ప్రార్ధించడం మొదలు పెట్టారు.. అయినా వారి ప్రార్ధనలు ఫలించే సమయం ఎప్పుడో దాటిపోయింది.. భీబత్సమైన అలల ఉధృతి లాంచిని అల్లకల్లోలం చేస్తున్నాయి..
మరోపక్క గాలివాన భీబత్సం. నడీసంద్రంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వుండగా లాంచి అడుగుభాగం దేనికో బలంగా “ డీ “ కొట్టిన శబ్దం అందరూ ఒక్కసారిగా వున్న స్థానాలలోంచి 5 అడుగులు ముందుకు ఎగిరిపడ్డారు.. ఈ లోపలే నీరు లాంచిలోకి ప్రవేశించింది….
మెల్లి మెల్లిగా లాంచి కిందకు ఒరుగుతుంది.. కెప్టెన్ కి ఏమి అర్ధం కాని పరిస్థితి.. ఎదురుగా ఒక కిలోమీటర్ దూరంలో ఓ పెద్ద సుడిగాలి సుడులు తిరుగుతూ వీరి లాంచిమీదకు వచ్చే పరిస్థితిని కెప్టన్ గమనిస్తాడు..
ఇక ఇదే మన ఆఖరు గడియలు అని అనుకోని.. బయటకు వచ్చి ఆకాశానికి నవ్వుతూ సగర్వంగా చూస్తాడు.. తనని అలా చూసిన ప్రతీ ఒక్కరికీ విషయం అర్ధం అవుతుంది..
ఎవరికి దొరికినదాన్ని వారు గట్టిగా పట్టుకొని ఊపిరి బిగబెట్టి ఆ సుడిగాలిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు అవుతారు.. అమాంతంగా ఆ సుడిగాలి వారి లాంచిమీదకు వచ్చి అల్లకల్లోలం చేసి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న ఒక చిన్న దీవిలో విసిరికొడుతుంది..
82 మంది వున్న ఆ లాంచిలో అదృష్టవశాత్తు అందరూ స్వల్ప గాయాలతో బయటపడుతారు… ఆశ్చర్యకరంగా వారు ఆ దీవికి చేరుకోగానే ఒక్కసారిగా నలుదిశలా గాఢమైన నిశ్శబ్దం అలముకుంది. గాలుల ప్రళయఘోష ఒక్కసారిగా ఎందుకో సద్దుమణిగింది. ఒక్క క్షణం ప్రకృతి శ్వాస నిలిచిపోయినట్టుగా అనిపించింది. ఒక్క అల కూడా లేకుండా నిశితంగా, నిశ్చలంగా ఆ సంద్రం మారిపోయింది..
మా వినాశనం కోసమే ఈ ప్రళయతాండవం జరిగినట్లు స్పష్టంగా తెలిసింది … ఎవరెవరు ఎక్కడ వున్నారో .. అని వారి వారి కుటుంబసభ్యులను వెతుక్కుంటూ అందరూ కలిసి ఒక్కచోట చేరుతారు.. ప్రసన్నకుమార్ భాటియా కంగారుగా అటూ ఇటూ పరుగులు తీస్తూ వుండగా కుమారులు ముగ్గురూ కూడా అదే కంగారులో ఒకరికి మరొకరు ఎదురెదురు చూసుకుంటారు … అందరూ క్షేమమనే ఆనందంతో ముగ్గురు కుమారులను ఆలింగనం చేసుకుంటాడు ప్రసన్నకుమార్ భాటియా…
ఇక అందరిమదిలో ఒకటే ఆలోచన …..
ఇక్కడనుంచి ఎలా బయటపడాలి అని ….
దానికోసం ఆలోచించసాగారు ..
అంతలోనే మెల్లి మెల్లిగా చీకటి పడటం మొదలైంది…
ఆ దీవి కేవలం కొన్ని కిలోమీటర్ల చుట్టుకొలత విస్తీర్ణంతో వుంది.. లాంచిలోనుంచి కొన్ని సామగ్రిని తీసుకొచ్చి ఒక పెద్ద టెంట్ ఏర్పాటుచేసుకొని అందరూ అక్కడ కూర్చుంటారు..
వాళ్ళకు కొన్ని అడుగుల దూరంలో మంట మండుతోంది…. ఆ మంట చుట్టూర కొందరు చిన్నపిల్లలు అన్నీ మరిచిపోయి కేరింతలు కొడుతూ సరదాగా కూర్చొని ఆడుతున్నారు…
పెళ పెళ మనే ఆ మంట నుంచి వస్తున్న శబ్దం సంగీతమై ఈ ప్రకృతితో మిళితమై చెవులకు వినసొంపుగా వినపడుతూ… కనులకు విందారమై ఉంటోంది … చుట్టూరా సంద్రం, మధ్యలో చిన్న దీవి, ఆ దీవిలో ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో అందరూ కలిసి ఈ సమయాన ఒకచోట చేరడం చాలా వింతగా అనిపించింది ప్రసన్నకుమార్ భాటియా కు ..
దిగులుగా, గుబులుగా కూర్చున్న వారిని చూస్తున్న ప్రసన్నకుమార్ భాటియా కు ఒక ఆలోచన వచ్చింది.. ఒక ప్రసంగం చెయ్యాలని సంకల్పించి అక్కడ అందరి మధ్యన వున్న 3 అడుగుల చిన్నని రాతిమీద ఎక్కి ఇలా మాట్లాడటం మొదలు పెడతాడు..
ముందుగా పెద్దవారికి నమస్కారములు,
నా వయస్సు గల మిత్రులకు అభినందనలు,
చిరంజీవులకు నా ఆశీస్సులు.
మనమంతా ఈ రోజు ఇక్కడ ప్రాణాలతో వున్నామంటే ఇది దైవ నిర్ణయం …
ఎందుకు అందరూ దిగులుగా వున్నారు ?
ఇప్పుడేమైంది ?
మన నుంచి దూరం అయింది కేవలం మన వస్తు, సామాగ్రి మాత్రమే … మన ఆశయ సాధనాలు, సంకల్ప బలాలు కాదు.. మన కలల్ని మనం సాకారం చెయ్యగలం... దానికి మనకు కావాల్సింది ఆఖరిశ్వాస వరకు కొంచం ప్రాణం మాత్రమే.. ఇప్పుడు మన దగ్గర అది మెండుగా వుంది..ఇంకా ఎందుకు అలా ఆలోచిస్తూ కూర్చోవడం .. ఎక్కుపెట్టిన బాణం లో దూసుకెల్లాలి .. మన మనోనిబ్బరమే మన బలం, బలగం కావాలి.. భూతః కాలాన్ని మనం మార్చలేము, భవిష్యత్ ఎలా వుందో చెప్పలేము, కాని ఈ వర్తమానం మాత్రమే మన చేతుల్లో వుంది. ఈ వర్తమానం వల్లే భవిష్యత్తు ను మార్చే శక్తి మనకు లభిస్తుంది.. లేవండి, త్వరపడండి.. అలా కూర్చొని సమయం వృధా చెయ్యకండి.. ఇక్కడకు రండి మీ ఆశయాలు, మీరు అనుభవించిన మధుర స్మృతులు ఇక్కడ అందరితో పంచుకోండి ….
అంటూ … ప్రసంగిస్తూ .. నా పేరు ప్రసన్నకుమార్ భాటియా అని చెప్తూ తన గురించి, తన పిల్లల గురించి, వారంతా ఎందుకు వచ్చారో ఆ విషయం గురించి, ఈ క్షణం వరకు జరిగిన సంగతులన్నింటినీ వివరిస్తారు.. దాదాపు ఈ ప్రసంగం 30 నిమిషాలపాటు ఏకధాటిగా జరుగుతుంది.. ప్రతీ ఒక్కరు కళ్ళు విట్టార్పి, గుటక వెయ్యకుండా ఆయన ప్రసంగాన్ని అలానే వింటూ నిస్తేజంగా చూస్తుండిపోయారు..
30 నిమిషాల అనంతరం అతను ప్రసంగాన్ని పూర్తిగావిస్తారు. అయిననూ కొన్ని క్షణాలు నిశబ్దవాతావారణం అలానే వుంటుంది.. ఓ 80 ఏళ్ళ పెద్దాయన తన చేతి కర్ర సాయంతో చిన్నగా లేచి నిలబడి కరతాళధ్వనులతో అక్కడనుంచి వచ్చి కరచాలనం గావించి ప్రసన్నకుమార్ భాటియాను అమాంతం హత్తుకుంటారు.. మిగిలిన అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులు చేస్తారు.. ఆ శబ్దం తో ఆ దీవి ఆ దీవిలోని ప్రాంగణం మొత్తం దద్దరిల్లి పోతుంది..
ఆ పెద్దాయన ఆ రాతి మీదకు ఎక్కి నిలబడి ప్రసన్నకుమార్ భాటియాను పట్టుకొని మాట్లాడటం మొదలు పెడతాడు…
నాకు 25 ఏళ్ళ వయసప్పుడు ఒక గుమస్తాగా ఉద్యొగం చేస్తున్నాను … నేను పుట్టి పెరిగింది ఓ నిరుపేద కుటుంబంలో .. నా 24వ ఏట వరకు భాద్యతారహితంగా తిరిగే వాడిని. మా తండ్రిగారు నాకు 25 వ ఏట వివాహం చేసి ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకురా అన్నారు...అప్పుడు ఆయన ఎందుకలా చేసారో ఆయన వయస్సు వచ్చాకనే నాకు అవగతమయ్యింది .. వివాహం మన జీవితాన్ని యెంత మారుస్తుందంటే అది మాటల్లో చెప్పలేము.. అనుభవించే తెలుసుకోవాలి.. భాద్యతల్ని, కష్ట, సుఖ, దుఃఖాలను రుచి చూపిస్తుంది.. అప్పటివరకు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ నేను ఒక్కసారిగా మరొకరికి ఆదరాగా మారాల్సి వచ్చింది… అందుకోసం చాల శ్రమ పడేవాడిని ఆమెకో మంచి జీవితం అందివ్వాలని అహర్నిశలు పోరాడేవాడిని .. అప్పుడే ఓ గుమస్తాగా ఉద్యొగం దొరికింది … ఆ రోజుల్లో నాకు నెలకు వేతనం అయిదు నూర్లు … చిన్నని ఇరుకు ఇంటిలో, ఇరుకుమంచముతో మా సంసారం మొదలైంది.. ఎలాంటి సాధనాలు లేని ఆరోజుల్లో ఇద్దరమే కలిసికట్టుగా ఉంటూ ఎన్నో వేల కబుర్ల, కాలక్షేపాలతో నిదురలేని మనోహర, మధుర, సుమధుర రాత్రులు ఎన్నో.. ఎన్నెన్నో.. ఒకేమంచం మీద ఒకరి శ్వాస మరొకరికి తగిలేంత దగ్గరగా ద్విశరీరాలు ఏక శరీరంగా మిళితమై వుండేవాళ్ళం.. ఆనాటి నుంచి అంచెలంచెలుగా నా ఎదుగుదల నేను ఊహించని రీతిలో సఫలీకృతం అయింది.. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడో ప్రముఖ శ్రీమంతుల్లో నేను ఒకడిని… ఇది ఈ ముదుసలి మధుర స్మృతి … అంటూ ఆయన మాటల్ని ముగిస్తారు…
ఇదంతా వింటున్న ఓ పిల్లడు లేచి .. తాత గారు మరి ఇప్పుడు మీరొక్కరే వున్నారు అమ్మమ్మ గారు రాలేదా అని అడుగగా… కంటి అద్దాలను తీస్తూ చమ్మగిల్లిన తన కళ్ళను తుడుచుకుంటూ పోయిన ఏడాది తను భగవంతునిలో ఐఖ్యం అయింది నాయనా.. ఈ రంగుల లోకంలో ఒంటరిగా నన్ను విడిచి వెళ్ళిపోయింది అంటూ తడిఆరి వణుకుతున్న తన స్వరంతో అంటాడు.. ఆమె విడిచిన జ్ఞాపకాలతో ఇలా వూర్లు పట్టుకొని ఈ వయస్సులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతూ వున్నాను.. అంటూ చెప్పి అక్కడనుంచి వెళ్లిపోతాడు..
నిజంగా ఆ పెద్దాయన మాటలు నన్ను, నా హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
ఈలోపు మరో 15 ఏళ్ళ యువకుడు ముందుకు వచ్చి పెదనాన్న గారు నేను మాట్లాడవచ్చా అని అడుగుతాడు..
ఆ పిల్లవాని కుతూహలానికి ముచ్చటపడి .. అంతకన్నా ఏం చెప్తాడా అనే ఆతురతతో దానికేం భాగ్యం నాయనా రా ఇలా వచ్చి మాట్లాడు అంటూ దారిని ఇస్తాడు ప్రసన్నకుమార్ భాటియా..
To be continued …
Written by : BOBBY
Nice.oka tension teerindi.next antoo chudali
ReplyDeletehahahahaha thank u mam ....
Delete